వయసు పెరగకుండా చరిత్రలో జరిగిన ప్రయోగాలేంటి... తాజాగా సైన్స్ కనిపెట్టింది ఏమిటి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, స్జు షెన్ వాంగ్, నీల్ గ్రాజీర్
- హోదా, .
వయసు పెరగకుండా చూసుకోవాలని ప్రయత్నించేవారికి.. గతంలో కన్నా ఇప్పుడు ఆ పని చాలా సులభమైంది.
చరిత్ర పొడవునా జనం పెరుగుతున్న వయసుతో పోరాడటానికి, తమ చర్మం నునుపు తగ్గకుండా చూసుకోవటానికి అనేక రకాల కిటుకులు పాటిస్తూ వచ్చారు. క్లియోపాత్రా చేసినట్లుగా భావిస్తున్న విధంగా గాడిద పాలతో స్నానం చేయటం, మధ్యయుగపు చివరి దశలో ఎలిజబెత్ కాలపు జనం చేసినట్లుగా పాదరసాన్ని నేరుగా చర్మానికి పూసుకోవటం వంటివి ఆ చిట్కాల్లో కొన్ని.
ఆధునిక యుగంలో కూడా చర్మం వయసు పెరగకుండా అడ్డుకోవటానికి అనేక చిత్రవిచిత్ర పద్ధతులు వచ్చాయి. ప్రసవ సమయంలో బిడ్డతో పాటు బయటకు వచ్చే మాయ (ప్లాసెంటా)ను ఉపయోగించటం, శరీరం నుంచి రక్తాన్ని సేకరించి ఫేషియల్ చేసుకునే వాంపైర్ ఫేషియల్స్ అటువంటివే.
అయితే ఇప్పుడు వయసుతో పోరాడటానికి సైన్స్‌ను ఉపయోగించటం తాజా ట్రెండ్‌గా మారింది.
కానీ నేటి ఫేస్ క్రీములు, స్కిన్ సొల్యూషన్ల నిండా అనేక రకాల పెప్టైడ్లు, యాంటీఆక్సిడెంట్లు, యాసిడ్లు వంటి రసాయనాలు మెండుగా ఉంటున్నాయి. ఈ ఉత్పత్తుల్లో వేటిని సైన్స్ బలపరుస్తోంది, ఏవి కేవలం మార్కెట్ గిమ్మిక్కులు అనేది తెలుసుకోవటం బయాలజీ (జీవశాస్త్రం) లేదా కెమిస్ట్రీ (రసాయనశాస్త్రం) చదువుకున్న, తెలిసిన నేపథ్యం లేని వారికి కష్టమవుతుంది.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న యాంటీ-ఏజీయింగ్ ఉత్పత్తుల్లో కనిపించే మూడు పాపులర్ పదార్థాలు, వాటి గురించి శాస్త్రీయ ఆధారాలు ఏం చెప్తున్నాయనేది పరిశీలిద్దాం.

ఫొటో సోర్స్, Getty Images
సి విటమిన్
సి విటమిన్ ఉన్న ఉత్పత్తులు చర్మాన్ని ప్రకాశవంతంగా మారుస్తాయని, చర్మంలో కొలాజిన్ ఉత్పత్తిని పెంపొందిస్తాయని చెప్తుంటారు.
మన చర్మంలోని మధ్య పొర.. చర్మానికి బిగువును, సాగే లక్షణాన్ని ఇచ్చే కొలాజిన్, ఎలాస్టిన్‌లను ఉత్పత్తి చేస్తుంది.
అయితే మన వయసు పెరిగే కొద్దీ చర్మంలో ఈ కొలాజిన్, ఎలాస్టిన్ ఉత్పత్తి తగ్గుతూపోతుంది. అందువల్లనే మన చర్మం మీద ముడతలు రావటం మొదలవుతాయి.
చర్మానికి సి విటమిన్‌ను అందించటం కొంచెం కష్టం.
ఎందుకంటే.. మన చర్మం మీద పై పొర (ఎపిడెర్మిస్) నీటిని నిరోధించే అవరోధంగా పనిచేస్తుంది.
సి విటమిన్ అనేది నీటిలో కరిగే పోషకం. కాబట్టి సి విటమిన్‌ను చర్మానికి అందించే ఉత్పత్తిని తయారు చేయటం కష్టమవుతుంది.

ఫొటో సోర్స్, Getty Images
అయితే.. విటమిన్ సి సాంద్రత 5 శాతం కన్నా ఎక్కువ ఉండే ఉత్పత్తులు చర్మం మీద పనిచేస్తాయని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి.
ఉదాహరణకు.. 50 నుంచి 60 ఏళ్ల వయసున్న పది మంది మహిళల్లో 5% సి విటమిన్ ఉన్న క్రీమును ఆరు నెలల పాటు రోజూ ముంజేతులకు రాసుకున్నపుడు.. వారి చర్మంలో కొలాజిన్ ఉత్పత్తి పెరిగినట్లు ఒక అధ్యయనంలో వెల్లడైంది.
అంతేకాదు.. సూర్యరశ్మి వల్ల చర్మం దెబ్బతిని ఏర్పడే హైపర్‌పిగ్మెంటేషన్ (చర్మం మీద కొంచెం నల్లని మచ్చలు).. సి విటమిన్‌ను రోజూ చర్మానికి రాయటం వల్ల గణనీయంగా తగ్గినట్లు కూడా మరో పరిశోధన సూచిస్తోంది.
అలాగే వివిధ అధ్యయనాల్లో సి విటమిన్ ఉన్న క్రీములు, అది లేని క్రీములను ఒక్కో వ్యక్తి శరీరం మీద వేర్వేరు ప్రాంతాల్లో పూసి పరిశీలించారు.
సి విటమిన్ క్రీములను మొత్తం 47 రోజుల పాటు ఉపయోగించిన వారి చర్మంలో.. దానిని వాడటం మొదలుపెట్టిన 12వ రోజు తర్వాత గుర్తించగలిగే తేడా కనిపించింది.
అయితే మొదటి 12 రోజుల తర్వాత ఈ మార్పులో పెద్ద తేడా కనిపించలేదు.
ఇలా వచ్చిన మార్పులు ఈ అధ్యయనం ముగిసిన తర్వాత కూడా కొనసాగాయా లేదా అన్నది తెలీదు.

ఫొటో సోర్స్, Getty Images
హాయల్యురానిక్ యాసిడ్
హాయల్యురానిక్ యాసిడ్ అనేది మన శరీరం ఉత్పత్తి చేసే ఒక సహజ పదార్థం.
ఇది సాధారణంగా మన కళ్లలోను, కీళ్లలలోను ఉండే ద్రవాల్లో కనిపిస్తుంది.
ఇప్పుడు చాలా చర్మ సంరక్షణ ఉత్పత్తుల్లో హాయల్యురానిక్ యాసిడ్ ఉంటోంది. చర్మం మీద ముడతలను తగ్గించటానికి ఇది మంచి మాయిస్చరైజర్ అని ఆ ఉత్పత్తులు చెప్తున్నాయి.
2011లో 30 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మధ్య వయసు ఉన్న 76 మంది మహిళలపై నిర్వహించిన ఒక అధ్యయనంలో.. హాయల్యురానిక్ యాసిడ్ 0.1% మోతాదులో ఉన్న క్రీములను రోజుకు రెండు సార్లు చొప్పున రెండు నెలల పాటు ఉపయోగించినపుడు చర్మంలో తేమ, సాగేగుణం మెరుగుపడినట్లు గుర్తించారు.
అయితే.. ఈ హాయల్యురానిక్ యాసిడ్ అణువులు (మాలిక్యూల్స్) బాగా చిన్నవిగా ఉన్న క్రీములు ఉపయోగించిన వారిలోనే.. చర్మపు ముడతలు, గురకు దనం తగ్గినట్లుగా కనిపించాయి.
దీనికి కారణం.. పెద్దవిగా ఉండే హాయల్యురానిక్ యాసిడ్ అణువులను చర్మం శోషించుకోవటం మరింత కష్టం కావటమే.

ఫొటో సోర్స్, Getty Images
కానీ హాయల్యురానిక్ యాసిడ్ గల చాలా స్కిన్ క్రీములు.. ఆ ఉత్పత్తుల్లో వాడిన ఈ యాసిడ్ అణువులు కచ్చితంగా ఎంత సైజులో ఉంటాయన్నది చెప్పవు. దీనివల్ల ఆయా ఉత్పత్తులను కొనాలా వద్దా అనే నిర్ణయం తీసుకోవటం కష్టమవుతుంది.
సదరు ఉత్పత్తుల మీది లేబుళ్లు చదవటం, అందులోని హాయల్యురానిక్ యాసిడ్ మోతాదును, దాని అణువుల సైజును నమోదు చేసుకోవటం వల్ల ఉపయోగం ఉంటుంది.
అయితే.. హాయల్యురానిక్ యాసిడ్ గల చాలా ఉత్పత్తులు (క్రీములు మొదలుకుని సీరమ్‌లు, ఇంజెక్టబుల్స్ వరకూ) చర్మంలో తేమను పెంచి, ముడతలను తగ్గిస్తాయని ఇతర అధ్యయనాలు చూపాయి.
2021లో పాల్గొన్న వారి మీద నిర్వహించిన ఒక అధ్యయనంలోనూ ఇలాంటి ఫలితాలే కనిపించాయి. అయితే ఈ అధ్యయనంలో ఉపయోగించిన ఓ వాణిజ్య ఉత్పత్తిలో హాయల్యురానిక్ యాసిడ్‌తో పాటు.. నియాసినామైడ్, సెరామైడ్స్ మిశ్రమాలు ఉన్నాయి. ఈ క్రీమును రోజుకు రెండుసార్లు రాయటంతో పాటు, రోజూ సన్‌స్క్రీన్‌ను కూడా ఉపయోగించారు.
అందువల్ల.. చర్మంలో కనిపించిన సానుకూల ఫలితాలకు కేవలం హాయల్యురానిక్ యాసిడ్ ఒక్కటే కారణమా అనేది చెప్పటం కష్టమవుతోంది.

ఫొటో సోర్స్, Getty Images
రెటినాల్ (ఎ1 విటమిన్)
రెటినాల్ ఉన్న చర్మ సంరక్షణ ఉత్పత్తులు ఇప్పుడు చాలా పాపులర్ అయ్యాయి. హైపర్‌పిగ్మెంటేషన్, ముడతలు సహా సూర్యరశ్మి వల్ల చర్మానికి జరిగే దీర్ఘకాలిక హాని (ఫొటో ఏజింగ్) ప్రభావాలను తగ్గించే సామర్థ్యం రెటినాల్‌కు ఉందని చెప్తుంటారు.
నిజానికి రెటినాల్ అనేది ఓ తరహా ఎ విటమిన్. కొందరు దీనిని ఎ1 విటమిన్ అని పిలుస్తుంటారు. ఇది ఒకసారి చర్మంలోకి ఇంకిన తర్వాత రెటినాయిక్‌గా మారుతుంది.
ఇది చర్మంలోకి శోషించుకున్న తర్వాత కొలాజిన్ ఉత్పత్తి పెరగటానికి, కొత్త కణాల పుట్టుక పెరగటానికి తోడ్పడుతుంది.
ఈ ప్రభావాలన్నీ కలిసి.. ముడతలను నిరోధించటానికి, హైపర్‌పిగ్మెంటేషన్‌ను తగ్గించటానికి సాయపడతాయి.
మానవ కణాల మీద, మానవ చర్మ నమూనాల మీద నిర్వహించిన అధ్యయనాలు.. రెటినాల్ ఉన్న ఉత్పత్తులు చర్మం కనిపించే తీరు మీద ప్రభావం చూపిస్తున్నట్లు సూచిస్తున్నాయి.
ఉదాహరణకు.. కనీసం 0.4% రెటినాల్ కలిగిన ఉత్పత్తులను వారానికి మూడు సార్లు చొప్పున ఆరు నెలల పాటు రాసుకున్నట్లయితే ముడతలు కనిపించటం తగ్గినట్లు ఒక అధ్యయనంలో వెల్లడింది.
గతంలో నిర్వహించిన అధ్యయనాలు కూడా.. 0.04% రెటినాల్ ఉన్న ఉత్పత్తులు సైతం కనీసం 12 వారాల పాటు ఉపయోగిస్తే ఇదే ప్రభావం ఉన్నట్లు చూపాయి.
ఇతర రెటినాల్ ఉత్పత్తులతో పోల్చినపుడు ప్రభావం అంత స్పష్టంగా లేకున్నప్పటికీ.. 0.04 శాతం రెటినాల్ కలిగిన వాణిజ్య ఉత్పత్తులను కొన్ని నెలల పాటు క్రమం తప్పకుండా ఉపయోగించినపుడు, దానితో పాటు సన్‌స్క్రీన్‌ను కూడా ఉపయోగించినపుడు.. ఇవి చిన్నపాటి ముడతలను తగ్గించగలవని ఆ అధ్యయనాలు సూచిస్తున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
చర్మ సంరక్షణ ఉత్పత్తుల్లో ఏమేం చూడాలి?
వయసు పెరుగుదలను తగ్గించే చర్మ సంరక్షణ ఉత్పత్తులను కొనుగోలు చేయాలని మీరు భావిస్తున్నట్లయితే.. మీరు కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
మొదటిగా.. ఆ ఉత్పత్తిలో ఉన్న పదార్థాల్లో ఏదైనా మీకు అలర్జీ కలిగించగలదేమో లేదో చూసుకోవాలి. అలాగే అది మీ చర్మం తరహాకి సరిపడుతుందో లేదో తెలుసుకోవాలి.
ఉదాహరణకు.. మీ చర్మం పొడిగా, సున్నితంగా ఉన్నట్లయితే రెటినాల్ మీకు సరైన ఉత్పత్తి కాకపోవచ్చు. ఎందుకంటే రెటినాల్ వల్ల సూర్యరశ్మికి చర్మపు సెన్సిటివిటీ పెరిగి మరింతగా దెబ్బతినే అవకాశముంది.
అలాగే సదరు ఉత్పత్తిలోని ప్రధాన పదార్థం మోతాదు ఎంత ఉందో కూడా గుర్తించాలి. దానిని ఎంత మొత్తంలో ఎలా ఉపయోగించాలనే అంశంపై తయారీ సంస్థ సిఫారసులను పాటించాలి.
ఈ సూచనలు ఉత్పత్తి లేబుల్ మీద ఉంటాయి.
మీరు కొన్న ఉత్పత్తితో మీ చర్మ సమస్యలన్నీ తీరిపోవనే విషయాన్ని కూడా గమనంలో ఉంచుకోవాలి.
ముందుగా.. ఆరోగ్యవంతమైన చర్మం కోసం ఆరోగ్యవంతమైన జీవనశైలిని పాటించటం, సంతులన ఆహారం తీసుకోవటం, తగినంత విశ్రాంతి తీసుకోవటం చాలా ముఖ్యం.
స్జు షెన్ వాంగ్ కీలె యూనివర్సిటీలోని స్కూల్ ఆఫ్ ఫార్మసీ అండ్ బయోఇంజనీరింగ్‌లో ఫార్మాసూటికల్ సైన్సెస్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.
నీల్ గ్రేజీర్ కీలె యూనివర్సిటీలోని స్కూల్ ఆఫ్ ఫార్మసీ అండ్ బయోఇంజనీరింగ్‌లో టెక్నీషియన్‌గా పనిచేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- ఇల్లు కొనడం మంచిదా లేక అద్దెకు ఉండటం మంచిదా.. సొంతిల్లు కొనే ముందు ఇవి తెలుసుకోండి
- హోంలోన్ వడ్డీ రేటు పెరిగినప్పుడు టెన్యూర్ పెంచుకుంటే మంచిదా లేక EMI ఎక్కువ కడితే బెటరా..
- తాజ్‌మహల్ ఒకప్పుడు తేజో మహాలయమా... ఆ 22 గదులలో ఏముంది?
- టంగ్-టై అంటే ఏంటి? పిల్లల్లో పెరుగుతున్న ఈ కొత్త సమస్యను గుర్తించడం ఎలా?
- సంపూర్ణ చంద్రగ్రహణం: ఎందుకు, ఎలా ఏర్పడుతుంది.. ఏ ఏ దేశాల్లో కనిపిస్తుంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













