స్పేస్ ఎక్స్ ప్రపంచ రికార్డ్: ఒకే రాకెట్‌లో అత్యధిక సంఖ్యలో ఉపగ్రహాల ప్రయోగం

Launch

ఫొటో సోర్స్, SPACEX

ఒకే రాకెట్ ద్వారా అత్యధిక సంఖ్యలో ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించి స్పేస్ ఎక్స్ కొత్త ప్రపంచ రికార్డును సృష్టించింది.

ఫ్లోరిడా నుంచి లాంచ్ చేసిన స్పేస్ ఎక్స్ ఫాల్కన్ రాకెట్ ద్వారా వివిధ రకాల ఆకారాలు, పరిమాణాలలో ఉన్న 143 పే లోడ్లు అంతరిక్ష కక్ష్యలోకి ప్రయాణం అయ్యాయి.

భారతదేశం 2017లో ఒకే రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి 104 ఉపగ్రహాలను పంపించి రికార్డ్ సృష్టించింది. ఆ రికార్డును స్పేస్ ఎక్స్ బ్రేక్ చేసింది.

అంతరిక్ష రంగంలో జరుగుతున్న నిర్మాణాత్మక మార్పులకు, ఈ రంగంలో మరింత మంది భాగస్వాములు అవుతున్నారనేందుకు ఈ పరిణామం ఒక రుజువుగా నిలుస్తోంది.

రైడ్ షేర్ డిస్పెన్సర్

ఫొటో సోర్స్, SPACEX

దృఢంగా, అతి చిన్న పరిమాణంలో తక్కువ ధరలో ఉండే విడి భాగాల తయారీ విషయంలో సంభవించిన విప్లవాత్మక మార్పుల వల్లే ఈ మార్పు సాధ్యం అయింది. ఇందులో కొన్ని భాగాలను స్మార్ట్ ఫోన్ల లాంటి వినియోగ వస్తువుల నుంచి కూడా సేకరిస్తారు. దీంతో ఎవరైనా అతి తక్కువ ఖర్చుతో ఒక చిన్న ఉపగ్రహాన్ని తయారు చేసే సౌలభ్యం కలుగుతోంది.

ఇలాంటి ఉపగ్రహాలను అంతరిక్ష కక్ష్యలోకి సుమారు 7.5 కోట్ల రూపాయల (1 మిలియన్ డాలర్ల) ఖర్చుతో పంపడానికి స్పేస్ ఎక్స్ సిద్ధంగా ఉండటంతో ఈ రంగంలో వాణిజ్యపరమైన అవకాశాలు కూడా పెరిగే అవకాశం ఉంది.

ఒక్క స్పేస్ ఎక్స్ ఫాల్కన్ లోనే 10 ఉపగ్రహాలు ఉన్నాయి. దీని స్టార్ లింక్ టెలి కమ్యూనికేషన్స్ భారీ సమూహానికి ఇటీవల జత అయిన కొన్ని ఉపగ్రహాల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ సేవలు అందించనున్నది.

అందరి కంటే ఎక్కువగా సాన్ ఫ్రాన్సిస్కోకి చెందిన ప్లానెట్ కంపెనీకి వాడుకలో ఉన్న 48 ఉపగ్రహాలు ఉన్నాయి.

ఇవి ప్రతి రోజు భూమి ఉపరితలాన్ని 3 - 5 మీటర్ల రిసొల్యూషన్లో చిత్రీకరించే సూపర్ డవ్ నమూనాలు. ఈ కొత్త స్పేస్ వాహనాల వలన సంస్థకి అంతరిక్షంలో ఉన్న వాహనాల సంఖ్య 200కి పైగా పెరుగుతోంది.

ఈ సూపర్ డవ్ నమూనాలు ఒక షూ పెట్టె పరిమాణంలో ఉంటాయి. ఫాల్కన్ రాకెట్ లో ఉండే చాలా పే లోడ్లు ఒక కాఫీ కప్పు కంటే కాస్త పెద్ద పరిమాణంలో ఉంటాయి. కానీ, కొన్ని మాత్రం ఒక పుస్తకం కంటే చిన్న సైజులో ఉంటాయి.

డిస్పెన్సర్ మీద అమర్చిన ఉపగ్రహాలు

ఫొటో సోర్స్, SpaceX

ఫొటో క్యాప్షన్, డిస్పెన్సర్ మీద అమర్చిన ఉపగ్రహాలు

స్వార్మ్ టెక్నాలజీస్ స్పేస్ బీస్ అనే కొత్త ఉపగ్రహాలను ప్రవేశ పెడుతోంది. ఇవి కేవలం 10 /10/2.5 పరిమాణంలో ఉంటాయి.

ఇవి భూమి పై జంతువులను తరలించడం నుంచి షిప్పింగ్ కంటైనర్ల లాంటి వాటికి అమర్చిన అన్ని రకాల సాధనాలను అనుసంధానం చేయడానికి టెలి కమ్యూనికేషన్ నోడ్స్ గా పని చేస్తాయి.

ఫాల్కన్ రాకెట్లో ఉన్న కొన్ని పెద్ద ఉపగ్రహాలు మాత్రం సూటుకేసు పరిమాణంలో ఉంటాయి. అందులో చాలా రాడార్ ఉపగ్రహాలు కూడా ఉన్నాయి. విడి భాగాల తయారీలో చోటు చేసుకున్న విప్లవం వలన ఎక్కువగా లబ్ది పొందిన వాటిలో రాడార్ ఉపగ్రహాలు ఒకటి.

సంప్రదాయంగా రాడార్ ఉపగ్రహాలు చాలా పెద్దవి, ఎక్కువ టన్నుల బరువుతో కూడుకుని ఉండేవి. వీటిని ఎగరవేయడానికి కొన్ని వేల కోట్ల రూపాయిల ఖర్చు అయ్యేది. మిలిటరీ లేదా పెద్ద పెద్ద అంతరిక్ష సంస్థలు మాత్రమే వీటిని నిర్వహించే సామర్ధ్యం కలిగి ఉండేవి.

కానీ, వీటి తయారీలో షెల్ఫ్ ల నుంచి తీసేసిన చిన్న చిన్న పదార్ధాలను వాడటం ద్వారా వీటి పరిమాణం గణనీయంగా తగ్గిపోయింది.

వీటి బరువు 100 కేజీల లోపే ఉండటం మాత్రమే కాకుండా ధర కూడా తక్కువే ఉంటుంది.

గ్వాటెమాలా సాంటా మరియా అగ్నిపర్వతం

ఫొటో సోర్స్, Planet Labs Inc

ఫొటో క్యాప్షన్, గ్వాటెమాలా సాంటా మరియా అగ్నిపర్వతం: చుట్టూ ఉన్న ఉపగ్రహాలతో ప్రతి రోజూ భూమి మొత్తాన్ని ఫోటో తీస్తున్న ప్లానెట్

ఫిన్‌లాండ్ కి చెందిన ఐసీ , అమెరికాకు చెందిన కాపెల్ల, అంబ్రా, జపాన్ కి చెందిన ఐక్యూపిఎస్ ఆదివారం అంతరిక్షంలోకి ప్రయాణమయ్యాయి.

ఇవి ఆకాశంలో మండలాన్ని ఏర్పర్చుకుని భూమికి సంబంధించిన చిత్రాలను అతి వేగంగా అందిస్తాయి.

ఈ రాడార్ ఉపగ్రహాలకు సాధారణ ఆప్టికల్ కెమెరాల కంటే కూడా మబ్బులను కూడా చీల్చుకుని పగలు, రాత్రితో సంబంధం లేకుండా భూమి ఉపరితలాన్ని గ్రహించే శక్తి ఉంది. ఈ భూమి మీద ఎక్కడైనా ఎటువంటి మార్పు జరిగినా క్షణాలలో కనిపెట్టే దశకు మనం చేరుకుంటున్నాం.

స్పేస్‌బీ

ఫొటో సోర్స్, SWARM

ఫొటో క్యాప్షన్, స్పేస్‌బీ

ఫాల్కన్ 143 ఉపగ్రహాలను ఒక ధ్రువం నుంచి ఇంకొక ధ్రువానికి ప్రయాణం చేసే విధంగా 500 కిలోమీటర్ల ఎత్తైన మార్గంలోకి తీసుకుని వెళ్ళింది. ఇది ఒక రైడ్ షేర్ మిషన్ లో ఉండే ఒక పెద్ద లోపం అని చెప్పవచ్చు. రాకెట్ వెళ్లిన ప్రతి చోటుకి ఉపగ్రహాలు వెళతాయి. ఇది అందరికీ ఉపయోగపడకపోవచ్చు

చాలా ఉపగ్రహాలకు అంతరిక్షంలో ఎక్కువ ఎత్తులో కానీ, తక్కువ ఎత్తులో కానీ లేదా భూ మధ్య రేఖకు విభిన్నంగా ఉండే వాలు మీద గాని ఉండే కక్ష్యలు అవసరం అవుతాయి.

ఇది కేవలం ఉపగ్రహాలను స్పేస్ టగ్స్ మీద నిలపడం వలన మాత్రమే సాధ్యం అవుతుంది. రాకెట్ నుంచి ఉపగ్రహం విడివడిన తర్వాత కొన్ని వారాల పాటు అందులో ప్రయాణం చేసే ప్రయాణికులకు తుది అంశాలను మారుస్తుంది. ఆదివారం వెళ్లిన ఫాల్కన్ అలాంటి రెండు టగ్స్ ను తీసుకుని వెళ్ళింది.

కానీ, కొన్ని మిషన్లకు నిర్ణీతమైన ప్రయాణం మాత్రమే సరైన పరిష్కారాన్ని ఇస్తుంది. అందుకే ప్రత్యేకమైన ప్రయాణాలు నిర్వహించేందుకు చిన్న పరిమాణంలో ఉన్న రాకెట్లను తయారు చేయడానికి తొందర పడుతున్నారు.

రాడార్ సాటిలైట్స్

ఫొటో సోర్స్, IQPS

ఫొటో క్యాప్షన్, ఊహాచిత్రం: అంతరిక్షంలోకి వెళ్లిన తరువాత రాడార్ సాటిలైట్స్ భారీ యాంటెన్నాలు గొడుగులా విచ్చుకుంటాయి

అయితే, ఈ చిన్న రాకెట్లు ఖర్చు విషయంలో స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 లాంటి పెద్ద వాహనాలతో పోటీ పడలేవు . కానీ, కొన్ని అత్యవసర లేదా ప్రత్యేకమైన అవసరాలు ఉన్న వారిని ఇవి ఆకర్షించగలవు.

బోయింగ్ 747 రెక్క పై నుంచి కూడా ప్రవేశపెట్టగలిగే అతి చిన్న రాకెట్ ని తయారు చేసిన వర్జిన్ ఆర్బిట్ సిఇఓ డాన్ హార్ట్ మాత్రం ఈ స్టార్ట్ అప్స్ చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి అని చెబుతున్నారు.

"ఈ చిన్న ఉపగ్రహాలు చాలా ఆసక్తిని రేపాయి. అంతరిక్షంలోకి వెళ్ళడానికి ఇదే చవకైన మార్గం" అని ఆయన వివరించారు.

"ఇది వేగంగా మారుతోంది. ఈ చిన్న వ్యాపారాలన్నీ కొన్ని కీలకమైన మిషన్లతో ఒక వేళ ఇతరుల కోసం వేచి చూడాల్సి వచ్చినా లేదా తమకు తగని కక్ష్యలోకి వెళ్లాలన్నా కొంత పెట్టుబడులను కోల్పోయే ముప్పుకు కూడా సిద్ధంగా ఉన్నాయి. అందుకే వాటి లక్ష్యం చేరేందుకు కాస్త ఎక్కువగా డబ్బులు చెల్లించే వారిని కూడా చూస్తున్నాం" అని ఆయన బీబీసీ న్యూస్ కి చెప్పారు.

అంతరిక్ష కక్ష్యల్లోకి వెళ్లే ఉపగ్రహాల సంఖ్య విరివిగా పెరుగుతుండటంతో, వీటి ట్రాఫిక్ నిర్వహణ కూడా హాట్ టాపిక్ గా మారింది.

ఇవి ఒక దానితో ఒకటి ఢీ కొనడం అరుదుగా సంభవిస్తుంది. కానీ, ఇప్పటికీ ఒక 10 శాతం ఉపగ్రహాలు ఊహించని మార్పులను ఎదుర్కోవలసి వస్తుంది.

అంతరిక్ష కక్ష్యల్లో ఉన్న వస్తువులను గుర్తించడానికి, ప్రయాణం చేస్తున్నప్పుడు అవాంతరాలను అధిగమించడానికి అంతరిక్ష రంగం కొత్త రకమైన మార్గాలను వెతుక్కోవలసి వస్తుంది. లేదంటే కొన్ని రకాల ఆల్టిట్యూడ్ లలో ప్రమాదకరమైన అంతరిక్ష రద్దు ప్రాంతాల వల్ల ఇవి నిరర్ధకంగా మారిపోతాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)