మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధిని మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో ఎందుకు నిర్మించారు?

ఫొటో సోర్స్, SHRIKANT BANGALE/BBC
- రచయిత, శ్రీకాంత్ బంగాలే
- హోదా, బీబీసీ కోసం
ఏఐఎంఐఎం తెలంగాణ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ఇటీవల ఔరంగాబాద్‌లో పర్యటించారు. అక్కడ ఆయన ఔరంగజేబు సమాధిని సందర్శించారు. దీంతో కొత్త రాజకీయ వివాదం రాజుకుంది.
ఔరంగాబాద్ నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖుల్తాబాద్ నగరంలో ఔరంగజేబు సమాధి ఉంది. దిల్లీని పాలించిన ఔరంగజేబు సమాధి మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌కు ఎలా వచ్చింది అనే సందేహం కలుగకమానదు.
ఈ ప్రశ్నకు సమాధానం వెతుక్కుంటూ ఖుల్తాబాద్ వెళ్లాను. ఖుల్తాబాద్‌లోకి ప్రవేశించే ద్వారాన్ని నగార్‌ఖానా అంటారు.
సిటీ హాలులోకి ప్రవేశించగానే కుడివైపున ఔరంగజేబు సమాధి కనిపిస్తుంది. ఇది 'జాతీయ స్మారక చిహ్నం' అని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసిన బోర్డు కూడా కనిపిస్తుంది.
సమాధిని దర్శించడానికి వెళ్లే ముందు బూట్లు, చెప్పులు బయట వదిలేయాలి. సమాధి ద్వారం దగ్గర షేక్ షుకూర్‌ని కలిశాను. పొద్దున్న పూట కావడంతో అక్కడ జనం పెద్దగా లేరు. ఔరంగజేబు సమాధిని దర్శించేందుకు ఒకరిద్దరు వచ్చారు.

ఫొటో సోర్స్, SHRIKANT BANGALE/BBC
'నా సమాధిపై కూరగాయల మొక్కలు నాటండి'
వచ్చినవారికి సమాధి విశేషాలను చెబుతున్నారు షేక్ షుకూర్. ఔరంగజేబు సమాధి చాలా సాదాసీదాగా ఉంది. అక్కడ కేవలం మట్టి ఉంది. సమాధి పైన తెల్లటి వస్త్రం కప్పారు. సమాధిపై కూరగాయల మొక్కలను కూడా నాటారు.
తరతరాలుగా షేక్ షుకూర్ కుటుంబం ఔరంగజేబు సమాధి సంరక్షణ బాధ్యతలు నిర్వర్తిస్తోంది. ఆ కుటుంబంలో షుకూర్ అయిదవ తరంవారు.
"ఇది చక్రవర్తి ఔరంగజేబు సమాధి. 'నా సమాధి నిరాడంబరంగా ఉండాలి, పైన కూరగాయల చెట్లతో కప్పాలి, పైకప్పు ఉండకూడదు' అని ఆయన తన వీలునామాలో రాశారు. అప్పట్లో ఈ సమాధి కట్టడానికి 14 రూపాయల 12 అణాలు ఖర్చయింది" అంటూ చెప్పుకొచ్చారు షేక్ షుకూర్.
ఔరంగజేబు సమాధికి ఒకవైపు శిలాఫలకం ఉంది. దానిపై, ఔరంగజేబు పూర్తి పేరు అబ్దుల్ ముజఫర్ ముహియుద్దీన్ మొహమ్మద్ ఔరంగజేబ్ ఆలంగీర్ అని చెక్కి ఉంది. ఔరంగజేబు 1618లో జన్మించి 1707లో మరణించాడు. హిజ్రీ కాలక్రమం ప్రకారం, ఔరంగజేబు పుట్టిన, మరణించిన సంవత్సరాలను కూడా ఈ ఫలకంపై చెక్కారు.

ఫొటో సోర్స్, SHRIKANT BANGALE/BBC
ఔరంగజేబు ఔరంగాబాద్‌ను ఎందుకు ఎంచుకున్నాడంటే...
ఔరంగజేబు 1707లో మహరాష్ట్రలోని అహ్మద్‌నగర్‌లో మరణించాడు. తరువాత, ఆయన మృతదేహాన్ని ఖుల్తాబాద్‌కు తరలించారు. మరణానంతరం తన సమాధి, తన గురువు సయ్యద్ జైనుద్దీన్ షిరాజ్ సమాధి పక్కనే ఉండాలని ఔరంగజేబు తన వీలునామాలో రాశాడు.
"ఔరంగజేబు తన వీలునామాలో ఈ విషయాన్ని స్పష్టంగా రాశాడు. హజ్రత్ ఖ్వాజా జైనుద్దీన్ షిరాజ్‌ను తాను గురువుగా భావిస్తున్నానని, తన సమాధి, తన గురువు సమాధి పక్కనే ఉండాలని రాశాడు. జైనుద్దీన్ షిరాజ్, ఔరంగజేబు కన్నా పూర్వ కాలానికి చెందినవారు. ఔరంగజేబు ఎన్నో పుస్తకాలు, గ్రంథాలు చదివాడు. షిరాజ్ బోధనలను అనుసరించేవాడు. అందుకే తన సమాధిని షిరాజ్ సమాధి పక్కనే నిర్మించమని వీలునామాలో రాశాడు" అని చరిత్రకారుడు డా. దులారీ ఖురేషి వివరించారు.
తన సమాధి ఎలా ఉండాలో కూడా ఔరంగజేబు వీలునామాలో వివరంగా రాశాడు.
"తాను సంపాదించిన డబ్బుతోనే తన సమాధి కట్టాలని, దానిపై కూరగాయల మొక్కలు నాటాలని ఔరంగజేబు కోరుకున్నాడు. ఔరంగజేబు టోపీలు తయారు చేసేవాడు. ఖురాన్ షరీఫ్ రాశాడు. వాటి ద్వారా వచ్చిన ఆదాయంతోనే ఖుల్తాబాద్‌లో ఆయన సమాధిని నిర్మించారు" అని ఖురేషి చెప్పారు.
ఔరంగజేబు మరణానంతరం అతడి కుమారుడు ఆజం షా ఈ సమాధిని నిర్మించాడు. మొదట్లో సమాధి చుట్టూ కేవలం రక్షణ కవచం లాంటిది ఉండేది. తరువాత, చుట్టూ చెక్క కట్టారు.
1904-05 మధ్య లార్డ్ కర్జన్ ఇక్కడకు వచ్చారు. అంత గొప్ప చక్రవర్తికి ఇంత సాదాసీదా సమాధి ఉండడం చూసి కర్జన్ ఆశ్చర్యపోయారు. వెంటనే పాలరాయితో చుట్టూ గోడలు నిర్మించి, సమాధికి భద్రత ఏర్పాటు చేశాడు.
'భూమిపై స్వర్గం'
ఖుల్తాబాద్ ఎంతో చరిత్రను నింపుకున్న గ్రామం. మతపరమైన సంప్రదాయాలు విలసిల్లిన ప్రదేశం. ఇక్కడ భద్ర మారుతి మందిరంతో పాటు, సూఫీ సాధువుల సమాధులు, ఇతర రాజవంశాలకు చెందిన రాజుల సమాధులు ఉన్నాయి.
ఖుల్తాబాద్‌ను పూర్వం 'భూమిపై స్వర్గం' అని పిలిచేవారు. చరిత్రకారుడు సంకేత్ కులకర్ణి ఖుల్తాబాద్ విశిష్టతను వివరించారు.
"ఖుల్తాబాద్‌ను భూమిపై స్వర్గంగా అభివర్ణిస్తారు. క్రీ. శ. 1300లో ముంతాజిబుద్దీన్ జర్ జరీ జార్ బక్ష్ రాకతో సూఫీలు ఇక్కడకు రావడం మొదలుపెట్టారు. కాబూల్, బుఖారా, కాందహార్, సమర్‌కండ్, ఇరాన్, ఇరాక్, పర్షియాల నుంచి సూఫీ సాధువులు ఖుల్తాబాద్‌కు వచ్చేవారు. దక్షిణ భారతదేశంలో ఇస్లాంకు బలమైన కోటగా, సూఫీ ఉద్యమానికి కేంద్రంగా నిలిచింది ఖుల్తాబాద్. ప్రపంచం నలుమూలల నుంచి సూఫీలు వచ్చేవారు. వారి సమాధులు ఖుల్తాబాద్‌లో ఉన్నాయి" అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, SHRIKANT BANGALE/BBC
దక్కన్‌లో ఇస్లామిక్ ఉద్యమానికి కేంద్రంగా...
దక్కన్‌లో ఇస్లాంను వ్యాప్తి చేయడానికి, క్రీ.శ.1300లో దిల్లీకి చెందిన నిజాముద్దీన్ ఔలియా, తన శిష్యుడైన ముంతాజిబుద్దీన్ జార్ జార్ బక్ష్‌ను 700మంది సూఫీ ఫకీర్లు సహా దేవగిరికి పంపారు.
ఆ సమయంలో అల్లావుద్దీన్ ఖిల్జీ దిల్లీని పాలిస్తున్నాడు. ముంతాజిబుద్దీన్ దౌలతాబాద్‌ను ప్రధాన కార్యాలయంగా చేసుకుని, 700 సూఫీలను దక్షిణ భారతదేశంలో వివిధ ప్రాంతాలకు పంపారు.
1309లో ముంతాజిబుద్దీన్ మరణించాడు. ఆయన దర్గా ఖుల్తాబాద్‌లోని హుడా కొండ దిగువన ఉంది.
"ఈ ఉద్యమాన్ని కొనసాగించడానికి, నిజాముద్దీన్ ఔలియా, మరో వారసుడు బుర్హానుద్దీన్‌ను మరో 700 సూఫీలను ఖుల్తాబాద్‌కు పంపారు. అప్పటి నుంచి ఖుల్తాబాద్ కేంద్రంగా బుర్హానుద్దీన్ 29 సంవత్సరాలు పనిచేశారు. తరువాత మహమ్మద్ తుగ్లక్ దేవగిరిని రాజధానిగా చేసుకున్నాడు. తన సభలో ఖ్వాజీ, ఇస్లాం పండితుడు అయిన దావూద్ హుస్సేన్ షిరాజీ (జైనుద్దీన్ షిరాజీ)ని తన వారసుడిగా నియమించారు. జైనుద్దీన్ 1370 నాటికి సూఫీ ఉద్యమాన్ని బలపరిచారు. ఖ్వాజా సంప్రదాయంలో జైనుద్దీన్ 22వ ఖలీఫా అయ్యారు. అయితే, తన తరువాత ఖలీఫాగా కొనసాగడానికి ఎవరూ సరిపోరని భావించిన జైనుద్దీన్ తన వారసుడిని ప్రకటించలేదు. దాంతో ఉద్యమం విచ్చిన్నమైంది. ఖుల్తాబాద్ దాని ప్రాముఖ్యాన్ని కోల్పోయింది" అని సంకేత్ కులకర్ణి వివరించారు.
"17వ శతాబ్దంలో ఔరంగజేబు, జైనుద్దీన్ షిరాజీ సమాధి మందిరాన్ని సందర్శించాడు. 14వ శతాబ్దంలో జైనుద్దీన్ షిరాజీ కొనసాగించిన ప్రచారాల నుంచి ప్రేరణ పొందిన ఔరంగజేబు దక్కన్‌లో దండయాత్రలు చేశాడు. జైనుద్దీన్ సమాధిపై చేయి ఉంచి, ఈయనే నా గురువు అని ప్రకటించాడు . దేశంలో నేను ఏప్రాంతంలో చనిపోయినా, నా సమాధి, నా గురువు సమాధి పక్కనే ఉండాలని ఔరంగజేబు స్పష్టం చేశాడు" అని సంకేత్ వివరించారు.

ఫొటో సోర్స్, SHRIKANT BANGALE/BBC
ఔరంగజేబుకు మహారాష్ట్రతో సంబంధం
షాజహాన్ చక్రవర్తిగా దిల్లీని పరిపాలిస్తున్నప్పుడు, తన మూడవ కుమారుడు ఔరంగజేబును సుభేదార్‌గా దౌలతాబాదుకు పంపాడు. 1636 నుంచి 1644 వరకు ఔరంగజేబు అక్కడ సుభేదారుగా విధులు నిర్వర్తించాడు.
తరువాత, ఔరంగజేబు తన ప్రధాన కార్యాలయాన్ని దౌలతాబాద్ నుంచి ఔరంగాబాద్‌కు మార్చాడు. ఆయనకు ఔరంగాబాద్‌పై మక్కువ కలిగిందని చరిత్రకారులు చెబుతారు.
"ఔరంగజేబు దక్కను అంతా ప్రయాణించాడు. దౌలతాబాద్, వేరూల్ లాంటి ఊర్లన్నీ తిరుగుతూ దక్షిణాది ప్రాంతాల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించేవాడు. వేరూల్ గురించి ఔరంగజేబు చాలా రాశాడు. దౌలతాబాద్ నుంచి వేరూల్‌కు రహదారి నిర్మించాడు" అని డా. దులారీ ఖురేషి చెప్పారు.
1652లో ఔరంగజేబు రెండవసారి ఔరంగాబాద్‌కు సుభేదారి అయ్యాడు. అక్కడకు తిరిగి వచ్చాడు. 1652 నుంచి 1659 వరకు ఔరంగాబాద్‌లో అనేక నిర్మాణాలు చేపట్టాడు. ఆర్క్ కోట, హిమాయత్ బాగ్ తోట లాంటివి ఎన్నో నిర్మించాడు.
1681-82లో మరాఠా సామ్రాజ్యంపై దండయాత్రలు పెరుగుతూ వచ్చాయి. ఆ సమయంలో ఔరంగజేబు దక్షిణానికి తిరిగి వచ్చి, 1707లో మరణించే వరకు అక్కడే ఉన్నాడు. ఔరంగజేబు మహరాష్ట్రలోని అహ్మద్‌నగర్‌లో మరణించాడు.

ఫొటో సోర్స్, PENGUIN INDIA
పర్యటకులను ఆకర్షించే ఖుల్తాబాద్
ఖుల్తాబాద్‌లో ఔరంగజేబు మనుమరాలు బానీ బేగం పేరుతో తోట, దాని పక్కనే ఉన్న సరస్సు, భద్ర మారుతీ మందిరం లాంటివి పర్యటకులను ఆకర్షిస్తాయి.
అక్బరుద్దీన్ ఒవైసీ ఔరంగజేబు సమాధిని దర్శించడంపై రాజకీయ విమర్శలు వస్తున్న నేపథ్యంలో, ఖుల్తాబాద్ ఔరంగజేబు సమాధికి మాత్రమే పరిమితం కాదని, విశిష్టమైన, చారిత్రక ప్రాధాన్యం ఉన్న ప్రాంతమని చరిత్రకారులు భావిస్తున్నారు.
"శాతవాహన, రాష్ట్రకూటుల కాలం నాటి అవశేషాలు ఇక్కడ లభించాయి. ఇక్కడ నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న వేరూల్‌లో కైలాస్ గుహలు ఉన్నాయి. ఖుల్తాబాద్‌లో 12 నుంచి 15 ముఖ్యమైన సూఫీ సాధువుల దర్గాలు ఉన్నాయి. యేటా పండుగలు జరుగుతాయి. దేశం నలుమూలల నుంచి ముస్లింలు ఇక్కడకు వస్తుంటారు. దగ్గర్లోనే భద్ర మారుతీ మందిరం ఉంది. ఈ ఆలయన్ని పునరుద్ధరించారు. హిందువులకు ఇది పుణ్యస్థలం" అని సంకేత్ కులకర్ణి చెప్పారు.
ఔరంగాబాద్‌లోనే ఔరంగజేబు తన భార్య కోసం 'బీబీ కా మక్బారా' నిర్మించాడు. దీనిని 'దక్కన్ తాజ్' అని పిలుస్తారు. దిల్లీ చక్రవర్తి ఔరంగజేబు తన 89 సంవత్సరాల జీవితంలో 36 నుంచి 37 సంవత్సరాలు ఔరంగాబాద్‌లోనే గడిపాడు.
ఇవి కూడా చదవండి:
- పిల్లల్లో జ్వరంతో పాటు ఫిట్స్ వస్తే ఎంత ప్రమాదకరం.. ఏం చేయాలి, ఏం చేయకూడదు?
- అమెరికాలో ‘జాతి విద్వేష హత్యాకాండ’.. బఫెలో సూపర్మార్కెట్లో దుండగుడి కాల్పులు - 10 మంది మృతి
- సంపూర్ణ చంద్రగ్రహణం: ఎందుకు, ఎలా ఏర్పడుతుంది.. ఏ ఏ దేశాల్లో కనిపిస్తుంది?
- Bra ఎంపికలో మహిళలు చేసే పొరపాట్లు ఇవే.. ‘బ్రా’ సరైన కొలతను తెలుసుకోవాలంటే ఇలా చేయండి..
- సి విటమిన్ మన వయసు పెరగకుండా ఉండటానికి ఎంతవరకూ సాయపడుతుంది? అధ్యయనాలు, ఆధారాలు ఏం చెప్తున్నాయి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













