అమెరికాలో ‘జాతి విద్వేష హత్యాకాండ’.. బఫెలో సూపర్‌మార్కెట్‌లో దుండగుడి కాల్పులు - 10 మంది మృతి

ఫొటో సోర్స్, Reuters
అమెరికాలోని న్యూయార్క్ రాష్ట్రం బఫెలో నగరంలో శనివారం మధ్యాహ్నం ఒక సూపర్‌మార్కెట్‌లో దుండుగుడు జరిపిన తుపాకీ కాల్పుల్లో పది మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇది జాతి విద్వేషంతో పాల్పడిన నేరంగా పరిగణిస్తూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కొంత ప్రతిఘటన తర్వాత 18 ఏళ్ల యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి పేరును పోలీసులు వెల్లడించలేదు.
అనుమానితుడు శనివారం మధ్యాహ్నం సూపర్‌మార్కెట్‌లోకి ప్రవేశించాడు. ఆ తర్వాత తుపాకీతో కాల్పులు ప్రారంభించాడు. ఈ దాడిని ఆన్‌లైన్‌లో లైవ్-స్ట్రీమ్ చేయటానికి అతడు ఒక కెమెరాను ఉపయోగించినట్లు పోలీసులు చెప్పారు.
ఇది 'హింసాత్మక తీవ్రవాద' చర్య అని ఎఫ్‌బీఐ అభివర్ణించింది.

ఫొటో సోర్స్, Getty Images
బఫెలో నగరంలో ప్రధానంగా నల్లజాతి ప్రజలు నివసించే ఈ ప్రాంతానికి చేరుకోవటానికి అనుమానితుడు కొన్ని గంటల పాటు కారు నడుపుకుని వచ్చినట్లు భావిస్తున్నారు.
ఈ కాల్పుల్లో మొత్తం 13 మందికి తూటాలు తగిలాయని, వారిలో అత్యధికులు నల్లజాతి వారేనని బఫెలో పోలీస్ కమిషనర్ జోసెఫ్ గ్రమగిలా చెప్పారు. పది మంది చనిపోగా, మిగతా ముగ్గురికి చికిత్స అందిస్తున్నారు.
సూపర్‌మార్కెట్ దగ్గర సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న ఓ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్.. అనుమానితుడి మీద కాల్పులు జరపటానికి ప్రయత్నించి, అతడి కాల్పుల్లో చనిపోయారు.

అనుమానితుడు అత్యంత శక్తివంతమైన రైఫిల్‌ను, శరీర రక్షణ కవచాలను, హెల్మెట్‌ను ధరించి ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
పోలీసులు చుట్టుముట్టాక కొంతసేపు ప్రతిఘటించిన అనుమానితుడు అనంతరం తన రైఫిల్‌ను పోలీసులకు అప్పగించాడు.
ఈ దాడిలో చనిపోయిన వారి కోసం, వారి కుటుంబాల కోసం దేశాధ్యక్షుడు జో బైడెన్, ఆయన భార్య ప్రార్థనలు చేస్తున్నారని అధ్యక్ష భవనం ఒక ప్రకటనలో పేర్కొంది.
‘సైనిక దుస్తుల్లోని వ్యక్తి ఆర్మీ స్టైల్‌లో కాల్పులు జరిపాడు’
సైనిక దుస్తుల్లో ఉన్న ఆగంతకుడు సూపర్ మార్కెట్ వెలుపుల కాల్పులు జరపటాన్ని తాను చూశానని రోడ్డుకు అవతలి నుంచి ఈ దారుణాన్ని చూసిన ప్రత్యక్ష సాక్షి గ్రాడీ లూయిస్ స్థానిక మీడియాకు తెలిపారు.
‘‘ఆ తర్వాత అతడు ఆర్మీ స్టైల్‌లో వంగుతూ జనాన్ని తుపాకీతో కాల్చుతూ లోపలికి వెళ్లటం చూశాను’’ అని చెప్పారు.
ఈ దాడి జరిగినపుడు సూపర్‌మార్కెట్‌లో పనిచేస్తున్న షానెల్ హారిస్.. తాను 70 పైగా తుపాకీ కాల్పులు విన్నట్లు బఫెలో న్యూస్ చానల్‌కు చెప్పారు. తాను వెనుక ద్వారం నుంచి తప్పించుకుపోయానని తెలిపారు.
‘‘వారాంతం కావటంతో స్టోర్ నిండా జనం ఉన్నారు. ఇదంతా ఓ పీడకలలా ఉంది’’ అన్నారామె.
ఇవి కూడా చదవండి:
- 'ఏడాదిలోగా మనుమడో, మనుమరాలినో కనివ్వండి, లేదా 5 కోట్ల పరిహారం కట్టండి' -కొడుకు, కోడలిపై తల్లిదండ్రుల కేసు
- సర్కారువారి పాట సినిమా రివ్యూ: శ్రుతి, లయ, తాళం తప్పిన పాట
- మదర్స్ డే: తల్లి అయ్యేందుకు సరైన వయసు ఏది? నిపుణులు చెప్పిన సమాధానం ఇది
- తాజ్‌మహల్ ఒకప్పుడు తేజో మహాలయమా... ఆ 22 గదులలో ఏముంది?
- టంగ్-టై అంటే ఏంటి? పిల్లల్లో పెరుగుతున్న ఈ కొత్త సమస్యను గుర్తించడం ఎలా?
- ఇల్లు కొనడం మంచిదా లేక అద్దెకు ఉండటం మంచిదా.. సొంతిల్లు కొనే ముందు ఇవి తెలుసుకోండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










