చెక్కతో ఉపగ్రహాల తయారీ.. అంతరిక్ష వ్యర్థాలతో కలిగే ప్రమాదాలను తగ్గించే ప్రయత్నం

జపాన్ సంస్థ క్యోటో యూనివర్సిటీ సంయుక్తంగా చెక్కతో ఉపగ్రహాలను తయారు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి.

ఫొటో సోర్స్, SUMITOMO FORESTRY

ఫొటో క్యాప్షన్, జపాన్ సంస్థ క్యోటో యూనివర్సిటీ సంయుక్తంగా చెక్కతో ఉపగ్రహాలను తయారు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి.
    • రచయిత, జస్టిన్ హార్పర్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఉపగ్రహాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో అంతరిక్ష వ్యర్థాలు ఎక్కువవుతున్నాయి.

ఈ సమస్యను అరికట్టడానికి జపాన్‌కు చెందిన ఒక సంస్థ క్యోటో యూనివర్సిటీతో కలిసి చెక్కతో ఉపగ్రహాలను తయారు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది.

వీరి ప్రయత్నాలు సఫలీకృతమైతే 2023 నాటికి చెక్కతో చేసిన ఉపగ్రహం అందుబాటులోకి వస్తుంది.

భూమిపై వివిధ ఉష్ణోగ్రతల్లో రకరకాల చెక్కలతో వీరు పరిశోధనలు సాగిస్తారు.

అంతరిక్షంలో చెక్క వాడకం, వృక్షాల ఎదుగుదల గురించి ఇప్పటికే పరిశోధనలు మొదలుపెట్టినట్లు సుమిటోమో ఫారెస్ట్రీ తెలిపింది.

ఈ చెక్కతో చేసిన ఉపగ్రహాలు వాతావరణంలోకి హానికారక పదార్ధాలను విడుదల చేయకుండా లేదా అవి తిరిగి భూమిని చేరుకునేటప్పుడు వ్యర్ధాలను విడిచి పెట్టకుండా దగ్ధం అవుతాయి.

"నిజానికి అంతరిక్షంలోకి పంపిన ఉపగ్రహాలు తిరిగి భూమిని చేరేటప్పుడు సూక్ష్మమైన అల్యూమినియం రేణువులను విడుదల చేయడం పట్ల మాకు చాలా ఆందోళన ఉంది.

ఇవి భూమి వెలుపల ఉండే వాతావరణంలో చాలా రోజులు తేలుతూ ఉంటాయి" అని జపాన్ వ్యోమగామి క్యోటో యూనివర్సిటీ ప్రొఫెసర్ టకావ్ డోయ్ చెప్పారు.

"ఇది అంతిమంగా భూమిపై పర్యావరణాన్ని ప్రభావితం చేస్తుంది" అని అన్నారు.

"వచ్చే దశలో ఈ ఉపగ్రహపు ఇంజనీరింగ్ నమూనాను తయారు చేస్తాం. ఆ తరువాత ఎగిరే నమూనాను తయారు చేస్తాం" అని డోయ్ చెప్పారు.

ఆయన మార్చి 2008లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని సందర్శించారు.

ఈ మిషన్లో భాగంగా మైక్రో గ్రావిటీలో వాడేందుకు రూపొందించిన ఒక ఆయుధాన్ని అంతరిక్షంలోకి విసిరిన తొలి వ్యక్తిగా నిలిచారు.

భూమి చుట్టూ సుమారు 6000 ఉపగ్రహాలు తిరుగుతున్నాయని వరల్డ్ ఎకనమిక్ ఫారం అంచనా వేసింది

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, భూమి చుట్టూ సుమారు 6000 ఉపగ్రహాలు తిరుగుతున్నాయని వరల్డ్ ఎకనమిక్ ఫోరం అంచనా వేసింది

అన్ని రకాల ఉష్ణోగ్రతలు, సూర్యరశ్మి పరిస్థితులను తట్టుకోగలిగే విధంగా ఉపగ్రహ తయారీకి కావాల్సిన చెక్క పదార్ధాలను తయారు చేసేందుకు కృషి చేస్తామని సుమిటోమో ఫారెస్ట్రీ తెలిపింది.

ఇది 400 ఏళ్ల క్రితం స్థాపితమైన సుమిటోమో గ్రూపుకు చెందిన సంస్థ.

"ఈ సంస్థ వాడుతున్న చెక్క పదార్ధం పరిశోధనా రహస్యం" అని సంస్థ ప్రతినిధి బీబీసీ కి తెలిపారు.

అంతరిక్షంలోకి వెళ్లేందుకు స్పేస్ వాహనాలు, ఉపగ్రహాలను అధిక సంఖ్యలో ఉపయోగిస్తూ ఉండటంతో అంతరిక్ష వ్యర్ధాలు భూమి పైకి పడటం వలన పెరుగుతున్న ముప్పు గురించి నిపుణులు ఇప్పటికే హెచ్చరించారు.

టెలివిజన్, నావిగేషన్, వాతావరణ పరిస్థితుల అంచనా, సమాచార వ్యవస్థలో ఉపగ్రహాలను విరివిగా వాడుతున్నారు.

అంతరిక్ష వ్యర్ధాలను తగ్గించేందుకు, తొలగించేందుకు ఉన్న వివిధ మార్గాల గురించి ఇప్పటికే అంతరిక్ష రంగ నిపుణులు, పరిశోధకులు పరిశోధనలు నిర్వహిస్తున్నారు.

భూమి చుట్టూ సుమారు 6000 ఉపగ్రహాలు తిరుగుతున్నాయని వరల్డ్ ఎకనమిక్ ఫారం అంచనా వేసింది. అందులో 60 శాతం వ్యర్ధమైనవే.

ఈ దశాబ్దంలో 990 ఉపగ్రహాలను విడుదల చేయనున్నట్లు యూరో కన్సల్ట్ అనే పరిశోధనా సంస్థ అంచనా వేసింది. అంటే, అంతరిక్ష కక్ష్యల్లో 2028 కల్లా సుమారు 15,000 ఉపగ్రహాలు ఉండవచ్చు.

ఇప్పటికే ఎలాన్ మస్క్ కి చెందిన స్పేస్ ఎక్స్ 900 స్టార్ లింక్ ఉపగ్రహాలను విడుదల చేసింది.

మరి కొన్ని వేల ఉపగ్రహాలను విడుదల చేసేందుకు ప్రణాళికలు కూడా ఉన్నాయి.

అంతరిక్ష వ్యర్ధాలు గంటకు 22,300 మైళ్ల వేగంతో ప్రయాణం చేస్తాయి. ఇవి దేనిని తాకినా వాటికి విపరీతమైన హాని కలిగే అవకాశం ఉంది.

2006లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని ఒక చిన్న అంతరిక్ష వ్యర్థం ఢీకొనడంతో అత్యంత బలమైన ఒక కిటికీలోని భాగం ఊడి వచ్చేసింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)