ఫిన్‌లాండ్: పుతిన్ హెచ్చరిస్తున్నా పట్టించుకోకుండా ఈ దేశం ఎందుకు నాటోలో చేరుతోంది?

సనా మారిన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సనా మారిన్
    • రచయిత, భూమికా రాయ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

నాటోలో ఫిన్‌లాండ్ చేరే దిశగా తాజా పరిణామాలు

  • నాటోలో చేరేందుకు అధికారికంగా దరఖాస్తు చేయబోతున్నట్లు ఫిన్‌లాండ్ అధ్యక్షుడు సౌలీ నినిస్టో ధ్రువీకరించారు.
  • నాటోలో సభ్యత్వం కోసం పార్లమెంటులో కొన్ని రోజుల్లోనే ఒక తీర్మానం ప్రవేశపెట్టనున్నట్లు ఫిన్‌లాండ్ ప్రధాన మంత్రి సనా మారిన్ చెప్పారు.
  • మరోవైపు ఫిన్‌లాండ్, స్వీడన్ కూడా నాటోలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు నాటో సెక్రటరీ జనరల్ జోన్స్ స్టోలెన్‌బర్గ్ వ్యాఖ్యానించారు. ఫిన్‌లాండ్, స్వీడన్‌ల నిర్ణయాలను చరిత్రాత్మకంగా ఆయన అభివర్ణించారు.
  • ‘‘స్వీడన్, ఫిన్‌లాండ్: మీరు సిద్ధంగా ఉంటే, మేం కూడా సిద్ధమే’’అని జర్మనీ విదేశాంగ మంత్రి వ్యాఖ్యానించారు.
  • ఫిన్‌లాండ్, స్వీడన్‌ల నిర్ణయాలకు అమెరికా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని అమెరికా విదేశాంగ మంత్రి కూడా స్పష్టంచేశారు.
ఫిన్‌లాండ్ అధ్యక్షుడు

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, ఫిన్‌లాండ్ అధ్యక్షుడు సౌలీ నినిస్టో

తటస్థంగా ఉండే ఫిన్‌లాండ్ ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది?

రష్యాతో ఫిన్‌లాండ్‌కు1340 కి.మీ. పొడవైన సరిహద్దు ఉంది. ఈ సరిహద్దు రెండు దేశాలకూ వ్యూహాత్మకంగా చాలా కీలకమైనది.

1917లో ఫిన్‌లాండ్‌ స్వాతంత్ర్యం ప్రకటించుకుంది. దీనికి ముందు ఫిన్‌లాండ్‌లోని చాలా భాగాలు రష్యా ఆధీనంలో ఉండేవి. రెండో ప్రపంచ యుద్ధంలో రష్యాకు వ్యతిరేకంగా ఫిన్‌లాండ్ యుద్ధంలో పాల్గొంది. గత 200ఏళ్లలో స్వీడన్ ఎప్పుడూ యుద్ధంలో పాల్గొనలేదు. ప్రజాస్వామ్యం, అణు నిరాయుధీకరణలకు ఈ రెండు దేశాలూ తమ విదేశాంగ విధానంలో ప్రాధాన్యం ఇస్తున్నాయి.

ఈ ఏడాది జనవరిలో రష్యా బలగాలను భారీగా యుక్రెయిన్ సరిహద్దుల్లో మోహరించారు. ఆ సమయంలో తమ దేశం నాటోలో చేరే అవకాశాలు చాలా తక్కువని ఫిన్‌లాండ్ ప్రధాన మంత్రి చెప్పారు.

కానీ, ఆ తర్వాత యుక్రెయిన్‌పై రష్యా దాడి చేసింది. దీంతో ఫిన్‌లాండ్ విధానాల్లోనూ మార్పులు వచ్చాయి.

ఇప్పుడు నాటోలో చేరడం తమకు అనివార్యమని ఫిన్‌లాండ్ చెబుతోంది. యుక్రెయిన్‌పై రష్యా దాడితో తమ వ్యూహాలు పూర్తిగా మారాయని ఫిన్‌లాండ్‌లోని యూరోపియన్ వ్యవహారాల మంత్రి టిట్టి టప్రెనెన్ వ్యాఖ్యానించారు.

ఫిన్‌లాండ్ తాజా ప్రకటనకు ఒక రోజు ముందు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ఫిన్‌లాండ్ అధ్యక్షుడు సమావేశమయ్యారు. ఫిన్‌లాండ్ భద్రతకు ఎలాంటి ముప్పూ ఉండదని ఆ సమావేశంలో పుతిన్ హామీ ఇచ్చారు. అయినప్పటికీ ఫిన్‌లాండ్ తాజా నిర్ణయం తీసుకుంది.

ఫిన్‌లాండ్

ఫొటో సోర్స్, Reuters

ద్వైపాక్షిక సంబంధాల్లో మార్పులు

ఈ ప్రశ్నపై కింగ్స్ కాలేజీ లండన్‌లోని అంతర్జాతీయ వ్యవహారాల ప్రొఫెసర్ హర్ష్ పంత్ మాట్లాడారు. ‘‘యుక్రెయిన్‌పై రష్యా దాడి తర్వాత.. రష్యాతో సరిహద్దులున్న దేశాల విధానాల్లో చాలా మార్పులు వచ్చాయి. ఇప్పుడు చాలా కొన్ని దేశాలు మాత్రమే రష్యాకు మద్దతు తెలుపుతున్నాయి’’అని పంత్ అన్నారు.

‘‘ఈ సమస్యకు వ్యూహాత్మక పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నట్లు మొదట్లో రష్యా చెప్పింది. ఆ తర్వాత దాడి చేసింది. దీంతో రష్యాకు పొరుగునున్న చాలా దేశాలు తమ విదేశాంగ విధానాల్లో మార్పులు చేసుకున్నాయి. రష్యాపై ఆయా దేశాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. రష్యా దాడి చేస్తుందనే భయం ఆ దేశాల్లో ఉంది’’అని ఆయన చెప్పారు.

నాటోలో చేరేందుకు ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని రష్యా హెచ్చరించినప్పటికీ ఫిన్‌లాండ్ తాజా నిర్ణయం తీసుకుందని హర్ష్ పంత్ వివరించారు.

ఈ అంశంపై విదేశాంగ నిపుణుడు మనోజ్ జోషి మాట్లాడుతూ.. ‘‘రష్యా, ఫిన్‌లాండ్‌ల ద్వైపాక్షిక సంబంధాలు పురాతనమైనవి. అయితే, యుక్రెయిన్‌పై రష్యా దాడి వల్ల ఫిన్‌లాండ్‌లో భయాందోళనలు నెలకొన్నాయి. మరోవైపు ఫిన్‌లాండ్ తాజా నిర్ణయానికి కొన్ని చారిత్రక కారణాలు కూడా ఉన్నాయి. ఫిన్‌లాండ్‌లో చాలా భాగాలను రష్యా గతంలో ఆక్రమించింది. భవిష్యత్‌లో ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ఉండేందుకే ఫిన్‌లాండ్ ఈ నిర్ణయం తీసుకుంది’’అని అన్నారు.

నాటోలో ఫిన్‌లాండ్, స్వీడన్‌ చేరాలని ప్రయత్నిస్తే, సరిహద్దుల్లో అణ్వాయుధాలను మోహరిస్తామని ఇప్పటికే రష్యా హెచ్చరించింది. ఫిన్‌లాండ్ తాజా చర్యలతో రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతింటాయి. మరోవైపు ఉత్తర ఐరోపాలోని శాంతి, భద్రతలకు కూడా భంగం కలిగే ముప్పుంటుంది.

ఫిన్‌లాండ్

ఫొటో సోర్స్, Reuters

ఫిన్‌లాండ్ చర్యలతో ఎలాంటి మార్పులు వస్తాయి?

నిజానికి ఫిన్‌లాండ్ తాజా నిర్ణయంతో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు.

1994 నుంచి ఫిన్‌లాండ్, స్వీడన్.. నాటో ‘‘భాగస్వామ్య దేశాలు’’గా కొనసాగుతున్నాయి. అయితే, ఇది పూర్తి నాటో సభ్యత్వం కాదు. అయినప్పటికీ రెండు దేశాలూ నాటో కార్యకలాపాల్లో పాలుపంచుకుంటున్నాయి.

అధికారికంగా నాటోలో చేరితే ‘‘ఆర్టికల్ 5’’ కూడా ఈ రెండు దేశాలకూ వర్తిస్తుంది. దీని ప్రకారం, నాటోలోని ఏదైనా ఒక దేశంపై దాడి జరిగితే, అన్ని దేశాలపైనా దాడి జరిగినట్లు భావించి చర్యలు తీసుకుంటారు. మరోవైపు భద్రత పరంగానూ నాటో నుంచి ఫిన్‌లాండ్, స్వీడన్‌లకు భరోసా ఉంటుంది.

‘‘గతంలోనూ ఫిన్‌లాండ్ నాటో కార్యక్రమాల్లో పాలుపంచుకుంది. కానీ, అధికారికంగా నాటోలో చేరడం ద్వారా ఆర్టికల్ 5 ఆ దేశానికి వర్తిస్తుంది. అంటే ఒకవేళ రష్యా దాడిచేస్తే, ఆ దాడిని అడ్డుకునేందుకు మిత్ర దేశాలు వస్తాయని భరోసా ఫిన్‌లాండ్‌కు ఉంటుంది’’అని మనోజ్ జోషి చెప్పారు.

వీడియో క్యాప్షన్, 2,000 కి.మీ. కఠిన ప్రయాణం చేసిన యుక్రెయిన్ యువతి కథ

రష్యాకు పెరుగుతున్న సవాళ్లు..

రష్యా నుంచి ముప్పు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫిన్‌లాండ్ నాయకులు చెబుతున్నారు. అయితే, ఈ చర్యలతో రష్యా ప్రాబల్యం తగ్గుతున్నట్లు భావించొచ్చా?

‘‘నిజానికి ఇది రష్యాకు భారీ వ్యూహాత్మక ఓటమిగా చెప్పాలి. దీనికి యుక్రెయిన్‌తో యుద్ధమే ప్రధాన కారణం. ఇదివరకు స్వీడన్, ఫిన్‌లాండ్‌లకు నాటోలో చేరే ఉద్దేశమే లేదు. ఈ యుద్ధం వల్ల రష్యాకు భద్రతా పరమైన సవాళ్లు పెరుగుతున్నాయి’’అని హర్ష్ పంత్ చెప్పారు.

పుతిన్

ఫొటో సోర్స్, Getty Images

‘‘ఇప్పటివరకు ఫిన్‌లాండ్, స్వీడన్‌లను బఫర్ దేశాలుగా రష్యా భావిస్తూ వచ్చింది. ఇప్పుడు ఈ దేశాలు కూడా నాటోలో చేరే దిశగా ప్రయత్నాలు మొదలుపెడుతున్నాయి’’అని హర్ష్ పంత్ వివరించారు.

‘‘రష్యాకు ముప్పులు పెరుగుతున్న మాట వాస్తవమే. అయితే, దీనికి కారణం రష్యానే. ఫిన్‌లాండ్ తాజా నిర్ణయంతో రష్యాకు నాటో మరింత సమీపంలోకి వస్తుంది. ఫిన్‌లాండ్ భూభాగం నుంచి క్షిపణులు ప్రయోగిస్తే, రష్యాలోని చాలా భాగాలను లక్ష్యంగా చేసుకోవచ్చు’’అని మనోజ్ జోషి అన్నారు.

వీడియో క్యాప్షన్, నిత్యావసర సరకుల ధరలు ఇంకా పెరుగుతాయా? ఈ ధరల మంట చల్లారేదెప్పుడు?

ఐరోపా దేశాలు ఏం అంటున్నాయి?

ఫిన్‌లాండ్ తాజా నిర్ణయాన్ని అమెరికాతోపాటు జర్మనీ సహా చాలా ఐరోపా దేశాలు స్వాగతిస్తున్నాయి. రష్యాకు ఈ దేశాలు ఎలాంటి సందేశాన్ని పంపాలని భావిస్తున్నాయి?

‘‘తామంతా కలిసికట్టుగా ఉన్నామని రష్యాకు ఐరోపా దేశాలు చెప్పాలని భావిస్తున్నాయి’’అని హర్ష్ పంత్ వ్యాఖ్యానించారు.

మరోవైపు ఫి‌న్‌లాండ్ తాజా నిర్ణయంతో రష్యా-యుక్రెయిన్ యుద్ధంపై ఎలాంటి ప్రభావం పడుతుంది?

ఈ ప్రశ్నపై హర్ష్ పంత్ మాట్లాడుతూ.. ‘‘ఫిన్‌లాండ్ నిర్ణయంతో రష్యా-యుక్రెయిన్ యుద్ధంపై నేరుగా ఎలాంటి ప్రభావం పడకపోవచ్చు. కానీ, పొరుగునున్న దేశాల వ్యూహాలు మారుతున్నాయనే సందేశం రష్యాకు వెళ్తుంది. దీంతో తమ వ్యూహాలు మార్చుకోవాలని రష్యాకు కూడా అర్థమవుతుంది’’అని ఆయన అన్నారు.

‘‘రష్యాకు సరిహద్దున ఉండే కొన్ని దేశాలు దశాబ్దాలుగా తటస్థంగా ఉన్నాయి. ఇప్పుడు అవి కూడా నాటోలో చేరడంతో, కచ్చితంగా రష్యాపై ప్రభావం పడుతుంది. కానీ, యుద్ధంలో రష్యా చాలావరకు వెళ్లిపోయింది. ఇప్పుడు వారి ముందు వేరే మార్గం లేదు. ఎలాగైనా ఆ యుద్ధాన్ని వారు కొనసాగించాలని చూస్తున్నారు. ఎందుకంటే ఇది పుతిన్ ఇమేజ్‌పై ప్రభావం చూపిస్తుంది’’అని ఆయన వివరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)