యుక్రెయిన్ యుద్ధం: రష్యాను అన్ని దేశాలూ ఎందుకు వ్యతిరేకించడం లేదు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఫ్రాంక్ గార్డనర్
- హోదా, సెక్యూరిటీ కరెస్పాండెంట్
"నాటోను మా సరిహద్దులకు తరలించడానికి, మా సంస్కృతిని దెబ్బ తీయడానికి యుక్రెయిన్, దాని మిత్రపక్షాలు గత వెయ్యి సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తున్నాయి. చాలా ఏళ్లుగా వాళ్లు మమ్మల్ని వేధిస్తున్నారు."
రష్యా పార్లమెంటు సభ్యుడు, రష్యా టీవీ హోస్ట్ యెవ్‌జని పొపొవ్ ఏప్రిల్ 19న బీబీసీతో చెప్పిన మాటలివి.
యుక్రెయిన్ కోసం నాటో రచిస్తున్న వ్యూహాలతో రష్యా పౌరులకు నేరుగా ముప్పు పొంచి ఉందని ఆయన అన్నారు.
రష్యా గురించి పశ్చిమ దేశాలు అనుకుంటున్నదానితో పోలిస్తే ఆయన మాటలు పూర్తి భిన్నంగా, ఆశ్చర్యం కలిగించే విధంగా ఉన్నాయి.
యురోపియన్, పశ్చిమ దేశాలకు అనుకూలంగా ఉండేవారికి ఆయన ప్రకటనలు దాదాపు అర్థం కాకుండానే ఉన్నాయి. ఇప్పటి వరకు జాగ్రత్తగా సేకరిస్తున్న ఆధారాలకు ఆయన మాటలు విరుద్ధంగా కనిపిస్తున్నాయి.
అయితే, ఇలాంటి కొన్ని అభిప్రాయాలు కేవలం రష్యా ప్రజలు, ఆ దేశ మద్దతుదారుల్లో మాత్రమే కాదు.. ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఇలాంటి అభిప్రాయాలు ఉన్నాయి.
ఫిబ్రవరి 24న యుక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య ప్రారంభించింది. ఆ తర్వాత ఆ దాడిని ఖండిస్తూ ఐక్యరాజ్యసమితి అత్యవసర ఓటింగ్ నిర్వహించింది. వారం తర్వాత 193 దేశాల్లో 141 దేశాలు రష్యా చర్యను ఖండించాయి.
కానీ చైనా, భారత్, దక్షిణాఫ్రికా వంటి చాలా దేశాలు ఆ తీర్మానానికి దూరంగా ఉన్నాయి. అంటే దీనర్థం 'యుద్ధానికి ప్రధాన కారణం రష్యా'నే అనే నాటో అభిప్రాయాన్ని ప్రపంచం మొత్తం నమ్ముతోందని పశ్చిమ దేశాల నాయకులు అనుకోవడం భ్రమే అవుతుంది. ఎందుకంటే పరిస్థితి అలా లేదు.
రష్యా దండయాత్రపై చాలాదేశాలు ఎందుకు తటస్థంగా ఉంటున్నాయి?
దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఆయా దేశాల ఆర్థిక లేదా సైనిక స్వప్రయోజనాల నుంచి పశ్చిమ దేశాల హిపోక్రసీ, యూరప్‌కు ఉన్న వలసవాద చరిత్ర వరకు అనేక కారణాలు ఉన్నాయి.
దేశాలన్నింటికీ ఉన్న ఒకే ఒక కారణం ఇదేనని చెప్పలేని పరిస్థితి. రష్యా చర్యను ఖండించకపోవడానికి, అదే సమయంలో పుతిన్‌కు మద్దతు ప్రకటించకపోవడానికి ఒక్కో దేశానికి ఒక్కో కారణం ఉండొచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
'సహకారానికి పరిమితులు లేవు'
ముందు చైనా నుంచి మొదలుపెడదాం. యుక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన వార్తలను చైనా ప్రజలు ప్రభుత్వ నియంత్రిత మీడియా ద్వారా తెలుసుకుంటున్నారు.
యుక్రెయిన్‌పై సైనిక చర్యకు కొన్నిరోజుల ముందు వింటర్ ఒలింపిక్స్‌కు ముఖ్య అతిథిగా రష్యా అధ్యక్షుడు పుతిన్ హాజరయ్యారు.
'రెండు దేశాల మధ్య పరస్పర సహకారంలో ఎలాంటి పరిమితులు లేవు' అని ఆ తర్వాత చేసిన ప్రకటనలో చైనా పేర్కొంది.
అంటే, యుక్రెయిన్‌పై పూర్తిస్థాయి దాడికి దిగబోతున్నట్లు పుతిన్ చైనా అధ్యక్షుడికి ముందే సంకేతాలు ఇచ్చారా?
కచ్చితంగా ఇవ్వలేదనే అంటోంది చైనా.
కానీ, అలాంటి ముఖ్యమైన పొరుగుదేశానికి త్వరలో ఏం జరగబోతోందో కనీసం ఒక్క సంకేతం కూడా ఇవ్వలేదనడం కూడా నమ్మశక్యంగా లేదు.
చైనా, రష్యాలు ఏదో ఒకరోజు వ్యూహాత్మక ప్రత్యర్థులుగా మారవచ్చు. ప్రస్తుతం ఆ రెండు దేశాలు భాగస్వాములు. నాటో, పశ్చిమ దేశాలు, వాటి ప్రజాస్వామ్య విలువల పట్ల రెండు దేశాలకు ద్వేషభావం ఉంది.
దక్షిణ చైనా సముద్రంలో తమ దేశ సైనిక విస్తరణ విషయంలో అమెరికాతో చైనా ఇప్పటికే ఘర్షణ పడుతోంది.
చైనాలో వీగర్ ముస్లింల అంశం, హాంగ్‌కాంగ్‌లో ప్రజాస్వామ్యాన్ని అణిచివేయడం, తైవాన్‌ను అవసరమైతే బలవంతంగానైనా తమ చేతుల్లోకి తీసుకుంటామని పదే పదే చెప్పడం.. ఇలా అనేక విషయాల్లో పశ్చిమ దేశాలతో చైనా విభేదిస్తోంది.
దీనిని బట్టీ చూస్తే, చైనా, రష్యాలకు కలిపి నాటోలో ఒక ఉమ్మడి శత్రువు ఉన్నారు. ఆయా దేశాల ప్రభుత్వాల దృక్కోణాన్ని ఆ దేశాల ప్రజలు కూడా సమర్థిస్తారు. రష్యా యుక్రెయిన్ పై చేస్తున్న యుద్ధాన్ని, యుద్ధ నేరాలను పశ్చిమ దేశాలు నిరసిస్తున్నట్లుగా ఆ దేశాల్లో ప్రజలు మద్దతు పలకకపోవచ్చు.
రష్యాకు వ్యతిరేకం అవ్వకుండా ఉండేందుకు భారతదేశానికి, పాకిస్తాన్ కు తమ సొంత కారణాలున్నాయి.
భారత్ మాస్కో నుంచి అత్యధికంగా ఆయుధాలను సమకూర్చుకుంటుంది. ఇటీవల హిమాలయాల్లో చైనాతో జరిగిన పోరాటం తర్వాత, ఎప్పటికైనా భారత్ కు భద్రత కోసం రష్యా మద్దతు, సహకారం అవసరం కావచ్చు.
పాకిస్తాన్‌లో ఇటీవల ఇమ్రాన్ ఖాన్ ప్రధాని పదవి నుంచి పదవీచ్యుతులయ్యారు. ఆయన పశ్చిమ దేశాలను ముఖ్యంగా అమెరికాను తీవ్రంగా విమర్శించేవారు.
పాకిస్తాన్ కూడా రష్యా నుంచి ఆయుధ సంపత్తిని సమకూర్చుకుంటుంది. మధ్య ఆసియాలోకి ప్రవేశించే వాణిజ్య మార్గాలను సంరక్షించుకునేందుకు పాకిస్తాన్ కు కూడా రష్యా సహకారం అవసరం.
యుక్రెయిన్ లో యుద్ధం మొదలు అయిన రోజు ఫిబ్రవరి 24న ఇమ్రాన్ ఖాన్ ప్రధాని హోదాలో రష్యా సందర్శించారు. రష్యా యుక్రెయిన్ పై చేస్తున్న దాడికి వ్యతిరేకంగా ఐక్యరాజ్య సమితిలో జరిగిన వోటింగ్ లో భారత్ పాకిస్తాన్ కూడా పాల్గొనలేదు.

ఫొటో సోర్స్, Getty Images
ఆత్మవంచన, ద్వంద్వ విలువలు
అమెరికా నేతృత్వం వహించే పశ్చిమ దేశాలు ఆత్మ వంచనతో ఉంటూ, ద్వంద్వ వైఖరిని అవలంబిస్తాయని చాలా ముస్లిం దేశాలు ఆరోపిస్తుంటాయి.
2003లో అమెరికా, బ్రిటన్ కూడా ఐక్యరాజ్య సమితి, ప్రపంచ దేశాల అభిప్రాయానికి విలువ ఇవ్వకుండా ఇరాక్ పై దాడి చేశాయి. ఈ దాడి వల్ల కొన్నేళ్ల పాటు హింస కొనసాగింది. వాషింగ్టన్, లండన్ రాయల్ సౌదీ ఎయిర్ ఫోర్స్ కు ఆయుధ సరఫరా చేసి యెమెన్ లో అంతర్యుద్ధాన్ని పొడిగించేందుకు సహకరించాయనే ఆరోపణలున్నాయి. ఆ దేశంలో అధికారంలో ఉన్న ప్రభుత్వానికి మద్దతుగా రాయల్ సౌదీ ఎయిర్ ఫోర్స్ తరచుగా వైమానిక దాడులు నిర్వహిస్తూ ఉండేది.
ఆఫ్రికాలో చాలా దేశాలు పశ్చిమ దేశాలకు మద్దతివ్వకపోవడానికి కొన్ని చారిత్రక కారణాలున్నాయి. సహారా నుంచి కేప్ వరకు ఉన్న అమెరికా ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు సోవియెట్ పాలనలో ఆఫ్రికాకు ఆయుధాలను సరఫరా చేసింది.
19, 20వ శతాబ్దాల్లో యూరోప్ కొన్ని దేశాల పై సాగించిన వలసాధిపత్యం ప్రభావం నేటికీ కీలకమైన పాత్ర పోషిస్తుంది.
2013లో అల్ ఖైదా మాలీని పూర్తిగా స్వాధీనం చేసుకోకుండా నిరోధించేందుకు ఫ్రాన్స్ తమ సేనలను పంపింది. అయితే, ఫ్రాన్స్ కు వలస దేశంగా ఉన్న మాలీలో ఫ్రాన్స్ పట్ల సానుకూలత లేదు. దీంతో, ఫ్రెంచ్ సేనలు దేశం వదిలి వెళ్లాయి. ఈ ఖాళీని పూరించేందుకు క్రెమ్లిన్ మద్దతు ఉన్న వాగ్నర్ గ్రూప్ కి చెందిన కిరాయి సైనికులు మాలీకి వెళ్లారు.
ఈ మొత్తం సన్నివేశంలో మధ్యప్రాచ్య దేశాల స్థానం ఎక్కడ? సిరియా, ఉత్తర కొరియా, బెలారస్, ఎరిత్రీ రష్యా దాడిని సమర్ధించడంలో ఆశ్చర్యపోయేందుకు ఏమి లేదు. 2015లో సిరియా ఐసిస్ తిరుగుబాటుదారుల చేతుల్లోకి చిక్కుకునే ముప్పు నుంచి బయటపడిన తర్వాత నుంచీ సిరియా అధ్యక్షుడు బషర్ అల్-అసద్ తన మనుగడ కోసం రష్యా పై విపరీతంగా ఆధారపడుతున్నారు. కానీ,
పశ్చిమ దేశాలకు ఎప్పటి నుంచో మిత్ర దేశాలుగా ఉన్న సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) కూడా ఐక్యరాజ్యసమితిలో వోటింగ్ ను సమర్ధించినప్పటికీ, మాస్కోను విమర్శించే విషయంలో మాత్రం మౌనం వహించారు.
యూఏఈలో చట్టబద్ధమైన పాలకుడు, ప్రిన్స్ మొహమ్మద్ బిన్ జాయెద్‌కు కూడా పుతిన్‌తో సత్సంబంధాలున్నాయి. మాస్కోకు యూఏఈ మాజీ రాయబారి పుతిన్‌తో కలిసి వేటకు వెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి.
సౌదీ అరేబియా యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ కు బైడెన్‌తో సత్సంబంధాలు లేవు. ఒకరి ఫోన్ కాల్స్ ఒకరు తీసేందుకు కూడా ఇష్టపడనంత వైరం వారిద్దరి మధ్యా ఉంది.
అంతకు ముందు 2018లో జీ-20 సదస్సు కోసం ప్రపంచ దేశాల నాయకులు బ్యూనస్ ఎయిర్స్‌లో సమావేశమైనప్పుడు కూడా చాలా పశ్చిమ దేశాలు సౌదీ యువరాజుతో సాదరంగా ప్రవర్తించలేదు. అంతకు ముందే సౌదీ విలేఖరి జమాల్ ఖషోగ్జీ హత్యకు సౌదీ క్రౌన్ ప్రిన్స్ ఆదేశించారని పశ్చిమ దేశాలు ఆరోపించాయి. ఇందుకు విరుద్ధంగా పుతిన్ మాత్రం ఆయనకు హై ఫై ఇచ్చారు.
ఈ సంఘటలన్నిటినీ సౌదీ నాయకుడు అంత త్వరగా మర్చిపోతారని అనుకోలేం.
అలా అని బెలారస్ తప్ప మిగిలిన దేశాలన్నీ రష్యా చేస్తున్న దాడిని సమర్ధిస్తున్నాయని చెప్పలేం. ఐక్యరాజ్యసమితిలో మార్చి 02న రష్యాకు మద్దతుగా కేవలం 5 దేశాలే ఓటు వేశాయి. మద్దతుగా ఓటు వేసిన దేశాల్లో రష్యా కూడా ఒకటి. అలా అని పుతిన్ గురించి, ఆంక్షల గురించి, రష్యా దాడిని నేరుగా ఎదుర్కొనేందుకు యుక్రెయిన్ కు ప్రాణాంతక ఆయుధాలను సరఫరా చేయడం గురించి పశ్చిమ దేశాల అభిప్రాయాలతో మిగిలిన ప్రపంచ దేశాలన్నీ ఏకీభవిస్తున్నాయని మాత్రం అనుకోవడానికి లేదు.
ఇవి కూడా చదవండి:
- LIC ఐపీఓ వచ్చేసింది... షేర్లకు ఎలా దరఖాస్తు చేయాలి, పాలసీదార్లకు రాయితీ ఎంత?
- వీర్ మహాన్: WWEలో దుమ్ము దులుపుతున్న ఈ రెజ్లర్ ఎవరు?
- ఖర్చులు తగ్గించుకుని, డబ్బులు మదుపు చేయడానికి ఏడు మార్గాలు
- విదేశాంగ మంత్రి జైశంకర్ అంటే ప్రధాని మోదీకి ఎందుకంత ఇష్టం?
- కేటీఆర్ ఇంటర్వ్యూ: ''టీఆర్ఎస్ పాలన బాగా లేదని ప్రజలు అనుకుంటే మమ్మల్ని ఏ వ్యూహకర్తా కాపాడలేరు'
- మహా ప్రస్థానం: మృత దేహాలను ఉచితంగా తరలించే ప్రభుత్వ వాహన సేవలు ఎలా పొందాలి? ఎవరికి ఫిర్యాదు చేయాలి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













