వారణాసి: కాశీ విశ్వనాథ ఆలయం పక్కన ఉన్న జ్ఞాన్‌వాపి మసీదులో తనిఖీలు ఎందుకు జరుగుతున్నాయి?

ఫొటో సోర్స్, SAMEERATMAJ MISHRA
- రచయిత, అనంత్ ఝానే
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఉత్తరప్రదేశ్ వారణాసిలో కాశీ విశ్వనాథ ఆలయానికి పక్కనే ఉండే జ్ఞాన్‌వాపి మసీదు పరిసరాల్లో తనిఖీలపై వివాదం రాజుకుంది.
జిల్లా కోర్టు ఆదేశాలపై మసీదు పరిసరాల్లో తనిఖీలు చేపట్టేందుకు అడ్వొకేట్ కమిషనర్ శుక్రవారం ఇక్కడకు చేరుకున్నారు.
మసీదు వెనుకనుండే మా శృంగార్ గౌరీ, ఇతర హిందూ ఆలయాల పరిసరాలను వీడియోగా రికార్డు చేయాలని అడ్వకేట్ కమిషనర్‌కు కోర్టు సూచించింది. అక్కడ దేవాలయాలు, దీనిలోని విగ్రహాలు బాగానేఉన్నాయని ధ్రువీకరించేందుకు కోర్టు ఈ తనిఖీలకు ఆదేశాలు జారీచేసింది.
అయితే, శుక్రవారం వీడియో రికార్డు చేసేపని పూర్తికాలేదు. దీంతో శనివారం మధ్యాహ్నం మూడు గంటలకు మళ్లీ రావాలని అధికారులు నిర్ణయించారు.
అయితే, అడ్వొకేట్ కమిషనర్ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారంటూ జ్ఞాన్‌వాపి మసీదును పర్యవేక్షిస్తున్న అంజుమన్ ఇంతిజామియా కమిటీ న్యాయవాదులు స్థానిక న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వేరే సీనియర్ లాయర్‌తో తనిఖీలు నిర్వహించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
జ్ఞాన్‌వాపి కమిటీ పిటిషన్‌పై విచారణ చేపట్టిన స్థానిక న్యాయస్థానం.. అడ్వొకేట్ కమిషనర్ అజయ్ కుమార్‌తోపాటు ఈ తనిఖీలకు కారణమైన పిటిషన్ దాఖలుచేసిన ఐదుగురు మహిళా పిటిషన్‌దారులకు కూడా సమన్లు పంపించింది. ఈ విషయంపై సోమవారం, మే 9న, విచారణ చేపడతామని కోర్టు స్పష్టంచేసింది.

ఫొటో సోర్స్, Utpal Pathak
శనివారం ఏం జరిగింది?
జ్ఞాన్‌వాపి మసీదు పరిసరాల్లో తనిఖీలు చేపట్టేందుకు అడ్వొకేట్ కమిషనర్ శనివారం మధ్యాహ్నం కాశీ కారిడార్‌లోని ఐదో గేటు దగ్గరకు చేరుకున్నారు. ఆ సమయంలో వారితోపాటు ఆ ఐదుగురు మహిళా పిటిషన్‌దారులు కూడా ఉన్నారు.
తాము కోర్టు ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నామని, లోపలకు ఎవరినీ అనుమతించబోమని జ్ఞాన్‌వాపి మసీదు కమిటీ చెప్పింది.
అయితే, జ్ఞాన్‌వాపి మసీదు కమిటీ పిటిషన్‌పై సోమవారం విచారణ చేపడతామని స్థానిక న్యాయస్థానం చెప్పడంతో అడ్వొకేట్ కమిషనర్ తనిఖీల విషయంలో గందరగోళం నెలకొంది.
అడ్వొకేట్ కమిషనర్ కోసం స్థానిక న్యాయస్థానం జారీచేసిన సమన్లతో జ్ఞాన్‌వాపి న్యాయవాదులు మసీదు దగ్గర ఎదురుచూశారు. కమిషనర్ వచ్చిన వెంటనే కోర్టు ఆదేశాలను ఆయనకు ఇచ్చేందుకు న్యాయవాదులు ప్రయత్నించారు.
అయితే, అడ్వొకేట్ కమిషనర్ కోర్టు ఆదేశాలను తీసుకోవడానికి తిరస్కరించారని జ్ఞాన్‌వాపి మసీదుకు చెందిన న్యాయవాది అఖ్లాక్ అహ్మద్ చెప్పారు. ‘‘మేం ఇచ్చిన కోర్టు ఆదేశాలను ఆయన తీసుకోలేదు. తాను సోమవారం నేరుగా కోర్టుకు వెళ్లి ఆ ఆదేశాలను తీసుకుంటానని అన్నారు’’అని అహ్మద్ వివరించారు.

ఫొటో సోర్స్, Utpal Pathak
ముందురోజు కూడా వివాదం..
మసీదు పరిసరాల్లో తనిఖీల విషయంలో ముందురోజు కూడా వాగ్వాదం జరిగిందని బీబీసీతో అహ్మద్ చెప్పారు.
‘‘శుక్రవారం వారు తనిఖీలు చేపట్టేందుకు వచ్చారు. మసీదు లోపలకు వెళ్లి వీడియోలు తీస్తామని అన్నారు’’అని ఆయన వివరించారు.
‘‘అయితే, బారికెడ్లను తొలగించి మసీదులోకి వెళ్లాలని కోర్టు ఆదేశంలో లేదని మేం చెప్పాం’’అని ఆయన పేర్కొన్నారు.
‘‘ఆ ఐదురుగు మహిళా న్యాయవాదులు చెప్పినట్లే అడ్వొకేట్ కమిషనర్ నడుచుకుంటున్నారు. ఈ విషయంపై మేం అభ్యంతరాలు వ్యక్తంచేశాం’’అని జ్ఞాన్‌వాపి మసీదు న్యాయవాది అభయ్ యాదవ్ చెప్పారు.
మరోవైపు ఈ విషయంపై మహిళా పిటిషన్‌దారుల న్యాయవాది హరి శంకర్ జైన్ కూడా మీడియాతో మాట్లాడారు. ‘‘ఈ రోజు వీడియో రికార్డింగ్ పనులు మొదలయ్యాయి. కానీ, వారు మధ్యలో అడ్డుపడ్డారు. మా పని సరిగా చేసుకోనివ్వడం లేదు. మేం ఈ విషయంలో కోర్టును ఆశ్రయిస్తాం. చట్టపరమైన చర్యలు తీసుకుంటాం’’అని ఆయన అన్నారు.
ఇంతకీ ఏమిటీ వివాదం?
ఈ విషయంపై 2021, ఆగస్టు 18న ఐదుగురు మహిళలు బనారస్ జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వీరిలో రాఖి సింగ్ దిల్లీకి చెందినవారు. మిగతా నలుగురు మహిళలూ బనారస్‌వాసులే.
జ్ఞాన్‌వాపి మసీదు పరిసరాల్లో మా శృంగార్ గౌరీ, వినాయక, హనుమాన్ దేవాలయాలకు వెళ్లేందుకు అందరినీ అనుమతించాలని వీరు పిటిషన్‌లో కోరారు.
ఆ దేవాలయాల్లోని విగ్రహాలను జ్ఞాన్‌వాపి మసీదు కమిటీ ధ్వంసం చేయకుండా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పరిరక్షించేలా ఆదేశాలు జారీచేయాలని ఆ ఐదుగురు మహిళలూ పిటిషన్‌లో కోరారు.

ఫొటో సోర్స్, ARRANGED
ప్రస్తుతం ఈ ఆలయాలన్నీ బాగానే ఉన్నాయని ధ్రువీకరించేందుకు అడ్వొకేట్ కమిషనర్ నేతృత్వంలో తనిఖీలు చేపట్టాలని పిటిషన్‌దారులు కోరారు.
మొదట జిల్లా కోర్టు, ఆ తర్వాత హైకోర్టు.. ఈ మసీదు పరిసరాల్లో తనిఖీలకు ఆమోదం తెలిపాయి.
అయితే, పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని అడ్వొకేట్ జనరల్‌పై వస్తున్న ఆరోపణలపై ఆయన ఏం వివరణ ఇస్తారో, కోర్టు ఈ విషయంలో ఏం చర్యలు తీసుకుంటుందో సోమవారం తెలుస్తుంది.
జ్ఞాన్‌వాపి మసీదు చరిత్ర ఏమిటి?
జ్ఞాన్‌వాపి మసీదు విషయంలో మొదటినుంచీ వివాదముంది. 14వ శతాబ్దంలో నిర్మించిన విశ్వనాథ్ ఆలయంలో కొంత భాగాన్ని ధ్వంసంచేసి ఈ మసీదును నిర్మించారని కొందరు చరిత్రకారులు చెబుతుంటే, మరికొందరు చరిత్రకారులు ఆ వాదనతో విభేదిస్తున్నారు.
అక్బర్ నవరత్నాల్లో ఒకరైన రాజా తోడర్‌మల్ 1585లో కాశీ విశ్వనాథ్ దేవాలయాన్ని నిర్మించారని వారణాసిలోని కాశీ విద్యాపీఠ్‌లో చరిత్ర విభాగం ప్రొఫెసర్ రాజీవ్ ద్వివేది చెప్పారు. ‘‘అక్బర్ ఆదేశాలతోనే తోడర్‌మల్ ఆ దేవాలయాన్ని కట్టించారు’’అని ఆయన చెప్పారు. అయితే, తోడర్‌మల్ కట్టించిన ఆ దేవాలయం ఇప్పుడు ఉన్నంత పెద్దది ఉండేదికాదని ఆయన అన్నారు.
మరోవైపు ఈ దేవాలయాన్ని మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ధ్వంసంచేసిన తర్వాత ఈ మసీదును కట్టారని చెబుతుంటారు. అయితే, జ్ఞాన్‌వాపి మసీదును కమిటీ సంయుక్త కార్యదర్శి దీనిపై మాట్లాడుతూ ‘‘మసీదు, దేవాలయం ఒకేసారి నిర్మించినట్లు ఆధారాలు ఉన్నాయి’’అని ఆయన అన్నారు.
ఇక్కడ మసీదు-దేవాలయం మధ్య వివాదం ఈనాటిది కాదు. 1809లో దీనిపై ఇక్కడ మత ఘర్షణలు కూడా జరిగాయి.
ఇవి కూడా చదవండి:
- ముస్లిం యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్న దళిత యువకుడిని నడిరోడ్డుపై చంపిన యువతి అన్న
- టంగ్-టై అంటే ఏంటి? పిల్లల్లో పెరుగుతున్న ఈ కొత్త సమస్యను గుర్తించడం ఎలా?
- ‘శిథిలాల కింద చిక్కుకుపోయాను, నీళ్లు తాగి బతికాను.. నిశ్శబ్దంగా ఉంటే రాయితో గోడపై కొట్టేదాన్ని, ఎందుకంటే..’
- సింహం పెరట్లోకి ఎలా వచ్చింది... అసలు సంగతి తెలిసి అంతా ఆశ్చర్యపోయారు
- డెత్ రోడ్: భయంకరమైన ఈ మార్గంలో ప్రయాణం ఎలా ఉంటుందంటే...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











