వారణాసి: విశ్వనాథ్ ఆలయానికి ముస్లింలు భూమి ఎందుకు ఇచ్చారు, ఇది చట్ట విరుద్ధమా?

వారణాసి

ఫొటో సోర్స్, VIKRANT DUBEY

ఫొటో క్యాప్షన్, వారణాసి లోని విశ్వనాథ్ ఆలయ ప్రాంతం
    • రచయిత, విక్రాంత్ దుబే
    • హోదా, బీబీసీ కోసం

కాశీ విశ్వనాథ్ ఆలయానికి వెళ్లే మార్గం ఇరుకుగా ఉండటంతో జ్ఞాన్‌వాపి మసీదు కమిటీ కారిడార్ ప్రాజెక్ట్ కోసం కొంత భూమిని ఇచ్చింది. ఈ భూమి మసీదుకు కొద్ది దూరంలో ఉంది.

అయితే, పరస్పర అంగీకారం ప్రకారం విశ్వనాథ్ టెంపుల్ ట్రస్ట్ 1700 చదరపు అడుగుల భూమికి బదులుగా 1000 చదరపు అడుగుల భూమిని మసీదుకు ఇచ్చింది.

కోర్టు వెలుపల జరిగిన ఈ ఒప్పందం పట్ల ఆలయ నిర్వాహకులు, భక్తులు సంతోషంగా ఉన్నారు. ముస్లింలు కూడా దీనిని సుహృద్భావ పరిణామంగా చెప్పుకుంటున్నారు.

ఈ ఒప్పందంలో పేర్కొన్న భూమి చిన్నదే కావచ్చు. కానీ, దాని ప్రభావం మాత్రం భారీగా ఉంటుంది. ఒక ఆలయానికి మసీదు భూమిని ఇవ్వడం, అది కూడా అయోధ్య తర్వాత అందరి దృష్టి ఉన్న జ్ఞాన్‌వాపి మసీదు తన భూమిని ఆలయానికి ఇవ్వడాన్ని అంతా ఆసక్తిగా గమనిస్తున్నారు.

కాశీ విశ్వనాథ్ కారిడార్

ఫొటో సోర్స్, VIKRANT DUBEY

ఫొటో క్యాప్షన్, కాశీ విశ్వనాథ్ కారిడార్

ఒప్పందానికి రెండేళ్లు పట్టింది

వాస్తవానికి జ్ఞాన్‌వాపి మసీదు సమీపంలో విశ్వనాథ్ ఆలయానికి ఆనుకొని మూడు స్థలాలు ఉన్నాయి. అందులో ఒక ప్లాటు 1700 చదరపు అడుగులు.

1991 లో బాబ్రీ మసీదు కూల్చివేసిన తరువాత, జ్ఞాన్‌వాపి మసీదు, విశ్వనాథ్ ఆలయాన్ని రక్షించడానికి ఈ స్థలంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఈ స్థలం సున్నీ వక్ఫ్ బోర్డుకు చెందిందని వారణాసి రెవెన్యూ శాఖ అధికారులు చెప్పారు.

ఈ భూమిలో కొంత భాగాన్ని వక్ఫ్‌బోర్డు కాశీ విశ్వనాథ్ మందిర్ ధామ్‌కు అప్పగించింది. దీనికి బదులుగా జ్ఞాన్‌వాపి మసీదుకు విశ్వనాథ్ మందిర్ తరపున 1000 చదరపు అడుగుల స్థలంలో ఒక భవనాన్ని ఇస్తారు.

ఈ స్థలం జ్ఞాన్‌వాపి మసీదుకు నాలుగు వందల మీటర్ల దూరంలో రోడ్డుకు అవతలివైపు ఉంది. విశ్వనాథ్ ఆలయం ఈ భవనాన్ని అన్వర్ ఉల్ హక్ అనే వ్యక్తి నుంచి రూ.5 కోట్లకు కొనుగోలు చేసింది.

ఈ ఒప్పందంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి అంజుమాన్ ఇంతెజామియా మసీదు కార్యదర్శి ఎం.ఎస్. యాసిన్. అంజుమాన్ ఇంతెజామియా నగరంలోని అన్ని మసీదుల నిర్వహణ బాధ్యతను చూస్తుంది.

యాసిన్ ముస్లిం వ్యక్తి మాత్రమే కాదు, ఆయన హిందువుల మనోభావాల గురించి కూడా మాట్లాడుతుంటారు.

''విశ్వనాథ్ ఆలయ కారిడార్ నిర్మాణ సమయంలో ఆలయ అధికారులకు స్థలం అవసరమైంది. ఆలయానికి వెళ్లే దారి చాలా ఇరుకుగా ఉంది. మసీదు సమీపంలో ప్లాట్ నంబర్ 8276 ఉన్నా, అక్కడ కంట్రోల్ రూమ్ ఉంది. ఈ భూమిని ఆలయం కోసం సేకరించడానికి అధికారులతో అనేక దఫాలు చర్చలు జరిగాయి. అప్పుడు నగరంలోని ప్రముఖుల నుంచి, సున్నీ వక్ఫ్‌బోర్డు నుంచి అనుమతి తీసుకున్న తరువాత ఈ భూమి ఆలయానికి ఇవ్వాలని నిర్ణయించాం. దీని వల్ల ఆలయానికి వెళ్లే మార్గం విశాలంగా మారుతుంది. ఈ చర్చలు, ఒప్పందాలకు దాదాపు రెండేళ్లు పట్టింది'' అన్నారాయన.

''ఈ భూమిని ఇవ్వడంలో మేం చొరవ చూపించాం. ఇప్పుడు వాళ్లు ఏం చేస్తారో చూడాలి'' అని అన్నారు యాసిన్.

బదిలీ అయిన భూమి విషయంలో సున్నీ వక్ఫ్ బోర్డు, విశ్వనాథ్ మందిర్ మధ్య మూడు దశాబ్దాలుగా బెనారస్ కోర్టులో కేసు నడుస్తోంది. ఈ పరిస్థితిలో భూమి ఇవ్వడానికి ముస్లిం వర్గాలు ముందుకు రావడం పట్ల హర్షం వ్యక్తమవుతోంది.

వారణాసి విశ్వేశ్వర ఆలయ ప్రాంతం

ఫొటో సోర్స్, VIKRANT DUBEY

ఫొటో క్యాప్షన్, వారణాసి విశ్వేశ్వర ఆలయ ప్రాంతం

సామరస్యం

కాశీ విశ్వనాథ్ ధామ్ నిర్మాణంలో ఆలయం పురాతనత్వాన్ని, పవిత్రతను పరిశీలిస్తున్న కాశీ విశ్వత్ పరిషత్ ప్రధాన కార్యదర్శి, బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో సంస్కృత ప్రొఫెసర్ రాంనారాయణ్ ద్వివేది ఈ పరిణామం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.

''దీని మీద చాలాకాలంగా చర్చలు జరుగుతున్నాయి. మేం యాసిన్ భాయ్‌తో మాట్లాడాము. మాకు ఈ భూమి ఇవ్వండి, మీకు మరొకచోట భూమిని ఇస్తామని చెప్పాము. వారు దీన్ని అర్ధం చేసుకున్నారు'' అని ఆయన అన్నారు.

ఆ తర్వాత జ్ఞాన్‌వాపి మసీదు స్థలం ఆలయానికి దక్కగా, అందుకు ప్రతిగా వెయ్యి చదరపు అడుగుల కమర్షియల్ ల్యాండ్‌ను వక్ఫ్ బోర్డుకు ఇచ్చారు.

అటు ఆలయం, ఇటు మసీదుకు చెందిన వారంతా ఈ పరిణామాల పట్ల సంతోషంగా ఉన్నారు.

''ముస్లింలకు కూడా విశ్వనాథ్ మీద నమ్మకం ఉంది. 1983కి ముందు, అప్పటి ఆలయ మహంత్ పండిట్ రాంశంకర్ త్రిపాఠిని ఒక ముస్లిం వ్యక్తి తాను ఆలయంలోకి వస్తానని అభ్యర్థించారు. ఆలయ మహంత్ కావడంతో ఆయన ఆ ముస్లిం భక్తుడిని రానివ్వ లేదు. నీకు నిజంగా విశ్వాసం ఉంటే నేను నిన్ను ఆపను అని ఆయనతో చెప్పారు. దీనికి ఆ ముస్లిం భక్తుడు జ్ఞాన్‌వాపి కాంప్లెక్స్ లో పాలు పొంగించి తన భక్తిని చాటుకున్నారు'' అని కాశీ విశ్వనాథ్ ఆలయ అర్చకుడు డాక్టర్ శ్రీకాంత్ మిశ్రా వెల్లడించారు.

అంజుమాన్ ఇంతెజామియా మసీదు కార్యదర్శి ఎం.ఎస్. యాసిన్

ఫొటో సోర్స్, VIKRANT

ఫొటో క్యాప్షన్, అంజుమాన్ ఇంతెజామియా మసీదు కార్యదర్శి ఎం.ఎస్. యాసిన్

'జీవనోపాధి ప్రశ్న'

ఈ భూమి బదిలీతో కాశీ విశ్వనాథ్ ఆలయ మార్గం వెడల్పు అవుతుంది. అయితే, ఈ ఒప్పందం కారణంగా జరిగే లాభనష్టాలపై కూడా చర్చ జరుగుతోంది.

ఈ నిర్ణయం కొందరి జీవనోపాధిని ప్రభావితం చేస్తుందన్న వాదన వినిపిస్తోంది. మసీదు కమిటీకి ఆలయం తరఫున ఇచ్చిన స్థలంలో కొంతమంది హిందువుల దుకాణాలు ఉన్నాయి.

హిందూ దుకాణదారులను ఆ ప్రాంగణాన్ని ఖాళీ చేయాలని కోరక పోయినప్పటికీ వారు భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది.

ప్రొఫెసర్ రామ్ నారాయణ

ఫొటో సోర్స్, VIKRANT

ఫొటో క్యాప్షన్, ప్రొఫెసర్ రామ్ నారాయణ

మార్పిడిలో వివాదం

రెండు పార్టీల ఈ భూ మార్పిడి మధ్యలో మూడో పక్షం కూడా తెరపైకి వచ్చింది. జ్ఞాన్‌వాపి లోని విశ్వేశ్వర్ ఆలయానికి కోర్టు నియమించిన సీనియర్ న్యాయవాది విజయ్ శంకర్ రస్తోగి ఈ మొత్తం సమస్యపై కోర్టు తలుపు తట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు.

జ్ఞాన్‌వాపి కాంప్లెక్స్‌లో 9130, 9131, 9132 అనే మూడు ప్లాట్లు ఉన్నాయని ఆయన బీబీసీతో అన్నారు. ఈ మూడు ప్లాట్లు స్వయంభు జ్యోతిర్లింగ విశ్వేశ్వర్ స్వామి ఆస్తి అని ఆయన తెలిపారు. స్వయంభు జ్యోతిర్లింగ విశ్వేశ్వర్ యాజమాన్యంలోని ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యం లోనిదని ఆయన వెల్లడించారు.

ఇప్పుడు ఆలయం, మసీదు కమిటీలు చేసుకున్న ఒప్పందాలన్నీ చట్ట విరుద్ధమని, హిందూ వ్యతిరేకమని న్యాయవాది రస్తోగి అంటున్నారు.

న్యాయవాది విజయ్ శంకర్ రస్తోగీ

ఫొటో సోర్స్, VIKRANT

ఫొటో క్యాప్షన్, న్యాయవాది విజయ్ శంకర్ రస్తోగీ

వక్ఫ్ చట్టం ప్రకారం కూడా అక్రమమే

"ఈ భూమి వక్ఫ్ బోర్డుది అనుకున్నా, వక్ఫ్ చట్టం 1995 లోని సెక్షన్ 104 ప్రకారం, వక్ఫ్ భూములను అమ్మవచ్చు, దానం చేయవచ్చు, మార్పిడి చేయవచ్చు, తనఖా పెట్టవచ్చు కానీ, బదిలీ చేయలేరు. ఇది జరిగితే ఈ నియమాలన్నీ కొట్టుకుపోయినట్లే. అధికారులు ఈ విషయాలన్నీ మరిచి చట్ట విరుద్ధంగా భూమిని బదిలీ చేశారు. దీన్ని మేం దీన్ని కోర్టులో సవాలు చేస్తాం'' అని రస్తోగీ స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)