ఉత్తర కొరియా జైలు జీవితం: బలవంతపు అబార్షన్లు, చిత్ర హింసలు... దేశం వదిలి వెళ్లాలనుకుంటే అంతే సంగతులు

ఉత్తర కొరియాలోని నిర్బంధ కేంద్రాల్లో బంధీలకు సంబంధించిన త్రీడీ చిత్రం
ఫొటో క్యాప్షన్, ఉత్తర కొరియాలోని నిర్బంధ కేంద్రాల్లో బంధీలకు సంబంధించిన త్రీడీ చిత్రం

జైలులోని తన గదిలోకి పాకుతూ వెళ్లిన తర్వాత, నేలపై కూర్చోవాల్సిందిగా లీ యాంగ్-జు అనే మహిళకు ఆదేశాలు అందాయి. మోకాళ్లపై రెండు చేతులు పెట్టుకొని కదలకుండా కూర్చోవాలని ఆమెకు చెప్పారు.

ఒక రోజులో 12 గంటల పాటు ఆమె అలా కూర్చోవాల్సిందే. ఆ సమయంలో కదలడానికి వీల్లేదు.

కాస్త కదిలినా లేదా పక్కనున్న వారితో గుసగుసగా మాట్లాడినా కూడా కఠిన శిక్ష ఎదుర్కోవాల్సి వస్తుంది.

కావాలనుకున్నప్పుడు నీరు తాగే స్వేచ్ఛ కూడా ఉండదు. తినడానికి కొన్ని మొక్కజొన్న గింజలు ఇస్తారు.

వీడియో క్యాప్షన్, కిమ్ జోంగ్ ఉన్ పాలన భరించలేని ఉత్తర కొరియన్లు సరిహద్దులు దాటి ఎలా పారిపోతున్నారు?

''చాలామంది దేశాన్ని వదిలి దర్జాగా వెళ్లిపోతారు. ఆ పని నేను చేసినందుకు గంటల పాటు విచారణను ఎదుర్కొన్నాను'' అని బీబీసీకి ఆమె తెలిపారు.

2007లో ఉత్తర కొరియా నుంచి పారిపోవడానికి ఆమె ప్రయత్నించారు. కానీ చైనాలో పట్టుబడ్డారు. వారు ఆమెను మళ్లీ వెనక్కి పంపించారు.

ఈ నేరానికి గానూ, శిక్ష కోసం ఎదురు చూస్తూ ఉత్తర కొరియా ఆన్‌సాంగ్ డిటెన్షన్ సెంటర్‌లో ఆమె మూడు నెలలు గడిపారు. ఈ డిటెన్షన్ సెంటర్, చైనా సరిహద్దుకు సమీపంలో ఉంటుంది.

ఆమె తన సెల్‌లో కూర్చున్నప్పుడు గదుల బయట గస్తీ కాస్తోన్న గార్డుల బూట్ల చప్పుడు వినిపించేది. ఆ శబ్ధం తక్కువ వినిపించినప్పుడు గార్డు, తన గది నుంచి దూరంగా వెళ్లినట్లు భావించి పక్కనున్న వారితో యాంగ్ జు నెమ్మదిగా మాట్లాడారు.

''మేం అక్కడ నుంచి బయటపడే మార్గాల గురించి, బ్రోకర్లను కలిసే ప్రణాళికల గురించి మాట్లాడుకున్నాం. అవి చాలా రహస్య చర్చలు'' అని యాంగ్ చెప్పారు.

ఉత్తర కొరియా జైళ్లు

ఫొటో సోర్స్, KOREA FUTURE

ఉత్తర కొరియా నుంచి పారిపోయే వాళ్లను నిరోధించడం కోసమే ప్రత్యేకంగా ఆ జైలును ఏర్పాటు చేశారు. కానీ ఇది యాంగ్ జు, ఆమె గదిలోని వారిని ఆపలేకపోయింది. దేశాన్ని వదిలి వెళ్లడానికి ప్రయత్నించినందుకుగానూ అక్కడ చాలా మంది శిక్ష కోసం ఎదురుచూస్తున్నారు.

కానీ యాంగ్ జు ప్రణాళికల గురించి గార్డులకు తెలిసిపోయింది.

''ఊచల వద్దకు రావాలని గార్డు నన్ను పిలిచారు. చేతులు బయట పెట్టమన్నారు. తాళం గుత్తితో నా చేతులపై కొట్టడం ప్రారంభించారు. చేతులు వాచిపోయి, నీలం రంగులోకి మారేంతవరకు కొడుతూనే ఉన్నారు. కానీ నేను ఏడవాలని అనుకోలేదు. ఉత్తర కొరియాను విడిచి వెళ్లిపోవాలనుకునే మాలాంటి వారిని గార్డులు, దేశద్రోహులుగా పరిగణిస్తారు.''

''జైలులోని గదులన్నీ ఒకే ప్రాంగణంలో ఉండటంతో మిగతా సెల్‌లోని వారిని కొట్టే దెబ్బల శబ్ధం కూడా మాకు వినిపించేది. నా సెల్ నంబర్ 3. కానీ 10వ నంబర్ గదిలోని వారిని చితకబాదడం కూడా నేను విన్నాను'' అని ఆమె గుర్తు చేసుకున్నారు.

నిర్భంద కేంద్రాల్లో ప్రజల దుర్భర జీవన స్థితిని ప్రతిబింబించేలా రూపొందించిన త్రీడీ చిత్రం

ఫొటో సోర్స్, KOREA FUTURE

ఫొటో క్యాప్షన్, ఈ నిర్బంధ కేంద్రాల్లో ప్రజల దుర్భర జీవన స్థితిని ప్రతిబింబించేలా రూపొందించిన త్రీడీ చిత్రం

అణచివేత విధానం

ఉత్తర కొరియా జైలు వ్యవస్థలో అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనపై ఒక వివరణాత్మక దర్యాప్తుకు 'కొరియా ఫ్యూచర్' అనే సంస్థకు సహకరించిన 200కి పైగా వ్యక్తుల్లో యాంగ్ జు కూడా ఒకరు.

ఈ దర్యాప్తులో 5,181 మానవ హక్కుల ఉల్లంఘనలతో సంబంధమున్న 597 మంది నేరస్థులను కొరియా ఫ్యూచర్ సంస్థ గుర్తించింది. ఉత్తర కొరియాలోని 148 కేంద్రాల్లో 785 మంది బంధీల పట్ల ఈ నేరస్థులు మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడ్డారని కనుక్కుంది.

ఈ నేరాలకు సంబంధించిన సాక్ష్యాలన్నీ సేకరించారు. డేటాబేస్‌లో పొందుపరిచారు. వీటికి కారణమైనవారిని ఏదో ఒక రోజు న్యాయస్థానం ముందు నిలబెట్టవచ్చన్న ఆశతో సాక్ష్యాలను భద్రపరిచారు.

మానవ హక్కుల ఉల్లంఘన ఆరోపణలను ఉత్తర కొరియా ఖండిస్తూ ఉంటుంది. ఈ దర్యాప్తుపై స్పందించేందుకు ఉత్తర కొరియా ప్రతినిధిని సంప్రదించేందుకు బీబీసీ ప్రయత్నించింది. కానీ వారి నుంచి ఎటువంటి సమాధానం రాలేదు.

ఆన్‌సాంగ్ నిర్బంధ కేంద్రంలోని పరిస్థితులను ప్రజలు అర్థం చేసుకునేందుకు వీలుగా ఈ గ్రూపు ఒక 3డీ మోడల్‌ను తయారు చేసింది.

''2.5 కోట్ల మంది ప్రజలను అణచివేయడం కోసం అక్కడి జైలు వ్యవస్థను, జైళ్లలో జరుగుతోన్న హింసను ఉపయోగిస్తున్నారు'' అని బీబీసీతో 'కొరియా ఫ్యూచర్' సియోల్ సహ డైరెక్టర్ సుయెన్ అన్నారు.

''మేం నిర్వహించే ప్రతీ ఇంటర్వ్యూలో మానవ జీవితాలను ఇది ఏవిధంగా ప్రభావితం చేస్తుందో తెలుసుకుంటాం. ఒక ఇంటర్వ్యూలో ఒక మహిళ తన కళ్లముందే నవజాత శిశువును చంపారన్న సంగతిని గుర్తు చేసుకుంటూ ఏడ్చారు'' అని సుయెన్ చెప్పారు.

నిర్బంధ కేంద్రం

అనేక అరోపణలు

గతంలో కంటే ఉత్తర కొరియా ఇప్పుడు ప్రపంచంతో సంబంధం లేకుండా మరింత ఒంటరిగా ఉంటోంది.

మూడు తరాలుగా ఆ దేశాన్ని కిమ్ కుటుంబమే పాలిస్తోంది. కిమ్ కుటుంబానికి, ప్రస్తుత నాయకుడు కిమ్ జోంగ్-ఉన్‌కు దేశ ప్రజలంతా పూర్తి విధేయులుగా, ఆరాధకులుగా ఉండాలి.

కోవిడ్ మహమ్మారి కారణంగా దేశ సరిహద్దులతో పాటు దేశం లోపల కూడా మరింత కఠినమైన ఆంక్షలు అమల్లోకి వచ్చాయి.

బయటి ప్రపంచం గురించి తెలుసుకునేందుకు ప్రయత్నించే వారికి తీవ్రమైన శిక్షల్ని విధిస్తారు. చివరకు విదేశీ డ్రామాలు లేదా సినిమాలు చూసేవారు కూడా ఈ శిక్షల్ని తప్పించుకోలేరు.

ప్రతీ సాక్ష్యంలో, ప్రతీ జైలులో... వ్యవస్థలోని హింస వెల్లడి అవుతూనే ఉంటుంది.

అత్యాచారంతో పాటు ఇతర లైంగిక వేధింపులకు సంబంధించి అనేక ఆరోపణలు ఉన్నాయి. అక్కడి నుంచి బయటపడిన వారు కూడా తమ అనుభవాలను కొరియా ఫ్యూచర్‌కు చెప్పారు. బలవంతంగా తమకు అబార్షన్లు చేశారని తెలిపారు.

ఉత్తర హామ్‌గ్యాంగ్ ప్రావిన్సులోని నిర్బంధ కేంద్రంలో జరిగిన ఘటన గురించి ప్రత్యక్ష సాక్షి ఒక ఇంటర్వ్యూలో వివరించారు. తనతో పాటు నిర్బంధంలో ఉన్న 8 నెలల గర్భిణీకి బలవంతంగా అబార్షన్ చేశారని చెప్పారు. అయినప్పటికీ ఆ బిడ్డ ప్రాణాలతో బయటకు వచ్చింది. కానీ వెంటనే ఆ శిశువును నీటి తొట్టిలో ముంచి చంపారని ఆమె అన్నారు.

తాము చూసిన 5 ఉరిశిక్షల గురించి కూడా సాక్షులు చెప్పారు.

ఆన్‌సాంగ్ డిటెన్షన్ సెంటర్ నమూనా

ఫొటో సోర్స్, KOREA FUTURE

ఫొటో క్యాప్షన్, ఆన్‌సాంగ్ డిటెన్షన్ సెంటర్ నమూనా

న్యాయానికి చేరువలో...

చివరకు యాంగ్‌కు మూడున్నర సంవత్సరాల జైలు శిక్షను విధించారు.

''నా శిక్షా కాలం పూర్తయ్యే నాటికి నేను బతికి ఉంటానా? లేదా? అని చాలా భయపడ్డాను. మీరు ఇలాంటి ప్రదేశాలకు వెళ్లినప్పుడు అక్కడ బతకానికి, ఆ హింసను భరించడానికి మీరు మనిషి అనే విషయాన్ని మరిచిపోవాలి'' అని ఆమె చెప్పారు.

సీరోమ్ కూడా 2007లో ఆన్‌సాంగ్ నిర్బంధ కేంద్రంలో ఉన్నారు. ప్రభుత్వ జైళ్లలో హింస, కొట్టడాలు అత్యంత దారుణంగా ఉంటాయని ఆమె గుర్తు చేసుకున్నారు.

''కర్రతో తొడలపై కొడతారు. మీరు నడుచుకుంటూ లోపలికి వెళ్తారు. కానీ బయటకు మాత్రం పాక్కుంటూనే రాగలరు. దెబ్బలు తింటున్నవారిని నేను చూడలేకపోయాను. ఒకవేళ మనం తల పక్కకి తిప్పుకుంటే వారు వచ్చి మనం ఆ ఘటనను చూసేలా చేస్తారు. మీ ధైర్యాన్ని వారు చంపేస్తారు'' అని ఆమె చెప్పారు.

''ఒకవేళ ఏదైనా అవకాశం ఉంటే మాత్రం వారికి తగిన శిక్ష పడేలా చేయాలి. వారు శిక్ష అనుభవించడమే నాకు కావాలి'' అని జైలులో తాను అనుభవించిన పీడకల లాంటి జీవితాన్ని గుర్తు చేసుకుంటూ సీరోమ్ అన్నారు. దక్షిణ కొరియాలో ఇప్పుడు తన కొత్త జీవితంలోని ప్రతీ క్షణాన్ని ఆస్వాదిస్తున్నానని ఆమె చెప్పారు.

ఈ కేసులను విచారించడం చాలా కష్టం. కానీ అంతర్జాతీయ క్రిమినల్ కోర్టుకు చెందిన నిపుణులు ఈ దర్యాప్తుకు సహకరించారు. ఈ సాక్ష్యాలు కోర్టులో ఆమోదయోగ్యమైనవి. వీటిని అందరికీ ఉచితంగా అందుబాటులో ఉంచారు.

ఈ రిపోర్టు, తాము కోరుకునే న్యాయాన్ని మరింత చేరువ చేస్తుందని నమ్ముతున్నట్లు సీరోమ్, యాంగ్ జు అన్నారు.

వీడియో క్యాప్షన్, చరిత్రలో 70 ఏళ్ల పాటు సాగిన ఆ యుద్ధంలో ఇప్పటికీ విజేతలెవరో తేలలేదు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)