కిమ్ జోంగ్ ఉన్: 2022లో తొలి క్షిపణి ప్రయోగం చేపట్టిన ఉత్తర కొరియా

2022లో కిమ్ జాంగ్ ఉన్ చేపట్టిన తొలి ప్రయోగం ఇదే అవుతుంది

ఫొటో సోర్స్, KCNA VIA REUTERS

ఫొటో క్యాప్షన్, కిమ్ జోంగ్ ఉన్

ఉత్తర కొరియా సముద్రంలోకి బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించిందని దక్షిణ కొరియా రక్షణ మంత్రి తెలిపారు. తొలుత సముద్రంలో ఏదో గుర్తు తెలియని ప్రయోగాన్ని ఉత్తర కొరియా చేపట్టిందని దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ (జేసీఎస్) చెప్పారు. తర్వాత అది ఖండాంతర క్షిపణి అని నిర్ధరించారు..

ఈ ప్రయోగం గురించి తొలుత జపనీస్ కోస్ట్ గార్డ్ కోస్ట్‌ గార్డ్ ద్వారానే బయట ప్రపంచానికి తెలిసింది.

బాలిస్టిక్, న్యూక్లియర్ ఆయుధాల పరీక్షలు నిర్వహించకుండా ఉత్తర కొరియాపై ఐక్యరాజ్యసమితి ఆంక్షలు విధించింది.

దేశ రక్షణ సామర్థ్యాన్ని బలోపేతం చేస్తామని ఆ దేశ పాలకుడు కిమ్ జోంగ్-ఉన్ గత నెలలో ప్రకటించారు.

ఈ ఏడాదిలో ఉత్తర కొరియా నిర్వహించిన తొలి క్షిపణి ప్రయోగం ఇదే.

''దీనికి సంబంధించి మరిన్ని వివరాల కోసం దక్షిణ కొరియా, అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు క్షుణ్ణంగా విశ్లేషిస్తున్నాయి'' అని జేసీఎస్ ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ బాలిస్టిక్ మిసైల్ 500 కి.మీ ప్రయాణించి ఉంటుందని జపాన్ రక్షణ మంత్రి నోబువో కిషీ చెప్పినట్లు రాయిటర్స్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. మరో నిపుణుడు మాత్రం, దీన్ని నిర్ధారించేందుకు ఇంకా తగిన ఆధారాలు లేవని అన్నట్లు రాయిటర్స్ చెప్పింది.

''ఇది తక్కువ దూరం నుంచి ప్రయోగించిన లాంగ్ రేంజ్ క్షిపణా? కాదా అని అంచనావేసేందుకు తగిన మార్గాలు లేవు'' అని బీబీసీ న్యూస్‌తో కార్నిగో ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషన్ పీస్‌లోని న్యూక్లియర్ పాలసీ ప్రోగ్రామ్‌కు చెందిన అంకిత్ పాండా అన్నారు.

2017లో హసాంగ్-15 అనే క్షిపణిని ఉత్తర కొరియా పరీక్షించింది. ఈ క్షిపణి 4500 కి.మీ ఎత్తులో ప్రయాణించింది. దీనివల్ల పసిఫిక్ ద్వీపం గ్వామ్‌లోని అమెరికా సైనిక స్థావరాలు, ఉత్తర కొరియాకు చాలా సమీప లక్ష్యాలుగా మారిపోయాయి.

కొరియా ద్వీపకల్పంలో పెరుగుతోన్న అస్థిర సైనిక వాతావరణం కారణంగా ప్యాంగాంగ్, రక్షణ రంగ సామర్థ్యాలను బలోపేతం చేసుకుంటుందని కిమ్ పేర్కొన్న కొన్ని రోజులకే తాజా ప్రయోగం జరిగింది.

వీడియో క్యాప్షన్, 2022కి ఉత్తర కొరియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఎలా స్వాగతం పలికారంటే..

కీలకమైన సంవత్సరాంతపు ఉత్తర కొరియా పాలక వర్గం సమావేశంలో కిమ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

2021 నుంచి ఉత్తర కొరియా పదేపదే క్షిపణులను పరీక్షించడాన్ని సూచిస్తూ, తాజా ప్రయోగం 'చాలా విచారకరమైనది' అని జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా అన్నారు.

2021లో ఉత్తర కొరియా, తమ 'ఆయుధ కార్యక్రమ పురోగతి'ని కొనసాగించింది. ఇందులో భాగంగా హైపర్‌సోనిక్ మిసైల్, రైలు ఆధారిత బాలిస్టిక్ మిసైల్, సుదూర లక్ష్యాలను ఛేదించే క్రూయిజ్ మిసైల్‌లను పరీక్షించినట్లు అక్కడి మీడియా పేర్కొంది.

క్రూయిజ్ క్షిపణుల కన్నా బాలిస్టిక్ క్షిపణులను మరింత ప్రమాదకరంగా పరిగణిస్తారు. అవి సుదూర లక్ష్యాలను ఛేదించడంతోపాటు వేగంగా ప్రయాణించగలవు. ఎక్కువ పేలోడ్‌ను మోసుకెళ్లే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.

ఉత్తర కొరియా పరిస్థితి ఏమిటి?

కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థ కుదేలవడంతో ప్యాంగ్యాంగ్ ప్రజలు ఆహార కొరతను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్యలో తాజా ప్రయోగం జరిగింది.

'' దేశం జీవన్మరణ పోరాటాన్ని ఎదుర్కొంటోంది. దేశాన్ని అభివృద్ధి చేయడంతో పాటు ప్రజల జీవన ప్రమాణాలను పెంచడమే కొత్త ఏడాది లక్ష్యాలు' అని సంవత్సరాంతపు సమావేశంలో కిమ్ పేర్కొన్నారు.

ఉత్తర కొరియాలో వృద్ధులు, పిల్లలు ఆకలితో చనిపోయే ప్రమాదంలో ఉన్నారని గతంలోనే ఐక్యరాజ్య సమితి అధికారులు హెచ్చరించారు.

అయితే, ఉత్తర కొరియా ఆయుధ కార్యక్రమాన్ని ఇవేవీ ప్రభావితం చేయలేవని అంకిత్ పాండా అన్నారు.

వీడియో క్యాప్షన్, కిమ్‌ ముందు సైనికుల సాహసాలు

''ఇటీవల కాలంలో దేశంలో కఠినమైన ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, కిమ్ జాతీయ రక్షణపై తన దృక్పథాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. అంతర్గత, బహిరంగ కారణాల నేపథ్యంలో ఈ ఆయుధ కార్యక్రమాలను కొనసాగించడం కిమ్, వర్కర్స్‌ పార్టీకి జాతీయ ప్రాధాన్యత అంశంగా మారింది'' అని పాండా పేర్కొన్నారు.

అణ్వాయుధాలకు స్వస్తి పలకాలని ఉత్తర కొరియాకు అమెరికా ఎప్పటి నుంచో చెబుతూనే ఉంది. జో బైడెన్ ప్రభుత్వం, ప్యాంగ్యాంగ్‌ల మధ్య సంబంధాలు ఇంకా ఉద్రిక్తంగానే ఉన్నాయి.

సైనిక కార్యక్రమాల విషయంలో దక్షిణ కొరియా ద్వంద్వ వైఖరిని పాటిస్తోందని ఉత్తర కొరియా పదే పదే ఆరోపణలు చేస్తోంది.

దక్షిణ కొరియా ఇటీవలే, సబ్‌మెరైన్ నుంచి ప్రయోగించే బాలిస్టిక్ మిసైల్‌ను పరీక్షించింది. ఉత్తర కొరియా కవ్వింపులకు వ్యతిరేకంగా ఇది అవసరమని దక్షిణ కొరియా పేర్కొంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)