అమెరికాకు కిమ్ జాంగ్ ఉన్ సోదరి హెచ్చరిక: ''ప్రశాంతంగా నిద్రపోవాలనుకుంటే.. గొడవ చెయ్యొద్దు'' - Newsreel

కిమ్ జాంగ్ ఉన్, కిమ్ యో జాంగ్

ఫొటో సోర్స్, Getty Images

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ సోదరి కిమ్ యో జాంగ్.. అమెరికాకు హెచ్చరిక జారీ చేశారు. ''మీరు నాలుగేళ్ల పాటు ప్రశాంతంగా నిద్రపోవాలంటే గొడవ చెయ్యొద్దు'' అని ఆమె సూచించారు.

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. కొరియన్ పాలసీని ప్రకటించనున్న సందర్భంలో కిమ్ యో జాంగ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఆమె ఉత్తర కొరియా ప్రభుత్వ మీడియాలో మాట్లాడుతూ.. అమెరికా, దక్షిణ కొరియా సంయుక్తంగా సైనిక విన్యాసాలు నిర్వహించడంపై విమర్శలు గుప్పించారు.

అమెరికా ప్రభుత్వ అధికారులు సియోల్ చేరుకోవడానికి ఒక రోజు ముందు ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

గత కొన్ని వారాలుగా ఉత్తర కొరియాతో దౌత్య సంబంధాలు నెరపడానికి ప్రయత్నిస్తున్నట్లు అమెరికా ప్రభుత్వం తెలిపింది. ఉత్తర కొరియా అణు కార్యక్రమం విషయమై ఈ రెండు దేశాల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి.

"సముద్రాలు దాటి మా దేశానికి తుపాకీమందు వాసనలను వెదజల్లేందుకు ప్రయత్నిస్తున్న అమెరికా కొత్త ప్రభుత్వానికి నాదొక సలహా. వచ్చే నాలుగేళ్లల్లో సుఖంగా, శాంతిగా నిద్రపోవాలంటే మొదటి అడుగులోనే రచ్చ చేయకుండా ఉండడం మంచిది" అంటూ కిమ్ యో జాంగ్ చేసిన వ్యాఖ్యలను ప్రభుత్వ రోడోంగ్ సిన్మన్ వార్తాపత్రికలో ప్రచురించారు.

అమెరికా, దక్షిణ కొరియా ఉమ్మడి సైనిక విన్యాసాలపై తమ దేశ విముఖతను ఆమె నొక్కి చెప్పారు. ''సౌత్ కొరియా ప్రభుత్వం యుద్ధం వైపు, సంక్షోభం వైపు అడుగులేస్తోంది'' అని వ్యాఖ్యానించారు.

కిమ్ జాంగ్ ఉన్ చెల్లెలైన కిమ్ యో జాంగ్‌ను.. కిమ్‌కు సన్నిహితురాలిగా, శక్తిమంతమైన భాగస్వామిగా పరిగణిస్తారు.

line

స్వలింగ సంపర్కుల వివాహానికి దేవుడి ఆశీర్వాదాలు ఉండవన్న వాటికన్‌

స్వలింగ సంపర్కం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, స్వలింగ సంపర్కుల మధ్య వివాహాలు పాపమని ప్రకటించిన చర్చ్‌ డాక్ట్రిన్‌

స్వలింగ సంపర్కుల మధ్య వివాహాలను ఆశీర్వదించే అధికారం క్యాథలిక్ చర్చికి లేదని వాటికన్‌లో చర్చి నిబంధనావళిని రూపొందించే 'కాంగ్రిగేషన్‌ ఫర్‌ ది డాక్ట్రిన్‌ ఆఫ్‌ ది ఫెయిత్‌ (సీడీఎఫ్‌) అని వ్యవహరించే క్రైస్తవ మతాధిపతుల బృందం స్పష్టం చేసింది.

ఆ పాపపు పనిని దేవుడు ఆశీర్వదించడని మత పెద్దలు సోమవారం నాడు వెల్లడించారు. స్వలింగ సంపర్కులైన వ్యక్తుల మధ్య వివాహాలను చర్చి సమర్ధిస్తుందా అన్న ప్రశ్నకు 'లేదు' అని సీడీఎఫ్ సమాధానమివ్వగా, ఈ స్పందనను పోప్‌ ఆమోదించారు.

స్వలింగ సంపర్కులు పెళ్లి చేసుకోవడాన్ని అనుమతించ వచ్చని గత అక్టోబర్‌లో పోప్‌ ఫ్రాన్సిస్‌ ఓ డాక్యుమెంటరీలో పేర్కొన్నారు.

ఇటీవలి కాలంలో అమెరికా, జర్మనీ సహా పలు దేశాలలోని చర్చి సంఘాలు స్వలింగ సంపర్కుల మధ్య వివాహాలను ఆమోదిస్తున్నాయని, స్వలింగ సంపర్కులను కూడా చర్చికి రప్పించడంలో భాగంగా ఇలా చేస్తున్నట్లు రాయిటర్స్‌ వార్తా సంస్థ తెలిపింది.

అయితే స్త్రీ, పురుషుల మధ్య వివాహాలే పవిత్రమైనవని, ఒకే లింగానికి చెందిన వ్యక్తుల మధ్య సంబంధాలు అపవిత్రమని చెప్పిన సీడీఎఫ్‌, స్వలింగ సంపర్కుల సంబంధాలలోని 'సానుకూల అంశాలను' గుర్తిస్తున్నట్లు తెలిపింది.

అయితే, పోప్ ఫ్రాన్సిస్ 2013లో స్వలింగ సంపర్కులను జంటను ఆమోదించడానికి నిరాకరించడానికి తానెవరినని సంచలన వ్యాఖ్యలు చేశారు.

గత ఏడాది ఓ డాక్యుమెంటరీలో మాట్లాడుతూ "ఒక కుటుంబంగా ఏర్పడటానికి స్వలింగ సంపర్కులకు అన్ని హక్కులు ఉన్నాయి, వారు కూడా దేవుడి బిడ్డలే. వారిని పక్కనబెట్టలేం.'' అని వ్యాఖ్యానించారు.

పోప్‌ వేరే సందర్భంలో చేసిన వ్యాఖ్యలను తప్పుగా అన్వయించారని ఆ తర్వాత చర్చి వివరణ ఇచ్చింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)