యుక్రెయిన్ యుద్ధం: రష్యా ఓలిగార్క్‌లు లక్షల కోట్ల నల్ల ధనాన్ని ఎక్కడ దాస్తున్నారు?

నల్లధనం

ఫొటో సోర్స్, Getty Images

దశాబ్దాల నుంచి రష్యన్ ఓలిగార్క్‌లు బిలియన్ల కొద్దీ నల్లధనాన్ని విదేశాలకు తరలిస్తున్నారు. డొల్ల కంపెనీల్లో ఈ డబ్బును పెట్టుబడిగా పెడుతూ దీని జాడను కనుక్కోవడానికి వీలు లేకుండా చేస్తున్నారు.

అయితే, నేడు ప్రపంచ దేశాలు ఈ ఓలిగార్క్‌ల నల్ల డబ్బు గుట్టు కనుక్కొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.

రష్యన్ల నల్ల డబ్బు ఎంత?

విదేశాల్లో దాచిన రష్యన్ల నల్ల డబ్బు మొత్తంగా దాదాపు రూ. 76 లక్షల కోట్లు (ఒక ట్రిలియన్ డాలర్లు) వరకు ఉంటుందని అమెరికా మేధోమధన సంస్థ ‘‘ద అట్లాంటిక్ కౌన్సిల్’’ అంచనా వేసింది.

ఈ ‘‘డార్క్ మనీ’’పై 2020లో సంస్థ ఓ నివేదిక విడుదల చేసింది. మొత్తం నల్ల ధనంలో నాలుగో వంతు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తోపాటు ఆయనకు సన్నిహితులైన రష్యన్ ఓలిగార్క్‌ల దగ్గరే ఉందని నివేదికలో పేర్కొన్నారు.

ఈ డబ్బును గూఢచర్యం, ఉగ్రవాదం, లంచాలు, రాజకీయ పలుకుబడి, నకిలీ వార్తలతోపాటు ఇతర చట్ట వ్యతిరేక కార్యకలాపాల కోసం ఉపయోగించే అవకాశముందని అంచనా వేశారు.

బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రష్యా నల్లధనం ఎక్కువగా వెళ్లే ప్రాంతాల్లో బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్ ఒకటి.

ఈ డబ్బు ఎలా వస్తుంది?

ప్రభుత్వ బడ్జెట్, ప్రైవేట్ వ్యాపారాల నుంచి డబ్బు కొల్లగొట్టాలని తన సన్నిహితులను పుతిన్ ప్రోత్సహిస్తారని అమెరికాకు చెందిన మరో మేధోమధన సంస్థ ద నేషనల్ ఎండోమెంట్ ఫర్ డెమొక్రసీ ఓ నివేదికలో వివరించింది. లాభాల బాటలో నడుస్తున్న ప్రభుత్వ సంస్థల నుంచి కూడా డబ్బును పక్క దోవ పట్టించాలని ఆయన సూచిస్తారని పేర్కొంది.

ఇలాంటి మార్గాల్లో వారు బిలియన్ల కొద్దీ డబ్బును వెనకేసుకున్నట్లు సంస్థ వివరించింది.

2004 నుంచి 2007 మధ్య రష్యాలోని భారీ చమురు సంస్థ గ్యాజ్‌ప్రోమ్ నుంచి పుతిన్ సన్నిహితులు దాదాపు రూ. 4,57,713 కోట్లు (60 బిలియన్ డాలర్లు) పక్కదారి పట్టించినట్లు రష్యా ప్రతిపక్ష నాయకులు బోరిస్ నెమ్‌ట్సోవ్, వ్లాదిమిర్ మిలోవ్ వివరించారు.

మరోవైపు ‘‘ఇంటర్నేషనల్ కన్షార్షియమ్ ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్’’ విడుదల చేసిన పాండోరా పేపర్స్‌లో కూడా పుతిన్‌ సన్నిహితులు భారీగా డబ్బులు వెనకేసినట్లు పేర్కొన్నారు. పుతిన్ నల్లధనాన్ని దేశాలు దాటించడంలోనూ వీరు సహాయ పడుతున్నట్లు వివరించారు.

సైప్రస్

ఫొటో సోర్స్, AFP via Getty Images

డబ్బును ఎక్కడికి పంపిస్తున్నారు?

ఈ డబ్బు చాలావరకు సైప్రస్‌కు వెళ్తుంటుంది. ఈ దీవిని చాలా మంది ‘‘మాస్కో ఆన్ ది మెడ్’’గా పిలుస్తుంటారు. అంటే మధ్యధరా సముద్రంలోని రష్యా అని అర్థం వస్తుంటుంది.

ద అట్లాంటిక్ కౌన్సిల్ సమాచారం ప్రకారం.. ఒక్క 2013లోనే రూ. 2,74,628 కోట్ల (36 బిలియన్ డాలర్లు) రష్యన్ల నల్ల ధనం దేశాలు దాటింది. ఇది డొల్ల కంపెనీల ద్వారా పన్నులు తక్కువగా వసూలు చేసే దేశాల్లోకి వెళ్తోంది.

2013లో ఇలాంటి డొల్ల కంపెనీలతో సంబంధమున్న వేల బ్యాంకు ఖాతాలను స్తంభింప జేయాలని సైప్రస్‌పై అంతర్జతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) ఒత్తిడి తీసుకొచ్చింది.

బ్రిటన్‌కు చెందిన కేమన్ ఐలండ్స్ లాంటి దీవులకు కూడా భారీగా నల్లధనం వెళ్తోంది.

ఓలిగార్క్ నౌకను జర్మనీలో అధికారులు స్వాధీనం చేసుకున్నారు

ఫొటో సోర్స్, Anadolu via Getty Images

ఫొటో క్యాప్షన్, ఓలిగార్క్ నౌకను జర్మనీలో అధికారులు స్వాధీనం చేసుకున్నారు

గ్లోబల్ విట్‌నెస్ సంస్థ సమాచారం ప్రకారం.. 2018లో రష్యన్ ఓలిగార్క్‌లు రూ. 3,47,099 కోట్లు (45.5 బిలియన్ డాలర్లు) ఇలాంటి ‘‘ట్యాక్స్ హెవెన్స్’’కు పంపించారు.

ఈ డబ్బు మళ్లీ చుట్టూ తిరిగి న్యూయార్క్, లండన్ లాంటి నగరాలకు చేరుతుంది. అక్కడ పెద్దపెద్ద సంస్థల్లో దీన్ని పెట్టుబడులుగా పెడుతున్నారు.

అవినీతిపై నివేదికలు విడుదల చేసే ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ సమాచారం ప్రకారం.. బ్రిటన్‌కు చెందిన రూ.15,257 కోట్ల (2 బిలియన్ డాలర్లు) విలువైన ఆస్తులు ఆర్థిక నేరాలకు పాల్పడే ఆరోపణలున్న రష్యన్ల చేతుల్లో ఉన్నాయి.

2014లో ద ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్ విడుదల చేసిన మరో నివేదికలోనూ రష్యన్ల నల్ల ధనం గురించి ప్రస్తావించారు. 2011 నుంచి 2014 మధ్య రష్యన్ బ్యాంకులు 96 దేశాల్లోని 5,140 కంపెనీలకు రూ. 1,58,674 కోట్లు (20.8 బిలియన్ డాలర్లు)ను అక్రమంగా తరలించినట్లు దీనిలో పేర్కొన్నారు.

లండన్‌లోని ఏటర్ స్క్వేర్‌లో చాలా మంది రష్యన్లకు ఆస్తులున్నాయి

ఫొటో సోర్స్, In Pictures via Getty Images

ఫొటో క్యాప్షన్, లండన్‌లోని ఏటర్ స్క్వేర్‌లో చాలా మంది రష్యన్లకు ఆస్తులున్నాయి

ఈ డబ్బును ఎలా దాస్తున్నారు?

సాధారణంగా ఈ నల్లధానాన్ని రష్యన్ ఓలిగార్క్‌లు డొల్ల కంపెనీ(షెల్ కంపెనీలు)ల్లో దాస్తుంటారు.

‘‘ఈ ఓలిగార్క్‌లు.. ప్రపంచ ప్రముఖ లాయర్లు, ఆడిటర్లు, బ్యాంకర్లు, లాబీయిస్టులను ఎంచుకుంటారు. వీరంతా కలిసి ఈ అక్రమ ధనాన్ని న్యాయంగా సంపాదించిన డబ్బుగా చూపిస్తారు’’అని ద అట్లాంటిక్ కౌన్సిల్ వివరించింది.

‘‘ఒక్కో ఓలిగార్క్ డబ్బు వరుసగా చాలా డొల్ల కంపెనీల చేతులు మారుతుంది. అలా దీన్ని దేశాలు దాటిస్తారు. ఈ లావాదేవీలన్నీ మెరుపు వేగంతో జరిగిపోతాయి.’’

2016లో విడుదలైన పనామా పత్రాల్లోనూ రష్యాలోని ధనవంతులు 2,071 డొల్ల కంపెనీలు ఏర్పాటుచేసినట్లు వెల్లడించారు.

వీడియో క్యాప్షన్, యుక్రెయిన్-రష్యా యుద్ధం: నెల రోజుల్లో ఏం జరిగింది?

ఈ డబ్బును వెలుగులోకి తెచ్చేందుకు ఏం చేస్తున్నారు?

యుక్రెయిన్‌పై రష్యా దాడి మొదలైన తర్వాత, చాలా దేశాలు రష్యన్ల నల్లధనంపై దృష్టిసారించాయి.

‘‘క్లెప్టో క్యాప్చర్’’ పేరుతో అమెరికా ఒక టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటుచేసింది. రష్యా ఓలిగార్క్‌ల ఆర్థిక లావాదేవీలపై ఇది దృష్టి సారిస్తోంది.

అమెరికా న్యాయ విభాగం ఆధ్వర్యంలో ఇది పనిచేస్తోంది. అక్రమ మార్గాల్లో సంపాదించిన ఆస్తులను స్తంభింప చేయడమే దీని లక్ష్యం.

మరోవైపు బ్రిటన్ కూడా తమ దేశంలో ఆస్తుల కొనుగోలుకు డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో వివరించాలని నోటీసులు ఇస్తోంది.

వీడియో క్యాప్షన్, రష్యా, యుక్రెయిన్‌లకు మరియుపోల్‌ ఎందుకంత కీలకం?

ఒకవేళ ఆస్తులను అక్రమ మార్గంలో సంపాదిస్తే అకౌంట్ ఫ్రీజింగ్ ఆర్డర్స్(ఏఎఫ్‌వో)ను జారీచేస్తున్నారు. వీటి ద్వారా వారి బ్యాంకు ఖాతాలు లేదా ఆస్తులను స్తంభింపచేస్తారు.

మరోవైపు ఆర్థిక నేరాల చట్టాన్ని కూడా బ్రిటన్ ఆమోదించింది. దీని కింద విదేశీయుల పేరుతో ఉన్న ఆస్తులను ప్రత్యేకంగా రిజిస్టర్ చేస్తున్నారు.

తమ దేశంలో భారీగా పెట్టుబడులు పెట్టే విదేశీయులకు నివాస హక్కులను కల్పించే ‘‘గోల్డెన్ వీసా’’లను కూడా బ్రిటన్ రద్దుచేసింది.

రష్యా నల్ల ధనం ఎక్కువ వెళ్లే మధ్యధరా దేశం మాల్టా కూడా ‘‘గోల్డెన్ పాస్‌పోర్టు’’ స్కీమ్‌ను రద్దు చేసింది. ఈ పథకం కింద ఓలిగార్క్‌లు అక్కడ పౌరసత్వాన్ని కూడా పొందారు.

2020లో సైప్రస్, బల్గేరియా కూడా గోల్డెన్ పాస్‌పోర్టు స్కీమ్‌ను రద్దు చేశాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)