జెర్సీ: తెలుగు సినిమాలు హిందీలో రీమేక్ చేస్తే ఎందుకు హిట్ కావడం లేదు

జెర్సీ

ఫొటో సోర్స్, Twitter/Nani

    • రచయిత, పరాగ్ ఛాపేకర్
    • హోదా, బీబీసీ కోసం

షాహిద్ కపూర్ తాజాగా ‘‘జెర్సీ’’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఎప్పుడు వచ్చిందో, ఎప్పుడు వెళ్లిపోయిందో కూడా చాలా మందికి తెలియదు.

అల్లు అర్జున్, యశ్, రష్మిక మందన లాంటి సౌత్ ఇండియా నటులు నేరుగా బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నప్పుడు రీమేక్ సినిమాలు ఎవరు చూస్తారనేలా పరిస్థితి మారిపోయింది.

ఇడ్లీ సాంబార్ నేరుగా అందుబాటులో ఉన్నప్పుడు దోశను చోలేతో ఎవరైనా తింటారా?

అంటే దక్షిణ భారత సినిమాల నుంచి రైట్స్ కొనుగోలుచేసి బాలీవుడ్‌లో రీమేక్ చేసే కాలం ఇక ముగిసిపోయిందా? లేదంటే, ప్రస్తుతం కాలం కలిసిరాలేదు అనుకోవాలా?

దక్షిణ భారత సినిమా స్టార్‌లు నేరుగా పాన్ ఇండియా సినిమాలతో ముందుకు వస్తున్నప్పుడు, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ సినిమాలను హిందీ స్టైల్‌లో ఎవరు చూస్తారనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి.

ప్రస్తుతం సౌత్ స్టార్‌లకు దేశ వ్యాప్తంగా అభిమానులు ఉంటున్నారు. హిందీ బెల్ట్‌లో వారి ఫాలోయింగ్ క్రమంగా పెరుగుతోంది. వారి డైలాగ్‌లు, సాంగ్స్‌తో మీమ్‌లు వైరల్ అవుతున్నాయి.

ఇలాంటి పరిస్థితుల్లో సౌత్ ఇండియా సినిమాలను హిందీలోకి రీమేక్ చేస్తే ఎవరు చూస్తారు?

సత్య

ఫొటో సోర్స్, RAM GOPAL VARMA

ఫొటో క్యాప్షన్, సత్య

రీమేక్‌లతో నష్టాలేనా?

తెలుగు హీరో నాని నటించిన ‘‘జెర్సీ’’ సినిమాను అదే పేరుతో బాలీవుడ్‌లో షాహిద్ కపూర్ రీమేక్ చేశారు. తెలుగులో ఈ సినిమా మూడేళ్ల కిందటే వచ్చింది. దీనికి నేషనల్ అవార్డు కూడా వచ్చింది.

హిందీ జెర్సీ ఓపెనింగ్స్ కనీసం రూ. 3 కోట్లు కూడా దాటలేదు. సినిమా మొత్తం కలెక్షన్లు రూ. 20 కోట్ల లోపే ఉన్నాయి.

ప్రస్తుతం రీమేక్ రైట్‌లను కొనుగోలు చేసే సినిమాలను మళ్లీ తీయడం దండగని ప్రిసెప్ట్ పిక్చర్స్ బిజినెస్ హెడ్ యూసుఫ్ షేక్ వ్యాఖ్యానించారు.

‘‘సౌత్ సూపర్‌హిట్ సినిమాల హిందీ రీమేక్‌లను ఇప్పుడు ఎవరు చూస్తారు? మీరు చూస్తారా చెప్పండి. వీటిని రీమేక్ చేయడం వల్ల ఏమీ ఉపయోగం ఉండదు. నిజానికి ఈ సినిమాలు హిందీ డబ్బింగ్ రూపంలో బాలీవుడ్‌కు చేరుతూనే ఉన్నాయి. మళ్లీ వాటిని హిందీలో రీమేక్ చేయడం ఎందుకు? ఒకసారి మనం బాక్సాఫీస్ కలెక్షన్లు చూస్తే మనకు పరిస్థితి ఏమిటో అర్థమవుతుంది. ప్రేక్షకులు కొత్తదనం కోరుకుంటున్నారు. బాహుబలి, ఆర్ఆర్ఆర్‌లకు విశేషంగా ప్రజల నుంచి వచ్చిన స్పందనే దీనికి ఉదాహరణ’’అని యూసుఫ్ అన్నారు.

జెర్సీ

ఫొటో సోర్స్, Twitter/Jerseythefilm

ఫొటో క్యాప్షన్, జెర్సీ

‘‘ఇప్పుడు బాలీవుడ్‌లో కొత్తదనం తగ్గింది. కొత్త సినిమాలు ఎప్పుడు తీస్తారా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఇదివరకటిలా మీరు ఏం తీస్తే చూసే రోజులు పోయాయి. కొత్తదనం లేకపోతే మొహమాటం లేకుండా ప్రేక్షకులు తిరస్కరిస్తున్నారు. దీన్ని బాలీవుడ్ ప్రముఖులు అర్థం చేసుకోలేకపోతున్నారు. కానీ, దక్షిణ భారత సినీ పరిశ్రమల్లో సినిమాలు తీసే ముందు చాలా మేధోమథనం జరుగుతోంది. దీని ఫలితమే అక్కడ మంచి సినిమాలు వస్తున్నాయి’’అని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇదివరకు హిందీ రీమేక్‌ల పరిస్థితి ఇలా ఉండేది కాదు. ఈ ఫార్ములాను నమ్ముకొని బాలీవుడ్‌లో చాలా సినిమాలు సూపర్‌హిట్ అయ్యాయి. అయితే, సోషల్ మీడియాకు ఆదరణ పెరగడంతో పరిస్థితులు చాలా మారాయి.

ఒకప్పుడు రజనీ కాంత్, కమల్ హాసన్‌ల పేర్లు మాత్రమే హిందీ బెల్టుకు తెలుసు. కానీ, ఇప్పుడు అలా కాదు, కొందరు దక్షిణ భారత నటులకు బాలీవుడ్ స్టార్‌లతో సమానంగా ఫాలోయింగ్ ఉంది.

వీడియో క్యాప్షన్, కేజీఎఫ్ అసలు కథ తెలుసా?

అది స్వర్ణ యుగం

సోషల్ మీడియా కాలానికి ముందు హిందీ రీమేక్‌లతో బాలీవుడ్ స్వర్ణ యుగాన్ని చూసింది. ‘‘ఏక్ దూజె కే లియే’’ (తెలుగులో మరో చరిత్ర) కేవలం రూ.కోటి పెట్టుబడితో రూ.పది కోట్లు సంపాదించింది.

రామ్ గోపాల్ వర్మ శివ, సత్య లాంటి సినిమాల రీమేక్‌లు కూడా బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అనిల్ కపూర్ సినిమా ‘‘విరాసత్’’ (తమిళ్‌లో థేవర్ మగన్), కమల్ హాసన్ ‘‘చాచీ 420’’ (తమిళ్‌లో అవ్వై షణ్ముగీ), సైఫ్ అలీ ఖాన్ సినిమా ‘‘రెహనా హై తేరే దిల్ మే’’ (తమిళ్‌లో మిన్నలే), రాణి ముఖర్జీ ‘‘సాథియా’’ (తమిళ్‌లో అలైపయుతే).. ఇలా చెప్పుకుంటూపోతే ఈ జాబితా చాలా పెద్దదే ఉంటుంది.

ఒకానొక సమయంలో బాలీవుడ్ ప్రొడ్యూసర్లు దక్షిణ భారత సినిమాలను ఫ్రేమ్ టు ఫ్రేమ్ అంటే మక్కీకిమక్కీ కాపీ కొట్టేసేవారు. ఆ తర్వాత కేసులు వేస్తారనే భయంతో రీమేక్ హక్కులు కొనడం ప్రారంభించారు.

వీడియో క్యాప్షన్, రాజానగరంలో మొబైల్ థియేటర్.. ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్లొచ్చు..

సల్మాన్ ఖాన్ హిట్ అయ్యింది ఇలానే..

బాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన సల్మాన్ ఖాన్ కెరియర్ కూడా ఇలాంటి రీమేక్‌ల వల్లే హిట్ అయ్యింది.

ఒక విధంగా చెప్పుకోవాలంటే సల్మాన్ ఖాన్‌ను నంబర్-1 స్టార్‌ను చేసింది కూడా సౌత్ సినిమాలే.

తేరే నామ్ (తమిళ్‌లో సేతు), వాంటెడ్ (తెలుగులో పోకిరీ), జుఢవా (తెలుగులో హలో బ్రదర్), నో ఎంట్రీ (తమిళ్‌లో చార్ల చాప్లిన్), క్యూంకీ (మలయాళంలో థలావట్టమ్), రెడీ (తెలుగులో రెడీ), బాడీగార్డ్ (మలయాళంలో బాడీగార్డ్), కిక్ (తెలుగులో కిక్) ఇలా చెప్పుకుంటూ పోతే సల్మాన్ ఖాన్ రీమేక్ చేసిన సినిమాల జాబితా చాలా పెద్దదే ఉంటుంది.

అక్షయ్ కుమార్ సినిమా రౌడీ రాఠోడ్ (తెలుగులో విక్రమార్కుడు), అజయ్ దేవగన్ సినిమా సర్దార్ (తెలుగులో మర్యాద రామన్న)లు కూడా రీమేక్ మంత్రాన్ని నమ్ముకొని బాలీవుడ్‌లో హిట్‌కొట్టాయి.

వీడియో క్యాప్షన్, సర్కారువారి పాట సినిమా రివ్యూ: శ్రుతి, లయ, తాళం తప్పిన పాట

భవిష్యత్‌లోనూ...

అయితే, హిందీ రీమేక్‌ల కాలం ముగిసిపోయిందని చెప్పడానికి వీల్లేదు. మరికొన్ని సౌత్ రీమేక్‌లు బాలీవుడ్‌లో సందడి చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

తమిళ్ సినిమా ‘‘రాత్సాసన్‌’’ను అక్షయ్ కుమార్, ‘‘మాస్టర్‌’’ను సల్మాన్ ఖాన్, ‘‘విక్రమ్ వేదా’’ను కృతిక్ రోషన్, సైఫ్ అలీ ఖాన్, ఖైదీని అజయ్ దేవగన్, ‘‘అన్నియన్’’ను అభిషేక్ బచ్చన్, రణ్‌వీర్ సింగ్, ‘‘థడియన్’’ను ఆదిత్య రాయ్ కపూర్ రీమేక్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

రీమేక్‌ల కాలం ముగిసిపోయిందని ట్రేడ్ ఎక్స్‌పర్ట్ అతుల్ మోహన్ కూడా అంటున్నారు. ‘‘బాలీవుడ్‌ సినిమాల బడ్జెట్ పెరుగుతోంది కానీ, అసలు ప్రొడక్షన్ విలువలే ఉండటం లేదు. ఇప్పుడు కాలం మారింది. ఆ సంగతిని బాలీవుడ్ దర్శకనిర్మాతలు గుర్తించాలి. ఇంకా రీమేక్‌లపైనే ఆధారపడితే ప్రేక్షకుల తిరస్కారం తప్పదు’’అని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)