Netflix పాస్‌వర్డ్ షేరింగ్ ఇకపై కుదరదా? సబ్‌స్క్రైబర్లు ఎందుకు తగ్గిపోతున్నారు?

ఫొటో సోర్స్, Insta/SaiPallavi
- రచయిత, డానియేల్ థామస్, నాటాలియే షేర్మన్
- హోదా, బీబీసీ న్యూస్
తమ సబ్‌స్క్రైబర్ల సంఖ్య భారీగా పడిపోవడంతో ఇకపై పాస్‌వర్డ్ షేరింగ్‌లను అడ్డుకునే దిశగా చర్యలు తీసుకునే అవకాశమున్నట్లు నెట్‌ఫ్లిక్స్ సంకేతాలిచ్చింది.
ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య దాదాపు 2,00,000 పడిపోయింది. మరోవైపు అమెజాన్, డిస్నీ హాట్‌స్టార్‌ల నుంచి సంస్థకు గట్టిపోటీ ఎదురవుతోంది.
మరోవైపు కొన్ని దేశాల్లో ప్లాన్‌ల ధరలను పెంచడం, రష్యాలో సేవలు నిలిపివేయడం లాంటి చర్యలతో సంస్థపై ప్రతికూల ప్రభావం పడుతోంది.
జులైతో ముగిసే త్రైమాసికంలోనూ 20 లక్షల మంది సబ్‌స్ర్కైబర్లు తమ ప్లాట్‌ఫామ్‌ను వీడిపోయే ముప్పుందని షేర్‌హోల్డర్స్‌కు సంస్థ తెలియజేసింది.
‘‘మన రెవెన్యూ పెరుగుదల కాస్త మందగించింది’’అని షేర్‌హోల్డర్స్‌కు మంగళవారం సంస్థ తెలియజేసింది. మొదటి మూడు నెలల ఫలితాల వివరాలను వెల్లడించింది.

ఫొటో సోర్స్, Getty Images
‘‘చాలా మంది తమ నెట్‌ఫ్లిక్స్ పాస్‌వర్డ్‌లను ఇతరులతో షేర్ చేస్తున్నారు. దీనికితోడు మార్కెట్‌లో మనకు విపరీతంగా పోటీ పెరుగుతోంది. ఫలితంగా మన రెవెన్యూ పెరుగుదల అవకాశాలకు గండిపడుతోంది’’అని నివేదికలో నెట్‌ఫ్లిక్స్ పేర్కొంది.
దాదాపు 10 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లు తమ పాస్‌వర్డ్‌లను షేర్ చేస్తూ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని సంస్థ అంచనా వేస్తోంది.
‘‘ఇలా పాస్‌వర్డ్‌లను షేర్ చేస్తున్నారని మనకు ముందు నుంచీ తెలుసు. కుటుంబ సభ్యుల మధ్య పాస్‌వర్డ్ షేరింగ్‌ను మనం అర్థం చేసుకోవచ్చు. దీని వల్ల మొదట్లో మన ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించే వారి సంఖ్య పెరిగింది’’అని సంస్థ సీఈవో రీడ్ హేస్టింగ్స్ చెప్పారు.
‘‘అయితే, ఇలా పాస్‌వర్డ్‌లు షేర్ చేసుకోవడంతో కొన్ని దేశాల్లో కొత్త సబ్‌స్క్రైబర్ల సంఖ్య పెరగడం లేదు’’అని రీడ్ వివరించారు.
‘‘సంస్థ అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నప్పుడు దీని గురించి పట్టించుకోలేదు. కానీ, ఇప్పుడు మనం దీనిపై దృష్టి పెట్టాల్సిన అవసరముంది’’అని ఆయన అన్నారు.
ప్రస్తుతం లాటిన్ అమెరికాలో టెస్ట్ చేస్తున్న పాస్‌వర్డ్ షేరింగ్‌లకు కళ్లెం వేసే విధానాన్ని మిగతా దేశాల్లోనూ అమలుచేసే అవకాశముందని నెట్‌ఫ్లిక్స్ సంకేతాలు ఇచ్చింది.

ఫొటో సోర్స్, GETTY IMAGES
పాస్‌వర్డ్ షేరింగ్‌కు ఎంత చెల్లించాలి?
గత నెలలో చిలీ, కోస్టారికా, పెరూల్లో పాస్‌వర్డ్ షేరింగ్ విధానాలను అమలులోకి తీసుకొచ్చారు. దీని ప్రకారం తమ కుటుంబానికి అవతలి వ్యక్తులతో పాస్‌వర్డ్‌ను పంచుకోవాలంటే సబ్‌స్క్రైబర్లు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం కుటుంబ సభ్యుల మధ్య పాస్‌వర్డ్‌లు షేర్ చేసుకునేందుకు నెట్‌ఫ్లిక్స్ అనుమతిస్తోంది.
రెండు ప్రొఫైల్స్‌ను అదనంగా యాడ్ చేయాలంటే నెలకు రెండు నుంచి మూడు డాలర్లు (రూ.150 నుంచి రూ.230) వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఈ రుసుము సాధారణ ప్లాన్‌కు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
అయితే, ఈ విధానాన్ని ఎలా అమలు చేయబోతున్నారో నెట్‌ఫ్లిక్స్ వెల్లడించలేదు. సబ్‌స్క్రైబర్లకు ఎలాంటి ఇబ్బందీ కలగకుండా దీన్ని అమలు చేస్తామని మాత్రం సంస్థ తెలిపింది.
‘‘కుటుంబానికి అవతలి వ్యక్తులకు పాస్‌వర్డ్ షేర్ చేయాలంటే స్వల్ప మొత్తంలో అదనంగా రుసుము చెల్లించాలని మేం సూచించబోతున్నాం’’అని నెట్‌ఫ్లిక్స్ చీఫ్ ప్రోడక్ట్ ఆఫీసర్ గ్రెగ్ పీటర్స్ తెలిపారు.
ఇప్పటికే ప్రజలు తమ ఖర్చులను తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఇలాంటి విధానాలతో సంస్థకు మొదటికే మోసం వచ్చే అవకాశముందని రీసెర్చ్ సంస్థ కంటార్ విశ్లేషకుడు డొమినిక్ సున్నెబో వ్యాఖ్యానించారు.
‘‘ఒకవేళ పాస్‌వర్డ్ షేరింగ్‌లకు కళ్లెంవేసే విధానాలను చాలా వేగంగా, కఠినంగా అమలు చేయాలని చూస్తే, చాలా మంది సబ్‌స్క్రైబర్లు ప్లాట్‌ఫామ్‌ను వీడిపోయే ముప్పుంది. నిజానికి చాలా మందికి తాము నెట్‌ఫ్లిక్స్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నామనే సంగతి తెలియదు’’అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, NETFLIX
సబ్‌స్రైబర్లు ఎందుకు తగ్గిపోయారు?
రష్యాలో తమ సేవలను నిలిపివేస్తున్నట్లు గత మార్చిలో నెట్‌ఫ్లిక్స్ వెల్లడించింది. యుక్రెయిన్‌పై రష్యా దాడి నడుమ సంస్థ ఈ చర్యలు తీసుకొంది. దీంతో దాదాపు 7,00,000 మంది సబ్‌స్క్రైబర్లను సంస్థ కోల్పోయింది.
మరోవైపు అమెరికా, కెనడాల్లో తమ ప్లాన్ల రేటు పెంచడంతో దాదాపు 6,00,000 మంది సబ్‌స్క్రైబర్లు తమ సేవలను నిలిపివేశారు.
అమెరికాలో బేసిక్ ప్లాన్ తొమ్మిది డాలర్ల (రూ.685) నుంచి పది డాలర్ల(రూ.762)కు పెంచారు. మరోవైపు స్టాండార్డ్ ప్లాన్‌ను 14 డాలర్ల (రూ 1066) నుంచి 15.5 డాలర్ల(రూ.1181)కు పెంచారు.
బ్రిటన్‌లోనూ బేసిక్, స్టాండార్డ్ ప్లాన్‌ల ధరలు పెంచారు. ఒక్కో ప్లాన్‌పై ఒక పౌండ్ చొప్పున పెంచారు. దీంతో ఇక్కడ బేసిక్ ప్లాన్ 6.99 పౌండ్లు (రూ.695), స్టాండార్డ్ ప్లాన్ 10.99 పౌండ్లు (రూ.1093)గా ఉన్నాయి.
ప్లాన్‌ల ధరలు పెంచడంతో కొంతమంది తమ ప్లాట్‌ఫామ్‌ను వీడి వెళ్లిపోతున్నప్పటికీ, తమ రెవెన్యూ పెరుగుతుందని సంస్థ అంచనా వేస్తోంది. అయితే, దీనివల్ల తగ్గే సబ్‌స్క్రైబర్ల సంఖ్య ఎక్కువే ఉంటుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
బ్రిటన్‌లో ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో దాదాపు 15 లక్షల మంది నెట్‌ఫ్లిక్స్ సేవలను నిలిపివేశారు. దాదాపు 38 శాతం మంది తమ డబ్బులను వృథా చేయాలని అనుకోవట్లేదని ఒక సర్వేలో వెల్లడించారు.
ఈ ప్రభావాన్ని తాము ముందే అంచనా వేసినట్లు రీడ్, నెట్‌ఫ్లిక్స్ వెల్లడించాయి. అయితే, డిస్నీ, హెచ్‌బీవో తరహాలో యాడ్‌లతో సర్వీస్‌లను ఉచితంగా అందించే విధానాలను సంస్థ పరిశీలిస్తోంది.
ఈ విధానంతో సంస్థకు కొత్త ఆదాయ మార్గాలు వస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
‘‘నెట్‌ఫ్లిక్స్ విధానాలను మొదటి నుంచి ఫాలో అవుతున్న వారికి యాడ్ సర్వీసులకు నేను వ్యతిరేకమని తెలుసు. అయితే, నేను సబ్‌స్క్రైబర్ల అనుకూల విధానాలకు ప్రాధాన్యం ఇస్తాను’’అని రీడ్ వ్యాఖ్యానించారు.
అమెజాన్, యాపిల్, డిస్నీల నుంచి నెట్‌ఫ్లిక్స్‌కు విపరీతమైన పోటీ ఎదురవుతోంది. ఈ సంస్థలు భారీగా తమ సంస్థల్లో పెట్టుబడులు పెడుతున్నాయి.
‘‘ధరలను పెంచుతూ సబ్‌స్క్రైబర్లను కాపాడుకోవాలనే నెట్‌ఫ్లిక్స్ విధానాలే ఈ సబ్‌స్క్రైబర్లు తగ్గిపోవడానికి ప్రధాన కారణం’’అని పీపీ ఫోర్‌సైట్ సంస్థ విశ్లేషకుడు పాలో పెస్కాటోర్ వ్యాఖ్యానించారు.
‘‘లాక్‌డౌన్‌లో నెట్‌ఫ్లిక్స్ లాంటి చాలా ప్లాట్‌ఫామ్‌లు కీలకంగా పనిచేశాయి. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి’’అని ఆయన చెప్పారు.
‘‘ఉత్తర అమెరికాలో చాలా తక్కు మొత్తాలకే మంచి సేవలు అందించే చాలా సర్వీసులు పుట్టుకొచ్చాయి’’అని ఆయన వివరించారు.
నెట్‌ఫ్లిక్స్ షేర్ల పతనం
తాజా ప్రకటనతో నెట్‌ఫ్లిక్స్ షేర్లు భారీగా పతనం అయ్యాయి. మొత్తంగా 30 శాతం వరకు తగ్గుదల కనిపించింది.
ఇప్పటికీ ప్రపంచంలోని అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ నెట్‌ఫ్లిక్సే. సంస్థకు మొత్తంగా 22 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. అక్టోబరు 2011 నుంచి వరుసగా యూజర్ల సంఖ్య పెరుగుతూనే వచ్చింది.
కోవిడ్-19 లాక్‌డౌన్‌ల సమయంలో యూజర్ల సంఖ్య విపరీతంగా పెరిగింది.
ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో సంస్థ ఆదాయం 7.8 బిలియన్ డాలర్లు (రూ. 77596 కోట్లు). గత ఏడాది మొదటి మూడు నెలలతో పోలిస్తే, ఇది 9.8 శాతం ఎక్కువ.
అంతకుముందు త్రైమాసికాలతో పోలిస్తే, వృద్ధి రేటు తగ్గింది. మరోవైపు ప్రస్తుతం లాభాల్లో కూడా 6 శాతం తగ్గుదల కనిపించింది.
ఇవి కూడా చదవండి:
- నరేంద్ర మోదీ: అంతర్జాతీయ సంబంధాలకు గుజరాత్‌ను కేంద్రంగా ఎందుకు మారుస్తున్నారు?
- అజాన్ వర్సెస్ హనుమాన్ చాలీసా: మసీదుల్లో మైకులు ఇప్పుడు ఎందుకు వివాదంగా మారాయి? నిబంధనలు ఏం చెబుతున్నాయి?
- నెహ్రూ-లియాఖత్ ఒప్పందం ఏంటి? సర్దార్ పటేల్, శ్యామ ప్రసాద ముఖర్జీ దీనిని ఎందుకు వ్యతిరేకించారు?
- ఇంద్రవెల్లి ఘటనకు 41ఏళ్లు: ‘స్వతంత్ర భారత జలియన్‌వాలా బాగ్’ కథ ఇదీ
- మనకు తగినంత విటమిన్-డి అందాలంటే ఏ సమయంలో, ఎంతసేపు ఎండలో ఉండాలి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















