'సేక్రెడ్ గేమ్స్'లో చిహ్నాల అర్థం ఏంటి?

ఫొటో సోర్స్, SACRED GAMES/FACEBOOK
- రచయిత, రవి పర్మార్
- హోదా, బీబీసీ ప్రతినిధి
నెట్‌ఫ్లిక్స్ భారతదేశపు మొట్టమొదటి ఒరిజినల్ వెబ్ సిరీస్ 'సేక్రెడ్ గేమ్స్' యువతరంలో సంచలనం సృష్టిస్తోంది. అంతే కాకుండా, సోషల్ మీడియాలో దీనిపై విస్తృతంగా చర్చ జరుగుతోంది.
బాల్యంలో జరిగిన దురదృష్టకర సంఘటనలు, మతపరమైన విద్వేషాలు గైతోండె అనే పాత్రలో ఎలాంటి మార్పులు తీసుకువస్తాయో ఈ సిరీస్‌లో చూపించారు.
విక్రమ్ చంద్ర అదే పేరుతో రాసిన థ్రిల్లర్ నవల ఆధారంగా 'సేక్రెడ్ గేమ్స్' రూపొందింది.
ఈ సిరీస్‌లోని ప్రతి ఎపిసోడ్ ప్రారంభంలో పురాణాలు, కథా నేపథ్యాన్ని బట్టి కొన్ని ప్రత్యేకమైన చిహ్నాలు కనిపిస్తాయి. ప్రతి చిహ్నానికి ఒక అర్థముండేలా వీటిని ప్రత్యేకంగా రూపొందించారు.

ఫొటో సోర్స్, Aniruddh Mehta/Instagram
ఈ చిహ్నాల సృష్టికర్త 28 ఏళ్ల గుజరాత్ కళాకారుడు అనిరుద్ధ్ మెహతా. అనిరుద్ధ్ ముంబైలోని ఒక గుజరాతీ కుటుంబంలో జన్మించారు.
లండన్‌లోని కమ్యూనికేషన్ కాలేజీలో డిజైన్ ఫర్ గ్రాఫిక్ కమ్యూనికేషన్ కోర్సును అభ్యసించారు. ప్రస్తుతం అనిరుద్ధ్ ముంబైలోని ప్లెక్సిస్ మోషన్ స్టూడియోలో పని చేస్తున్నారు.

ఫొటో సోర్స్, Netflix
''ఈ సిరీస్ దర్శకుడు విక్రమాదిత్య మోత్వానె, సిరీస్ రచయిత వరుణ్ గ్రోవర్‌ను కలిసినప్పుడు మేం అన్ని ఎసిసోడ్ల పేర్లను నిర్ణయించాం. వాటికి డిజైన్ల గురించి చర్చించేటప్పుడు మధ్యలో చక్రం ఉండాలని నిర్ణయించాం'' అని అనిరుద్ధ్ బీబీసీకి వివరించారు.
''చక్రం హిందూ, బౌద్ధ ధర్మాలకు సంకేతం. అది విశ్వాన్ని సూచిస్తుంది'' అని ప్లెక్సిస్ స్టూడియో డైరెక్టర్ యశోద తెలిపారు.
''హిందూ మతంలో ఏవైనా శుభకార్యాల సందర్భంగా చక్రాన్ని చిత్రిస్తారు. దానిని పవిత్రంగా భావిస్తారు'' అని ఆమె వివరించారు.

ఫొటో సోర్స్, Aniruddh Mehta/Studio Plexus
మొదటి ఎపిసోడ్‌లోని చక్రానికి అర్థం ఏమిటి?
సిరీస్ ప్రారంభంలోనే రంగురంగుల చక్రం కనిపిస్తుంది.
ఈ చక్రంలో కొన్ని ప్రత్యేకమైన రేఖలు, ఆకృతులు కనిపిస్తాయి. ఇవి హిందూ, ముస్లిం మతాలను సూచిస్తాయి. ఎరుపు, నారింజ రంగులు హిందూ మతాన్ని సూచిస్తే.. ఆకుపచ్చ, నీలం రంగులు ఇస్లాం, ఇతర మతాలను సూచిస్తాయి.
అనిరుద్ధ్ బీబీసీ కోసం ఈ చిహ్నాలను డీకోడ్ చేశారు.

ఫొటో సోర్స్, Aniruddh Mehta/Studio Plexus
మొదటి ఎపిసోడ్ - అశ్వత్థామ
మహాభారతంలో కౌరవులకు, పాండవులకు మధ్య యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో అశ్వత్థామ కౌరవుల తరపున యుద్ధం చేస్తాడు.
మహాభారతం ప్రకారం, అశ్వత్థామ శివుని అవతారం. అతని నుదుటన ఒక వజ్రం ఉంటుంది. అశ్వత్థామకు మరణం లేదని అంటారు.
ఈ ఎపిసోడ్లో ముఖ్యమైన పాత్రలో గైతోండె కనిపిస్తాడు. దీనిలో అతను తనకు మరణం లేదని పదేపదే అంటుంటాడు.
మహాభారతంలో జరిగిన యుద్ధంలో అశ్వత్థామ నారాయణాస్త్రాన్ని తన ఆయుధంగా వాడతాడు. ఇది అత్యంత శక్తిమంతమైన ఆయుధం. దాని నుంచి ఒకేసారి అనేక లక్షల బాణాలను వదలవచ్చు.
ఈ ఎపిసోడ్‌లోని చిహ్నం మధ్యలో వజ్రం అశ్వత్థామ ఫాలభాగాన్ని సూచిస్తుంది. దాని చుట్టూ ఉన్న బాణాలు, అతని ఆయుధాలను సూచిస్తాయి.

ఫొటో సోర్స్, Aniruddh Mehta/Studio Plexus
రెండో ఎపిసోడ్ - హాలాహల
ఇది విష్ణుపురాణం, భగవద్ పురాణం, మహాభారతం నుంచి ఉత్పన్నమైన పదం.
దేవతలు, రాక్షసులు అమృతం కోసం సాగరాన్ని మధించారు. అప్పుడు ముందుగా దాని నుంచి హాలాహలం ఉద్భవించింది.
దీనికి సూచనగా ఒక గుండ్రటి చిహ్నం కనిపిస్తుంది. ఇది సాగరమథనాన్ని, శంఖం హాలాహలాన్ని సూచిస్తుంది.

ఫొటో సోర్స్, Aniruddh Mehta/Studio Plexus
మూడో ఎపిసోడ్ - అతాపి, వాతాపి
హిందూ పురాణాల ప్రకారం అతాపి, వాతాపి అనే రాక్షసులు ఉండేవారు.
వాళ్లు అమాయకులను తమ ఇంటికి భోజనానికి ఆహ్వానించేవాళ్లు.
అతిథులు రాక ముందే వాతాపి మేక రూపంలోకి మారిపోయేవాడు. అతాపి దానిని చంపి అతిథుల కోసం విందుభోజనం తయారు చేసేవాడు.
అతిథులు భోజనం తినే సమయంలో అతాపి 'వాతాపి' అని పిలిచేవాడు. దాంతో వాతాపి అతిథుల పొట్టను చీల్చుకుని వచ్చేవాడు.
ఈ ఎపిసోడ్ ఆ రాక్షసద్వయం గురించి పేర్కొంటుంది. అందుకే ఈ చిహ్నం మధ్యలో ఇద్దరు రాక్షసులు కనిపిస్తారు.
ఈ ఎపిసోడ్లో గైతోండె వద్ద పని చేస్తూ, అతని కోసం ఏమైనా చేసే బద్రి సోదరులు కనిపిస్తారు.

ఫొటో సోర్స్, Aniruddh Mehta/Studio Plexus
నాలుగో ఎపిసోడ్ - బ్రహ్మ హత్య
ఇంద్రుడు విశ్వపుర అనే బ్రాహ్మణున్ని చంపేస్తాడు.
అయితే తర్వాత ఇంద్రుడు పశ్చాత్తాపపడతాడు. తన పాపప్రాయశ్చిత్తం కోసం విష్ణువు సలహా మేరకు భూమిని, ఒక మహిళను, ఒక చెట్టును ఎంచుకుంటాడు.
ఈ పురాణకథను దృష్టిలో పెట్టుకుని ఈ చిహ్నాన్ని రూపొందించారు. ఈ చిహ్నంలోని చక్రం మధ్యలో ఒక త్రికోణం కనిపిస్తుంది. దాని మూడు మూలల్లో ఒక చెట్టు, ఒక మహిళ, భూగోళం కనిపిస్తాయి.
బ్రాహ్మణుడైన గైతోండె జనాలను ఎలా చంపుతాడో, వాళ్ల మధ్య ఎలా మతపరమైన ఉద్రిక్తతలను సృష్టిస్తాడో ఈ ఎపిసోడ్లో చూపించారు.

ఫొటో సోర్స్, Aniruddh Mehta/Studio Plexus
ఐదో ఎపిసోడ్ - సర్మా
రుగ్వేదంలో సర్మా అంటే దేవుళ్లకు చెందిన ఆడకుక్క. ఇది ఇంద్రునికి చెందిన పశువులను పాణిని (రాక్షసుల సైన్యం) నుంచి రక్షిస్తుంటుంది.
ఈ చిహ్నం మధ్యలో సర్మాను చూపించడం జరిగింది. ఇదే ఎపిసోడ్లో సర్తాజ్ (సైఫ్ అలీ ఖాన్) తల్లి , అతని తండ్రి ఒక పార్సీ కుటుంబానికి చెందిన కనిపించకుండా పోయిన కుక్కను ఎలా కనుగొన్నాడో చెబుతుంది.

ఫొటో సోర్స్, Aniruddh Mehta/Studio Plexus
ఆరవ ఎపిసోడ్ - ప్రేతకల్ప
ప్రేతకల్ప అనేది గరుడ పురాణంలో ఒక భాగం. ఇది జీవితంలోని జనన, మరణ చక్రాలను గురించి, మరణం తర్వాత ఏమవుతుంది అన్న దాని గురించి వివరిస్తుంది.
ఆ చిహ్నం చుట్టూ ఉన్న డిజైన్ ఆత్మలను సూచిస్తుంది.
పైకి వెళ్లే బాణాలు స్వర్గానికి వెళుతున్న ఆత్మలను సూచిస్తే, కింది వైపున్న బాణాలు నరకానికి వెళుతున్న ఆత్మలను సూచిస్తాయి. ఈ ఎపిసోడ్ పోలీస్ కానిస్టేబుల్ మరణానికి సంబంధించినది.

ఫొటో సోర్స్, Aniruddh Mehta/Studio Plexus
ఏడవ ఎపిసోడ్ - రుద్ర
రుగ్వేదం ప్రకారం రుద్రుడు నాశనానికి, తుపానుకు ప్రతీక. రుద్రుణ్ని శివునిలో భాగమని భావిస్తారు.
ఈ చిహ్నంలో మధ్య భాగం తుపానును సూచిస్తుంది. దాని చుట్టూ ఉన్నది శక్తికి ప్రతీక.
ఈ ఎపిసోడ్లో గైతోండె భార్య మరణిస్తుంది. దానికి తోడు అతను జైలుకు వెళ్లడంతో అతని కోపం రెట్టింపవుతుంది. ఈ చిహ్నం గైతోండెలోని కోపాన్ని సూచిస్తుంది.

ఫొటో సోర్స్, Aniruddh Mehta/Studio Plexus
ఎనిమిదో ఎపిసోడ్ - యయాతి
యయాతి శుక్రాచార్యుని కూతురైన దేవయానిని వివాహమాడాడు. శుక్రాచార్యుడు రాక్షసుల గురువు. భగవద్ పురాణం ప్రకారం, యయాతి యవ్వనంలోనే వృద్ధునిగా మారతాడని శుక్రాచార్యుడు శాపం పెడతారు.
ఈ శాపం నుంచి తప్పించుకోవడానికి యయాతి ఆ శాపాన్ని తన కుమారునికి బదిలీ చేస్తాడు.
ఈ ఎపిసోడ్ తండ్రీ-కొడుకుల మధ్య సంబంధం గురించి ఉంటుంది. ఇక్కడ చిహ్నం మధ్యలో త్రాసును చూడవచ్చు. ఇది వారిద్దరి మధ్య సంబంధాలు, వాటి సమతుల్యతను సూచిస్తుంది.
ఈ ఎపిసోడ్లో సర్తాజ్ తన తండ్రితో ఉన్న సంబంధాల గురించి వివరిస్తాడు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









