ప్లేబాయ్ మోడల్‌తో ట్రంప్ సంబంధాన్ని బయటపెడుతున్న టేపులు

ఫొటో సోర్స్, Getty Images
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో తనకు శృంగార సంబంధాలున్నాయని చెప్పే ప్లేబాయ్ మాజీ మోడల్ 'కెరెన్ మెక్‌డ్యూగల్'తో ఆయన నడిపిన వ్యవహారానికి సంబంధించిన ఆధారాలు దొరికాయని అమెరికా మీడియా వెల్లడించింది.
ఆమెకు చెల్లించాల్సిన డబ్బు విషయంలో ట్రంప్ తన వ్యక్తిగత న్యాయవాది మైఖేల్ కాన్‌తో జరిపిన ఈ సంభాషణలను రహస్యంగా రికార్డు చేశారని.. 2016లో ట్రంప్ అమెరికా అధ్యక్షుడు కావడానికి రెండు నెలల ముందు ఇది జరిగిందని చెబుతున్నారు.
కాగా కాన్.. ట్రంప్ వ్యక్తిగత న్యాయవాదిగా సుదీర్ఘకాలం పనిచేశారు. ఆయనే ఈ సంభాషణలను రహస్యంగా రికార్డు చేశారని.. ఈ ఏడాది ప్రారంభంలో న్యూయార్క్‌లోని కాన్ ఇంటిపై ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు దాడులు చేసినప్పుడు ఈ టేపులు బయటపడ్డాయని 'న్యూయార్క్ టైమ్స్' వెల్లడించింది.
ఈ పరిణామం తరువాత ట్రంప్.. మైఖేల్ కాన్‌ను తన వ్యక్తిగత న్యాయవాది పదవి నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు.



ఫొటో సోర్స్, Getty Images
‘తెలివిగా నోరు మూయించారు’
కాగా 2016 అధ్యక్ష ఎన్నికల సమయంలో కెరెన్ తనకు ట్రంప్‌తో శృంగార సంబంధాలున్నాయంటూ ప్రకటించి ఆ సంగతులన్నీ పంచుకునేందుకు 'నేషనల్ ఎంక్వైరర్' పత్రికతో 1,50,000 డాలర్లకు ఒప్పందం చేసుకున్నారు.
ఈ ఒప్పందం ప్రకారం ఆమె ఈ విషయాన్ని ఇంకే పత్రికతో కానీ, ఇంకెక్కడా కానీ బహిరంగంగా చెప్పడానికి వీల్లేదు.
అయితే... 1,50,000 డాలర్లకు ఆ సంచలన సంగతిని, ఆమె కథను కొనుగోలు చేసిన ఆ పత్రిక దాన్ని ప్రచురించలేదు. అందుకు కారణం... ఆ పత్రిక ట్రంప్ మిత్రుడిది కావడమే.
తన నోరు మూయించడానికే ట్రంప్ ఆయన స్నేహితుడికి చెందిన 'నేషనల్ ఎంక్వయిరర్' పత్రిక ద్వారా తెలివిగా ఈ పనిచేశారని కెరెన్ ఆరోపించారు.
రహస్య రికార్డింగ్ నిజమే..
ట్రంప్, కాన్‌ల సంభాషణలు రహస్యంగా రికార్డయ్యాయని అధ్యక్షుడి మరో వ్యక్తిగత న్యాయవాది రూడీ గిలియానీ శుక్రవారం 'న్యూయార్క్ టైమ్స్'తో మాట్లాడుతూ నిర్ధారించారు.
అయితే... కెరెన్‌తో చేసుకున్న ఒప్పందం మేరకు ఆమెకు 'నేషనల్ ఎంక్వయిరర్' చెల్లించిన డబ్బును ఆ పత్రికకు తిరిగి చెల్లించడంపై వారిద్దరూ మాట్లాడుకున్నారని రూడీ చెబుతున్నారు.
ఈ సంభాషణలు ఫోన్లో జరిపినవి కావని.. ముఖాముఖి జరిపిన సంభాషణలని 'వాల్‌స్ట్రీట్ జర్నల్' వెల్లడించింది.
కాగా.. కెరన్‌కు చేసిన చెల్లింపులకు సంబంధించిన రికార్డులు కావాలని 'నేషనల్ ఎంక్వయిరర్'ను ఎఫ్‌బీఐ అడిగినట్లు తెలుస్తోంది.
మరోవైపు.. ఈ మొత్తం ఉదంతంలో అమెరికా ఎన్నికల ప్రచార చట్టాలను ఉల్లంఘించారా? పన్ను చెల్లింపు మోసాలకు పాల్పడ్డారా అన్న కోణంతో పాటు ఈ వ్యవహారంలో కాన్ పాత్రపై అమెరికా న్యాయవిభాగం దర్యాప్తు చేస్తోంది.


ఫొటో సోర్స్, Getty Images
ఇంతకూ కెరెన్‌తో ట్రంప్‌కు శారీరక సంబంధం ఉందా?
ప్లేబాయ్ మాజీ మోడల్ కెరెన్ 2006లో డొనాల్డ్ ట్రంప్‌తో ఆరు నెలల పాటు శారీరక సంబంధాన్ని నెరిపినట్లు గతంలో ఆరోపించారు.. ట్రంప్ మెలానియాను పెళ్లి చేసుకున్న ఏడాది తరువాత వీరి మధ్య సంబంధమేర్పడినట్లు చెబుతారు.
అయితే, ట్రంప్ మాత్రం తనకు ఆమెతో ఎలాంటి సంబంధం లేదని.. ఆమెకు ఎన్నడూ డబ్బు చెల్లించలేదని చెబుతున్నారు.
కానీ, ఇంతకుముందు మే నెలలో ఓసారి ట్రంప్ ఈ చెల్లింపుల విషయాన్ని అంగీకరించారు. తనతో వ్యవహారం ఉందని చెబుతున్న ఓ మహిళ నోరు మూయించడానికి మైఖేల్ కాన్ ఇచ్చిన డబ్బును తాను తిరిగి చెల్లించినట్లు అంగీకరించారు.
అయితే, అది కెరెన్‌కు సంబంధించినది కాదు. స్టెఫానీ క్లిఫర్డ్ అలియాస్ స్టార్మీ డేనియల్స్ అనే పోర్న్‌స్టార్‌కు ఆయన ఇచ్చిన 1,30,000 డాలర్లకు సంబంధించినది.
డేనియల్ కూడా 2006లో ట్రంప్‌తో తాను ఒక హోటల్‌లో సెక్స్‌లో పాల్గొన్నట్లు ఆరోపించారు. దీంతో ఆమె ఆ విషయాన్ని మళ్లీ బయటపెట్టకుండా ఆమెతో 1,30,000 డాలర్లకు ఒప్పందం చేసుకున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఎందుకిది చట్ట విరుద్ధం?
ట్రంప్‌తో వ్యవహారాలు నడిపి.. ఆ విషయం బయటపెట్టి ఆయన్ను ఇబ్బందులు పాల్జేయకుండా ఉండేందుకు చేసుకున్న ఈ ఆర్థిక ఒప్పందాలు ఆయా మహిళలకు సంబంధించి చట్టవిరుద్ధమేమీ కాకపోవచ్చు. కానీ, డొనాల్డ్ ట్రంప్‌కు మాత్రం ఈ ఒప్పందాలు చిక్కులు తెచ్చి పెట్టేవే.
అధ్యక్ష ఎన్నికల్లో పోటీపడిన ఒక అభ్యర్థి తన రహస్య శృంగార సంబంధాలు బయటి ప్రపంచానికి తెలియకుండా దాచిపెట్టేందుకు చేసుకునే ఇలాంటి ఒప్పందాలు 'అమెరికా ఎన్నికల ప్రచార ఆర్థిక చట్టాల'ను ఉల్లంఘించడం కిందకే వస్తాయి.

ఫొటో సోర్స్, Getty Images
కాన్ అప్రూవర్‌గా మారుతారా?
మైఖేల్ కాన్... ట్రంప్ వ్యక్తిగత న్యాయవాదిగా సుదీర్ఘకాలంగా పనిచేసిన ఆయన ట్రంప్‌కు నమ్మిన బంటు. ట్రంప్ కోసం తాను తుపాకీ తూటాకు ఎదురు నిలవడానికి కూడా సిద్ధమేనని ఒకసారి ప్రకటించి ట్రంప్ పట్ల తన విశ్వాసాన్ని చాటుకున్నారాయన.
కానీ, తాజాగా ఆయన స్వరం మారింది. 'ఏబీసీ న్యూస్'తో మాట్లాడిన ఆయన తన పాత బాస్(ట్రంప్) కంటే కుటుంబం, దేశం ముఖ్యమని అన్నారు.
దీంతో ఆయన దర్యాప్తు అధికారులకు సహకరించి అన్ని విషయాలూ చెబుతారని, ఆధారాలు కూడా ఇస్తారన్న ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఇదే జరిగితే ట్రంప్ ఇబ్బందుల్లో పడినట్లే.
ఇవి కూడా చదవండి:
- LIVE అవిశ్వాస తీర్మానం: అప్పట్లో ప్రత్యేక హోదా 10 ఏళ్లు ఇస్తామన్నారు: ఎంపీ రామ్మోహన్ నాయుడు
- ‘మీరు నన్ను పప్పూ అన్నా.. మీపై నాకు ద్వేషం లేదు’.. లోక్‌సభలో రాహుల్ గాంధీ ఇంకేమన్నారంటే
- చేపలు తినొచ్చా.. తినకూడదా? ఈ రసాయనాల గొడవేంటి?
- సింగపూర్‌కి ఇంత తక్కువ సమయంలో అంత సంపద ఎలా వచ్చింది?
- రాహుల్ ముందున్న అతిపెద్ద సవాళ్లు!
- ‘దేశంలో పార్లమెంట్ అవసరం తీరిపోయిందా?’
- రాజ్యాంగం నుంచి ‘సెక్యులర్’ పదాన్ని తొలగించడం సాధ్యమేనా?
- నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీలకు కర్ణాటక ఎన్నికల ఫలితాలు ఇస్తున్న సంకేతాలేంటి?
- టీడీపీ మరో శివసేన అవుతుందా?
- హైపర్‌లూప్: భవిష్యత్తా? భ్రమా?
- అమెరికాకు ఆ పేరు పెట్టిన మధ్యయుగాల నాటి మ్యాప్ ఇదే
- మోదీ సమక్షంలో జరిగిన ఎస్సార్ ఒప్పందం ఏంటి? ఇందులో కుంభకోణం ఉందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








