‘మీరు నన్ను పప్పూ అన్నా.. మీపై నాకు ద్వేషం లేదు’.. లోక్‌సభలో రాహుల్ గాంధీ ఇంకేమన్నారంటే

ఫొటో సోర్స్, LSTV
లోకసభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. తన ప్రసంగం ముగిసిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వద్దకు వెళ్లి ఆయన్ను ఆలింగనం చేసుకున్నారు.
టీడీపీ సభ్యుడు గల్లా జయదేవ్ ప్రసంగంలో బాధ తనకు అర్థమైందన్నారు. 21వ దశాబ్దపు రాజకీయ ఆయుధంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాధితులని రాహుల్ గాంధీ అన్నారు. అయితే, ఈ ఆయుధం కారణంగా బాధపడుతోంది ఆంధ్రులు మాత్రమే కాదని, దేశంలో చాలామంది ఉన్నారన్నారు.
దేశ ప్రజలంతా ‘అబద్ధపు హామీల’ దాడులతో బాధపడుతున్నారని.. తొలుత చాలా ఉత్సాహంగా మొదలై, సంతోషంగా అనిపిస్తుంది కానీ తర్వాత షాకులు మొదలవుతాయని చెప్పారు. ఆ తర్వాత ఎనిమిది గంటలపాటు ప్రసంగం వస్తుందన్నారు.
ఈ ‘అబద్ధపు హామీల’ దాడులతో దేశ రైతాంగం, యువత, దళితులు, ఆదివాసీలు, మహిళలు బాధపడ్డారని వివరించారు.
‘ప్రధానమంత్రి ఏదైనా మాట అన్నారంటే దానిపై నిలబడాలి’ అని గల్లా జయదేవ్ అన్న మాటను గుర్తు చేస్తూ.. దేశం మొత్తం అదే అడుగుతోందని చెప్పారు.
ప్రతి వ్యక్తి బ్యాంకు ఖాతాలోకి రూ.15 లక్షలు జమ చేస్తానన్నది మొదటి అబద్ధపు హామీ అని రాహుల్ గాంధీ చెప్పారు.

ప్రతి ఏటా రెండు కోట్ల మంది యువతకు ఉపాధి కల్పిస్తానన్నది రెండో అబద్ధపు హామీ అని, 2016-17 సంవత్సరంలో దేశవ్యాప్తంగా నాలుగు లక్షల మందికి మాత్రమే ఉపాధి లభించిందని, ఈ గణాంకాలు కేంద్ర కార్మిక శాఖవేనని అన్నారు.
ఉపాధి గురించి మాట్లాడుతూ.. పకోడీలు అమ్ముకోవాలని, బడ్డీ కొట్లు పెట్టుకోవాలని సలహాలు ఇస్తున్నారని బీజేపీ నాయకులను విమర్శించారు.
నల్లధనం వెనక్కు తెస్తానంటూ పెద్దనోట్లు రద్దు చేశారని, దీనివల్ల రైతులు, పేదలు, కార్మికులు చాలా ఇబ్బందులు పడ్డారన్నారు. దీనివల్లనే ప్రస్తుతం దేశంలో నిరుద్యోగం ఏడేళ్లలో ఎన్నడూ లేనంతగా పెరిగిందన్నారు.
దేశవ్యాప్తంగా ఒకే పన్ను విధానం ఉండాలని, జీఎస్టీ తీసుకురావాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించిందని, అయితే అప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రి వ్యతిరేకించారని నరేంద్ర మోదీని ఉద్దేశించి విమర్శించారు. ఇప్పుడు నరేంద్ర మోదీ జీఎస్టీ తీసుకొచ్చారని, అయితే ఐదు శ్లాబులు పెట్టారని, చిన్నచిన్న వ్యాపారుల ఇళ్లల్లోకి కూడా ఆదాయపు పన్ను శాఖ అధికారుల్ని పంపిస్తున్నారని అన్నారు.
ప్రధానమంత్రి చిన్న వ్యక్తులతో మాట్లాడరని, ప్రధానమంత్రి మాట్లాడేది సూటు-బూటు వేసుకున్న 15-20 మంది వ్యాపారులతోనేనని ఆరోపించారు.
జియో వంటి వాణిజ్యాంశాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫొటో వస్తుందని, అలాంటి శక్తులు మోదీకి మద్దతు ఇస్తాయని చెప్పారు.
దేశానికి తాను కాపలాదారునని, దేశానికి కాపలా కాస్తానని ప్రధానమంత్రి చెప్పారని, అయితే అమిత్ షా కుమారుడు జయ్ షా (ఈ పేరును రాహుల్ పలకగానే సభలో అధికారపక్ష సభ్యులు పెద్ద ఎత్తున అభ్యంతరం తెలిపారు. దీంతో ఈ పేరు లోక్‌సభ రికార్డుల్లోకి ఎక్కదని స్పీకర్ తెలిపారు) తన ఆస్తుల్ని 16 వేల రెట్లు పెంచుకున్నారని.. అయినా ప్రధానమంత్రి నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు.
ఒక్కో రాఫెల్ యుద్ధ విమానం ధర రూ.520 కోట్లని, అయితే ప్రధానమంత్రి కొంతమందిని వెంటపెట్టుకుని ఫ్రాన్స్ వెళ్లారని, ఏం జరిగిందో ఏమో కానీ ఒక్కో యుద్ధ విమానం ధర ఒక్కసారిగా రూ.1600 కోట్లు అయిపోయిందని రాహుల్ చెప్పారు. ఈ యుద్ధ విమానాల ధర ఎంతో దేశానికి చెబుతానని రక్షణ శాఖ మంత్రి ప్రకటించారని, కానీ తర్వాత మాట మార్చారన్నారు. ఫ్రాన్స్, భారత్ మధ్య కుదిరిన రహస్య ఒప్పందం కారణంగా ఈ ధరను చెప్పలేనని రక్షణ శాఖ మంత్రి ప్రకటించారన్నారు. అయితే తాను ఫ్రాన్స్ రక్షణ శాఖ మంత్రిని కలిశానని, ఇలాంటి రహస్య ఒప్పందం ఏమైనా కుదిరిందా అని అడిగానని.. అలాంటిదేమీ లేదని సమాధానం లభించిందన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒత్తిడితోనే రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ దేశానికి అబద్ధం చెప్పారని, దీనివల్ల ఎవరికి మేలు జరుగుతోందని, ఎందుకు జరుగుతోందని రాహుల్ ప్రశ్నించారు.

ఫొటో సోర్స్, Getty Images
‘అధికారం పోతుందేమోనని మోదీ, షాలకు భయం’
ప్రధానమంత్రికి, వ్యాపారులకు మధ్య సంబంధాల గురించి రాహుల్ మాట్లాడుతూ.. నరేంద్ర మోదీ దేశానికి కాపలాదారు కాదని, (వ్యాపారులకు) భాగస్వామి అని ఆరోపించారు.
‘‘ప్రధానమంత్రి నవ్వుతున్నట్లు కనిపిస్తున్నారు. కానీ, ఆయన నా కళ్లలోకి చూడలేకపోతున్నారు. ఆయన ఎక్కడెక్కడో చూస్తున్నారు. నా కళ్లలో కళ్లుపెట్టి ఆయన చూడలేరు’’ అని రాహుల్ అన్నారు.
కాగా, రాహుల్ గాంధీ ఆరోపణలు సరికాదని, ఆయన సభా నియమాలను ఉల్లంఘిస్తున్నారని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంతకుమార్ అన్నారు.
ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా అందరిలాంటి రాజకీయ నాయకులు కాదని, వారు వేరే తరహా నాయకులని రాహుల్ అన్నారు.
తాము అధికారం కోల్పోయేందుకు, అధికారానికి దూరంగా ఉండేందుకు కూడా సిద్ధంగా ఉంటామని, కానీ.. మోదీ, షాలు మాత్రం అధికారం కోల్పోయేందుకు సిద్ధంగా లేరని, వాళ్లు అధికారం కోల్పోయిన వెంటనే వారికి వ్యతిరేకంగా చాలా జరుగుతాయని వారు భయపడుతున్నారని అన్నారు. ప్రధానమంత్రి, బీజేపీ అధ్యక్షుడు ఇద్దరూ భయపడుతున్నారని, ఈ భయం దేశంపైన కూడా పడుతోందన్నారు. ఈ భయమే దేశంలో ప్రతి గొంతుకను అణగదొక్కాలని చూస్తోందని ఆరోపించారు.
‘అందరినీ కాంగ్రెస్‌లోకి మార్చేస్తా’
''మీలో నా మీద ద్వేషం ఉంది. మీరు నన్ను పప్పు అని ఇంకా అనేక దూషణలు చేయొచ్చు. కానీ నాలో మీ పట్ల ద్వేషం లేదు. ఇదే కాంగ్రెస్. మీ అందరినీ ఒక్కొక్కరుగా మారుస్తాను. అందరిలో ఉన్న ప్రేమను వెలికితీస్తాను. అందరినీ కాంగ్రెస్‌లోకి మార్చేస్తా'' అని వ్యాఖ్యానించారు.
ప్రసంగం అనంతరం ప్రధాని మోదీ కూర్చున్న స్థానానికి వచ్చారు. లేచి నిలబడాలని ప్రధానిని కోరారు. అప్పుడు మోదీ ఆయనకు కరచాలనం ఇచ్చేందుకు ప్రయత్నించగా నిరాకరించిన రాహుల్ .. తన స్థానంలో కూర్చునే ఉన్న మోదీ మెడ చుట్టూ చేతులు వేసి ఆలింగనం చేసుకున్నారు. తర్వాత వెనుదిరిగారు.
ఈ హఠాత్ పరిణామానికి తొలుత అవాక్కైన ప్రధాని మోదీ వెంటనే తేరుకుని.. తిరిగి వెళ్లిపోతున్న రాహుల్‌ను వెనక్కు పిలిచారు. రాహుల్ మళ్లీ మోదీ వద్దకు వెళ్లారు. మోదీ నవ్వుతూ రాహుల్‌కు ఏదో చెబుతూ.. కరచాలనం చేశారు.
తిరిగి తన సీట్లోకి వచ్చి కూర్చున్న రాహుల్ గాంధీ సహచర ఎంపీల వైపు చూస్తూ కన్ను కొట్టారు.
ఈ కథనాలు కూడా చదవండి:
- అత్యాచారాల గురించి తల్లిదండ్రులు తమ పిల్లలకు ఏం చెబుతారు? ఎలా చెబుతారు?
- భార్యపై అత్యాచారం చేయించిన భర్త.. స్వలింగ సంపర్కురాలైనందుకు కక్ష
- దేశంలో రేప్‌లు ఎందుకు తగ్గట్లేదు?
- రేప్ వార్తల రిపోర్టింగ్‌లో మీడియా 'ఆనందం' దాగి ఉందా?
- సెక్స్ అడిక్షన్: కోరికలు ఎక్కువగా ఉంటే వ్యాధిగా భావించాలా?
- ‘సెక్స్ గురువు' ఓషో రజనీష్ 'రహస్యాల'పై నోరు విప్పిన బాడీగార్డ్
- ‘అది భార్యాభర్తల పడక సీన్... అలా నటించడానికి నాకేమీ సిగ్గనిపించలేదు’
- మాట వినకపోతే గాడిదలతో రేప్ చేయించేవారు!
- ‘ఫస్ట్‌నైట్’ పరీక్ష: ‘‘తెల్లటి దుప్పటిపై రక్తపు మరక కనిపించాలన్నారు. మేం ఎదిరించాం’’
- #HerChoice: ‘మా ఆయనకు తీరిక లేదు, వేరే మగాళ్లతో చాట్ చేస్తాను!'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









