నేను వైట్‌హౌస్‌‌లోనే ఉన్నా: ట్రంప్ భార్య ట్వీట్

మెలానియా ట్రంప్

ఫొటో సోర్స్, AFP

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సతీమణి మెలానియా ట్రంప్ విషయంలో తరచూ ఊహాగానాలు, వదంతులు వ్యాపిస్తున్నాయి. గత 20 రోజులుగా ఆమె ఆరోగ్యం, ట్రంప్‌తో వైవాహిక బంధంపైనా అమెరికాలో, మిగతా ప్రపంచంలోనూ అనేక ఊహాగానాలు వినిపించాయి.

వాటన్నిటికీ తెరదించుతూ ఆమె తాజాగా వైట్‌హౌస్ నుంచి ఒక ట్వీట్ చేశారు. అందులో ఆమె ఇప్పుడు తానెక్కడున్నారో, ఏం చేస్తున్నారో స్పష్టత ఇచ్చారు.

''నేనెక్కడున్నాను.. ఏం చేస్తున్నాననేది ఊహించడానికి మీడియా చాలా కష్టపడడం చూశాను. నేనిప్పుడు ఇక్కడే వైట్‌హౌస్‌లో కుటుంబంతో హాయిగా ఉన్నాను'' అంటూ ఆమె బుధవారం ట్వీట్ చేశారు.

డొనాల్డ్ ట్రంప్‌తో కలిసి మెలానియా కనిపించి సుమారు 20 రోజులైంది. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన వైట్‌హౌస్ ఫిట్‌నెస్ డే కార్యక్రమానికి ఆమె రాలేదు. ఆమెకు బదులుగా ట్రంప్ కుమార్తె ఇవాంకా వచ్చారు. ఈ నేపథ్యంలో అమెరికా వ్యాప్తంగా వదంతులు వినిపించాయి.

ఆమె ట్రంప్‌ను, వైట్‌హౌస్‌ను వీడి వెళ్లారని.. తల్లిదండ్రులతో కలిసి జీవిస్తున్నారని వాషింగ్టన్ పోస్ట్ తన కథనంలో పేర్కొంది. కుమారుడితో కలిసి న్యూయార్క్‌లో ఉంటున్నట్లుగానూ కథనాలు ప్రచారమయ్యాయి.

అయితే... చికిత్స నిమిత్తం ఆమె ఇంతవరకు ఆసుపత్రిలో ఉన్నారని, ప్రస్తుతం వైట్‌హౌస్‌కు తిరిగొచ్చారని మెలానియా అధికార ప్రతినిధి కూడా తాజాగా ప్రకటన చేశారు. ఈ ప్రకటన, మెలానియా ట్వీట్‌తో వదంతులకు తెరపడింది.

జపాన్ బృందం వేటాడిన తిమింగలాలు

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, జపాన్ కార్యక్రమం ''తిమింగలాలను అక్రమంగా వేటాడటమే''నిని ఉద్యమకారులు ఆరోపిస్తున్నారు

గర్భంతో ఉన్న 122 తిమింగలాలను చంపిన జపాన్ వేటగాళ్లు

అంటార్కిటిక్‌లో వేసవి ‘క్షేత్ర సర్వే’లో భాగంగా జపాన్ వేటగాళ్లు.. గర్భంతో ఉన్న 122 మింక్ తిమింగలాలను పట్టుకుని చంపారు.

వేటగాళ్లు మొత్తంగా 333 మింక్ తిమింగలాలను పట్టుకున్నారని ఇంటర్నేషనల్ వేలింగ్ కమిషన్ (ఐడబ్ల్యూసీ)కి పంపిన ఒక నివేదిక వెల్లడించింది.

జపాన్ వేలగాళ్ల బృందం 2017 నవంబర్‌లో దక్షిణ మహాసముద్రం మీదకు వెళ్లింది. ఆ బృందం 2018 మార్చిలో తిరిగి వచ్చింది.

శాస్త్రీయ పరిశోధనల అవసరాల కోసమే ఈ తిమింగలాల వేట కార్యక్రమం చేపట్టినట్లు జపాన్ చెప్తోంది. అయితే.. జపాన్ ‘‘ప్రాణాంతక పరిశోధన’’కు వ్యతిరేకంగా 2014లో ఐక్యరాజ్యసమితి ఆదేశం జారీచేసింది. ఆ పరిశోధనలపై తీవ్ర ఖండనలూ వచ్చాయి.

జంతువులను సేకరించి, విశ్లేషించటం ద్వారా అంటార్కిటికా జీవావరణ వ్యవస్థను అర్థం చేసుకోవటం ‘‘శాస్త్రీయంగా అవసరం’’ అని జపాన్ ఒక పరిశోధన పత్రంలో పేర్కొంది.

ఆరియారియా నగరంలో ఖాళీగా ఉన్న వీధుల్లో జనం ఫుట్‌బాల్ ఆడుకున్నారు

ఫొటో సోర్స్, EMMANUEL IZUCHWU / BBC IGBO

ఫొటో క్యాప్షన్, ఆరియారియా నగరంలో ఖాళీగా ఉన్న వీధుల్లో జనం ఫుట్‌బాల్ ఆడుకున్నారు

నైజీరియాలో బైయాఫ్రా బంద్.. స్తంభించిన నగరాలు

నైజీరియాలో బైయాఫ్రన్ వేర్పాటువాదులు ఇచ్చిన బంద్ పిలుపుతో దేశంలో ఆగ్నేయ ప్రాంతంలోని నగరాలు, పట్టణాలు స్తంభించిపోయాయి.

1967లో ఈ ప్రాంతానికి స్వాతంత్ర్యం కోసం చేసిన ప్రయత్నం వార్షికోత్సవం సందర్భంగా జరిగిన ఈ బంద్ కారణంగా.. వీధులు ఖాళీ అయ్యాయి. మార్కెట్లు, బ్యాంకులు, స్కూళ్లు మూతపడ్డాయి.

ఆ నాడు జరిగిన తిరుగుబాటు కారణంగా అంతర్యుద్ధం చెలరేగింది. మూడేళ్ల పాటు కొనసాగిన ఆ భీకర ఘర్షణలో 10 లక్షల మందికి పైగా చనిపోయారు.

బంద్ సందర్భంగా వీధుల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించరాదని వేర్పాటువాదులను అధికారులు హెచ్చరించారు. భద్రతా బలగాలు గస్తీ నిర్వహించాయి.

ఆగ్నేయ నైజీరియాలో ప్రధానంగా ఇగ్బో జాతీయులు నివసిస్తున్నారు. వరుసగా వస్తున్న ప్రభుత్వాలు తమ ప్రాంతాన్ని అభివృద్ధి చేయటం లేదని.. తమను విస్మరిస్తున్నారని వీరు ఆరోపిస్తున్నారు.

స్వాధీనం చేసుకున్న కొకెయిన్ పొట్లం

ఫొటో సోర్స్, ALGERIAN DEFENCE MINISTRY

అల్జీరియాలో 700 కిలోల కొకెయిన్ స్వాధీనం

అల్జీరియాలో ఒక ఓడలో అక్రమ రవాణా చేస్తున్న 700 కిలోల కొకెయిన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 20 మందిని అరెస్ట్ చేశారు.

ఈ నౌకలో బ్రెజిల్ నుంచి ఫ్రోజెన్ మీట్ (గడ్డకట్టించిన మాంసం) రవాణా చేస్తున్నారు. అది అల్జీరియా చేరుకోకముందు స్పెయిన్‌లోని వాలెన్సియా ఓడరేవులో ఆగింది.

ఈ ఓడ అల్జీరియాలోని ఓరాన్ ఓడరేవులో సరుకును దించాల్సి ఉంది. అయితే.. మూడు రోజుల పాటు ఓడను రేవుకు తీసుకురావడానికి కెప్టెన్ ఒప్పుకోకపోవడంతో అనుమానాలు వచ్చాయి.

రహస్య సమాచారం అందుకున్న అల్జీరియా కోస్ట్‌గార్డ్.. ఆ నౌకను బలవంతంగా రేవుకు రప్పించింది.

లైబీరియాలో రిజిస్టరైన ఈ నౌకలో ‘హలాల్ మీట్’ అని రాసిని పెట్టెల్లో గల కొకెయిన్ మాదకద్రవ్యాన్ని గుర్తించారు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)