ఉత్తర కొరియాలో జీవితం: పరులతో మాట్లాడితే జైలు శిక్ష, నాయకుడిని నిందిస్తే మరణ శిక్ష

ఫొటో సోర్స్, Reuters
ఉత్తర కొరియాలో సాధారణ పౌరులతో బయటివారు మాట్లాడటం చాలా కష్టం. సందర్శకులు, పర్యాటకులపై పోలీసులు ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచుతారు. ఎవరైనా సందర్శకులతో మాట్లాడితే, వారికి జైలు శిక్ష తప్పకపోవచ్చు. అంతేకాదు, వారి ప్రాణాలకూ ముప్పు ఎదురవుతుంది. ఇంత తీవ్రమైన పరిస్థితులున్నా ఇద్దరు ఉత్తర కొరియన్లు ధైర్యం చేసి బీబీసీతో మాట్లాడారు.
ఉత్తర కొరియాలో పాలకుడు కిమ్ జాంగ్-ఉన్‌ను ఎంతో మంది దైవసమానుడిగా చూస్తారు. ఆయన్ను ప్రశ్నిస్తూ బయటకు మాట్లాడటం చాలా మందికి అసలు ఊహకు కూడా అందదు. కిమ్ అన్నీ తెలుసుకొంటున్నారని, అసమ్మతివాదులు ఎక్కడున్నా అధికారులకు సమాచారం ఇవ్వాలని, కుటుంబ సభ్యుల్లో ఇలాంటివారున్నా చెప్పాలని పాలనా యంత్రాంగం చెబుతుంటుంది.
బీబీసీతో మాట్లాడిన ఇద్దరిలో సున్ హుయ్ ఒక మార్కెట్‌లో ట్రేడర్ కాగా, చోల్ హో సైన్యంలో పనిచేస్తున్నారు. ఇవి వీరి అసలు పేర్లు కావు.
కిమ్ వ్యాపారవేత్తలా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఎక్కువగా ఉన్నాయని సున్ హుయ్ చెప్పారు. ''మనలాగే ఉన్నట్లు ఉంటారు, కానీ మన డబ్బు లాగేసుకుంటారు. ఒక 'వాంపైర్' (పిశాచి) మాదిరి ఆయన మన డబ్బు లాగేసుకొంటున్నారని జనం అనుకొంటుంటారు'' అని ఆమె వెల్లడించారు.
బీబీసీ విక్టోరియా డెర్బిషైర్ కార్యక్రమంలో భాగంగా రహస్య పద్ధతుల్లో ఉత్తర కొరియాలోని సాధారణ ప్రజలతో మాట్లాడేందుకు బీబీసీ చాలా నెలలపాటు ప్రయత్నించింది.

ఫొటో సోర్స్, Getty Images
తెలిస్తే మూడు తరాలకు జైలు శిక్ష
సున్ హుయ్ ఎవరో ఉత్తర కొరియా ప్రభుత్వానికి తెలిస్తే ఆమెను దేశంలోని లేబర్ క్యాంపుల్లో పెట్టొచ్చు. లేదా, ఆమెకు మరణశిక్ష విధించొచ్చు. జైలు శిక్ష ఆమె ఒక్కరికే పరిమితం కాకపోవచ్చు. కుటుంబంలోని మూడు తరాలు జైలు జీవితం గడపాల్సి రావచ్చు.
సున్ హుయ్ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వ్యాపారం బాగా జరిగితే మూడు పూటలా తిండి ఉంటుంది. లేకపోతే అరకొర ఆహారంతోనే సరిపెట్టుకోవాలి.
సున్ హుయ్ పనిచేసే మార్కెట్లో స్ట్రీట్ ఫుడ్, బట్టలు, స్మగ్లింగ్ ద్వారా తరలించిన ఎలక్ట్రానిక్ వస్తువులు, ఇతరత్రా ఉంటాయి.
ఈ మార్కెట్లతో ఐదు లక్షల మందికి ఉపాధి
స్మగ్లింగ్ ఆధారిత మార్కెట్లపై ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఐదు లక్షల మందికి పైగా ఆధారపడి జీవనం సాగిస్తున్నారని దక్షిణ కొరియా రాజధాని సోల్ కేంద్రంగా పనిచేసే 'డైలీ ఎన్‌కే' పత్రిక తెలిపింది. విక్టోరియా డెర్బిషైర్ కార్యక్రమంలో బీబీసీకి ఈ పత్రిక సహకారం అందించింది.
ఉత్తర కొరియా ప్రభుత్వ అతివాద కమ్యూనిజానికి దేశంలోని ఈ మార్కెట్ ట్రేడ్ పూర్తిగా విరుద్ధమైనది. కానీ ఇది దేశంలోని ఎంతో మంది ఆకలి తీరుస్తోంది. విదేశీ, అంతర్జాతీయ ఆర్థిక ఆంక్షలతో, నామమాత్రంగా మారిన ప్రభుత్వ ఆహార సరఫరా వ్యవస్థతో ఉత్తర కొరియా ప్రజలు కష్టాలు ఎదుర్కొంటున్నారు.
నాటి క్షామంతో 10 లక్షల మంది మృతి
1990ల్లో సంభవించిన క్షామంతో పది లక్షల మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. మరోసారి అలాంటి పరిస్థితి తలెత్తకూడదని ఉత్తర కొరియా ప్రభుత్వం కోరుకొంటోంది.
మార్కెట్లపై కిమ్ పెద్దగా చర్యలు తీసుకోరని, అక్కడ ఏం జరిగినా చూసీ చూడనట్టు ఉంటారని, ఈ కారణంగా దేశంలో కిమ్‌ను సానుకూలంగా చూసే వారి సంఖ్య పెరుగుతోందని సున్ హుయ్ చెప్పారు.
ఇలాంటి కొన్ని మార్కెట్లలో వందల కొద్దీ స్టాళ్లు ఉంటాయి. ఈ మార్కెట్లు కొన్ని వార్తలు, అనేక వదంతుల వ్యాప్తికి కేంద్రాలు కూడా అవుతుంటాయి.
''కిమ్‌తో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చర్చించబోతున్నారని నేను మార్కెట్‌లోనే విన్నాను'' అని సున్ హుయ్ తెలిపారు. వీరి ప్రతిపాదిత సమావేశం గురించి ఎవరికీ పెద్దగా తెలియదని ఆమె చెప్పారు. తమ దేశంలో అమెరికా అంటే ఎవ్వరికీ నచ్చదన్నారు.
''మేం పేదరికంలో మగ్గడానికి అమెరికానే కారణం. ఉత్తర, దక్షిణ కొరియాలను అమెరికానే విడగొట్టింది. దక్షిణ కొరియాను మాకు దూరం చేసింది'' అని సున్ హుయ్ తెలిపారు.

ఫొటో సోర్స్, AFP/Getty
ప్రభుత్వ వైఖరిలో మార్పు
ఉత్తర కొరియాలో సమాచార వ్యాప్తి పూర్తిగా ప్రభుత్వ నియంత్రణలో ఉంటుంది. ప్రభుత్వ ఆధ్వర్యంలోని మీడియా అమెరికాకు, దక్షిణ కొరియాకు వ్యతిరేకంగా వార్తలు, సమాచారం అందిస్తుంటుంది.
అయితే ఈ మధ్య కాలంలో పరిస్థితులు కాస్త మారాయని సున్ హుయ్ చెప్పారు. ''మనం దక్షిణ కొరియాతో కలిసి నడవాలని మీడియాలో చెబుతున్నారు. మన జీవితాలు మెరుగుపడాలంటే అమెరికాతో శాంతియుతంగా మెలగాలని చెబుతున్నారు'' అని ఆమె వివరించారు.
ఉత్తర కొరియా అంతర్గత వైఖరి కాస్త మెతబడటాన్ని ముఖ్య పరిణామంగా చెప్పొచ్చు. ఈ మార్పు, కిమ్ ప్రభుత్వం ఒక అణుపరీక్షల కేంద్రంలో సొరంగాలను ధ్వంసం చేయడం అమెరికాతో సయోధ్య పట్ల కిమ్ సానుకూలంగా ఉన్నారని సూచిస్తున్నాయి.
ఇంతకుముందు నిర్ణయించిన ట్రంప్-కిమ్ శిఖరాగ్ర సమావేశం రద్దయింది. అయితే వీరి మధ్య చర్చలకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. వీరు సమావేశమయ్యే అవకాశం ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
రోజువారీ జీవితంపై అసంతృప్తి
ఈర్ష్య అసూయ లేకుండా, అనారోగ్యం బారిన పడకుండా, చనిపోయే వరకు బాగా బతకాలని, ఇదే తన కోరికని సైన్యంలో పనిచేస్తున్న చోల్ హో తెలిపారు. తన తల్లిదండ్రులకు, తన పిల్లలకు ఇలాంటి జీవితమే ఉండాలని ఆయన ఆకాంక్షించారు.
తమ రోజువారీ జీవితంపై దేశ ప్రజల్లో అసంతృప్తి ఉందని చోల్ హో వెల్లడించారు. ప్రభుత్వానికి రుచించని మాటలు మాట్లాడేవారు కొన్ని సందర్భాల్లో భద్రతా విభాగం బోవిబుకు దొరికిపోతుంటారని చెప్పారు. ''అప్పటివరకు మన చుట్టూ ఉన్న వ్యక్తులు ఒక్కసారిగా కనిపించకుండా పోతుంటారు. అయితే ఇటీవలి కాలంలో ఈ ఘటనలు జరగలేదు'' అని వివరించారు.
భద్రతాధికారులు కొన్ని సందర్భాల్లో పైవారి మెప్పు పొందేందుకు కట్టుకథలతో కొంత మందిని పట్టుకొని ఈ శిబిరాలకు తరలిస్తుంటారని చోల్ హో తెలిపారు. ఉదాహరణకు చైనా వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నామని వారితోనే చెప్పించి, అదే కారణంతో వారిని నిర్బంధంలోకి తీసుకొంటుంటారని వివరించారు.
అత్యాచారం ఒక శిక్ష
ప్రభుత్వానికి వ్యతిరేకంగా అసమ్మతి వ్యక్తంచేసేవారిని భద్రతా విభాగం ఎక్కువ సందర్భాల్లో కారాగార శిబిరాలకు తరలిస్తుంటుంది.
అక్కడ బందీలను చిత్రహింసలు పెడతారని, వారి సమాధులను వారితోనే తవ్విస్తారని, అత్యాచారాన్ని ఒక శిక్షగా విధిస్తారనే వార్తలు వస్తుంటాయి.
ఒక్కో శిబిరంలో 20 వేల మంది వరకు ఉంటారని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ తెలిపింది.
ఈ చిత్రహింసల భయంతోనే ప్రజలు ప్రభుత్వం చెప్పినట్లు నడుచుకుంటారని సున్ హుయ్ తెలిపారు. తానుండే ప్రాంతంలో చాలా మందిని ప్రభుత్వం నిర్బంధంలోకి తీసుకొందని వెల్లడించారు.

అక్రమంగా వచ్చిన సినిమాలు చూస్తే పదేళ్ల జైలు
విదేశాల నుంచి అక్రమంగా రవాణా అయిన సినిమాలు, టీవీ షోలు చూస్తే లేబర్ క్యాంపుల్లో పదేళ్ల వరకు ఖైదు తప్పకపోవచ్చు.
విదేశీ మీడియా అందించే సమాచారమేదీ ప్రజలకు అందకుండా చూసేందుకు ప్రభుత్వం గట్టి చర్యలు చేపడుతుంటుంది. అయినప్పటికీ యూఎస్‌బీ స్టిక్స్, నకిలీ వీడియోల రూపంలో చాలా సమాచారం ఉత్తర కొరియాలోకి ప్రవేశిస్తుంటుంది.
విదేశీ సినిమాలు చూస్తూ దొరికిపోతే అధికారులకు లంచాలు చెల్లించాల్సి రావొచ్చని, లంచాలు భారీగా ఉంటాయని విన్నానని సున్ హుయ్ తెలిపారు. అయినా ప్రజలు వీటిని చూడటానికి ఇష్టపడతారని చెప్పారు. దక్షిణ కొరియా ప్రజలు ఎలా జీవిస్తారో తెలుసుకోవాలనే ఆసక్తి ఎక్కువగా ఉంటుందని తెలిపారు.
లోయర్ టౌన్.. దక్షిణ కొరియా
ఉత్తర కొరియాలోని కొన్ని భూభాగాలకు చెందిన కొందరు ప్రాణాలకు తెగించి చైనా గుండా దక్షిణ కొరియాలోకి ప్రవేశిస్తుంటారు. ఇటీవలి సంవత్సరాల్లో ఇలా వెళ్లేవారి సంఖ్య తగ్గింది. సరిహద్దు భద్రత పెరగడం, ఇలాంటి వాళ్లను అప్పగించేందుకు చైనాతో ఉత్తర కొరియా చేసుకొన్న ఒప్పందం దీనికి ప్రధాన కారణం.
తాముంటున్న ప్రాంతంలో ఇలా వెళ్లేవారు చాలా తక్కువని సున్ హుయ్ చెప్పారు. ఇలా దక్షిణ కొరియాకు వెళ్లిన వారిని ఉద్దేశించి మాట్లాడేటప్పుడు ఇరుగుపొరుగు ఆచితూచి స్పందిస్తారని ఆమె తెలిపారు. దక్షిణ కొరియాకు వెళ్లారని సూటిగా చెప్పకుండా 'లోయర్ టౌన్'కు వెళ్లారని అన్యాపదేశంగా చెబుతారని వివరించారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









