పెగాసస్: ప్రభుత్వం మీపై ఎప్పుడు నిఘా పెడుతుందో తెలుసా... అనుమానం వస్తే ఏం చేయాలి?

వైఎస్ జగన్

ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) 2019లో అప్పటి ప్రతిపక్ష పార్టీ సభ్యుల పై నిఘా పెట్టేందుకు పెగాసస్ స్పైవేర్ ఉపయోగించిందని ఆరోపణలొచ్చాయి. రాజకీయ ప్రత్యర్థుల పై నిఘా పెట్టేందుకు అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం పెగాసస్ స్పైవేర్ వాడకంపై విచారణ జరపాలని వైఎస్‌ఆర్‌సీపీ పార్టీ సభ్యులు డిమాండ్ చేశారు.

తెలుగుదేశం పార్టీ 2019లో పెగాసస్ స్పైవేర్‌ ఖరీదు చేసిందని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు.

ఈ ఆరోపణల పై విచారణ జరిపేందుకు ఏపీ శాసనసభ హౌస్ కమిటీని నియమించింది.

అయితే, ఈ ఆరోపణలను టీడీపీ ఖండించింది.

చంద్రబాబు

ఫొటో సోర్స్, fb/Telugu Desam Party

గతంలో భారత ప్రభుత్వం కూడా పెగాసస్ స్పైవేర్ వాడి సుమారు 160 మంది రాజకీయ నాయకులు, విలేఖరులు, న్యాయవాదులు, ఉద్యమకారుల పై నిఘా పెట్టిందనే వార్తలొచ్చాయి.

ఇజ్రాయెల్‌తో జరిగిన రక్షణ ఒప్పందంలో భాగంగా భారత ప్రభుత్వం 2017లో ఇజ్రాయెల్ నుంచి స్పైవేర్ కొనుగోలు చేసినట్లు ది న్యూ యార్క్ టైమ్స్ కథనం పేర్కొంది.

ఈ విషయం పై పార్లమెంట్‌లో కూడా తీవ్ర చర్చలు జరిగాయి. ఈ వార్త దేశవ్యాప్తంగా కలకలం రేపింది.

పెగాసస్ గూఢచర్యం

ఫొటో సోర్స్, Getty Images

పెగాసస్ మాల్‌వేర్ ఐఫోన్లు, ఆండ్రాయిడ్ ఫోన్ల నుంచి మెసేజీలు, ఫోటోలు, ఈ మెయిల్స్ సేకరించగలదు. కాల్స్ రికార్డ్ చేసి, మైక్రో ఫోన్‌లను కూడా రహస్యంగా యాక్టివేట్ చేయగలిగే సామర్ధం ఉంటుంది.

ఈ సాఫ్ట్‌వేర్ ద్వారా నేరస్థులు, తీవ్రవాదుల కదలికలను కనిపెట్టేందుకు వాడవచ్చు.

మానవ హక్కులను కాపాడే విషయంలో ఉత్తమ రికార్డు ఉన్న దేశాల్లో కేవలం మిలిటరీ, లా ఎన్ఫోర్స్మెంట్, ఇంటెలిజెన్స్ సంస్థలకు మాత్రమే అమ్ముతామని ఎన్‌ఎస్‌ఓ చెబుతోంది.

వీడియో క్యాప్షన్, ఈ యాప్స్ ఉంటే మీ ఫోన్ హ్యాక్ అయినట్లే...

భారత ప్రభుత్వం పై వచ్చిన ఆరోపణలను విచారించేందుకు అక్టోబరు 2021లో సుప్రీం కోర్టు నిపుణులతో కూడిన స్వతంత్ర కమిటీని నియమించింది.

పెగాసస్ అంశం జాతీయ భద్రత పై ప్రభావం చూపిస్తుందని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్‌.వీ. రమణ వ్యాఖ్యానించారు.

ఈ ఆరోపణలు పౌరుల సహజ హక్కులైన రైట్ టూ ప్రైవసీ , వాక్స్వాతంత్య్రం పై తీవ్రమైన ప్రభావం చూపిస్తాయని అన్నారు.

అయితే, భారత ప్రభుత్వం కూడా పెగాసస్ స్పైవేర్ కొనుగోలు చేయలేదని చెబుతూ వస్తోంది.

పెగాసస్ అంశాన్ని పక్కన పెడితే, ప్రభుత్వం ఏయే సందర్భాల్లో ప్రజల హక్కుల పై నిబంధనలు విధించగలదు?

రాజ్యాంగం ప్రజలందరికీ సమానత్వ హక్కు, స్వేచ్ఛగా జీవించే హక్కు, సాంస్కృతిక, విద్యా హక్కు లాంటి ప్రాధమిక హక్కులను కల్పిస్తోంది. వీటిని ఉల్లంఘించడం చట్ట వ్యతిరేకమవుతుంది.

"అయితే, జాతీయ భద్రతకు భంగం వాటిల్లినప్పుడు, ప్రజా జీవనం అస్తవ్యస్థం అయినప్పుడు, నేరాలను ప్రేరేపితం చేసే విధంగా ప్రవర్తిస్తున్నప్పుడు, పౌరుల హక్కుల పై నిబంధనలను విధించే హక్కు ప్రభుత్వానికుంటుందని హైదరాబాద్ మహీంద్ర లా కాలేజీ ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ చెప్పారు. ఆయన కేంద్ర సమాచార కమిషనర్‌గా పని చేశారు.

ప్రభుత్వం వాస్తవానికి జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లుతున్న పరిస్థితుల్లోనే వివిధ వర్గాలకు చెందిన వ్యక్తుల పై నిఘా పెడుతోందా అనేది ఒక పెద్ద ప్రశ్న అని శ్రీధర్ అన్నారు.

వాట్సాప్ ద్వారా భారత జర్నలిస్టులు, మానవ హక్కుల కార్యకర్లపై నిఘా

ఫొటో సోర్స్, Getty Images

ఫోన్ ట్యాపింగ్ చేయవచ్చా?

ఒక వ్యక్తి చట్టానికి లోబడి మినహా తన జీవితాన్ని లేదా తన స్వేచ్ఛను కోల్పోకూడదని రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 చెబుతోంది.

టెలిఫోన్ ట్యాప్ చేయడం వ్యక్తుల ప్రైవసీ హక్కుతో పాటు వాక్ స్వాతంత్ర హక్కును కూడా కాలరాస్తుంది. వ్యక్తుల వాక్ స్వాతంత్రానికి భంగం వాటిల్లినప్పుడు అది చట్ట వ్యతిరేక చర్య కిందకు వస్తుంది.

అయితే, టెలిగ్రాఫిక్ చట్టం 1885లోని సెక్షన్ 5 (2) కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు టెలిఫోన్ ట్యాపింగ్ చేసే అధికారాన్ని కల్పిస్తోంది.

మాడభూషి శ్రీధర్

ఫొటో సోర్స్, Facebook/Madabhushi Sridhar

ఫొటో క్యాప్షన్, మాడభూషి శ్రీధర్

ఎవరి ఫోన్లను ట్యాప్ చేయవచ్చు?

నేరస్థులు, అనుమానితుల కదలికలు, చర్యల పై నిఘా పెట్టేందుకు సదరు వ్యక్తుల ఫోన్ సంభాషణలను రికార్డ్ చేయవలసిన అవసరం పరిశోధన సంస్థలకుంటుంది.

అలా చేయవలసి వచ్చిన సందర్భంలో పరిశోధన సంస్థలు హోమ్ మంత్రిత్వ శాఖ నుంచి అనుమతులు తీసుకోవలసి ఉంటుందని శ్రీధర్ చెప్పారు.

ఆ దరఖాస్తులో ఫోన్ ట్యాప్ చేయడానికి గల కారణాలను కూడా పొందుపరచాలి. పొందుపరిచినా కారణాలు నిరూపించే విధంగా ఉండాలి.

ఆ దరఖాస్తులో పొందుపరిచిన వివరాలను పరిశీలించి సంబంధిత రాష్ట్ర హోమ్ శాఖ కార్యదర్శి తగిన అనుమతులు జారీ చేస్తారు.

అధికారికంగా రాజకీయ నాయకుల టెలిఫోన్లను ట్యాప్ చేయకూడదు. నిఘా పెట్టిన వ్యక్తి ప్రజలతో ఎన్నికైన అభ్యర్థి కాదని కూడా దరఖాస్తులో చెప్పాల్సి ఉంటుంది.

"ఈ నియమాలను ప్రభుత్వాలు, సదరు పరిశోధన సంస్థలు పాటిస్తున్నాయా అనేది పెద్ద ప్రశ్న" అని శ్రీధర్ అన్నారు.

"జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశమున్నందున చాలా మంది పౌర హక్కుల నేతలను అరెస్టు చేసినట్లు చెబుతున్నప్పటికీ, అదెటువంటి ముప్పు అనేది మాత్రం ఎవరూ వివరణ ఇవ్వలేకపోతున్నారు" అని శ్రీధర్ అన్నారు.

"పెగాసస్ వ్యవహారాన్ని పరిశీలిస్తే అది వ్యక్తుల ప్రైవసీ హక్కుకు భంగం కలిగిస్తోందని స్పష్టమవుతోంది" అని అన్నారు.

"రాజకీయ నిఘా పెట్టడం ప్రతిపక్షాన్ని, ఇతర రాజకీయ పార్టీలను పూర్తిగా నాశనం చేసేందుకు వాడటం లాంటిది. ఇది పూర్తిగా హక్కులను దుర్వినియోగం చేస్తున్నట్లే" అని అభిప్రాయపడ్డారు.

సజయ

ఫొటో సోర్స్, SAJAYA

ఫొటో క్యాప్షన్, సజయ

చట్ట వ్యతిరేకంగా నిఘా పెడుతున్న సందర్భాలు కూడా ఉన్నాయా?

"పౌరుల ప్రాధమిక హక్కులైన వ్యక్తిగత స్వేచ్ఛ, భావ స్వాతంత్య్రం హరించడం ప్రభుత్వాలు చేయకూడని పని. కానీ డిజిటల్ యుగంలో ఆ గీత చెరిగిపోతోంది" అని హైదరాబాద్‌కు చెందిన సామాజిక కార్యకర్త సజయ అభిప్రాయపడ్డారు.

"నేరాలు జరిగినప్పుడు నిఘా పెట్టడం సహేతుకమే కానీ, గొంతు వినిపించే వారి పైన, సామాజిక కార్యకర్తలు, విద్యావేత్తలు, రచయతలు, అధ్యయనకారులు, పత్రికా ప్రతినిధుల పై నిఘా పెట్టడం ప్రమాద సంకేతం" అని అన్నారు.

"టెక్నాలజీ రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది. దానిని విచక్షణతో ఉపయోగించాలి.ఇదొక విధంగా గొంతును వినిపించేవారిని, అభిప్రాయాలను వ్యక్తపరిచేవారిని బెదిరించడమే".

"ప్రభుత్వాలు, అధికారమున్న వారు వ్యక్తిగత స్వేచ్ఛ అనే పరిధిలోకి కూడా అడుగుపెట్టడం మాత్రం సహించలేనిది. ఇలాంటి స్పై వేర్ లు విచ్చలవిడిగా వదిలేస్తే, మహిళలకు, పిల్లలకు ముప్పుగా పరిణమించే ప్రమాదముంది" అని సజయ అభిప్రాయపడ్డారు. రోజురోజుకీ పెరుగుతున్న గృహహింస కేసులను ఇందుకు ఉదాహరణగా పేర్కొన్నారు.

పెగాసస్ ప్రాజెక్ట్

ఫోన్ డేటా సేకరించడం ఎంత సులభం?

పోలీసులు సులభంగా వారికున్న ప్రైమరీ రేట్ ఇంటర్ ఫేస్ (పిఆర్‌ఐ) లైన్ ద్వారా ఫోన్ సంభాషణలను ట్యాప్ చేసి రికార్డింగ్ సంపాదించవచ్చు.

సైబర్ క్రైం నేరాలు చోటు చేసుకున్నప్పుడు ఫోన్ డేటా వివరాలను సేకరించే టెక్నాలజీ పోలీసులకు అందుబాటులో ఉంటుందని ఒక సీనియర్ పోలీసు అధికారి బీబీసీతో చెప్పారు.

ప్రైవసీకి భంగం కలిగినప్పుడు ఏమి చేయాలి?

వ్యక్తుల ప్రైవసీకి భంగం కలిగిందని భావించినప్పుడు:

పోలీస్ స్టేషన్‌లో లేదా మానవ హక్కుల కమీషన్‌లో ఫిర్యాదు నమోదు చేయవచ్చు.

లేదా బాధితులు కోర్టుకు వెళ్ళవచ్చు.

నేరం నిరూపితమైతే, 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుంది.

"ప్రభుత్వం వ్యక్తుల స్వేచ్ఛలోకి తొంగి చూడటం మాత్రం సహేతుకం కాదు. ఇదే జరిగితే ప్రైవసీ అనే హక్కుకి పూర్తిగా అర్ధం కోల్పోయినట్లే. ఇలాంటి టెక్నాలజీని నేరాలను నిర్మూలించేందుకు, నేరస్థులను పట్టుకునేందుకు వాడాలి కానీ, సాధారణ పౌరులను కాదు. ఇది కొనసాగితే, గొంతెత్తే వారంతా భయపడే పరిస్థితి ఏర్పడుతుంది" అని సజయ అన్నారు.

రాజ్యాంగం ప్రజల సహజ హక్కు ప్రైవసీకి రక్షణ కల్పిస్తోందని 2017లో జస్టిస్ కేఎస్ పుత్తుస్వామి కేంద్ర ప్రభుత్వానికి మధ్య జరిగిన కేసులో 9 మంది సభ్యుల ధర్మాసనం పేర్కొంది.

"మానవ జీవితంలో ప్రతీ చిన్న అంశాన్ని సామాజికంగా నిర్దేశిస్తున్న ఇన్ఫర్‌మేషన్ యుగంలో వాక్‌స్వాతంత్రానికి కోర్టులు కొత్త అర్ధాన్ని ఇవ్వాల్సిన అవసరముంది. వ్యక్తుల సాంఘిక, ఆర్ధిక స్థాయితో సంబంధం లేకుండా ప్రైవసీని అనుభవించే హక్కును కలిగి ఉంటారు" అని జస్టిస్ చంద్రచూడ్ ఈ కేసులో వ్యాఖ్యానించారు.

పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి
Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of YouTube ముగిసింది

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)