పెట్రోల్-డీజిల్ ధరలు: కర్ణాటక బోర్డర్ వద్ద ఏపీ పెట్రోలు బంకులు ఎందుకు మూతపడుతున్నాయి?

- రచయిత, తులసీ ప్రసాద్ రెడ్డి
- హోదా, బీబీసీ కోసం
ఆంధ్రప్రదేశ్-కర్ణాటక సరిహద్దుల్లో నేషనల్ హైవే 44 మీద, ఏపీ వైపు ఉండే ఓ పెట్రోలు బంకు మూతపడి కనిపిస్తోంది. అందులో వరిగడ్డి వామి వేసి ఉంది.
ఈ పరిస్థితి ఏదో ఒక పెట్రోల్ బంకుకే పరిమితం కాదు. ఆంధ్రప్రదేశ్-కర్ణాటక సరిహద్దుల్లో ఇలాంటివి ఇంకా అనేకం ఉన్నాయి. కొనుగోలుదారులు లేక ఈ సరిహద్దుల్లో ఆంధ్రప్రదేశ్ భూభాగంలో ఉండే పెట్రోలు బంకులు మూత పడుతున్నాయి.
కర్ణాటకతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోలు, డీజిల్ ధరలు ఎక్కువగా ఉండటమే ఈ పరిస్థితి కారణమని స్పష్టమవుతోంది. వాల్యూ యాడెడ్ ట్యాక్స్(వ్యాట్) కర్ణాటకలో కన్నా ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువగా ఉండటం, దీనికి తోడు అదనపు వ్యాట్ వేయడం, రోడ్ డెవలప్‌మెంట్ సెస్ వసూలు చేయడం వల్ల ఏపీలో పెట్రోలు ధరలు అధికంగా ఉంటున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లోని సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండల కేంద్రం, కర్ణాటకలోని బాగేపల్లి తాలూకా కేంద్రం మధ్య దూరం పది కిలోమీటర్లు ఉంటుంది. ఈ ప్రాంతంలో 44వ జాతీయ రహదారిపై 14 పెట్రోలు బంకుల వరకు ఉన్నాయి. అందులో జాతీయ రహదారిపై ఆంధ్రప్రదేశ్ వైపు ఉన్న ఏడు పెట్రోల్ బంకులు మూత పడ్డాయి.
గత మూడు సంవత్సరాల కాలంలో ఒకదాని తర్వాత ఒకటి ఇవి మూతపడ్డాయని సరిహద్దులో ఏపీ భూభాగంలోని ఒక పెట్రోలు బంకు యజమాని రంగారెడ్డి బీబీసీతో చెప్పారు.
మే 12 నాటి వివరాల ప్రకారం- సరిహద్దులో ఆంధ్రప్రదేశ్‌లోని పెట్రోలు బంకులో లీటరు పెట్రోల్ ధర 121.99గా, లీటరు డీజిల్ ధర 107.52గా ఉంది. అదే కర్ణాటకలోని బాగేపల్లిలో లీటరు పెట్రోల్ ధర రూ.111.56గా, లీటరు డీజిల్ ధర రూ.95.21గా ఉంది. అంటే కర్ణాటక బంకులో కన్నా ఏపీ బంకులో పెట్రోలు ధర సుమారు రూ.10, డీజిల్ ధర సుమారు రూ.12 ఎక్కువగా ఉన్నాయి.

అంటే, కర్ణాటకలో 10 లీటర్ల డీజిల్ కొనుక్కుంటే దాదాపు రూ.120 ఆదా అవుతుంది. దీంతో చాలామంది కొనుగోలుదారులు కర్ణాటక బంకుల వైపు మొగ్గు చూపుతున్నారు.
జాతీయ రహదారిపై వచ్చిపోయే వాహనాల వాళ్లు, ఆంధ్రప్రదేశ్ వైపు ఉండే బంకుల్లో కాకుండా కర్ణాటక వైపు ఉండే బంకుల్లో ఎక్కువగా పెట్రోలు, డీజిల్ కొట్టిస్తున్నారు.
''ఆంధ్రకు కర్ణాటకకి డీజిల్లో పన్నెండు రూపాయలు తేడా ఉంది. వీక్లీ బెంగళూరు వెళుతూ ఉంటా. అందుకని ఇక్కడ ఫుల్ ట్యాంక్ చేయించుకొని వెళ్తున్నా" అని బాగేపల్లిలో డీజిల్ కొట్టించడానికి వచ్చిన పెనుగొండ వాసి హరీశ్ బీబీసీకి చెప్పారు.
సరిహద్దు ప్రాంతంలోని చాలామంది ఏపీ రైతులు కూడా కర్ణాటకకు వెళ్లి క్యాన్లలో ఇంధనం తెచ్చుకొంటున్నారు.
''మాది అనంతపురం జిల్లా గోరంట్ల మండలం పాపిరెడ్డిపల్లి. ఇక్కడికి 18 కిలోమీటర్లు దూరంలో మా ఊరు ఉంది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడికి వచ్చి డీజిల్ పట్టుకొని వెళ్తున్నాను. 50 లీటర్లు పట్టుకుంటే నాకు 600 రూపాయల వరకు మిగులుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో రేట్లు ఎక్కువగా ఉన్నాయి. వ్యవసాయ అవసరాల కోసం డీజిల్ క్యాన్‌లో పట్టుకొని వెళ్తున్నా. మా దగ్గర (ఏపీలో) 107 రూపాయలు ఉంది. ఇక్కడ(కర్ణాటకలో) 95 రూపాయలు ఉంది. కారులో లేదా వేరే వాహనాల్లో వస్తే టోల్ కట్టాలి. బైకుపై వస్తే టోల్ ఉండదు. అందుకని నేను బైక్‌పై వచ్చి తీసుకెళ్తున్నా" అని బాగేపల్లిలో డీజిల్ కొనుక్కెళ్లడానికి వచ్చిన శ్రీనివాస్ రెడ్డి బీబీసీతో చెప్పారు.

అధిక ధరల వల్ల కొనుగోలుదారులు లేక ఆంధ్రప్రదేశ్ పెట్రోలు బంకులు మూతపడటమో, వెలవెలపోవడమో జరుగుతుంటే, కర్ణాటక పెట్రోల్ బంకులు మాత్రం రద్దీగా కనిపిస్తున్నాయి. కొన్ని కర్ణాటక బంకుల్లో వచ్చిన డీజిల్ వెంటనే అయిపోవడంతో కొరత కూడా ఏర్పడుతుంటుంది.
వ్యాపారం లేకపోవడంతో తన ఇంధన కేంద్రాన్ని మూసివేసినట్లు కొడికొండ చెక్ పోస్టు దగ్గరున్న పెట్రోల్ బంక్ యజమాని రామకృష్ణ బీబీసీతో చెప్పారు.
వ్యాపారం తగ్గిపోయినా ఉన్న ఉద్యోగులను వదులుకోలేక, రేట్లు తగ్గుతాయేమోననే ఆశతో పెట్రోల్ బంకును నడుపుతున్నామని మరో యజమాని రంగారెడ్డి బీబీసీకి చెప్పారు. చిలమత్తూరు మండలం మొరవ కొత్తపల్లి దగ్గర ఆయన బంకు ఉంది.
పరిస్థితి ఇలాగే ఉంటే ఎక్కువ కాలం నడపలేమని రంగారెడ్డి నిస్సహాయత వ్యక్తంచేశారు.
''డీజిల్, పెట్రోల్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకు రాకపోవడం వల్ల ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా పన్నులు వసూలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ట్యాక్సులు ఎక్కువగా వసూలు చేస్తున్నారు. అక్కడి పరిశ్రమల వాళ్లు, క్రషింగ్ మెషిన్ల వాళ్లు, వాహనదారులు కర్ణాటక వెళ్లి డీజిల్ కొనుగోలు చేస్తున్నారు'' అని రంగారెడ్డి అన్నారు.
ఆంధ్ర సరిహద్దులో జాతీయ రహదారిపై ఉన్న 7 బంకులు మూతపడితే కర్ణాటక సరిహద్దులో మరో ఆరు బంకులు కొత్తగా వచ్చాయి. ఇప్పటికే అనంతపురం జిల్లాలో కర్ణాటక సరిహద్దును పంచుకుంటున్న ప్రాంతాల్లో దాదాపు 60 బంకులు మూతపడ్డాయని, మరో 50 బంకులు కూడా మూత పడటానికి సిద్ధంగా ఉన్నాయని రంగారెడ్డి తెలిపారు.
''గతంలో 8 వేల లీటర్లు డీజిల్ అమ్మేవాళ్లు ఇప్పుడు 150 లీటర్లు మాత్రమే అమ్ముతున్నాము. అదే కర్ణాటకలో 1500 లీటర్లు అమ్మే పెట్రోల్ బంకులు ఇప్పుడు 50, 60 వేల లీటర్లు డీజిల్ అమ్ముతున్నారు" అని రంగారెడ్డి చెప్పారు.
సేల్స్ మీద ఆధారపడే పెట్రోలు బంకుల నిర్వహణ, ఆదాయం లేకపోవడంతో మూసేయాల్సి వస్తోందని, బంకులు మూతపడడంతో చాలామంది రోడ్డున పడ్డారని ఆయన తెలిపారు.

కొంత మంది కర్ణాటక బోర్డర్‌కెళ్లి పెట్రోల్ తీసుకువచ్చి తమ కంటే తక్కువకు షాపుల్లో పెట్టి విక్రయిస్తున్నారని రంగారెడ్డి తెలిపారు. పెట్రోల్ బంకు నిర్వాహకుడి కంటే కొట్టులో పెట్టుకుని అమ్మే వారికే ఆదాయం ఎక్కువగా ఉందని చెప్పారు.
ఈ సరిహద్దుల్లోని పెట్రోలు బంకుల్లో ఒక్కో బంకులో సుమారు 15 మంది వరకు పనిచేస్తారు. బంకులు మూతపడటంతో చాలా మంది ఉపాధి కోల్పోయారు. వారిలో కొంత మంది కర్ణాటక బంకుల్లో చేరారు.
ఆంధ్రాలో తాను పనిచేసే పెట్రోల్ బంకు మూత పడడంతో కర్ణాటక వైపునున్న పెట్రోల్ బంకులో పనిచేస్తున్నానని సఫీ ఉల్లా అనే ఉద్యోగి బీబీసీతో చెప్పారు.
''15 సంవత్సరాల నుంచి పెట్రోల్ బంకుల్లోనే పని చేస్తున్నాను. నాకు వేరే పని చేయడం చేతకాదు. ఆంధ్రాలో కొడికొండ చెక్‌పోస్ట్ దగ్గరున్నపెట్రోల్ బంక్ లో పని చేసే వాడిని. దాన్ని మూసేయడంతో కర్ణాటక బాగేపల్లి దగ్గర ఉన్న పెట్రోల్ బంక్ లో పని చేసుకుంటున్నాను. అక్కడ గాని పెట్రోల్ బంకులు ఓపెన్ అయితే మళ్ళీ అక్కడికి వెళ్లిపోతాను. ఆంధ్ర వాళ్లు అంతా చాలామంది ఇక్కడికి వచ్చి నైటంతా పట్టుకొని వెళ్తుంటారు'' అని సఫీఉల్లా చెప్పారు.
రాష్ట్రాల మధ్య ఇంధన వ్యత్యాసాలు మామూలేనని, అయితే ఆంధ్రా కంటే తమ దగ్గర రేటు తక్కువగా ఉండడంతో తమ వ్యాపారం పెరిగిందని బాగేపల్లికి చెందిన పెట్రోల్ బంకు యజమాని ప్రసాద్ బీబీసీతో చెప్పారు.
''రేటు మారక ముందు 25 వేల లీటర్లు వరకు సేల్స్ ఉండేది. ఇప్పుడు 35,000 లీటర్లు డీజిల్ సేల్స్ ఉంది అంటే 10 వేలు లీటర్ల వరకూ సేల్స్ పెరిగింది. ఆంధ్రాలో రేట్లు పెరగడం వల్లనే అక్కడ పెట్రోల్ బంకులు మూతబడ్డాయి. సెంట్రల్ గవర్నమెంట్ తగ్గించింది కాబట్టి ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ కూడా తగ్గించింది" అని ఆయన చెప్పారు.

అంత తేడా ఇందుకే
ఆంధ్రప్రదేశ్, కర్ణాటకకు ఇంత తేడాలు ఎందుకు అనే విషయాన్ని వివరంగా చూద్దాం.
పెట్రోలు, డీజిల్‌లపై కర్ణాటక ప్రభుత్వం వ్యాట్ మాత్రమే విధిస్తోంది. ఏపీ ప్రభుత్వం వ్యాట్ అధికంగా విధించడంతోపాటు అదనపు వ్యాట్, రోడ్డు అభివృద్ధి సెస్ కూడా వసూలు చేస్తోంది.
కర్ణాటక ప్రభుత్వం లీటరు పెట్రోల్ కి 25.92 శాతం వ్యాట్ విధిస్తే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 31 శాతం వ్యాట్ విధిస్తోంది. అదనపు వ్యాట్ 4 రూపాయలు. రోడ్డు సెస్ 1 రూపాయిని ఏపీ ప్రభుత్వం అదనంగా వసూలు చేస్తోంది.
కర్ణాటక ప్రభుత్వం లీటరు డీజిల్‌పై 14.34 శాతం వ్యాట్ వసూలు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 22.25 శాతం వ్యాట్ వేస్తోంది. దానికితోడు అదనపు వ్యాట్ 4 రూపాయలు, రోడ్డు సెస్ 1రూపాయి వసూలు చేస్తోంది.
పెట్రోలుపై పన్ను విధింపు తీరు:

మే 12 నాటి వివరాల ప్రకారం కేంద్ర ప్రభుత్వ పన్నులు, రవాణా ఛార్జీలు, కర్ణాటక ప్రభుత్వ పన్ను కలుపుకొని బాగేపల్లిలో కర్ణాటక బంకులో లీటరు పెట్రోల్ ధర.111.56గా ఉంది. కేంద్ర ప్రభుత్వ పన్నులు, రవాణా ఛార్జీలు, ఏపీ ప్రభుత్వ పన్నులు, సెస్ కలుపుకొని ఏపీ బంకులో లీటరు పెట్రోలు ధర రూ.121.99 గా ఉంది.
డీజిల్ పై పన్ను విధింపు తీరు:

మే 12 నాటి వివరాల ప్రకారం కేంద్ర ప్రభుత్వ పన్నులు, రవాణా ఛార్జీలు, కర్ణాటక ప్రభుత్వ పన్ను కలుపుకొని బాగేపల్లిలో కర్ణాటక బంకులో లీటరు డీజిల్ ధర.95.21గా ఉంది. కేంద్ర ప్రభుత్వ పన్నులు, రవాణా ఛార్జీలు, ఏపీ ప్రభుత్వ పన్నులు, సెస్ కలుపుకొని ఏపీ బంకులో లీటరు డీజిల్ ధర రూ.107.52గా ఉంది.
రవాణా చార్జీలు, ఆయిల్ కంపెనీలను బట్టి ఊరు ఊరుకూ మారుతుంటాయి కాబట్టి ఈ ధరల్లో స్వల్ప తేడాలు ఉంటాయి. పన్నులు మాత్రం రాష్ట్రమంతా ఒకే విధంగా ఉంటాయి.
ఇవి కూడా చదవండి:
- చేతనా రాజ్: ప్లాస్టిక్ సర్జరీ తర్వాత మరణించిన కన్నడ నటి, అసలేం జరిగింది?
- ఫిన్లాండ్: పుతిన్ హెచ్చరిస్తున్నా పట్టించుకోకుండా ఈ దేశం ఎందుకు నాటోలో చేరుతోంది?
- మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధిని ఔరంగాబాద్‌లో ఎందుకు నిర్మించారు?
- నరేంద్ర మోదీ 75 ఏళ్లకు రిటైర్ అవ్వరా? మూడోసారి కూడా ప్రధాని కావాలనుకుంటున్నారా?
- ఇల్లు కొనడం మంచిదా లేక అద్దెకు ఉండటం మంచిదా.. సొంతిల్లు కొనే ముందు ఇవి తెలుసుకోండి
- సంపూర్ణ చంద్రగ్రహణం: ఎందుకు, ఎలా ఏర్పడుతుంది.. ఏ ఏ దేశాల్లో కనిపిస్తుంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













