QR Code fraud: క్యూఆర్ కోడ్ మోసాలను ఎలా గుర్తించాలి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? – డిజిహబ్

- రచయిత, పూర్ణిమ తమ్మిరెడ్డి
- హోదా, బీబీసీ కోసం
వాడిన వస్తువుల అమ్మకాలు, కొనుగోళ్లు చేసే ఒక వెబ్‍సైట్‌లో పాత సోఫాను అమ్మకానికి పెట్టారు సతీశ్. సోఫా ఫోటోలు అప్‍లోడ్ చేసి, పోస్ట్ క్రియేట్ చేసిన కొద్ది క్షణాలలోనే "నేను కొంటాను" అంటూ ఒకరు పింగ్ చేశారు. ఇంకే వివరాలు అడక్కుండా, సోఫా ధర రూ. 25,000లు ట్రాన్స్‌ఫర్ చేస్తామన్నారు. సతీశ్‌ని వాట్సాప్ నంబర్ అడిగారు.
వాట్సాప్‍లోకి రాగానే "మీకో QR code పంపిస్తాను. అది స్కాన్ చేయగానే మీ డబ్బు మీకు వచ్చేస్తుంది" అని మెసేజ్ పెట్టారా వ్యక్తి. మామూలుగా అయితే, డబ్బు కట్టేటప్పుడు QR కోడ్ స్కాన్ చేస్తారని సతీశ్‌కు తెలుసు. డబ్బు అందుకోడానికి కూడా QR Code ఉంటుందా అని సతీశ్‌కు అనుమానం వచ్చింది.
"అవును. మీకు డబ్బు రావడానికే స్కాన్ చేయమంటున్నా" అని మళ్లీ నమ్మబలికేసరికి సతీశ్ స్కాన్ చేశారు.
చేయగానే "మీకు రూ.25,000 అందబోతున్నాయి" అన్న మెసేజ్ కనిపించింది. ఓటీపీ ఎంటర్ చేయమని మెసేజీ వచ్చింది.
సతీశ్‌కు ఏదో తేడా అనిపిస్తూనే ఉంది, వాళ్లు డబ్బులు కట్టడానికి తనకెందుకు ఓటీపీ వచ్చిందని సందేహపడ్డారు. అయినా బేరసారాలు లేకుండా, చెప్పిన ధరకు వస్తువు కొనేవాళ్లు ముందుకొస్తే ఎందుకు వదులుకోవడమని ఓటీపీ ఎంటర్ చేశారు.
సతీశ్‌కు డబ్బు రాలేదు. పైగా, ఆయన ఖాతాలోంచి రూ.50,000 కట్ అయ్యాయి. మోసం జరిగింది.
ప్రస్తుతం QR కోడ్‌లను అడ్డం పెట్టుకుని జరుగుతున్న అనేక స్కాముల్లో ఇదో రకం. ముఖ్యంగా కోవిడ్ కాలంలో ఆర్థిక లావాదేవీలు చాలా త్వరగా ఆన్‌లైన్‌కు మారిపోయాయి. కనీస అవగాహన పెంపొందించుకునేలోపే డిజిటల్ పేమెంట్స్ వాడక తప్పని పరిస్థితి వచ్చేసింది. దాంతో, ఇలాంటి ఎన్నో స్కాములు మొదలయ్యాయి.

ఫొటో సోర్స్, Getty Images
QR కోడ్ అంటే ఏమిటి? ఎందుకు వాడతారు?
QR కోడ్‌లో QR అంటే Quick Response అని అర్థం. దీన్ని మొదట 1994లో డెన్సో వేవ్ (Denso Wave) అనే జపాన్ ఆటోమొబైల్ కంపెనీ కనుగొంది. ఇదొక మాట్రిక్స్ బార్‍కోడ్. మెషీన్ ద్వారా ఈ కోడ్‍ని రీడ్ చేయవచ్చు.
కోడ్‍లో అవసరమైన సమాచారాన్ని ముందే పొందుపరుస్తారు, కోడ్‍ని రీడ్ చేయగానే ఆ వివరాలన్నీ మెషీన్ డిటెక్ట్ చేసి మనకి చూపిస్తుంది.
వస్తువులను గుర్తించడం లేదా ట్రాక్ చేయడం, ఇతర వివరాల కోసం వాటి వెబ్‌సైట్‌కు మళ్లించడం మొదలైనవాటికి QR Code వాడుతుంటారు. ఉదాహరణకు ఒక కారు మీదున్న కోడ్ స్కాన్ చేయగానే కారు పనితనానికి సంబంధించిన అన్ని విషయాలు కనిపిస్తాయి లేదా కారు మాన్యుఫాక్చరింగ్‌లో ఏయే దశలు దాటిందో తెలుసుకోవచ్చు. లేదా ఆ QR కోడ్, కారు వెబ్‌సైట్‌కు తీసుకెళ్లవచ్చు.
QR కోడ్‌ను ఆటోమొబైల్ ఇండస్ట్రీ నుంచి తక్కిన అన్ని ఇండస్ట్రీలు వేగంగానే అందిపుచ్చుకున్నాయి. అందుకు ముఖ్య కారణం వీటి వాడకంలో ఉన్న వెసులుబాటు.
UPC బార్‍కోడ్ కన్నా (లావు, సన్నని నిలువు గీతలతో ఉండే కోడ్) వీటిని త్వరగా రీడ్ చేయవచ్చు. పైగా ఎక్కువ సమాచారాన్ని కూడా స్టోర్ చేసుకోగలవు. జపాన్‍లో అయితే సమాధుల మీద కూడా ఈ QR కోడ్‌లను ప్రవేశపెట్టారు. వాటిని స్కాన్ చేయగానే మరణించిన వ్యక్తిపై రాసిన సంతాప సందేశాలన్నీ మొబైల్‍లో కనిపిస్తాయి.
QR కోడ్‍లతో పేమెంట్
QR కోడ్‌లో బాంక్ అకౌంట్ వివరాలతో పాటు క్రెడిట్ కార్డ్ వివరాలనూ పొందుపరచవచ్చు. లేదా ఏదో ఒక పేమెంట్ ప్రొవైడర్‌తో పనిచేసేలా డిజైన్ చేయవచ్చు.
సాధారణంగా ఎవరికైనా డబ్బులు పంపించాలంటే వాళ్ల అకౌంట్ వివరాలు తెలుసుకుని, అకౌంట్ యాడ్ చేసుకుని అప్పుడు పంపుతాం. అదే ఆ అకౌంట్‍కి QR కోడ్ ఉంటే, దాన్ని స్కాన్ చేయగానే బ్యాంకు అకౌంట్ వివరాలు వచ్చేస్తాయి. వెంటనే డబ్బు పంపించవచ్చు.
డిజిటల్ లిటరసీ (టెక్నాలజీ వాడకంలో అవగాహన) తక్కువగా ఉన్న దేశాల్లో ఇది చాలా సౌకర్యవంతం. డిజిటల్ పేమెంట్ యాప్స్‌లో ఈ కోడ్ల వినియోగం లేకపోయుంటే అన్ని వర్గాల వారికీ ఈ యాప్స్ అంత దగ్గరయ్యుండేవి కాదన్నది ఒక వాదన.
2021 సెప్టంబర్ నాటికి భారత్‌లో QR, UPI రెండూ దాదాపుగా 100% పెరుగుదలని చూశాయని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఒక కథనాన్ని ప్రచురించింది.
వినియోగదారులకే కాకుండా వ్యాపారస్తులకు ముఖ్యంగా చిరువర్తకులకు QR కోడ్ వాడుకోవడం లాభదాయకం. కోడ్ వచ్చాక ప్రింటవుట్ తీసుకుని దుకాణం ముందు అంటించుకోవడమే. అలా కాకుండా, కార్డులని రీడ్ చేసే POS మెషీన్ కొనాలంటే రూ. 12,000 లేదా మొబైల్ POS కొనాలంటే రూ. 5000 ఖర్చుపెట్టాల్సి వస్తుంది.
పోను పోను, బిల్లుల మీదే క్యూఆర్ కోడ్‌లు ముద్రించవచ్చు. ఆ బిల్లు కట్టాల్సిన యాప్/వెబ్సైట్, అకౌంట్ వివరాలు, కట్టాల్సిన డబ్బు ఇవేవీ గుర్తుంచుకోనవసరం లేకుండా స్కాన్ చేసి డబ్బులు కట్టే వెసులుబాటు కూడా రావచ్చు.

QRకోడ్ పేమెంట్లతో ఇక్కట్లు
సౌలభ్యం ఉన్న చోటే ఏమరపాటు వల్ల పొరపాట్లకు, మోసాలకు కూడా అవకాశం ఉంటుంది. క్యూఆర్ కోడ్‍ను అడ్డం పెట్టుకుని అనేక సైబర్ మోసాలు జరుగుతున్నాయి.
మొదట్లో చెప్పుకున్నట్టు, సతీశ్‌కు జరిగిన మోసం లాంటివి జరుగుతున్నాయి.
ఇక్కడ రెండు విషయాలు గుర్తుంచుకోవాలి.
- మీ ఖాతాలోకి డబ్బు రావాల్సి ఉంటే, QR స్కాన్ చేయాల్సిన అవసరం ఉండదు. మనం ఎవరికైనా పంపించాలంటేనే QR కోడ్ స్కాన్ చేయాల్సి ఉంటుంది.
- మీ ఖాతాలోకి డబ్బు రావాల్సి ఉన్నప్పుడు మీరు ఓటీపీ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. మీ ఖాతాలోంచి డబ్బు బయటకు వెళ్లడానికి మాత్రమే ఓటీపీ అవసర పడుతుంది.
ఈ రెండూ గుర్తుంచుకుంటే ఇలాంటి మోసాల బారిన పడకుండా ఉంటాం.
తెలియని వారి దగ్గర నుంచి వచ్చిన లింక్స్ క్లిక్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సి వచ్చినట్టే, క్యూఆర్ కోడ్స్ స్కాన్ చేసే ముందు ఎక్కడిది, ఎవరిది అన్నది ఒకసారి తరచి చూసుకోవాలి. లేకపోతే, క్యూఆర్ కోడ్స్‌ను వాడి మాల్‍వేర్‍ను ఇన్‍స్టాల్ చేయవచ్చు, లేదా బాంకింగ్ యాప్స్ పాస్‍వర్డ్స్ కాజేయచ్చు. అందుకని ఏం స్కాన్ చేస్తున్నామన్న విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
ఇంకో రకమైన మోసాలు చిరువ్యాపారులను దృష్టిలో ఉంచుకుని చేస్తున్నారు. మామూలుగా దుకాణాల బయట గోడలకు క్యూఆర్ కోడ్ ప్రింటవుట్లు తీసిపెడుతుంటారు. దూరం నుంచే కస్టమర్లు స్కాన్ చేసేందుకు వీలుగా ఇలా పెడతారు. కోవిడ్ సమయంలో భౌతిక దూరం పాటించాల్సి రావడంతో, ఇలా చేయడం తప్పనిసరైపోయింది.
కొందరు దుండగలు దీన్ని అవకాశంగా తీసుకుని క్యూఆర్ కోడ్‌లకు చిన్న చిన్న మార్పులు చేసి, చూడగానే గుర్తించలేనంత చిన్న మార్పులు చేసి కొత్త అకౌంట్లు తెరుస్తున్నారు. వాటిని గోడలకు అతికిస్తారు.
దాంతో, కొనుగోలుదారులు వేసిన డబ్బు దుకాణదారుకు చేరదు. వ్యాపారులు, కొనుగోలుదారులు కూడా నష్టపోతున్నారు.
అందుకని క్యూఆర్ కోడ్‌లు స్కాన్ చేసే ముందు ఒకటికిరెండుసార్లు సరిచూసుకోవాలి.

ఫొటో సోర్స్, Getty Images
క్యూఆర్ కోడ్‌తో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
క్యూఆర్ కోడ్స్ చాలావరకు మన జీవితంలో భాగమైపోయాయి. వాటిపై అవగాహన పెంచుకుంటూ, జాగ్రత్తగా వాడుకోవాలి.
- అవకాశం ఉన్నప్పుడల్లా, క్యూఆర్ కోడ్ స్కాన్ చేశాక, అవతల పార్టీకి వివరాలు చూపించి వాళ్లు కన్ఫర్మ్ చేశాకే పేమెంట్ చేయడం ఉత్తమం. దీని వల్ల స్కానర్లలో గానీ, వాళ్ల కోడ్‍లో గానీ తేడాలుంటే వెంటనే తెలిసిపోతుంది.
- డబ్బులు కట్ అయ్యాక వాళ్ళకి వచ్చాయో లేదో కనుక్కోవాలి. దీనివల్ల ఏదైనా పొరపాటు జరిగితే సరిచేసుకునే అవకాశాలు ఉంటాయి.
- పొరపాటున డబ్బులు కట్ అయినా లేక చేరాల్సిన అకౌంట్‍కి డబ్బులు చేరకపోయినా, వెంటనే సంబంధిత యాప్, బ్యాంకులను సంప్రదిస్తే జరిగిన నష్టాలను కొంత వరకు నివారించవచ్చు.
- క్యూఆర్ కోడ్ అనే కాదు, ఏ డిజిటల్ పేమెంట్ విషయంలోనైనా వీలైనంత వరకూ హడావిడి పడకుండా, కావాల్సినంత సమయం తీసుకుని సొమ్ము బదిలీ చేయాలి.
- అవతల పార్టీ అనవసరంగా కంగారు పెడుతున్నా, స్కాన్ చేశాక వచ్చిన వివరాల్లో ఏదైనా తేడా కనిపించినా వాటిని ప్రమాద సూచికలుగా భావించి వెనక్కి తగ్గితే మంచిది.
- మామూలుగా పేమెంట్ యాప్స్ క్యూఆర్ కోడ్ స్కానర్‍తో వస్తుంటాయి. ఇవి కాకుండా, క్యూఆర్ కోడ్స్ స్కాన్ చేయడానికి కొన్ని ప్రత్యేకమైన యాప్స్ ఉంటాయి. వాటిని డౌన్లోడ్ చేసుకునే ముందు యాప్ రేటింగ్, రివ్యూలు చదువుకుని, సరి అనిపిస్తేనే డౌన్లోడ్ చేసుకోవడం ఉత్తమం. లేదంటే, ఈ యాప్స్ వల్ల ఇబ్బందులు తలెత్తవచ్చు.
ఎంతటి జిత్తులమారి హంతకుడైనా ఏదో ఒక క్లూ వదిలేస్తాడని అంటారు. అలానే ఎంత అనుభవం ఉన్న సైబర్ నేరగాళ్లయినా మన అజాగ్రత్తనే పెట్టుబడిగా మార్చుకుంటుంటారు. మనం అవగాహనతో మసలుకుంటే సౌలభ్యానికి సౌలభ్యం, భద్రతకు భద్రత.
(సాంకేతిక విషయాలను సులభంగా వివరించడానికి రాసిన కథనం ఇది. ఇందులోని పాత్రలు, నేపథ్యం కల్పితం. నిజమైన వ్యక్తులతో, జీవించి ఉన్న లేదా చనిపోయిన ఎవరితోనైనా ఏదైనా సారూప్యం ఉన్నట్లయితే అది పూర్తిగా యాదృచ్ఛికం)
ఇవి కూడా చదవండి:
- హైదరాబాద్‌లో మరో దారుణం: కులాంతర వివాహం చేసుకున్న యువకుడిని నడి బజారులో నరికి చంపేశారు
- ఎప్పటిలాగే అడవికెళ్లి పుట్టగొడుగులు తెచ్చుకుని తిన్నారు, కానీ అర్ధరాత్రి దాటిన తర్వాత..
- ‘నా దగ్గర వేరే దారి లేదు, నేనెలాగూ చనిపోతా’ - సోనియాతో రాజీవ్ గాంధీ
- ఎలాన్ మస్క్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. ఇంతకీ ఏం జరిగింది
- భూకంపాలు, సునామీలను ఇంటర్నెట్ కేబుళ్లు ఎలా గుర్తిస్తాయంటే....
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














