భూకంపాలు, సునామీలను ఇంటర్నెట్ కేబుళ్లు ఎలా గుర్తిస్తాయంటే....

2017లో అమెరికా, స్పెయిన్ మధ్య ఆప్టికల్ పైబర్ పనులు జరుగుతున్న దృశ్యం

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, 2017లో అమెరికా, స్పెయిన్ మధ్య ఆప్టికల్ ఫైబర్ పనులు జరుగుతున్న దృశ్యం
    • రచయిత, క్రిస్ వాలన్స్
    • హోదా, టెక్నాలజీ రిపోర్టర్

"సముద్రం అడుగు భాగంలో ఉండే ఇంటర్నెట్ కేబుళ్లను భూకంపాలు, సునామీలను గుర్తించడానికి ఉపయోగించవచ్చు. వాతావరణ మార్పుల వల్ల సముద్రాల్లో వచ్చే మార్పులను పర్యవేక్షించవచ్చు"

ఈ టెలికామ్ కేబుళ్లను లోతైన సముద్రంలో సైంటిఫిక్ సెన్సార్లలాగా ఉపయోగించవచ్చని యూకేకు చెందిన నేషనల్ ఫిజికల్ లాబోరేటరీ (ఎన్‌పీఎల్) చెప్పింది.

యూకే, కెనడా మధ్య ఆప్టికల్ ఫైబర్ లింక్‌పై శాస్త్రవేత్తలు ఈ సాంకేతికతను పరీక్షించారు. సైన్స్ మ్యాగజీన్‌లో ఈ పరిశోధనను ప్రచురించారు.

సముద్రపు అట్టడుగు భాగాన్ని పర్యవేక్షించడానికి శాశ్వతంగా ఉండే సెన్సార్లను అమర్చడం చాలా ఖర్చుతో కూడుకున్నపని అని శాస్త్రవేత్తలు అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటివి కొన్ని మాత్రమే ఉన్నాయని చెప్పారు.

''భూమి ఉపరితలంపై 70 శాతం నీరు ఉంది. కానీ, భూకంప కేంద్రాలన్నీ భూమిపైనే ఉన్నాయి. సముద్రపు అడుగు భాగంలో శాశ్వత సెన్సార్లను ఏర్పాటు చేయడం చాలా కష్టంతో కూడిన ఖరీదైన పని'' అని ఎన్‌పీఎల్‌కు చెందిన డాక్టర్ జియుసెపె మరా బీబీసీతో అన్నారు.

ప్రపంచంలోని సముద్రాలు, మహాసముద్రాల నుంచి డేటాను మోసుకెళ్లే ఆప్టికల్ ఫైబర్ కేబుళ్లు అసంఖ్యాకంగా ఉన్నాయి.

ఆప్టికల్ పైబర్ కేబుళ్లు

ఫొటో సోర్స్, TELEGEOGRAPHY

ప్రపంచవ్యాప్తంగా ఇలాంటివి 430కి పైగా ఉన్నాయని, ఇవి 13 లక్షల కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయని అంచనా.

డాక్టర్ మరా ప్రకారం... ప్రకంపనలు, ఒత్తిడి, ఉష్ణోగ్రతల్లో మార్పులు చాలా స్వల్ప పరిమాణంలో ప్రభావం చూపుతాయి. కేబుల్ గుండా ప్రయాణిస్తున్నప్పుడు కాంతి వేగాన్ని చాలా సున్నితమైన పరికరాలు కూడా గుర్తించగలవు.

సౌత్‌పోర్ట్, లాంకషైర్, హాలిఫాక్స్, కెనడాల మధ్య 5,860 కి.మీ ఈఎక్స్‌ఏ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఆప్టికల్ ఫైబర్ లింక్‌ను ఉపయోగించి భూకంపాలు, సముద్ర సంకేతాలను గుర్తించినట్లు పరిశోధకులు చెప్పారు.

రిపీటర్ల మధ్య కేబుల్‌లను ప్రత్యేక సెన్సర్లుగా శాస్త్రవేత్తలు ఉపయోగించగలిగారు. సిగ్నల్‌ నాణ్యతను పెంచే పరికరాలను రిపీటర్లు అంటారు.

''ఒకవేళ ఈ సాంకేతికతను పెద్దసంఖ్యలోని కేబుళ్లకు వర్తింపజేస్తే నీటిఅడుగులోని మౌలిక సదుపాయాలను భూకంపాలు, సముద్ర ప్రవాహాలు వంటి వాటిని గుర్తించే డిటెక్టర్లుగా మార్చగలం'' అని డాక్టర్ మరా చెప్పారు.

వీడియో క్యాప్షన్, విశాఖపట్నం: తవ్వోడ అంటే ఏంటి? దీనికి ఆ పేరు ఎలా వచ్చింది?

''భూకంప కేంద్రాల నెట్‌వర్క్‌ను భూమి నుంచి సముద్రం అడుగుభాగం వరకు విస్తరిస్తే భూమి అంతర్గత నిర్మాణం, దాని గతి ప్రవర్తనపై మన అవగాహన మెరుగుపడుతుంది'' అని ఆయన వివరించారు.

భూకంపానికి చెందిన అధికేంద్ర ప్రాంతాన్ని భూమ్మీది సెస్మోమీటర్ల తరహాలోనే కేబుల్ సెన్సర్లు కూడా పసిగట్టగలవని పరిశోధకులు సూచిస్తున్నారు.

గ్లోబల్ వార్మింగ్ కారణంగా సముద్రాల్లో వచ్చే మార్పులను పర్యవేక్షించడానికి కూడా ఈ సాంకేతికత ఉపయోగపడుతుంది.

సముద్ర అడుగు భాగాల్లో ఉష్ణోగ్రతలను వాతావరణ మార్పులు ఎలా ప్రభావితం చేస్తాయో పర్యవేక్షించడానికి కూడా ఈ కేబుల్ సాంకేతికత ఉపయోగపడుతుందని అనుకుంటున్నారు. ఈ దిశగా ఇంకా పరీక్షలు జరగలేదు.

టెక్నాలజీ దిగ్గజం గూగుల్ ఈ పరిశోధనలో పాల్గొంది. గూగుల్‌తో పాటు యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్‌బర్గ్, బ్రిటిష్ జియోలాజికల్ సర్వే, ఇటలీలోని ఇన్‌స్టిట్యూట్ నజియోనాలె డి రిసెర్కా మెట్రోలాజికా ఈ పరిశోధనలో పాల్గొన్నాయి.

''భూమి ఉపరితలం మీదున్న విస్తారమైన ప్రాంతాలను కొలిచే సామర్థ్యాన్ని ఈ పరిశోధన శాస్త్రవేత్తలకు అందిస్తుంది. సంప్రదాయ సాంకేతిక పద్ధతుల ద్వారా ఇలా చేయడం చాలా కష్టమైన పని'' అని బ్రిటిష్ జియోలాజికల్ సర్వే ఎర్త్ సెస్మోలజీ హెడ్ బ్రియాన్ బాప్టీ అన్నారు.

''సముద్రాల మధ్యలో సంభవించే భూకంపాలను అతి సమీపం నుంచి గమనించడానికి ఇది అద్భుతమైన అవకాశం. అలాగే భవిష్యత్‌లో అగ్నిపర్వత విస్పోటనాలు, సునామీ వంటి వాటిని కూడా ఈ సాంకేతికత ద్వారా పరిశీలించవచ్చు'' అని ఆయన చెప్పారు.

వీడియో క్యాప్షన్, ఇవి ప్రపంచంలోనే అత్యంత పొడవైన పగడపు దిబ్బలు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)