సినిమా రివ్యూ: ‘జోసెఫ్‌’ని కాపీ, పేస్ట్ చేసిన‌ ‘శేఖర్‌’

శేఖర్ సినిమా రివ్యూ

ఫొటో సోర్స్, ActorRajasekhar/twitter

ఫొటో క్యాప్షన్, వయసుకు తగ్గ పాత్రలో రాజశేఖర్ హుందాగా కనిపించారు
    • రచయిత, సాహితి
    • హోదా, బీబీసీ కోసం

రీమేక్ చేయ‌డం త‌ప్పు కాదు. ఓ భాష‌లో విజ‌య‌వంత‌మైన క‌థని, మ‌రో భాష‌లో ప‌రిచయం చేయ‌డం తెలివైన ప‌నే. సేఫ్ గేమ్ కూడా. ఎందుకంటే..ఓచోట బాగా ఆడిందంటే.. క‌చ్చితంగా క‌థ విష‌యంలో త‌ప్పు జ‌రిగి ఉండ‌దు.

అయితే, ఆ క‌థ‌ని నేటివిటీకి త‌గ్గ‌ట్టుగా ఎంత బాగా తీర్చిదిద్దారు, మార్పులు - చేర్పుల‌లో ఎంత నైపుణ్యం చూపించారు అనేదానిపై.. రీమేక్ చిత్రాల భ‌విత‌వ్యం ఆధార‌ప‌డి ఉంటుంది.

రాజ‌శేఖ‌ర్‌కు రీమేకులు కొత్త కాదు. ఆ విష‌యంలో ఆయ‌న ఆరితేరిపోయారు. ఆయన కెరీర్‌లో రీమేక్ చిత్రాల వాటా ఎక్కువ‌. ఈసారి ఆయ‌న దృష్టి `జోసెఫ్‌`పై ప‌డింది. 2018లో మ‌ల‌యాళంలో వ‌చ్చి, సక్సెస్ అయిన సినిమా అది. క్రైమ్‌,ఇన్వెస్టిగేష‌న్‌, ఎమోష‌న్‌....ఇవ‌న్నీ బాగా మిక్స్ అయిన క‌థ‌. అందుకే రాజ‌శేఖ‌ర్ ఈ సినిమాని `శేఖ‌ర్‌`గా తీసుకొచ్చారు.

ద‌ర్శక‌త్వ బాధ్యత‌ల్ని త‌న అర్థాంగి జీవిత‌కు అప్పగించారు. క‌రోనా స‌మ‌యంలో ఎన్నో ఒడుదొడుకుల‌కు లోనై, విడుద‌ల వాయిదా ప‌డుతూ వ‌చ్చిన ఈ సినిమా ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వ‌చ్చింది. జోసెఫ్‌ని ఎంత బాగా అర్థం చేసుకొని, శేఖ‌ర్‌గా మ‌లిచారు? తెలుగులో కొత్త కోణాలేమైనా ఉన్నాయా, లేవా? అనే విష‌యాలు ఇంకాస్త వివరంగా తెలుసుకొంటే..

వీడియో క్యాప్షన్, కేజీఎఫ్ అసలు కథ తెలుసా?

రిటైర్డ్ కానిస్టేబుల్ కథ

శేఖ‌ర్ (రాజ‌శేఖ‌ర్‌)వాలంటరీ రిటైర్‌మెంట్ తీసుకొన్న కానిస్టేబుల్‌. నిజాయ‌తీ ప‌రుడు. చాలా తెలివిగా కేసుల్ని ఛేధిస్తుంటాడు. అందుకే ఆయన రిటైర్ అయినా, పోలీస్ డిపార్ట్ మెంట్ ఆయన సేవ‌ల్ని వాడుకుంటూ ఉంటుంది. శేఖ‌ర్‌ది ఓ విషాద గాథ‌. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన మ‌ర‌ద‌లు మ‌రొకర్ని పెళ్లి చేసుకుంటుంది.

శేఖ‌ర్ ఇందుని పెళ్లి చేసుకుంటాడు. ఓ పాప (శివాని) కూడా పుడుతుంది. జీవితం అంతా స‌వ్యంగా సాగుతోంది అనుకున్న త‌రుణంలో... త‌న మ‌ర‌ద‌లు హ‌త్యకు గుర‌వుతుంది. భ‌ర్తే ఆమెను అనుమానించి, హ‌త్య చేశాడ‌ని తెలుస్తుంది.

దానికి త‌ను కూడా ఓ కార‌ణ‌మే అనుకొని క్షోభ అనుభ‌విస్తుంటాడు. అందుకే.. ఇందుని నిర్లక్ష్యం చేయ‌డం మొద‌లుపెడతాడు. దాంతో ఇంట్లో గొడ‌వ‌లు పెరుగుతాయి. ఇద్దరూ విడిపోతారు.

కానీ పాప గీత‌ మాత్రం శేఖ‌ర్ ద‌గ్గరే ఉంటుంది. విడాకుల తంతు పూర్తయ్యాక ఇందు మ‌రొక‌ర్ని (కిశోర్‌)ని పెళ్లి చేసుకొని జీవితాన్ని మ‌ళ్లీ ప్రారంభిస్తుంది.

కొంత‌కాలం గ‌డిచాక‌ ఓ రోడ్డు ప్రమాదంలో గీత మ‌ర‌ణిస్తుంది. మ‌రికొంత కాలానికి మ‌రో రోడ్డు ప్రమాదంలో ఇందు కూడా చ‌నిపోతుంది. అయితే ఇవి రోడ్డు ప్రమాదాలు కావ‌ని, వీటి వెనుక ఓ కుట్ర ఉంద‌ని గ‌మ‌నిస్తాడు శేఖ‌ర్‌. ఆ కేసుని తానే ఇన్వెస్టిగేష‌న్ చేయ‌డం మొద‌లెడ‌తాడు.

ఆ క్రమంలో శేఖ‌ర్‌కి ఎలాంటి నిజాలు తెలిశాయి..? ఈ కేసుని తాను ఎలా ఛేదించాడు? అనేదే 'శేఖ‌ర్' క‌థ‌.

జోసెఫ్ 2018లో వ‌చ్చింది. మ‌లయాళంలో సూప‌ర్ హిట్ సినిమా అది. జోసెఫ్ - శేఖ‌ర్‌గా మ‌రి, విడుద‌ల‌య్యే స‌రికి.. నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో చాలా మార్పులొచ్చాయి. క‌రోనా వ‌ల్ల థియేట‌ర్లు మూత‌పడ్డాయి. దాంతో జ‌నం ఓటీటీల్లో ప‌డ్డారు. జోసెఫ్ లాంటి సినిమాలు వాళ్లు చాలా చూసేశారు. ఇంత‌కంటే థ్రిల్లింగ్ కంటెంట్ ప్రేక్షకుల‌కు ఇప్పటికీ అందుబాటులో ఉంది.

అయినా.. శేఖ‌ర్ న‌చ్చుతుంద‌ని భ్రమ‌ప‌డి, సినిమాగా మార్చారంటే ధైర్యం చేశార‌నే చెప్పాలి.

మ‌ల‌యాళంలో ఇన్వెస్టిగేష‌న్ థ్రిల్లర్‌ల‌కు కొద‌వే లేదు. అక్కడ ఏడాదికి క‌నీసం 20 అయినా వ‌స్తుంటాయి. కానీ హిట్టయ్యేవి రెండో మూడో. ఎంతో గొప్ప కంటెంట్ ఉంటే త‌ప్ప మ‌ల‌యాళం ప్రేక్షకులు విజ‌యాన్ని క‌ట్టబెట్టరు. అలాంటిది `జోసెఫ్‌`ని వాళ్లు ఆద‌రించారంటే ఇంకా ఆశ్చర్యం వేస్తుంది.

శేఖర్ సినిమా రివ్యూ

ఫొటో సోర్స్, ActorRajasekhar/twitter

ఫొటో క్యాప్షన్, రాజశేఖర్ కూతురు శివానీ ఈ సినిమాలో కూడా కూతురు పాత్రలో కనిపిస్తారు

కథలో సీరియస్‌నెస్

జోసెఫ్‌లో ద‌ర్శకుడు ఎంచుకున్న పాయింట్ బాగుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. మెడిక‌ల్ మాఫియా చేతుల్లో అవ‌య‌వ‌దానం అనే బృహ‌త్తర కార్యక్రమం ఎంత‌టి అప‌హాస్యం అవుతోందో, వాటి వెనుక ఎంత అవినీతి ఉందో క‌ళ్లకు క‌ట్టిన‌ట్టు చూపించారు.

ఆర్గాన్ డొనేష‌న్ వెనుక ఇంత కుట్ర ఉంటుందా, ఇలా ఆలోచిస్తారా, ఇన్ని కోట్లు చేతులు మార‌తాయా? అనే సందేహాలు, అనుమానాలూ, ఆశ్చర్యాలూ క‌లుగుతాయి. అలాంటి పాయింట్ ని ఎత్తుకున్నందుకు జోసెఫ్ రూప‌క‌ర్తల్ని మెచ్చుకోవాలి. ఆ పాయింటే న‌చ్చి తెలుగులోనూ రీమేక్ చేసి ఉంటారు.

అయితే... ఇదంతా చివ‌రి 20 నిమిషాల్లో చెప్పే వ్యవ‌హారం. రెండు గంట‌ల ప‌ది నిమిషాల సినిమాలో చివ‌రి ఇర‌వై నిమిషాలు మాత్రమే ఆస‌క్తిగా ఉంటే స‌రిపోదు. మిగిలిన రెండు గంట‌లూ అంతే ఆస‌క్తిని క‌లిగించాలి. ఆ విష‌యంలో చిత్రబృందం విఫ‌ల‌మైంద‌నే చెప్పాలి. తొలి ప‌ది నిమిషాలూ శేఖ‌ర్‌ని ప‌రిచ‌యం చేయ‌డానికి వాడుకొన్నారు.

శేఖ‌ర్ ఓ వృద్ధ దంప‌తుల హ‌త్య కేసుని ఎలా ఇన్వెస్టిగేష‌న్ చేశాడో చూపించారు. ఆ స‌న్నివేశాలు ఆస‌క్తిని క‌లిగిస్తాయి. శేఖ‌ర్ ఎందుకు ఉద్యోగాన్ని వ‌దులుకున్నాడో, త‌న భార్యకు దూరంగా ఎందుకు బ‌తుకుతున్నాడో చెప్పడానికి ఓ ఫ్లాష్ బ్యాక్ వేశారు. మ‌ర‌ద‌లి ఎపిసోడ్ మ‌రోటి.

ఈ రెండు ఫ్లాష్ బ్యాకుల్లో భార్య ఎపిసోడ్ ని ప‌క్కన పెడితే... మ‌ర‌ద‌లి క‌థ అన‌వ‌స‌రం అనిపిస్తుంది. ఆమెతో హీరోకున్న అనుబంధం ప్రేమ చూపించ‌డం ఈ క‌థ‌కు అవస‌రం లేదు. మ‌ర‌ద‌లు దారుణంగా హ‌త్యకు గురైన‌ప్పుడు ఈ క‌థ ఆ కోణంలో సాగ‌బోతోందా? అనిపిస్తుంది. కానీ.. ఆ క‌థ‌ని అక్కడే ఆపేశాడు క‌థ‌కుడు.

శేఖర్ సినిమా రివ్యూ

ఫొటో సోర్స్, Sivatmika/twitter

ఫొటో క్యాప్షన్, ‘శేఖర్’ చిత్ర బృందం

అక్కడ్నుంచి శేఖ‌ర్ జీవితంలో అల‌జ‌డి మొద‌ల‌వుతుంది. భార్యని నిర్లక్ష్యం చేస్తాడు. ఆమె ఇంకొక‌ర్ని పెళ్లి చేసుకుంటుంది. ఇవ‌న్నీ చెప్పుకుంటూ రావ‌డం వ‌ల్ల క‌థ‌లో థ్రిల్లింగ్ మిస్సయ్యింది.

శేఖ‌ర్ త‌న భార్యకు విడాకులు ఇవ్వాల్సిన అవ‌స‌రం ఏమొచ్చింది? ఇద్దరూ దూరంగా ఉందుకున్నారు? క‌లిసున్నా..ఇదే క‌థ చెప్పొచ్చు క‌దా?

`నా కూతురు లాప్ టాప్ ప‌ని చేయ‌డం లేదు... అది కాస్త చూడు` అని మాటి మాటికీ శేఖర్ త‌న స‌హ‌చ‌రుడ్ని పుర‌మాయిస్తుంటాడు. దాంతో ఆ లాప్ టాప్ లో ఏదో ఉంది? దాంట్లో క్లూ దొరుకుతుంది..అనే భ్రమ ప్రేక్షకుడిలో క‌లుగుతుంది. అయితే... ఆ లాప్ టాప్ ఏమిటో? దానిని అస్తమానూ ఎందుకు కోట్ చేసి చెప్పాల్సి వ‌స్తుందో అర్థం కాదు.

శేఖ‌ర్‌ భార్య చావునీ, కూతురి చావునీ స‌మాంత‌రంగా చూపిస్తూ.. ఇదేదో.. స్క్రీన్ ప్లే గ‌మ్మత్తు అనుకుంది చిత్రబృందం. అయితే అది ప్రేక్షకుల్ని గంద‌ర‌గోళానికి గురి చేస్తుంది. ఏది ముందు జ‌రిగిందో, ఏది త‌ర‌వాత జ‌రిగిందో, ప్రస్తుతం జ‌రుగుతోందేమిటో తెలీక తిక‌మ‌క ప‌డాల్సివ‌స్తుంది.

ఆర్గాన్ డొనేష‌న్ క్రైమ్ దందా ఎలా జ‌రుగుతోందో, అన్నీ డైలాగుల రూపంలోనే చెప్పించేశారు. వాటికి దృశ్య రూపం అందిస్తే బాగుండేది. క్లైమాక్స్ లో ఫీల్ అంతా సంభాష‌ణ‌ల రూపంలోనే చెప్పాల‌నుకోవ‌డం వ‌ల్ల.. ఆ ఎమోష‌న్ అంత‌గా ఎక్కలేదు.

కాక‌పోతే.. ఓ కేసు ఛేదించ‌డానికి త‌న ప్రాణాన్ని సాక్ష్యంగా మార్చాల‌నుకున్న శేఖ‌ర్ ప్రయ‌త్నం క‌దిలిస్తుంది. జోసెఫ్ లో హార్ట్ ట‌చింగ్ ఎలిమెంట్ కూడా అదే. అయితే, సినిమా మొత్తం కాపీ పేస్ట్ గా మారి, సృజ‌న‌కు, మార్పులూ చేర్పుల‌కూ అవ‌కాశం లేకుండా పోయింది.

శేఖర్ సినిమా రివ్యూ

ఫొటో సోర్స్, Sivatmika/twitter

టీమ్ ఎలా పని చేసింది?

శేఖ‌ర్‌గా రాజ‌శేఖర్ కొత్తగా క‌నిపించారు. ఆయ‌న వ‌య‌సుకు త‌గిన పాత్ర అది. తెల్లటి జుత్తు, గ‌డ్డంతో..హుందాగా ఉన్నారు. ఎక్కడా.. హెచ్చు త‌గ్గులు లేకుండా ఆ పాత్రని చేసుకుంటూ వెళ్లారు. యంగ్ రాజ‌శేఖ‌ర్ గానూ... ఆయ‌న మెప్పించారు. సాయికుమార్ గొంతు కావ‌డంతో ఆ పాత్ర మ‌రింత గంభీరంగా మారిపోయింది.

రాజ‌శేఖ‌ర్ కూతురిగా శివానీ క‌నిపించారు. ఉన్నది కాసేపే అయినా ఆ బాండింగ్ ని బాగా క్యారీ చేశారు. ఇద్దరు హీరోయిన్ల పాత్రలకూ ప‌రిమిత‌మైన స్క్రీన్ స్పేసే ద‌క్కింది.

అనూప్ థీమ్ మ్యూజిక్ ఆక‌ట్టుకుంటుంది. పాట‌లు బాగానే ఉన్నా, ఇలాంటి థ్రిల్లర్‌ల‌కు అవి అడ్డొస్తుంటాయి. ఈ సినిమాలో మ‌రీ నాలుగైదు పాట‌లుండ‌డం, అందులో స‌గానికి పైగా తొలి స‌గంలోనే వ‌చ్చేయ‌డంతో క‌థ‌నంలో వేగానికి స్పీడ్ బ్రేక‌ర్లు వేసిన‌ట్లయింది.

వీడియో క్యాప్షన్, విశాఖపట్నం టాలీవుడ్ హబ్‌గా మారుతుందా?

ఫొటోగ్రఫీ కూల్‌గా ఉంది. ప‌చ్చద‌నాన్ని కెమెరాలో బాగా బంధించారు. ఎడిటింగ్ ఇంకా షార్ప్‌గా ఉండాల్సింది. ముఖ్యంగా పాట‌ల‌కు క‌త్తెర వేస్తే బాగుండేది.

అన‌వ‌స‌ర‌మైన ఎపిసోడ్లు ఈ సినిమాలో కొన్ని క‌నిపిస్తాయి. ద‌ర్శకురాలిగా జీవిత చేసింది ఒక్కటే. మ‌ల‌యాళంలో ఉన్నది తెలుగు తెర‌కు తర్జుమా చేయ‌డం.

మ‌హిళా ద‌ర్శకులు క‌ర‌వవుతున్న ఈ రోజుల్లో జీవిత మ‌ళ్లీ మెగాఫోన్ ప‌ట్టుకోవ‌డం అభినందించద‌గిన విష‌యం.

క‌రోనా స‌మ‌యంలో ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొని ఈ సినిమా ని ఆమె పూర్తి చేయ‌గ‌లిగారు. కాక‌పోతే... జోసెఫ్ లో ఎమోష‌న్ ని ఇంకాస్త అర్థం చేసుకొని, ఇంకొన్ని తెలివైన మార్పులు చేర్పులూ చేసుకుని ఉంటే బాగుండేది.

(అభిప్రాయాలు వ్యక్తిగతం)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)