Nikhat Zareen: నిజామాబాద్ గ్రౌండ్‌లో పరుగు ప్రాక్టీస్ చేసిన బక్కపల్చని అమ్మాయి బాక్సింగ్‌లో వరల్డ్ చాంపియన్ ఎలా అయిందంటే

ఫొటో సోర్స్, @nikhat_zareen
- రచయిత, బళ్ల సతీశ్, సురేఖ అబ్బూరి
- హోదా, బీబీసీ ప్రతినిధులు
తెలంగాణలోని నిజామాబాద్ పట్టణంలో కలెక్టరేట్ గ్రౌండ్‌లో పరుగు ప్రాక్టీస్ చేస్తోంది నిఖత్. ఆమె 100, 200, 300 మీటర్ల పరుగు ప్రాక్టీస్ చేసేది. ఆమెను గొప్ప అథ్లెట్‌గా తీర్చిదిద్దాలన్నది తండ్రి జమీల్ కల.
రోజూ గ్రౌండ్‌కు తీసుకెళ్లి, తీసుకువస్తుండేవారు తండ్రి. గ్రౌండ్ తరువాత స్కూల్. స్ప్రింట్ ప్రాక్టీస్ చేస్తోన్న నిఖత్ అదే గ్రౌండ్‌లో జరుగుతోన్న బాక్సింగ్ ట్రైనింగ్ కూడా గమనించేది. అక్కడ చాలా మంది అబ్బాయిలు శిక్షణ తీసుకుంటున్నారు. ఒకరోజు ఆ శిక్షణ సాగుతున్నపుడు తాను బాక్సింగ్ నేర్చుకుంటాను అని అడిగింది తండ్రిని.
''ఆమె అడిగిన తరువాత నేను బాక్సింగ్ గురించి ఆలోచించాను. దానికి చాలా ధైర్యం కావాలి. అది మగ పిల్లల ఆట. రఫ్ గేమ్. నేను అదే విషయం మా అమ్మాయికి చెప్పాను. దెబ్బలు తగులుతాయి. దెబ్బల వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయి (పరోక్షంగా పెళ్లి ప్రస్తావిస్తూ). చాలా పవర్ కావాలి అని చెప్పాను. తను మాత్రం కష్టపడతాను అంది. అప్పటికే కొన్ని రోజులుగా గమనించిందేమో, బాక్సింగ్ నేర్చుకుంటాను అని చెప్పింది. నేను వెంటనే ఒప్పుకున్నాను'' అంటూ నిఖత్ బాక్సింగ్ ప్రస్థానం మొదలైన విధానాన్ని వివరించారు ఆమె తండ్రి జమీల్.
12 ఏళ్ల వయసు నుంచే క్రీడల్లో తన ప్రయాణం ప్రారంభించింది నిఖాత్. కూతరిని బాక్సింగ్ లో చేర్చే విషయమై కోచ్‌తో మాట్లాడటానికి వెళ్లాడు ఆ తండ్రి. అథ్లెట్స్‌తో పోలిస్తే బాక్సింగ్‌లో పోటీ తక్కువ అనీ, తప్పకుండా జాతీయ స్థాయికి, వీలుంటే అంతర్జాతీయ స్థాయికి వెళ్లే అవకాశం ఉంటుందనీ ఆమె తండ్రికి చెప్పారు కోచ్.
బాక్సింగ్‌లో అమ్మాయిలు కూడా తక్కువ కావడం ఆమెకు కలిసి వస్తుందని వివరించారు. అలా చేరిన నిఖాత్‌ను అప్పుడు నిజామాబాద్‌లో మగవారికి బాక్సింగ్ శిక్షణ ఇస్తున్న కోచ్ ప్రోత్సహించారు.
కట్ చేస్తే, ఏడాది తిరిగేలోగానే బాక్సింగ్‌లో మంచి నైపుణ్యంతో జాతీయ స్థాయిలో పతకాలు సాధించడం మొదలుపెట్టింది నిఖాత్ జరీన్. జాతీయ స్థాయిలో బ్రాంజ్, ఆ తరువాత గోల్డ్ వచ్చింది. ఇది జరిగింది 2010లో.

ఫొటో సోర్స్, @nikhat_zareen
'ఆమెను ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? అని బంధువులు అనేవారు'
నిఖత్ తండ్రి క్రికెట్, ఫుట్‌బాల్ క్రీడాకారుడు. ఆ ఆసక్తే ఆయన నలుగురు కూతుళ్లలో ఇదర్ని క్రీడాకారిణులుగా తయారు చేసేలా చేసింది.
నిఖత్ ఇద్దరు అక్కలు ఫిజియోథెరపిస్టులు కాగా, చెల్లి బ్యాడ్మింటన్ ఆడతారు. క్రీడల్లో శిక్షణకు అనుకూలంగా ఉండడం కోసం వారు నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వచ్చేశారు.
''బాక్సింగ్ ఎందుకు? ఆమెను ఎవరైనా పెళ్లి చేసుకుంటారా?' అని బంధువులూ, బయటి వారు కూడా అన్నారు. కానీ ఆమెను క్రీడల్లోకి పంపాలన్నది నా నిర్ణయం. నేను పట్టుదలతో ఉన్నాను. ఏదో ఒకరోజు ఆమె ఒలింపిక్స్ ఆడాలని నా ప్రణాళిక. కచ్చితంగా అక్కడ కూడా సక్సెస్ అవుతుందని నమ్ముతున్నాను'' అని ఆమె తండ్రి జమీల్ బీబీసీతో చెప్పారు.
ముస్లిం కుటుంబం కావడం వల్ల నిక్కరు, టీషర్టులో అమ్మాయిని గ్రౌండుకు తీసుకెళ్లడం ఇబ్బందిగా ఉండేదని ఆమె తండ్రి మీడియాతో చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
'దెబ్బలు, రక్తం, స్కార్స్ చూసి ఏడ్చాను...'
నిఖత్‌ను ఆమె తల్లి పర్వీన్ ఎప్పుడూ నిరుత్సాహపరచలేదు. కానీ ఆమెకెప్పుడూ నిఖత్‌కు ఏమైనా దెబ్బలు తగులుతాయేమోనని బెంగగా ఉండేది.
''ఒకసారి ఆమెకు ప్రాక్టీసులో స్పైరింగ్ దెబ్బ తగిలింది. నేను గమనించలేదు. ఇంటికి వెళ్లాక వాళ్ల అమ్మ చూసింది. బాక్సింగ్ వదిలేసి వేరే గేమ్ చూసుకోమని సలహా ఇచ్చింది. కానీ నిఖత్ ఒప్పుకోలేదు. నిజామాబాద్ లో ప్రాక్టీస్ చేసేందుకు అమ్మాయిలు లేకపోవడంతో మగ పిల్లలతో కలసి ఆడేది. 'అబ్బాయిలో స్పీడ్, పవర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలా జరిగింది. భవిష్యత్తులో నేను ఎక్కువ ప్రాక్టీస్ చేసి దాన్ని తట్టుకుంటా. నేను వారికి కౌంటర్ ఇస్తా. మంచి రిజల్ట్స్ వస్తాయి. నేను కొడతా' అని వాళ్ల అమ్మకు నచ్చచెప్పింది పర్వీన్'' అని జమీల్ వివరించారు.
''మొదటిసారి బాక్సింగ్ అనగానే భయపడ్డాను. అబ్బాయిలతో ట్రైనింగ్. ఆడపిల్ల తెల్లవారుజామునే వెళ్లాలి. చిన్న చిన్న దెబ్బలు, రక్తం, స్కార్స్ చూసి ఏడ్చాను. ఈ ఆట వద్దు అన్నాను. ముఖం పాడైపోతే భవిష్యత్తులో సమస్య (పెళ్లి విషయంలో) వస్తుంది అన్నాను. కానీ తను పట్టు పట్టింది. వాళ్ల నాన్న బాగా సపోర్ట్ ఇచ్చారు. తల్లిగా నేను కొంచెం భయపడి వద్దనుకున్నాను. తరువాత అలవాటు అయిపోంది'' అంటూ నిఖత్ ప్రాక్టీస్ తొలిరోజులను గుర్తు చేసుకున్నారు ఆమె తల్లి పర్వీన్.
నిఖత్ తల్లి కూడా స్కూల్ డేస్‌లో కబడ్డీ ఆడేవారు.
14 ఏళ్ల వయసులో జూనియర్ ప్రపంచ చాంపియన్...
ఆమె జూనియర్ వరల్డ్ చాంపియన్ షిప్, ఇప్పుడు ఫ్లైవెయిట్ ప్రపంచ చాంపియన్‌షిప్ - ఈ రెండూ టర్కీలోనే గెలిచింది. మొదటి టోర్నీ ఆమె 14 ఏళ్ల వయసులో జరిగితే, తాజాగా టర్కీలోని ఇస్తాంబుల్‌లో జరిగిన మహిళ ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్ స్వర్ణ పతకం 26 ఏళ్ల వయసులో గెలుచుకుంది. 52 కేజీల విభాగం ఫైనల్లో థాయిలాండ్‌కి చెందిన జిట్ పాంగ్ జుటామాస్ ను ఓడించింది నిఖత్.
''మొదటి సారి టర్కీ వెళ్లినప్పుడు ఈ స్మార్టుఫోన్లు, సోషల్ మీడియా లేవు. వెళ్లి వారం అయినా మాకు ఎలాంటి సమాచారం లేదు. భయం పట్టుకుంది. కోచ్‌కి ఫోన్ చేస్తే 'సెమీ ఫైనల్స్‌కి వెళ్లింది కంగారు పడకండి' అని చెప్పారు. సెమీస్ అంటే సిల్వర్ వచ్చినా చాల్లే అన్నారు వాళ్ల నాన్న. కాదు గోల్డే వస్తుంది అన్నాను. వచ్చింది. ఈ రెండు గోల్డులూ టర్కీలోనే'' అని సంతోషంగా చెప్పారు తల్లి పర్వీన్.

ఫొటో సోర్స్, @nikhat_zareen
'ఫైనల్‌లో కాస్త టెన్షన్ పడ్డా.. కాన్ఫిడెంట్‌గా ఆడాను'
తాజా టోర్నీలో కూడా అన్ని మ్యాచులూ 5-0తోనే గెలుస్తూ వచ్చింది నిఖత్. ''అన్నీ 5-0తో గెలిచాను కానీ ఒక్క ఫైనల్ మాత్రం కాస్త టెన్షన్ పడ్డాడు. రెండో రౌండ్‌లో తడబడ్డాను. అయినా కాన్ఫిడెంట్‌గా ఆడాను'' అని ఈ మ్యాచ్ గురించి బీబీసీతో మాట్లాడింది నిఖాత్ జరీన్ తెలిపారు.
తనను తాను బాక్సర్ గా తీర్చిదిద్దుకోవడానికి కఠోర శ్రమ పడింది నిఖత్. తండ్రి ఉపాధి కోసం కొంత కాలం సౌదీ వెళ్లారు. దీంతో నిఖాత్ సొంతంగా ప్రాక్టీసుకు వెళ్లేది. అంతకు ముందు తండ్రితోనే వెళ్లడం అలవాటు. తెల్లవారుజామున 5 గంటలకు కోచింగ్ వెళ్లేది. తిరిగి వచ్చి వెంటనే స్కూలు. స్కూల్ అయిపోగానే హోంవర్క్. తరువాత మళ్లీ ప్రాక్టీస్. ఆ కఠోర శ్రమ ఆమెకు వరుస విజయాలు తెచ్చిపెట్టింది.
2011లో టర్కీలోని అంటాల్యాలో జరిగిన అంతర్జాతీయ ఉమెన్స్ యూత్ అండ్ జూనియర్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం గెలవడం ఆమె కెరీర్‌లో తొలి పెద్ద అడుగు. 2019 బ్యాకాంగ్‌లో జరిగిన థాయిలాండ్ ఓపెన్ ఇంటర్నేషనల్ బాక్సింగ్ టోర్నీలో రజత పతకం గెలిచింది నిఖాత్. 2022లో బల్గేరియాలో జరిగిన 73వ స్ట్రాండ్జా మెమోరియల్ బాక్సింగ్ టోర్నమెంటులో టోక్యో ఒలింపిక్స్ సిల్వర్ మెడలిస్ట్ బూస్ నాజ్‌ని ఓడించింది.

ఫొటో సోర్స్, Getty Images
ఒకవైపు చదువులు, మరోవైపు కఠోర శిక్షణ...
చదువుల్లో కూడా నిఖాత్ ముందుండేదని చెబుతారు తల్లి. నిజామాబాద్‌లో ఇంటర్ వరకూ చదవి, డిగ్రీ హైదరాబాద్‌లో పూర్తి చేసిన నిఖాత్, ప్రస్తుతం ఒక ప్రైవేటు కాలేజీ ఎంబీఏ చదువుతోంది. విశాఖపట్నానికి చెందిన ద్రోణాచార్య అవార్డీ ఐ.వి.రావు దగ్గర 2009 లో శిక్షణ పొందింది నిఖాత్. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్‌కి ఎంపిక అయింది. అడిడాస్‌కు బ్రాండ్ అండార్స్‌మెంట్ చేస్తోంది. బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం చేస్తోంది. హైదరాబద్ ఏవీ కాలేజీలో డిగ్రీ చదువుతోంది. 2014లో అప్పటి నిజామాబాద్ కలెక్టర్ రొనాల్డ్ రాస్, నిఖాత్‌ను నిజామాబాద్ జిల్లా బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటించారు. 2014 తెలంగాణ ప్రభుత్వం నిఖాత్‌కి 50 లక్షల రూపాయల ప్రోత్సాహకం అందించింది.
2015 నుంచి ఆమెకు ప్రత్యేక శిక్షణ ప్రారంభం అయింది. దానికోసం కఠోర శిక్షణ తీసుకుంది. ''ఆమె కొన్ని సంవత్సరాల పాటు ఇంట్లో ఏ ఫంక్షన్‌కీ రాలేదు. మాకు కూడా బాధ కలిగేది. ఇంట్లో మంచి ఫుడ్ వండినా తినేది కాదు. మేం అందరం మంచి ఫుడ్ తింటూ తను మాత్రం డైట్ పేరుతో ఏమీ తినకుండా ఉంటే మాకు చాలా బాధ కలిగేది. తిండి, సోషల్ లైఫ్ అన్నీ వదులుకుని కష్టపడింది'' అంటూ కూతరు గురించి చెప్పింది ఆ తల్లి.

ఫొటో సోర్స్, TWITTER/NIKHAT JAREEN
ఒలింపిక్స్‌కు క్వాలిఫై కావటం లక్ష్యంగా...
కూతురు కష్టం బయటే కాదు, బాక్సింగ్ రింగులోనూ చూడలేదు ఆ తల్లి. ''నేను ఆ మ్యాచులు చూడాలంటే భయం వేసేది. కొట్టుకుంటారు కదా. రింగులో నేనే ఉన్నట్టు భయం వేసేది. తరువాత క్రమంగా నిఖాత్ మ్యాచులు చూడడం అలవాటు చేసుకున్నాను'' అని ఆమె తెలిపారు.
నిఖాత్ జరీన్‌కి క్రీడల పరంగా కొన్ని విషయాల్లో అన్యాయం జరిగినట్టు ఆయన తండ్రి చెబుతున్నారు. అనేకసార్లు సెలక్షన్ ప్రొసెస్ అనుకన్న సమయానికి జరగలేదని వివరించారు.
''ఓపిగ్గా ఎదురు చూశాం. దేవుడు కరుణించాడు. ఇప్పుడు సక్సెస్ అయ్యాం. జూలైలో జరిగే కామన్వెల్త్‌లో కూడా మెడల్ తెస్తాం. ఏషియన్ గేమ్స్ క్వాలిఫై అయ్యాం. తరువాత ఒలింపిక్స్ క్వాలిఫై అవుతాం. అదే లక్ష్యం'' అన్నారు జమీల్. 2017లో భుజం గాయం ఆమె కెరీర్ కాస్త బ్రేక్ ఇచ్చింది. నిఖాత్ ఒలింపిక్స్ నాటికి 54 ఏళ్ల కేటగిరీలో పోటీ పడుబోతందని చెబుతున్నారు.

ఫొటో సోర్స్, @nikhat_zareen
మేరీ కోమ్‌తో బాక్సింగ్ వివాదం
2000వ సంవత్సరంలో మేరీ కోమ్ రాష్ట్రస్థాయి చాంపియన్ అయ్యేప్పటికి నిఖత్ నాలుగేళ్ల చిన్నారి. సరిగ్గా 20 ఏళ్ల తర్వాత ఇద్దరూ ఒకే బాక్సింగ్ రింగులో తలపడ్డారు.
ఒలింపిక్స్ ఎంపిక విషయంలో తనకూ సమాన అవకాశం ఇవ్వాలని ట్విట్టర్ వేదికగా డిమాండ్ చేసింది నిఖత్. తనకు ఆదర్శం మేరీ కోమ్ అని చెప్పింది. అదే సందర్భంలో క్రీడల్లో ఫెయిర్ చాన్స్ ఇవ్వాలని కోరింది. చివరకు మ్యాచ్ ఏర్పాటు చేశారు. మేరీ చేతిలో నిఖత్ ఓడిపోయింది.
ఆ మ్యాచ్ విషయంలో కూడా వివాదాలు వచ్చాయి. మ్యాచ్ అయ్యాక నిఖత్‌కి హగ్, షేక్ హ్యాండ్ ఇవ్వలేదు మేరీ. ఆమెను గౌరవించాలంటే, ముందు ఆమె ఇతరులను గౌరవించాలని మీడియాతో వ్యాఖ్యానించారు మేరీ కోమ్.
ప్రపంచ చాంపియన్‌షిప్‌లో బంగారు పతకం సాధించిన ఐదో భారతీయ మహిళ నిఖత్.
భారతీయ మహిళలు మొత్తం పది ప్రపంచస్థాయి బంగారు పతకాలు సాధించగా, అందులో ఆరు ఒకే మహిళకు చెందినవి. ఆమే మేరీ కోమ్. 2002, 2005, 2008, 2010, 2018 లలో మేరీ కోమ్ బంగారు పతకాలు సాధించింది. మిగిలిన నాలుగులో మూడు 2006లోనే వచ్చాయి. సరితా దేవి, జెన్నీ ఆర్ఎల్, లేఖా కేసీ అవి సాధించారు.
2012లో మహిళల బాక్సింగును ఒలింపిక్స్ క్రీడల్లో చేర్చారు. అంటే మొత్తం పదిలో ఎనిమిది పతకాలు, మహిళల బాక్సింగ్ క్రీడను ఒలింపిక్స్‌లో చేర్చకముందే వచ్చాయి. వాటిలో ఐదు మేరీ కోమ్ తెచ్చింది. ఒలింపిక్స్‌లో ఒకే ఒక బంగారు పతకం 2018 మేరీ కోమ్ తెచ్చింది. ఆ పతకం గెలిచే సరికే మేరీ కోమ్ వయసు 35 ఏళ్లు. క్రీడలకు అది పెద్ద వయసు. అసలు టోక్యో ఒలింపిక్స్‌కి ఆమె పోటీ ఇచ్చే పరిస్థితిలో కూడా లేదు. ఆ రకంగా చూస్తే, నిఖాత్ జరీన్ 2024 పారిస్ ఒలింపిక్స్‌కి వెళ్లి గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి.
ఆ లక్ష్యాన్ని చాటుతూ ట్విట్టర్‌లో పారిస్ కౌంట్ డౌన్ ఫొటో పోస్ట్ చేసింది నిఖత్. వచ్చే ఒలింపిక్స్ కోసం సిద్ధం అయ్యేలోపు, ఈసారి నిఖత్ ఇంటికి వచ్చేసరికి బిర్యానీలతో పాటూ ఆమెకు ఇష్టమైన, తహరీ, మటన్ కర్రీ, టమాట చట్నీ, కాస్త మిర్చి మసాలా ఎక్కువగా వేసి కూతురుకు తినిపించేందుకు సిద్ధమవుతున్నారు ఆ తల్లితండ్రులు.
ఇవి కూడా చదవండి:
- మీరు ప్రేమలో పడ్డారా, కామంలో కూరుకుపోయారా? ప్రేమకు, కామానికి తేడాను ఎలా గుర్తించాలి?
- వంటగది అపరిశుభ్రత వల్లే అనేక జబ్బులు... సాధారణంగా చేసే 9 తప్పులు, సరిదిద్దుకునే మార్గాలు
- ఇల్లు కొనడం మంచిదా లేక అద్దెకు ఉండటం మంచిదా.. సొంతిల్లు కొనే ముందు ఇవి తెలుసుకోండి
- Bra ఎంపికలో మహిళలు చేసే పొరపాట్లు ఇవే.. ‘బ్రా’ సరైన కొలతను తెలుసుకోవాలంటే ఇలా చేయండి..
- కళ్లు ఎందుకు అదురుతాయి? మీ ఆరోగ్యం గురించి మీ కళ్లు ఏం చెప్తున్నాయో తెలుసుకోండి...
- పెట్రోల్-డీజిల్ ధరలు: కర్ణాటక బోర్డర్ వద్ద ఏపీ పెట్రోలు బంకులు ఎందుకు మూతపడుతున్నాయి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












