టోక్యో ఒలింపిక్స్: నగదు, ఇళ్లు, ఆవులు... ఇవి ఒలింపిక్స్ పతక విజేతలకు ఇచ్చే ప్రోత్సాహకాలు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఫెర్నాండో డ్యూవార్టే
- హోదా, బీబీసీ వరల్డ్ సర్వీస్
ఒలింపిక్స్‌లో పతకం సాధిస్తే అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రతిష్ఠలు, గుర్తింపు వస్తాయి. వారిని వెతుక్కుంటూ ఎన్నో అవకాశాలు కూడా వస్తాయి.
అయితే, వీటితోపాటు నగదు, ఇళ్లు కూడా క్రీడాకారులకు ప్రోత్సాహకాలుగా అందిస్తుంటారు. కొందరికైతే పతకం తెచ్చినందుకు ఆవులను కూడా ఇస్తుంటారు.
ఒలింపిక్స్‌లో పాల్గొనే వారి నుంచి అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐవోసీ) ఎలాంటి ఫీజూ వసూలు చేయదు. అలాగే పతక విజేతలకు ఎలాంటి ప్రోత్సాహకాలూ అందించదు. అయితే, క్రీడాకారుల్లో స్ఫూర్తి నింపేందుకు చాలా దేశాలు ప్రోత్సాహకాలు ఇస్తుంటాయి.
టోక్యో ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన వారికి ఆయా దేశాలు ఎలాంటి ప్రోత్సాహకాలు ఇచ్చే అవకాశం ఉందో ఇప్పుడు చూద్దాం.

ఫొటో సోర్స్, Getty Images
రెండు ఇళ్లు..
జులై 26న వెయిట్ లిఫ్టర్ హిదిలిన్ దియాజ్ ఫిలిప్పీన్స్‌కు తొలి ఒలింపిక్ బంగారు పతకాన్ని తెచ్చిపెట్టారు.
మహిళల 55 కేజీల విభాగంలో ఆమె పతకం సాధించడంతో.. ఆమె ‘‘నేషనల్ హీరో’’గా మారిపోయారు.
ఒకే ఒక్క పతకంతో దియాజ్ కెరియర్‌తోపాటు జీవితం కూడా మారిపోయింది.
ఆమెకు 6 లక్షల డాలర్లు(రూ.44.6 కోట్లు) నగదు ప్రోత్సాహకంగా ఇస్తున్నట్లు ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది. వీటిలో కొంత మొత్తాన్ని ఫిలిప్పీన్స్ స్పోర్ట్స్ కమిషన్, మరికొంత మొత్తాన్ని దేశ అధ్యక్షుడు రోడ్రిగో డ్యూటెర్టే అందిస్తారు.
అంతేకాదు, ఆమెకు రెండు ఇళ్లు కూడా ఇవ్వనున్నారు. వీటిలో ఒకటి చైనీస్-ఫిలిప్పీనో బిలియనీర్ ఆండ్ర్యూ లిమ్ టామ్ ఇస్తానని చెప్పారు. ఆయన ఒక విలాసవంతమైన ఇల్లును ఆమెకు ఇవ్వబోతున్నారని ఇప్పటికే వార్తలు వచ్చాయి.
ప్రస్తుతం ఫిలిప్పీన్స్ వైమానిక దళంలో అధికారిగా పనిచేస్తూ నెలకు 500 డాలర్లు (రూ.37,248) సంపాదిస్తున్న ఆమెను ఈ బహుమతులు సంతోషంతో ముంచెత్తాయి.
నిజానికి ఆమె జిమ్ కూడా లేకుండానే ఒలింపిక్స్‌కు శిక్షణ తీసుకున్నారు. కరోనావైరస్ వ్యాప్తి నడుమ దాదాపు 18 నెలలు ఆమె మలేసియాలోనే ఉండిపోవాల్సి వచ్చింది. దీంతో తాత్కాలిక వెయిట్ లిఫ్టింగ్ పరికరాలతోనే ఆమె శిక్షణ కొనసాగించారు.

ఫొటో సోర్స్, Getty Images
నగదు బహుమతులు..
నగదు ప్రోత్సాహకాలు దేశాన్నిబట్టి మారుతూ ఉంటాయి. కొన్ని దేశాలు భారీ ప్రోత్సాహకాలు ఇస్తుంటాయి.
భారీ పెట్టుబడులు, ప్రత్యేక సదుపాయాలతో పెద్దయెత్తున పతకాలు సాధించే దేశాలతో పోలిస్తే చిన్న దేశాలు, తక్కువగా పతకాలు సాధించే దేశాలే ఎక్కువ నగదు ప్రోత్సాహకాలు ఇస్తుంటాయి.
13 ఒలింపిక్స్‌లో ఇప్పటివరకు 11 పతకాలు మాత్రమే సంపాదించిన మలేసియాలో ఈ ప్రోత్సాహకాలు భారీగా ఉన్నాయి.
టోక్యో ఒలింపిక్స్‌లో ఎవరైనా దేశానికి స్వర్ణ పతకం అందిస్తే, 2.41 లక్షల డాలర్లు (రూ. 1.79 కోట్లు) ఇస్తామని మలేసియా ప్రకటించింది. రజతం సాధిస్తే 1.5 లక్షల డాలర్లు (రూ.1.11 కోట్లు), కాంస్యం సాధిస్తే 24,000 డాలర్లు (రూ. 17.87 లక్షలు) ఇస్తామని కూడా తెలిపింది.
ఆగస్టు 7నాటికి మలేసియాకు టోక్యో ఒలింపిక్స్‌లో ఒక కాంస్యం (బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్) మాత్రమే వచ్చింది.
మరోవైపు, ఇప్పటివరకు ఒలింపిక్స్‌లో 500కుపైగా పతకాలు సాధించిన ఆస్ట్రేలియా.. మలేసియా ప్రకటించిన దానిలో పదో వంతు నగదు మాత్రమే ప్రోత్సాహకంగా అందిస్తోంది. టోక్యో ఒలింపిక్స్‌లో ఆ దేశం ఇప్పటికే 40కి పైగా పతకాలు సాధించింది.

ఫొటో సోర్స్, Getty Images
కార్లు కూడా..
ప్రోత్సాహకాలు అందించే పెద్ద దేశాల్లో చైనా, రష్యాలను ప్రత్యేకంగా చూడాలి. ఎందుకంటే పెద్దయెత్తున పతకాలు సంపాదిస్తున్నప్పటికీ, ఈ దేశాల్లో క్రీడాకారులకు విలువైన బహుమతులు అందిస్తున్నారు.
రష్యాలో అయితే వారికి విలువైన కార్లు, అపార్ట్‌మెంట్లు కూడా ఇస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆవులు..
కొన్ని ప్రోత్సాహకాలు ప్రజల్లో ఆసక్తిని రేపుతూ వార్తల్లో నిలుస్తాయి. ఇలాంటి వాటిలో దక్షిణాఫ్రికా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
2012 లండన్ ఒలింపిక్స్‌లో పురుషుల లైట్‌వెయిట్ 4 రోవింగ్‌లో దక్షిణాఫ్రికాకు చెందిన సిజ్వే డ్లోవు, మాథ్యూ బ్రిటన్, జాన్ స్మిత్, జేమ్స్ థాప్సన్‌లు పతకాలు సాధించారు.
ఈ నలుగురికి ఒక్కో ఆవును ప్రోత్సాహకంగా అందించారు. వ్యాపారవేత్త, టీవీ చెఫ్ జాన్ స్కానెల్ ఈ ఆవులను బహూకరించారు.

ఫొటో సోర్స్, Getty Images
కొత్త ఉద్యోగాలు, జీతం పెంపు..
చాలా దేశాల్లో ఒలింపిక్ పతకం ఉద్యోగం తెచ్చి పెడుతుంది. కొన్నిచోట్ల జీతం పెంచుతుంది.
టోక్యోలో రజత పతకం సాధించిన భారత వెయిట్ లిఫ్టర్ మీరాబాయికి 3.5 లక్షల డాలర్లు (26 కోట్లు) నగదు బహుమతి అందించారు. మరోవైపు ఆమెకు పదోన్నతి కల్పిస్తామని భారత రైల్వే ప్రకటించింది.
దక్షిణ కొరియాలో ఒలింపిక్ పతక విజేతలకు నగదు బహుమతి ఇస్తారు. అయితే, పతకాలు సాధించిన కొంతమంది పురుషులకు అంతకంటే ముఖ్యమైన ప్రోత్సాహకం ఒకటి ఉంది.
18 నెలల నిర్బంధ సైనిక సేవల నుంచి వారికి విముక్తి కల్పిస్తారు. అంటే పతకం తీసుకొస్తే, వారు ఆ 18 నెలలు సైన్యంలో విధులు నిర్వర్తించాల్సిన పనిలేదు.
టోక్యో ఒలింపిక్స్‌లో గోల్స్‌లో బరిలోకి దిగిన సుంజేయీ ఇమ్, సివూ కిమ్‌లకు ఈ ఆఫర్లు ఇచ్చారు. అయితే, వీరు పతకాలు గెలవడంలో విఫలమయ్యారు.

ఫొటో సోర్స్, Getty Images
ఎప్పటి నుంచో..
ఒలింపిక్ పతక విజేతలకు ప్రోత్సాహకాలు ఇవ్వడం అనేది కొత్తేమీ కాదు. 1980ల నుంచి ఇలాంటి ప్రోత్సాహకాలు ఇస్తూనే ఉన్నారు. అయితే, ఇటీవల కాలంలో ఇవి మరింత ఎక్కువయ్యాయి.
చాలా మంది క్రీడాకారులకు ఈ ప్రోత్సాహకాలే జీవనాధారం. ఎందుకంటే చాలాదేశాల్లో క్రీడలపై మీడియా అంతగా దృష్టిసారించదు. వారి కోసం స్పాన్సర్లు రావాలంటే చాలా కష్టంగా ఉంటుంది.
ఉదాహరణకు బ్రెజిల్ క్రీడాకారులనే తీసుకుంటే, వీరు చాలా వరకు ప్రభుత్వం ఇచ్చే స్టైఫండ్ మీదే ఆధారపడతారు. జిమ్నాస్టిక్స్‌లో దేశానికి రెండు ఒలింపిక్ పతకాలు సాధించిన రెబెకా ఆండ్రాడేదీ కూడా ఇదే పరిస్థితి.
గత ఫిబ్రవరిలో గ్లోబల్ అథ్లెట్ రీసెర్చ్ గ్రూప్.. 48 దేశాలకు చెందిన 500 మంది ఒలింపిక్ క్రీడాకారులతో మాట్లాడింది. వీరిలో దాదాపు 60 శాతం మంది తాము ఆర్థికంగా నిలదొక్కుకునే పరిస్థితిలో లేమని చెప్పడం శోచనీయం.
భారీగా పతకాలు సాధిస్తున్న అమెరికాతోపాటు చాలా దేశాల్లో క్రీడాకారులు తమ శిక్షణ కోసం క్రౌడ్ ఫండింగ్ వైపు చూస్తున్నారు.
తన ఒలింపిక్ లక్ష్యాన్ని నెరవేర్చుకోడానికి క్రౌడ్ ఫండింగ్‌నే ఆశ్రయించానని బ్రిటన్‌కు చెందిన బీఎంఎక్స్ రేసింగ్ ఛాంపియన్ బెథనీ ష్రీవెర్ చెప్పారు.
2017లో బ్రిటన్ క్రీడా విభాగం నిధుల్లో కోత విధించడంతో తాము ఈ విధానాన్ని ఆశ్రయించాల్సి వచ్చిందని ఆమె అన్నారు.
కరోనావైరస్ వ్యాప్తి నడుమ పరిస్థితులు మరింత దిగజారాయి. క్రీడాకారులు బయట ఈవెంట్లలో పాల్గొనడం అనే మాటే లేకుండా పోయింది.
ప్రస్తుతం రికార్డులు, పతకాలు సాధించిన చాలా మంది క్రీడాకారులకు ఇలాంటి ఇబ్బందులు ఇకపై ఉండకపోవచ్చు.
‘‘కరోనావైరస్ చెలరేగుతున్నప్పటికీ మేం ఇక్కడ ఉన్నాం. పతకాలు సాధిస్తున్నాం. అసాధ్యమైనదంటూ ఏమీ ఉండదు’’అని ఫిలిప్పీన్స్ వెయిట్ లిఫ్టర్ దియాజ్ మీడియా సమావేశంలో చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- టోక్యో ఒలింపిక్స్: పతకం చేజారినా, హృదయాలను గెల్చుకున్న భారత మహిళా హాకీ జట్టు
- టోక్యో ఒలింపిక్స్: ఏ దేశానికి ఎన్ని పతకాలు? ఇదీ జాబితా
- కిసాన్ సంసద్: ఒక పార్లమెంటులో గందరగోళం మధ్య బిల్లులు, మరో 'పార్లమెంటు'లో పద్ధతిగా తీర్మానాలు
- టోక్యో ఒలింపిక్స్: అమెరికాలో ఒలింపిక్ పతకాల పట్టికలో చైనా టాప్‌లో ఎందుకు కనిపించడం లేదు?
- అమెజాన్ Vs. రిలయన్స్: అమెజాన్‌కు అనుకూలంగా భారత సుప్రీం కోర్టు తీర్పు
- పెగాసస్ స్పైవేర్: ఇప్పటికీ సమాధానాలు దొరకని కీలక ప్రశ్నలు
- తెలంగాణ: ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఇంకా ఎన్ని ఇస్తారు?
- టోక్యో ఒలింపిక్స్: ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా ఉత్సవం ప్రత్యేకతలేంటి? భారత్ నుంచి ఎవరెవరు వెళ్తున్నారు?
- పాకిస్తాన్‌లోని హిందూ దేవాలయంపై దాడి, దోషులను వెంటనే అరెస్ట్ చేయాలని ఆదేశించిన సుప్రీం కోర్టు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








