అమెజాన్ Vs. రిలయన్స్: అమెజాన్‌కు అనుకూలంగా భారత సుప్రీం కోర్టు తీర్పు

ఫొటో సోర్స్, Reuters
ఈ-కామర్స్ దిగ్గజాల చుట్టూ తిరుగుతున్న ‘‘అమెజాన్-ఫ్యూచర్-రిలయన్స్’’ కేసులో అమెజాన్‌కు అనుకూలంగా భారత సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది.
ఫ్యూచర్ రీటెయిల్ లిమిటెడ్ (ఎఫ్‌ఆర్‌ఎల్) ఆస్తుల కొనుగోలు విషయంలో ఇకపై ముందుకు వెళ్లొద్దని రిలయన్స్ రీటెయిల్‌కు మధ్యవర్తిత్వ సంస్థ ‘‘సింగపూర్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ (ఎస్‌ఐఏసీ)’’ గత ఏడాది అక్టోబరులో ఆదేశించింది.
ఎస్ఐఏసీ ఆదేశాలను ఫ్యూచర్ రీటెయిల్ లిమిటెడ్, రిలయన్స్‌లు తూచా తప్పకుండా పాటించేలా చూడాలని మొదట దిల్లీ హైకోర్టును అమెజాన్ ఆశ్రయించింది.
ఈ అంశంపై దిల్లీ హైకోర్టులో ఏకసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. అనంతరం ఎస్‌ఐఏసీ తీర్పును అమలు చేయాలని ధర్మాసనం సూచించింది.
అయితే, ఈ ఏకసభ్య ధర్మాసనం తీర్పుపై దిల్లీ హైకోర్టులోని డివిజన్ బెంచ్ నిలుపుదల ఆదేశాలు ఇచ్చింది. దీంతో అమెజాన్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది.
ఈ అంశంపై జస్టిస్ రోహింటన్ ఎఫ్ నారీమన్ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం తుది తీర్పు వెల్లడించింది.

ఫొటో సోర్స్, Getty Images
సుప్రీం కోర్టు ఏం చెప్పింది?
ఆస్తుల కొనుగోలు ఒప్పందంలో రిలయన్స్, ఫ్యూచర్ గ్రూప్‌లు ముందుకు వెళ్లకుండా సింగపూర్ మధ్యవర్తిత్వ సంస్థ ఇచ్చిన ఆదేశాలను తప్పకుండా పాటించాలని సుప్రీం కోర్టు సూచించింది.
అంటే ఈ కేసులో దిల్లీ హైకోర్టులోని ఏకసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పుకు సుప్రీం కోర్టు మద్దతు పలికింది.
ఈ కేసులో ఏకసభ్య ధర్మాసనంతోపాటు డివిజన్ బెంచ్ ముందున్న విచారణలను నిలిపివేయాలని గత వారమే సుప్రీం కోర్టు ఆదేశాలు జారీచేసింది.
‘‘విదేశీ సంస్థ ఇచ్చిన తీర్పును ‘భారత ఆర్బిట్రేషన్ అండ్ కన్సీలియేషన్ యాక్ట్’ కింద అమలు చేయొచ్చా? అనే అంశాన్ని పరిశీలించాం. మన చట్టంలోని సెక్షన్ 17 (2)ల కింద ఆ ఆదేశాలను అమలు చేయొచ్చనే నిర్ణయానికి వచ్చాం’’అని సుప్రీం కోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది.

ఫొటో సోర్స్, Getty Images
అసలు ఏమిటీ కేసు?
భారత్‌లో దిగ్గజ సంస్థ అయిన ఫ్యూచర్ రీటెయిల్ లిమిటెడ్ (ఎఫ్‌ఆర్‌ఎల్)కు చెందిన రూ. 24,713 కోట్ల విలువైన ఆస్తుల కొనుగోలుపై ఈ వివాదం మొదలైంది. ఒకవైపు రిలయన్స్, మరోవైపు అమెజాన్‌లతో వేర్వేరుగా కుదుర్చుకున్న ఒప్పందాలు ప్రతిష్టంభనకు దారితీశాయి.
కరోనావైరస్ వ్యాప్తి నడుమ ఫ్యూచర్ రీటెయిల్ వ్యాపార లావాదేవీలు బాగా దెబ్బతిన్నాయి. తమ కంపెనీ మనుగడలో ఉండాలంటే ఆస్తుల కొనుగోలు ఒప్పందం కుదిరితీరాలని ఫ్యూచర్ రీటెయిల్ చెబుతూ వస్తోంది. లేని పక్షంలో తమ సంస్థకు చెందిన దాదాపు 25,000 మంది ఉద్యోగాలు ప్రమాదంలో పడతాయని వివరిస్తోంది.
ఫ్యూచర్ గ్రూప్ అధినేత కిశోర్ బియానీ చాలా కాలం నుంచీ ప్రపంచంలోని ఒక పెద్ద రిటెయిలర్‌తో చేతులు కలపాలనే ప్రయత్నాల్లో ఉన్నారు. వాల్‌మార్ట్‌తో కూడా ఆయన సుదీర్ఘ చర్చలు నడిచాయి. ప్రపంచంలో చాలా దిగ్గజాలతో మాట్లాడారు.
అయితే, ఎట్టకేలకు రిలయన్స్‌తో వీరికి ఒప్పందం కుదిరింది. ఫ్యూచర్ గ్రూప్ తన మొత్తం రిటెయిల్, హోల్‌సేల్ వ్యాపారాన్ని రిలయన్స్ గ్రూప్ కంపెనీ అయిన రిలయన్స్ రిటెయిల్ వెంచర్స్ లిమిటెడ్‌కు విక్రయించే ఒప్పందంపై సంతకాలు చేసింది.
దానికోసం రిలయన్స్ సుమారు 24,700 కోట్లు చెల్లించనుందని ఆగస్టులో ఈ రెండు కంపెనీలు ప్రకటించాయి.

ఫొటో సోర్స్, Getty Images
అమెజాన్ ఎలా వచ్చింది?
భారత్‌లో తమ వ్యాపార లావాదేవీల విస్తరణకు అమెజాన్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. దీనిలో భాగంగానే 2019లో ఫ్యూచర్ గ్రూప్‌కు చెందిన ‘‘ఫ్యూచర్ కూపన్స్’’లో అమెజాన్‌కు 49 శాతం వాటా కొనుగోలు చేసింది. దీని ద్వారా ఫ్యూచర్ గ్రూప్‌లో అమెజాన్‌కు 9.82 శాతం వాటా ఉన్నట్లు అయింది.
అయితే, ఒప్పంద సమయంలో ఫ్యూచర్ గ్రూప్ తమ ఆస్తులను ఏ భారతీయ గ్రూప్‌కు విక్రయించకుండా ఉంటామనే షరతుకు అంగీకరించిందని అమెజాన్ వెల్లడించింది. ఫ్యూచర్ గ్రూప్ ఆ షరతుకు అంగీకరిచడంతోనే తాము రూ.1431 కోట్లను పెట్టుబడిగా పెట్టామని వివరించింది.

ఫొటో సోర్స్, Getty Images
ఇప్పుడు ఒకవేళ ఫ్యూచర్ గ్రూప్‌తో రిలయన్స్‌కు ఒప్పందం కుదిరితే.. భారత్‌లోని 420 నగరాల్లో ఉన్న 1800 పెద్ద పెద్ద మాల్స్ రిలయన్స్ చేతుల్లోకి వెళ్తాయి. మరోవైపు ఫ్యూచర్ గ్రూప్ హోల్‌సేల్ విభాగం, లాజిస్టిక్స్ విభాగం కూడా రిలయన్స్ చేతుల్లోకి వెళ్లిపోతాయి.
ఒకవేళ ఈ ఒప్పందాన్ని అడ్డుకుని అమెజాన్ ఆ వాటాను కొనుగోలు చేస్తే, భారత మార్కెట్‌లో అమెజాన్ పైచేయి సాధిస్తుంది.
అందుకే ఈ ఒప్పందాన్ని అడ్డుకోవాలని సింగపూర్ మధ్యవర్తిత్వ సంస్థ నుంచి అమెజాన్ ఆదేశాలను తీసుకొచ్చింది.
ఇవి కూడా చదవండి:
- టోక్యో ఒలింపిక్స్: పోరాడి ఓడిన భారత మహిళల హాకీ జట్టు.. కాంస్యం కైవసం చేసుకున్న బ్రిటన్
- టోక్యో ఒలింపిక్స్: భారత్ గెలిచిన, తృటిలో చేజారిన పతకాలు ఇవే
- పెగాసస్ స్పైవేర్: ఇప్పటికీ సమాధానాలు దొరకని కీలక ప్రశ్నలు
- తెలంగాణ: ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఇంకా ఎన్ని ఇస్తారు?
- టోక్యో ఒలింపిక్స్: ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా ఉత్సవం ప్రత్యేకతలేంటి? భారత్ నుంచి ఎవరెవరు వెళ్తున్నారు?
- ప్రమాదం అని తెలిసినా చైనాలో ప్లాస్టిక్ సర్జరీల సంఖ్య ఎందుకు పెరుగుతోంది
- దానిష్ సిద్దిఖీ: పులిట్జర్ ప్రైజ్ అందుకున్న భారత ఫొటో జర్నలిస్ట్ తీసిన మరపురాని ఛాయా చిత్రాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








