ISWOTY: పలక్ కోహ్లీ నుంచి అవని లేఖరా వరకు... భారత మహిళా పారా అథ్లెట్ల విజయ విహారం

- రచయిత, వందన
- హోదా, టీవీ ఎడిటర్, ఇండియన్ లాంగ్వేజెస్
పలక్ కోహ్లీని మొదట చూడగానే ఒక సాధారణ టీనేజర్‌లా కనిపిస్తారు. 19 ఏళ్ల ఆమె చురుగ్గా, ఉత్సాహంగా సోషల్ మీడియాను స్క్రోల్ చేస్తుంటారు.
కానీ, ఈ అభిప్రాయం మీరు పలక్‌ను బ్యాడ్మింటన్ కోర్టులో చూడనంతవరకు మాత్రమే ఉంటుంది. ఆమె బరిలో దిగాక తప్పకుండా మీ అభిప్రాయం మారిపోతుంది.
బ్యాడ్మింటన్ కోర్టులో పలక్ సంధించే బలమైన ఫోర్‌హ్యాండ్, బ్యాక్‌హ్యాండ్ షాట్లు సుదీర్ఘంగా సాగే ర్యాలీలు ఆమె అథ్లెటిక్స్ సామర్థ్యాలకు అద్ధం పడతాయి. మ్యాజిక్ చేస్తున్నట్లుగా రెప్పపాటులో ఆమె మరో కొత్త వ్యక్తిగా మారిపోయి ఆటలో సత్తా చాటుతారు.
ఈ మార్పును గ్రహించడానికి మీకు కొంత సమయం పడుతుంది.

ఫొటో సోర్స్, Getty Images
పూర్తిగా అభివృద్ధి చెందని చేయితో పలక్ జన్మించారు. కేవలం ఒక చేతి సహాయంతోనే ఆమె బ్యాడ్మింటన్‌లో ఆకట్టుకుంటున్నారు. టోక్యో పారాలింపిక్స్‌లో భారత్ తరఫున ఆడిన ఏకైక క్రీడాకారిణి 19 ఏళ్ల పలక్.
ఇంత చిన్న వయస్సులో పారాలింపిక్స్ వరకు వెళ్లడం పలక్ సాధించిన పెద్ద ఘనతగా చెప్పుకోవచ్చు. ఈ స్థాయికి చేరుకోవడానికి ఆమె చేసిన పోరాటం కూడా పెద్దది, చాలా కఠినమైనది కూడా.
వికలాంగుల కోసం పారా-స్పోర్ట్స్ ఉంటాయనే సంగతి చాలా మందికి తెలియదు. 2016 వరకు పలక్, ఆమె తల్లిదండ్రులు కనీసం ఈ పదాన్ని కూడా వినలేదు.
బ్యాడ్మింటన్ క్రీడలోకి రావడం యాదృచ్ఛికంగా జరిగిందని పలక్ చెప్పారు. ''జలంధర్‌లో ఉంటున్నప్పుడు రోడ్డుపై వెళ్తోన్న నన్ను ఒకాయన ఆపారు. నువ్వు పారా బ్యాడ్మింటన్ ఎందుకు ఆడకూడదు? అని అడిగారు. అప్పుడే నాకు పారా బ్యాడ్మింటన్ గురించి తొలిసారి తెలిసింది'' అని ఆమె అన్నారు.
ఆ అపరిచితుడు సూచించిన మేరకు పలక్, 2017లో బ్యాడ్మింటన్ రాకెట్ పట్టారు. అపరిచితుడిగా తారసపడిన ఆ వ్యక్తే తర్వాత ఆమెకు కోచ్‌గా మారారు. ఆయనే గౌరవ్ ఖన్నా. రెండేళ్ల కాలంలోనే ఆమె విశ్వవేదికగా టోర్నమెంట్‌లు గెలవడం ప్రారంభించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
''అందరూ వైకల్యాన్నే ఎత్తి చూపిస్తారు. చిన్నతనంలో నన్ను మొదటిసారి కలిసిన ప్రతీ ఒక్కరూ, నీ చేయికి ఏమైంది అని అడిగేవారు. ఇది పుట్టుకతో వచ్చింది అని చెప్పేదాన్ని. అప్పుడు నేను చిన్నపిల్లను. నాకు పుట్టుక అంటే అర్థమేంటో కూడా తెలియదు. నాకు తెలిసింది ఒక్కటే. ఎవరైనా నా చేయి గురించి అడిగితే పుట్టినప్పటి నుంచి అలాగే ఉందని సమాధానం చెప్పడం'' అని పలక్ చెప్పారు.
''మొదట్లో ఆటలు ఆడాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఎందుకంటే నేను ఆడటానికి వెళ్లినపుడు... నీవు ఆడలేవు. వికలాంగురాలివి అనేవారు.''
''కానీ నేను నా వైకల్యాన్ని అద్భుత సామర్థ్యంగా మార్చుకున్నా. పారా బ్యాడ్మింటన్ నా జీవితాన్ని మార్చేసింది'' అని ఆమె చెప్పారు.
పలక్ ఒక్కరే కాదు. ఆమెలా క్రీడల్లో గొప్ప పేరు తెచ్చుకుంటోన్న భారతీయ వికలాంగ మహిళా క్రీడాకారిణులు ఎందరో ఉన్నారు.
వారి ఆటతో చరిత్ర సృష్టించడమే కాకుండా దేశానికి పతకాలు అందిస్తున్నారు. మరీ ముఖ్యంగా వికలాంగుల్లో ఏదైనా సాధించగలమనే ప్రేరణను, స్ఫూర్తిని రగిలిస్తున్నారు.
భారతదేశంలో నేటికీ చాలామంది క్రీడాకారులు వారి సొంత కుటుంబం, సమాజం నుంచి సవాళ్లను, వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. పేదరికం, వైకల్యం అనే అంశాలు క్రీడాకారులు మార్గాన్ని మరింత కష్టతరం చేస్తాయి.
ఇక ఆ ప్లేయర్ అమ్మాయి అయితే ఆమె కష్టాలు మరింత రెట్టింపు అవుతాయి.
కళ్లు కనిపించకపోయినా పరుగులో రాణిస్తోన్న సిమ్రన్
23 ఏళ్ల సిమ్రన్, టోక్యో పారాలింపిక్స్ 100మీ. పరుగుకు అర్హత సాధించిన తొలి భారతీయ మహిళా అథ్లెట్.
ఆమె నెలలు నిండకుండానే జన్మించారు. అప్పటి నుంచే తనకు కళ్లకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి.
పారాలింపిక్స్ ముందు సిమ్రన్ తన గురించి మాట్లాడారు. ''నా కళ్లు సరిగా పనిచేయవు. అంటే నేను ఒకే వస్తువుపై దృష్టిని కేంద్రకరించలేను. అందుకే చిన్నప్పుడు మా బంధువులే నన్ను ఎగతాళి చేసేవారు. నాపై జోకులు వేసేవారు. 'ఈ అమ్మాయి చూపు ఒకవైపు ఉంటుంది, మాట మరోవైపు ఉంటుంది' అంటూ గేలి చేసేవారు. నాకు చాలా బాధ అనిపించేది'' అని అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
చిన్నప్పటి నుంచి సిమ్రన్ మంచి రన్నర్. కానీ ఆమె తల్లిదండ్రుల వద్ద డబ్బు లేదు. 18 ఏళ్ల వయస్సులోనే ఆమెకు పెళ్లి జరిగింది.
పెళ్లి తర్వాత ఆమెకు మరో అవకాశం లభించింది. కోచ్ మార్గదర్శకత్వంలో తన కలలు నిజం చేసుకునేందుకు, తనకు నచ్చిన జీవితాన్ని గడిపేందుకు ఆమె ముందు అవకాశం నిలిచింది. ఆమె భర్తే ఆమె కోచ్.
అత్తవారింటిని చూసుకోవాల్సిన నవ వధువు, రోడ్లపై పరుగులు పెడుతుండటంపై ఆమె భర్త గ్రామంలో పెద్ద దుమారమే చెలరేగింది.
కానీ సిమ్రన్, ఆమె భర్త ఎవరి మాటల్ని పట్టించుకోలేదు. 2019, 2021 ప్రపంచ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిక్స్‌లో సిమ్రన్ స్వర్ణ పతకాలు గెలుచుకున్నారు.
ఒకప్పుడు తన వైకల్యాన్ని దెప్పిపొడిచిన బంధువులే ఇప్పుడు తనపై ప్రశంసలు కురిపిస్తున్నారని సిమ్రన్ చెప్పుకొచ్చారు.
నెమ్మది నెమ్మదిగా అయినా సరే, మహిళా పారా ప్లేయర్లు క్రీడల్లో తమ స్థానాన్ని సంపాదించుకోవడం ప్రారంభించారు.

ఫొటో సోర్స్, REUTERS/ISSEI KATO
అవని లేఖరా: భారత్‌కు పారాలింపిక్స్ తొలి స్వర్ణం అందించిన షూటర్
పారా షూటర్ అవని లేఖరా గురించి ఇప్పుడు అందరికీ తెలుసు. 19 ఏళ్ల అవని లేఖరా, పారాలింపిక్స్‌లో బంగారు పతకం సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణి.
ఆమె 2021లో కూడా 'బీబీసీ స్పోర్ట్స్ వుమెన్ ఆఫ్ ద ఇయర్' పురస్కారానికి నామినేట్ అయ్యారు.
10 ఏళ్ల వయస్సులో ఆమె ఒక ప్రమాదానికి గురయ్యారు. అప్పటి నుంచి వీల్‌చెయిర్‌కే పరిమితమయ్యారు. పారాషూటింగ్ ఆమెకు మరో కొత్త జీవితాన్ని అందించింది.
ఆమె వెళ్లే షూటింగ్ రేంజ్‌లో వికలాంగుల కోసం ర్యాంప్ కూడా లేదు. దీంతో ఆమె స్వయంగా ర్యాంప్‌ను ఏర్పాటు చేశారు.
పారా షూటర్లు ఉపయోగించే పరికరాలు ఎక్కడ దొరుకుతాయో కూడా మొదట్లో అవనికి, ఆమె తల్లిదండ్రులకు తెలియదు.
జైపూర్‌లోని షూటింగ్ రేంజ్‌లో అవని ప్రాక్టీస్ చేస్తుండగా చూసే అవకాశం నాకు దక్కింది. అది చూశాక షూటింగ్‌లో ఆమె ఎందుకు అగ్రస్థానంలో ఉందో అర్థమైపోయింది.
అద్భుతమైన ఏకాగ్రత, పర్‌ఫెక్ట్‌గా ఉండాలనే తపన ఆమెను ప్రత్యేకంగా నిలుపుతాయి.
''వికలాంగ క్రీడాకారులు ఎవరి సానుభూతిని కోరుకోరు. వీల్‌చెయిర్‌లో కూర్చొని ఆడటం సులభంగానే ఉంటుందని ప్రజలు అనుకుంటారు. మేం కూడా సాధారణ క్రీడాకారుల తరహాలోనే కష్టపడుతున్నాం అని నేను అందరికీ చెప్పాలనుకుంటున్నా. మాకు కూడా సమాన అవకాశాలు దక్కాలి'' అని అవని అన్నారు.
కొన్నేళ్ల క్రితం వరకు అంతర్జాతీయ స్థాయిలో మంచి ప్రదర్శన చేసిన తర్వాత కూడా వికలాంగ క్రీడాకారులకు, ముఖ్యంగా క్రీడాకారిణులకు మీడియాలో కవరేజీ లభించేది కాదు.
కానీ ఇప్పుడు ఈ పరిస్థితిలో నెమ్మదిగా మార్పు కనిపిస్తోంది. గుజరాత్‌కు చెందిన పరుల్ పర్మార్ ప్రపంచ పారా బ్యాడ్మింటన్ చాంపియన్‌గా అవతరించినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు.

ఫొటో సోర్స్, SAM PANTHAKY/Getty images
2019లో భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు తొలిసారి ప్రపంచ చాంపియన్‌షిప్ గెలుచుకున్నారు. అదే సమయంలో భారత పారా బ్యాడ్మింటన్ క్రీడాకారిణి మాన్సీ జోషి కూడా ప్రపంచ చాంపియన్ అయ్యారు. అప్పుడు ప్రజలు పారా బ్యాడ్మింటన్, వికలాంగ క్రీడాకారుల గురించి బహిరంగంగా మాట్లాడటం మొదలుపెట్టారు.
ఒక రోడ్డు ప్రమాదం కారణంగా మాన్సీ కాలును తీసేయాల్సి వచ్చింది.
చిన్న పట్టణాలు, నగరాల్లో పారా స్పోర్ట్స్ గురించి సరైన సమాచారం లేకపోవడం, జెండర్ పేరుతో మహిళా క్రీడాకారులపై వివక్ష, వికలాంగ క్రీడాకారులకు సౌకర్యంగా ఉండే స్టేడియాలు లేకపోవడం వంటి కారణాల వల్ల వికలాంగ మహిళా క్రీడాకారులు ఆటల్లో వెనుకబడి ఉన్నారు.
వీటితో పాటు కోచ్‌ల కొరత కూడా పెద్ద సమస్య. వికలాంగుల శిక్షణ గురించి మాన్సీ జోషి కోచ్ గోపీచంద్, బీబీసీతో మాట్లాడారు. ''వికలాంగ క్రీడాకారులకు మంచి శిక్షణ ఇవ్వడం ఎలా అని తెలుసుకోవడానికి నేను చాలా వీడియోలు చూడాల్సి వచ్చింది. వారి ఇబ్బందులను సరిగ్గా అర్థం చేసుకోవడం కోసం ఒక్క కాలుతో బ్యాడ్మింటన్ ఆడేందుకు కూడా ప్రయత్నించాను. మాన్సీ కోసం మా సిబ్బందితో కలిసి ఒక ప్రత్యేక ట్రైనింగ్ కార్యక్రమాన్ని తయారు చేశాను'' అని ఆయన చెప్పారు.
ఇక్కడ చాలా సవాళ్లు ఉన్నాయి. కానీ తమకు సరైన మార్గదర్శకత్వం, సౌకర్యాలు, అవకాశాలు లభిస్తే తామెవరికీ తీసిపోమని భారత పారా క్రీడాకారిణులు నిరూపించారు.
పారాలింపిక్స్‌లో మొదట పతకం సాధించిన భారతీయ మహిళ దీపా మలిక్. ఆమె పారాలింపిక్స్ కమిటీ ఆఫ్ ఇండియా అధ్యక్షురాలిగా ఉన్నారు. 2016లో ఆమె పారాలింపిక్స్‌లో కాంస్యాన్ని గెలుచుకున్నారు.
2021 వచ్చేనాటికి భారత పారా క్రీడాకారిణులు పారాలింపిక్స్‌లో రజతం, స్వర్ణాలను సాధించారు.

ఫొటో సోర్స్, ITTF
వీల్‌చెయిర్‌లో కూర్చొని ఆడుతూ టీటీలో ఆకట్టుకుంటోన్న భావినా
టోక్యో పారాలింపిక్స్ టేబుల్ టెన్నిస్ విభాగంలో పతకం గెలుపొందిన తొలి భారతీయ మహిళ, 33 ఏళ్ల భావినా హస్ముఖ్‌భాయి పటేల్.
''భావినా 13 ఏళ్లుగా టేబుల్ టెన్నిస్ ఆడుతున్నారు. ఆటతో పాటు ఉద్యోగం చేస్తున్నారు. పెళ్లి తర్వాత కుటుంబాన్ని చూసుకుంటున్నారు. ఇవన్నీ మనం గుర్తించాల్సిన, అభినందించాల్సిన అంశాలు'' అని ఆమె కోచ్ లల్లన్‌భాయి దేశీ అన్నారు.
వికలాంగ ఆటగాళ్ల గురించి సమాజంలో ఒకలాంటి ఆలోచన స్థిరపడిపోయింది. కానీ ఇప్పుడు అందులో మార్పు కనబడుతోంది.
వీల్‌చెయిర్‌లో కూర్చుండి టేబుల్ టెన్నిస్ ఆడే భావినాకు తన తండ్రి, భర్త నుంచి పూర్తి మద్దతు లభించింది.
రూబినా: 2021 పారా షూటింగ్ ప్రపంచకప్ చాంపియన్
21 ఏళ్ల రూబినా కథ కూడా వీరికి భిన్నంగా ఏం ఉండదు. రూబినా తండ్రి జబల్‌పూర్‌లో మెకానిక్. ఆమె తల్లి నర్స్.
గత ఏడాది పెరూలో జరిగిన పారా షూటింగ్ ప్రపంచకప్‌లో రూబినా స్వర్ణ పతకాన్ని గెలిచారు.
''డబ్బులు లేకపోవడం, అవగాహనలేమి కారణంగా చిన్నతనంలో నేను చికిత్స పొందలేకపోయాను. దీని కారణంగా శాశ్వత వికలాంగురాలిగా మారిపోయాను. మా ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఏమీ లేదు. కానీ మా అమ్మనాన్న నన్ను రాజకుమారిలా చూసుకుంటారు. పారా షూటింగ్‌లో రాణించాలనేది నా కల. ఇదే నా తల్లిదండ్రుల కల కూడా. షూటింగ్ నా జీవితాన్ని మార్చేసింది'' అని రూబినా చెప్పారు.
నేను మాట్లాడిన వికలాంగ క్రీడాకారుల్లో చాలా మంది పారా స్పోర్ట్స్ తమ జీవితాలను మార్చేశాయని నమ్ముతారు.
''నిజానికి పారా స్పోర్ట్స్ నా ప్రాణాన్ని కాపాడాయి. నా జీవితాన్ని రక్షించాయి. నాకు కొత్త గుర్తింపును ఇచ్చాయి. పురుషాధిక్యత ఉన్న ఈ సమాజంలో వికలాంగురాలిని, మహిళను అయినప్పటికీ నాకు గౌరవాన్ని అందించాయి'' అని సిమ్రాన్ అన్నారు.
గత ఏడాది టోక్యో పారాలింపిక్స్‌లో పాల్గొన్న పురుషులతో పోలిస్తే మహిళా క్రీడాకారుల సంఖ్య చాలా తక్కువ. అయినప్పటికీ అవని లేఖర హర్షం వ్యక్తం చేశారు.
''ఒక మహిళ, క్రీడాకారిణిగా ఎదగడం చాలా కష్టం. భద్రతా కారణాల రీత్యా అమ్మాయిలను ఒంటరిగా బయటకు పంపరు. ఖర్చు కూడా అధికం అవుతుంది. అందుకే మహిళా క్రీడాకారులకు అవకాశాలు తక్కువ. కానీ తమకు అందుతోన్న అవకాశాల్లోనే మహిళలు తమను తాము నిరూపించుకుంటున్నారు.''
''మీరు చూడండి, రాబోయే రోజుల్లో పురుషులు, మహిళలు సమాన సంఖ్యలో పతకాలను సాధించుకొని వస్తారు. దీనికి ఇంకా చాలా కాలం పడుతుంది. కానీ ఇప్పటికైతే మనం ఆ దిశగా సరైన దారిలోనే వెళ్తున్నాం'' అని అవని అన్నారు.
''మీరు మహిళలు.. మీరు వికలాంగులు.. కాబట్టి మీరు మీ కలలను సాధించలేరు అని ప్రపంచం మొత్తం మీకు చెప్పినప్పటికీ మీరు పట్టించుకోకండి. ఎందుకంటే ప్రపంచంలో ప్రతీది సాధ్యమే. నేను సాధించినప్పుడు మీరెందుకు సాధించలేరు'' అని పలక్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఒక్క ఆయుధాన్ని కూడా కొనలేదా, ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ వాదనలో నిజమెంత?
- భగత్‌సింగ్ 90 ఏళ్ల క్రితం కులం గురించి ఏం చెప్పారు?
- బోయిగూడలో ఘోర అగ్నిప్రమాదం, 11 మంది సజీవ దహనం
- జీవో 111 ఏంటి, ఎలా వచ్చింది, గండిపేట, హిమాయత్ సాగర్ చెరువులు మరో హుస్సేన్ సాగర్లా మారనున్నాయా
- పాకిస్తాన్లో హిందూ యువతి హత్య, ‘ప్రతిఘటించడంతో తుపాకీతో కాల్చి చంపేశారు’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













