కర్ణాటక స్కూల్ పుస్తకాల్లో ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు హెడ్గేవార్ ప్రసంగాలను ఎందుకు ప్రవేశపెడుతున్నారు

ఆరెస్సెస్ వ్యవస్థాపకుడు కేశవ్ బలిరామ్ హెడ్గేవార్

ఫొటో సోర్స్, RSS

ఫొటో క్యాప్షన్, ఆరెస్సెస్ వ్యవస్థాపకుడు కేశవ్ బలిరామ్ హెడ్గేవార్
    • రచయిత, ఇమ్రాన్ ఖురేషీ
    • హోదా, బీబీసీ కోసం

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) వ్యవస్థాపక అధ్యక్షుడు కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ ప్రసంగాన్ని కర్ణాటకలో స్కూల్ సిలబస్‌లో చేర్చే అంశంపై వివాదం రాజుకుంటోంది. హెడ్గేవార్ ప్రసంగం కన్నడ భాషా పాఠ్య పుస్తకంలో చేర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది.

కర్ణాటక ప్రభుత్వం భగత్ సింగ్‌‌పై పాఠ్యాంశాన్ని తొలగించే ప్రయత్నాలను వెనక్కి తీసుకోవడం ద్వారా పెద్ద వివాదాన్ని నివారించిందని కొందరు విద్యావేత్తలు భావిస్తున్నారు.

భగత్ సింగ్ పాఠాన్ని సిలబస్ నుంచి తొలగించే నిర్ణయాన్ని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యతిరేకించారు. నిరసనలు, ఆందోళనల తర్వాత, ప్రభుత్వం భగత్ సింగ్‌పై రాసిన అధ్యాయాన్ని తొలగించే నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది.

అయితే, హెడ్గేవార్‌‌పై ఎవరైనా రాసిన పాఠ్యాంశాలను కాకుండా, ఆయన ప్రసంగాన్ని సిలబస్‌లో చేర్చిన మొదటి రాష్ట్రం కర్ణాటక. ఈ అకడమిక్ సెషన్‌లో పదవ తరగతి విద్యార్థులు హెడ్గేవార్ ప్రసంగాన్ని తమ పాఠ్య పుస్తకాలలో చదవనున్నారు.

దశాబ్దాలుగా బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు దేశంలో చాలానే ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు ఏ రాష్ట్రం కూడా హెడ్గేవార్ ప్రసంగాన్ని స్కూల్ సిలబస్‌లో చేర్చలేదు. కర్ణాటక సిలబస్‌లో చేర్చిన హెడ్గేవార్ ప్రసంగం ‘నిజమైన ఆదర్శ పురుషుడు ఎవరు’ అనే పేరుతో ఉంటుంది.

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యకర్తలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యకర్తలు

రాష్ట్ర ప్రభుత్వం ఏం చెబుతోంది?

రాష్ట్ర ప్రాథమిక, మాధ్యమిక విద్యాశాఖ మంత్రి బీసీ నగేశ్ ఈ అంశంపై బీబీసీతో మాట్లాడారు.

''ఇంత వరకు హెడ్గేవార్ ప్రసంగాలు ఏవీ పాఠ్యాంశంగా చేర్చలేదు. ఈ కంటెంట్‌పై విమర్శలు ఉంటే, నేను దానిని వినడానికి సిద్ధంగా ఉన్నాను. ఇక భగత్ సింగ్ పాఠాన్ని తొలగించే విషయం మా ఆలోచనలోకి కూడా రాలేదు. అది మళ్లీ మళ్లీ ముద్రితమవుతూనే ఉండాలి'' అని అన్నారు.

భగత్ సింగ్ పాఠాన్ని తొలగించరాదన్న నిర్ణయంతో ప్రభుత్వ నైతిక స్థైర్యం పెరిగినట్లు కనిపిస్తోంది. ప్రశాంతంగా ఉన్న విద్యాశాఖ మంత్రి టెలివిజన్ ఛానెళ్లలో గట్టిగా మాట్లాడటానికి కారణం ఇదే కావచ్చు.

''మీకు అభ్యంతరం ఉంటే నిరసన తెలియజేయండి. కానీ ప్రభుత్వం హెడ్గేవార్ ప్రసంగాన్ని పాఠశాల సిలబస్ నుండి తొలగించదు'' అని మంత్రి బీసీ నగేశ్ అన్నారు.

''భగత్ సింగ్ చిన్ననాటి రోజులు, ఆయన విప్లవ కార్యకలాపాల గురించి మేం సిలబస్‌లో మరిన్ని విషయాలను జోడించాం. మునుపటి పాఠం కేవలం ఆయన చిన్ననాటి రోజుల గురించి మాత్రమే చెబుతుంది'' అని టెక్ట్స్‌బుక్ రివ్యూ కమిటీ ఛైర్మన్ రోహిత్ చక్రతీర్ధ అన్నారు.

కర్ణాటక ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న విద్యార్ధి సంఘాలు

ఫొటో సోర్స్, IMRAN QURESHI/BBC

ఫొటో క్యాప్షన్, కర్ణాటక ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న విద్యార్ధి సంఘాలు

హెడ్గేవార్ ప్రసంగాన్ని ఎందుకు చేర్చారు?

"ఇది ఆయన అనేక ప్రసంగాలలో ఒకటి" అని చక్రతీర్థ చెప్పారు. ఈ ప్రసంగం గురించి చాలామందికి పెద్దగా తెలియనప్పటికీ, 15 సంవత్సరాలపాటు ఆయన నడిపించిన సంఘ్ ఉద్యమ సమయంలో చేసిన ప్రసంగాలలో ఇదొకటి. ( హెడ్గేవార్ 1940లో మరణించారు).

"ఇది చిన్న పిల్లలకు చాలా ముఖ్యం" అని చక్రతీర్ధ అన్నారు. సమాజంలోని వివిధ విభాగాల నుంచి తమ రోల్ మోడల్‌లను ఎంచుకునే వారు. చాలామంది క్రికెటర్లు లేదా సినిమా హీరోలను రోల్ మోడల్‌గా చూస్తారు. ఈ రోజుల్లో యువత చాలా గందరగోళంలో ఉంది. ఈ ప్రసంగం ద్వారా ఆయన విజన్ స్పష్టంగా కనిపిస్తుంది. విలువలతో కూడిన జీవితాన్ని గడిపిన వారికి రోల్ మోడల్స్ ముఖ్యం'' అని చక్రతీర్ధ వ్యాఖ్యానించారు.

అయితే, హెడ్గేవార్ ప్రసంగాన్ని పాఠ్యాంశాల్లో చేర్చడంపై మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నాయకుడు సిద్ధరామయ్య అభ్యంతరం వ్యక్తం చేశారు.

వీడియో క్యాప్షన్, బతేశ్వర్ ఆలయ పునర్నిర్మాణం కోసం ముస్లిం పోరాటం

''భారత స్వాతంత్ర్య పోరాటంలో హెడ్గేవార్ ఎప్పుడూ పాల్గొనలేదు. విద్యార్థులకు మతతత్వాన్ని నమ్మే వ్యక్తి ప్రసంగాన్ని నేర్పించడం ఏంటి? మేం న్యాయ నిపుణులను సంప్రదిస్తున్నాం. ప్రభుత్వ నిర్ణయాన్ని కోర్టులో సవాలు చేస్తాం'' అని ఆయన బీబీసీతో అన్నారు.

మరో మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత హెచ్‌డీ కుమారస్వామి కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని ట్వీట్‌ల ద్వారా తీవ్రంగా విమర్శించారు. ''హిజాబ్, హలాల్, వ్యాపార సంస్థల సమస్యల తర్వాత ఇప్పుడు బీజేపీ పుస్తకాల మీద పడింది. ఇది వారి పతనానికి పరాకాష్ట'' అని ఒక ట్వీట్‌లో విమర్శించారు.

ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, సీపీఐ(ఎం)కి అనుబంధంగా ఉన్న మరికొన్ని సంస్థలు తప్ప మరే ఇతర ప్రధాన రాజకీయ పార్టీకి చెందిన విద్యార్థులు లేదా యువజన సంఘాలు నిరసన ప్రదర్శనలు నిర్వహించలేదు.

హెడ్గేవార్ వృత్తిరీత్యా వైద్యుడు. బంకిం చంద్ర ఛటర్జీ, వీర్ సావర్కర్ హిందుత్వ విధానాలకు ప్రభావితమైన వ్యక్తి. స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నా, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఏర్పడిన తరువాత ఉద్యమానికి దూరంగా ఉన్నారు. హిందూ రాజ్యాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశ్యంతో హిందువులను సంఘటితం చేయడానికే పరిమితమయ్యారు.

హెడ్గేవార్ పాఠ్యాంశం ప్రవేశపెట్టడం పై కొన్ని పార్టీలకు చెందిన విద్యార్ధి సంఘాలే నిరసన తెలిపాయి

ఫొటో సోర్స్, IMRAN QURESHI/BBC

ఫొటో క్యాప్షన్, హెడ్గేవార్ పాఠ్యాంశం ప్రవేశపెట్టడం పై కొన్ని పార్టీలకు చెందిన విద్యార్ధి సంఘాలే నిరసన తెలిపాయి

హెడ్గేవార్ ప్రసంగంలో ఏముంది?

హెడ్గేవార్ ప్రసంగం శీర్షిక ‘నిజమైన ఆదర్శ పురుషుడు ఎవరు’

ఎలాంటి లోపాలు లేని ఆదర్శవంతుడైన వ్యక్తిని గుర్తించడం కష్టమని ఉపోద్ఘాతంలో పేర్కొన్నారు. ‘‘ఒక వ్యక్తిని ఆదర్శంగా లేదా ఉదాహరణగా చూసే బదులు, వారి సిద్ధాంతాలు, అంతర్గత విలువలను అనుసరించాలి. కానీ ఈ తత్వాన్ని ఆచరణలో పెట్టడం కూడా అంతే కష్టం'' అని పేర్కొన్నారు.

''సమాజంలో విగ్రహారాధన ఉనికిలోకి రావడానికి ఇదే కారణం. విగ్రహారాధన అనేది విశ్వశక్తి అవ్యక్త స్వభావం గురించి చైతన్యాన్ని వ్యాప్తి చేసే మార్గం'' అని ఆయన పేర్కొన్నారు.

''మనం జెండాను గురువుగా భావించి గురుపూర్ణిమ రోజున పూజిస్తాం. మన జెండాను చూసినప్పుడల్లా మన దేశ చరిత్ర, సంస్కృతి, సంప్రదాయం మొత్తం మన కళ్ల ముందు వస్తుంది. మన జెండాను చూడండి, మన హృదయాలలో భావోద్వేగాలు పెరుగుతాయి. అందుకే మనం జెండాను గురువుగా భావిస్తాం'' అని ఆయన పేర్కొన్నారు.

''కృష్ణుడి వంటి వ్యక్తిత్వాన్ని మొత్తం దేవుళ్ల సమూహంలోకి లేదా అవతారాల సమూహంలోకి నెట్టివేశారు. అందుకే ఆయనలా ప్రవర్తించడం మన శక్తికి మించిన పని అన్న భావన ఏర్పడింది. మనం శ్రీరాముడు, శ్రీ కృష్ణుడిని పూజిస్తాం. రామాయణం వంటి గొప్ప గ్రంథాలు, గీత,మహాభారతాలు వాటి ఆదర్శాలను పుణికిపుచ్చుకోవడానికి చదవడం లేదు. కేవలం దానివల్ల కలిగే పుణ్యం సంపాదించడం కోసమే జరుగుతుంది. ఇది ఎంత సంకుచిత మనస్తత్వం?'' అని ఆయన అన్నారు.

"మన పతనానికి ఈ రకమైన సంకుచిత మనస్తత్వం కూడా ఒక కారణం" అని ఆయన చెప్పారు. ఛత్రపతి శివాజీ, లోకమాన్య తిలక్ కూడా అవతారాలలో చేర్చారని ఆయన అన్నారు.

''మన మహానుభావులను దేవుళ్ల కోవలోకి చేర్చడం విచిత్రం. అందుకే వారిలో గుణాలను అలవర్చుకునే ప్రయత్నాలు ఎవరూ చేయడం లేదు. మొత్తం మీద మనం మన బాధ్యతల నుంచి తప్పించుకునే నైపుణ్యాన్ని నేర్చుకున్నాం'' అని పేర్కొన్నారు.

హెడ్గేవార్

ఫొటో సోర్స్, RSS.ORG

ఫొటో క్యాప్షన్, హెడ్గేవార్

సిలబస్ నుంచి ఎవరి పాఠాలను తొలగించారు?

పాఠశాల పుస్తకాల నుండి తొలగించిన పాఠ్యంశాలలో అవార్డు గెలుచుకున్న రచయితలు పి.లంకేష్, సారా అబూబకర్, ఏఎన్ మూర్తి రావు ఉన్నారు. వీరి స్థానంలో శివానంద కల్వే, ఎం.గోవింద్‌రావు, వేదపండితులు దివంగత గోవిందాచార్య, శతవధాని ఆర్‌.గణేశ్‌ల పాఠాలను చేర్చారు.

''విద్యార్థులకు లంకేశ్, మూర్తి రావుల కథలు బోర్‌గా అనిపించాయి. అందుకే కొత్త పేర్లు, తాజా విషయాలను తీసుకురావాలని అనుకున్నాం. లంకేశ్ పుస్తకంలో ఎలాంటి ఉపయోగం కనిపించదు. పైగా ఈ కంటెంట్‌ను సంక్షిప్తీకరించారు. సాహిత్యపరమైన ప్రాముఖ్యం లేదు. అందుకే దానిని తొలగించాం'' అని చక్రతీర్థ అన్నారు.

అయితే ప్రొఫెసర్ నిరంజన్ రాధ్య ఈ వాదనతో ఏకీభవించ లేదు. ఆయన 'నెవర్‌హుడ్ కామన్ స్కూల్ సిస్టమ్ త్రూ స్టేట్ ఫండెడ్ పబ్లిక్ ఎడ్యుకేషన్' ఉద్యమ కారుడు .

''చరిత్రను బోధించడంలో ప్రధాన ఉద్దేశం చిన్న పిల్లలకు స్వాతంత్ర్య పోరాటం విలువల గురించి అవగాహన కల్పించడం. భారతదేశ స్వాతంత్ర్య పోరాటం చాలా సుదీర్ఘమైంది. కాబట్టి పిల్లల మనస్సులలో దాని విలువలను పెంపొందించడం చాలా అవసరం’’ అని ప్రొఫెసర్ రాధ్య అన్నారు.

వీడియో క్యాప్షన్, విజయనగరం: ఆటపాటలు, బుర్రకథలతో సోషల్ పాఠాలు చెబుతున్న టీచర్

‘‘ప్రపంచవ్యాప్తంగా స్వాతంత్ర్య పోరాటాలు జరుగుతున్నాయి. హెడ్గేవార్ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనలేదు. హేతువాదంపై మూర్తిరావు పాఠాన్ని తొలగించడం చాలా దురదృష్టకరం. ఇది శాస్త్రీయ దృక్పథం గురించి వివరిస్తుంది. ఇందులోని అంశాలను రాజ్యాంగంలో కూడా చేర్చాలనే ప్రయత్నం కూడా జరుగుతోంది'' అని ప్రొఫెసర్ నిరంజన్ రాధ్య వ్యాఖ్యానించారు.

"ముఖ్యమైన సమస్యల నుండి ప్రజల దృష్టిని మరల్చడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నమని స్పష్టంగా తెలుస్తోంది ఉంది. క్లాస్‌రూమ్‌లో ఒకే రకమైన పిల్లలు ఉండరు. విభిన్న నేపథ్యాల నుంచి వస్తారు. ఇలాంటివి చదువుకోమని ఇస్తే అయోమయంలో పడి వారి మధ్య విభజన ఏర్పడుతుంది'' అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

సంఘ్ కార్యకర్తలు

ఫొటో సోర్స్, FACEBOOK@RSSORG

గత రెండేళ్లలో ప్రభుత్వం తన వ్యూహాన్ని మార్చుకుందని ప్రొఫెసర్ రాధ్య అన్నారు. అంతకుముందు టిప్పు సుల్తాన్‌కు సంబంధించిన పుస్తకాన్ని కూడా పూర్తిగా తొలగించారని, కానీ ఇప్పుడు టిప్పును మైసూర్ టైగర్ అని పిలవడాన్ని ఎవరూ వ్యతిరేకించడం లేదని ఆయన అన్నారు.

వాస్తవాల వక్రీకరణకు వ్యతిరేకంగా అనేక నిరసనల తర్వాత ఈ వైఖరి మారిందని ప్రొఫెసర్ నిరంజన్ రాధ్య అభిప్రాయపడ్డారు. ఇంతకు ముందు కాషాయీకరణ గురించి మాట్లాడటానికి చాలామంది అసౌకర్యంగా ఫీలయ్యేవారని, కానీ, ఇప్పుడు బహిరంగంగానే మాట్లాడుతున్నారని అన్నారు.

''పాఠ్యపుస్తకాలను మేనిఫెస్టోలుగా మారుస్తున్నారన్నది పెద్ద భయం. ఎన్నికల సంవత్సరంలోనే దీన్ని మొదలుపెట్టారు. అసలు సమస్యలను విస్మరిస్తున్నారు. రాష్ట్రంలో ఆరు వేల పాఠశాలల్లో ఒకే టీచర్‌ ఉన్నారు. పాఠ్యపుస్తకాలు సరఫరా కావడం లేదు.. ఇలాంటి పరిస్థితుల్లో దృష్టి మరల్చేందుకు ఇలాంటి సమస్యలు లేవనెత్తుతున్నారు'' అని ప్రొఫెసర్ నిరంజన్ రాధ్య విమర్శించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)