సిజేరియన్ ప్రసవాల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్ ఎందుకు అయింది

గర్బిణి

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, బళ్ల సతీశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

సాధారణ ప్రసవం కాని మహిళలకు బిడ్డను బయటకు తీయడానికి ఆపరేషన్లు చేస్తుంటారు. వీటినే సిజేరియన్లు అని, సీ సెక్షన్ సర్జరీ అని అంటారు. ఒకప్పుడు ఈ ఆపరేషన్ సదుపాయం లేక ఎందరో తల్లీబిడ్డలు మరణించేవారు. ఆ సదుపాయం వచ్చిన తర్వాత వైద్యులు ఎంతోమంది ప్రాణాలను కాపాడగలిగారు.

కానీ, ఇప్పడు అదే సిజేరియన్ ప్రక్రియ మహిళల ఆరోగ్యానికి శాపంగా మారుతోందా? అవసరం ఉన్నా లేకపోయినా చేసే కోతలు నిజంగానే కడుపుకోతగా మారుతున్నాయా? ఈ ఆపరేషన్లు తెలంగాణలోనే ఎందుకు పెరుగుతున్నాయి?

తెలంగాణ టాప్, కృష్ణా జిల్లా నెక్స్ట్

జిల్లా ఆసుపత్రులపై నీతి ఆయోగ్ సర్వే... మొత్తం దేశ ప్రజల ఆరోగ్య పరిస్థితి, వసతులపై జాతీయ సమగ్ర కుటుంబ ఆరోగ్య సర్వే జరిగాయి. ఈ రెండు నివేదికలు పలు ఆసక్తికర అంశాలను తేల్చాయి.

డెలివరీ కోసం చేసే సీ సెక్షన్ సర్జరీల్లో తెలంగాణ దేశంలోనే టాప్‌లో ఉంది. తెలంగాణలో జరిగే ప్రసవాల్లో 60.7 శాతం సిజేరియన్లే. ఇది దేశ సగటు కంటే మూడు రెట్లు ఎక్కువ. కేంద్రపాలిత ప్రాంతాలను పక్కన పెడితే తెలంగాణ తర్వాతి స్థానాల్లో తమిళనాడు (44.9- రెండో స్థానం), ఆంధ్రప్రదేశ్ (42.4- మూడో స్థానం) ఉన్నాయి.

ఇక మిజోరం, మేఘాలయ, నాగాలాండ్‌లలో చాలా తక్కువ. వెనుకబడిన రాష్ట్రాలైన బిహార్, రాజస్థాన్‌లలో కూడా ఆపరేషన్లు తక్కువ. బిహార్లో 9.7 శాతం, రాజస్థాన్లో 10.4 శాతం మంది మాత్రమే సర్జరీలకు వెళ్తున్నారు.

సీజేరియన్లు

ఫొటో సోర్స్, Getty Images

మచిలీపట్నం, కరీంనగర్ పెద్ద ఆసుపత్రుల్లో రికార్డు సంఖ్యలోసిజేరియన్లు

మొత్తం ప్రసవాల్లో 35 శాతం కంటే తక్కువ సీసెక్షన్లు చేసిన జిల్లా ఆసుపత్రులు ఆంధ్రప్రదేశ్‌లో ఒకటి, తెలంగాణలో రెండు మాత్రమే ఉన్నాయి.

200-300 పడకలున్న ఆసుపత్రుల్లో దేశంలోనే అత్యధిక సీ సెక్షన్లు జరిగిన ఆసుపత్రిగా ఖమ్మం జిల్లా ఆసుపత్రి రికార్డు సృష్టించింది. అక్కడ ఏకంగా 65.42 శాతం సిజేరియన్లు జరిగాయి.

ఇక 300 పడకలు, ఆపై ఉన్న పెద్ద స్థాయి ఆసుపత్రుల కేటగిరీలో దేశంలోనే అత్యధిక సీ సెక్షన్లు జరిగిన ఆసుపత్రులు రెండూ తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నట్టు నీతి ఆయోగ్ సర్వే చెబుతోంది.

ఈ విషయంలో మచిలీపట్నం జిల్లా ఆసుపత్రి 73.34 శాతం సిజేరియన్లతో దేశంలో టాప్‌లో ఉండగా, రెండవ స్థానంలో కరీంనగర్ జిల్లా ఆసుపత్రి 69.93 శాతంతో ఉంది.

కేవలం ప్రభుత్వ జిల్లా ఆసుపత్రుల్లో జరిగే సిజేరియన్లనే పరిగణలోకి తీసుకుంటే తమిళనాడు (55.15 శాతం), తెలంగాణ (53.51 శాతం), ఆంధ్రప్రదేశ్‌(42.74 శాతం) వరుసగా మూడు స్థానాల్లో ఉన్నాయి. ఉత్తరప్రదేశ్, బిహార్, ఉత్తరాఖండ్, మేఘాలయల్లో బాగా తక్కువగా కేవలం పది శాతం లోపే సీ సెక్షన్లున్నాయి.

గర్బిణి

ఫొటో సోర్స్, Thinkstock

డబ్బు, చదువు, పట్టణీకరణ ప్రభావం

ఆ సర్వే ప్రకారం పట్టణ ప్రాంతాల్లో, చదువుకున్న, ఎక్కువ ఆదాయం ఉన్న వారిలోనే సిజేరియన్లు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. డబ్బున్న కుటుంబాల్లో 39 శాతం సీసెక్షన్లు జరుగుతోంటే, తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాల్లో 7 శాతమే సీ సెక్షన్ జరుగుతోంది. 12 ఏళ్ల కంటే ఎక్కువ కాలం విద్యను అభ్యసించిన వారిలో 35 శాతం సిజేరియన్లు జరగగా, అసలు చదువుకోని వారిలో 8 శాతమే సిజేరియన్లు ఉన్నాయి.

మత పరంగా చూస్తే జైనుల్లో ఎక్కువ. జైనుల్లో 49.1 శాతం ఆపరేషన్లే. ఇక ముస్లింలు, హిందువుల్లో తక్కువ. ముస్లింలలో 19.6 శాతం, హిందువుల్లో 21.4 శాతం మంది ఆపరేషన్లు చేయించుకుంటున్నారు. కులాల్లో ఓసీల్లో 28 శాతం, ఎస్టీల్లో 11 శాతం సిజేరియన్లు జరుగుతున్నాయి.

ఇక ఆసుపత్రుల వారీగా చూస్తే, ప్రభుత్వ ఆసుపత్రుల్లో 14.3 శాతం... ట్రస్టులు, ఎన్జీవో ఆసుపత్రుల్లో 41.1 శాతం, ప్రైవేటు ఆసుపత్రుల్లో 47.5 శాతం సిజేరియన్లు చేస్తున్నారు. (వాస్తవానికి ప్రైవేటు ఆసుపత్రుల్లో సీసెక్షన్లు ఎక్కువగా ఉంటాయి. అయితే చాలా మంది ట్రస్టుల పేరుతో ప్రైవేటు ఆసుపత్రులు నిర్వహించడం దీనికి ఒక కారణం.)

''సీ సెక్షన్లు మరీ ఎక్కువ ఉండటం లేదా మరీ తక్కువ ఉండటం కూడా సరైనది కాదు. ఎక్కువా, తక్కువా రెండూ ప్రసూతి వైద్యసేవలపై తీవ్రప్రభావాన్ని చూపుతాయి. ఖర్చు పెరుగుతుంది. ఆసుపత్రిలో ఎక్కువ రోజులు ఉండాలి. పుట్టిన వెంటనే బిడ్డకు తల్లిపాలు ఇచ్చే అవకాశం ఉండటం లేదు'' అని నీతిఆయోగ్ నివేదిక అభిప్రాయపడింది.

''ఎక్కడైనా సీ సెక్షన్లు 10 శాతం దాటితే అవి తల్లీ పిల్లల మరణాలు తగ్గించడం కోసం జరిగినవి కావు'' అని ప్రపంచ ఆరోగ్య సంస్థ 2015లో వ్యాఖ్యానించింది. అదే సందర్భంలో సీ సెక్షన్ అవసరం అయ్యేవారికి తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలి అని సూచించింది. డబ్ల్యుహెచ్ఓ లెక్కల ప్రకారం సీ సెక్షన్లు సుమారు 10 శాతం, ఒక్కోసారి 15 శాతం వరకూ ఉండవచ్చు.

సిజేరియన్ ఆపరేషన్లు

ఉత్తర తెలంగాణ- ప్రైవేటు ఆసుపత్రులలో..

2021లో కరీంనగర్ జిల్లాలో 13,077 ప్రసవాలు జరిగితే వాటిలో 10,312 సిజేరియన్లు. కరీంనగర్ కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో 90 శాతం సిజేరియన్లే జరుగుతున్నట్టు గుర్తించారు.

కరీంనగర్ జిల్లాలో 2019 జనవరి- 2022 మే నెలల మధ్య ప్రైవేటు ఆసుపత్రుల్లో 6693 ప్రసవాలు అయితే అందులో 90.91శాతం అంటే 6085 సిజేరియన్లే.

అటు నిజామాబాద్ కూడా అలానే ఉంది.

తెలంగాణ సగటు 66 శాతం అయితే నిజామాబాద్ సగటు 77 శాతం. మంచిర్యాల, నిర్మల్‌లలో పలు ప్రైవేటు ఆసుపత్రుల్లో 90 శాతం సిజేరియన్లు జరుగుతున్నాయి. ఖమ్మం జిల్లాలో 2020-21లో 62.36% ఉన్న సిజేరియన్ కాన్పులు 2021-22 ప్రథమార్ధంలో 79.14%కు చేరాయి.

దక్షిణ తెలంగాణలో దీనికి భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. గద్వాల జిల్లాలో సిజేరియన్లు చాలా తక్కువ.

ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణా జిల్లాలో ఇవి ఎక్కువ ఉన్నాయి.

గర్బిణి

ఫొటో సోర్స్, Getty Images

ఆపరేషన్ ఎప్పుడు అవసరం?

బిడ్డ తల/శరీరం పెద్దగా ఉన్నప్పుడు, సహజ కాన్పు వల్ల ప్రాణాపాయం ఉన్నప్పుడు, కవలలు, బిడ్డ అడ్డం తిరగడం, బిడ్డ కాళ్లు ముందుకు రావడం, ఇతర సమస్యలు ఉన్నాయని వైద్యులు భావించినప్పుడు ఆపరేషన్ చేస్తారు.

''మేం సాధారణంగా నార్మల్ డెలివరీకి ట్రై చేస్తాం. కుదరకపోతేనే ఆపరేషన్లు చేస్తాం. ఇది వ్యక్తిని బట్టీ మారుతుంది. చాలా అబార్షన్లు అయిన వాళ్లకీ, ఎక్కువ వయసు, బీపీ, షుగర్ ఉండడం, ఐవీఎఫ్ పిల్లలు, అరుదైన కేసులు, ఆలస్యంగా గర్భం వచ్చిన కేసుల్లో ఆపరేషన్ వైపు మొగ్గు చూపుతాం. ప్రతీ కేసూ ఒక 24 గంటలు చూస్తాం. కాదంటే అప్పుడు సిజేరియన్ వెళ్లేవి ఎక్కువ. కొన్నిసార్లు 48 గంటలు చూసి కూడా సిజేరియన్‌కి వెళ్లాల్సి వస్తుంది. అలాంటప్పుడు బంధువులు అర్థం చేసుకోరు. మీకు ముందే తెలుస్తుంది కదా. ముందే ఆపరేషన్ ఎందుకు చేయలేదు? అని అడుగుతారు. లాస్ట్ మినిట్ డెసిషన్‌ను పేషెంట్లు క్వశ్చన్ చేస్తున్నారు. దీంతో డాక్టర్లు కూడా ముందే సిజేరియన్‌కి సిద్ధపడుతున్నారు. అంటే నార్మల్ కోసం ప్రయత్నించి కాకపోతే సిజేరియన్ అనే కాన్సెప్టు వారికి అవగాహన చేయించకపోవడం కూడా సమస్యే. ప్రస్తుతం చాలా ప్రైవేటు ఆసుపత్రుల్లో 70-80 శాతం సిజేరియన్ రేటు ఉంది. నా వరకూ వ్యక్తిగతంగా 50-50 వస్తుంటాయి'' అని బీబీసీతో అపోలో ఆసుపత్రికి చెందిన సీనియర్ గైనకాలజిస్ట్ ప్రమీల చెప్పారు.

ఇబ్బందులు

  • ఆపరేషన్‌కి విశ్రాంతి కావాలి. సహజ ప్రసవానికి అక్కర్లేదు
  • కుట్లు మానడం, ఇన్ఫెక్షన్ సమస్యలు ఆపరేషన్‌లో ఉంటాయి
  • దీర్ఘకాలంలో కొందరికి గర్భాశయ సమస్యలు రావడం
  • మత్తు వల్ల సమస్యలు
  • బిడ్డ పుట్టిన వెంటనే తల్లి పాలు పట్టడం అత్యుత్తమ పద్ధతి. అది బిడ్డకు ఎంతో మంచిది. సిజేరియన్లలో చాలా వరకూ ఆ అవకాశం ఉండదు
  • కొందరికి వెర్టికల్ కట్ వల్ల హెర్నియా వచ్చే అవకాశం ఉంటుంది
  • సహజ ప్రసవంలో అబ్డామిన్ కోయనక్కర్లేదు, ఇన్ఫెక్షన్ సమస్యలు ఉండవు, గంటలో నడిచేయవచ్చు
వీడియో క్యాప్షన్, స్పెర్మ్ కౌంట్ పెంచుకోవడానికి 9 మార్గాలు

సిజేరియన్లు పెరగడానికి కారణాలు

సీ సెక్షన్ వల్ల భవిష్యత్తులో ఇబ్బంది అని తెలిసినా చాలా మంది దానికే మొగ్గు చూపడానికి అనేక కారణాలు ఉన్నాయి. నిజానికి సాధారణ డెలివరీ చేయలేని పరిస్థితుల్లో వైద్యులే సిజేరియన్ సూచిస్తారు. అప్పడు తప్పదు. కానీ వైద్యులతో సంబంధం లేకుండా రెండు ప్రధాన కారణాల వల్ల సిజేరియన్‌కి వెళ్తున్నారు చాలా మంది తల్లితండ్రులు.

పిల్లలు మంచి రోజుల్లో పుట్టాలని ముహూర్తాలు పెట్టించుకుని ఆపరేషన్లు చేయించుకునే వారి సంఖ్య పెరుగుతోంది. కొన్ని సందర్భాల్లో పెళ్లిరోజు వంటి ప్రత్యేక తేదీల్లో పుట్టాలని కోరుకునేవారు కూడా ఇలా చేస్తున్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో 30 శాతం వరకూ ఇలాంటివి ఉంటాయని చెబుతున్నారు వైద్యులు.

తల్లి నొప్పులు తట్టుకోలేదు కాబట్టి ఆపరేషన్ చేయాల్సిందే అని పట్టుపట్టే వారి సంఖ్య పెరుగుతోంది. ''మేం చాలా సార్లు నార్మల్ డెలివరీ చేస్తామని చెప్పినా వినరు. మేం వేరే ఆసుపత్రికి వెళ్లిపోతాం అని బెదిరిస్తారు. కొందరు అయితే వాళ్ల ఊరి సర్పంచి చేత ఇతర పెద్దల చేత ఫోన్లు చేయించి మాపై ఒత్తిడి తెస్తారు. వాళ్లకు నొప్పిలేని డెలివరీ కావాలి'' అని బీబీసీతో వరంగల్ జిల్లాలో పనిచేస్తున్న ఒక ప్రభుత్వ వైద్యురాలు చెప్పారు.

సిజేరియన్లు పెరగడం వెనుక ఆసుపత్రుల తప్పు కూడా ఉంది. సాధారణ ప్రసవం కంటే సిజేరియన్‌కి తక్కువ సమయం పడుతుంది. కానీ ఆసుపత్రికి కాస్త ఎక్కువ డబ్బు వస్తుంది. సాధారణ ప్రసవానికి డాక్టర్లు ఎక్కువ సమయం కేటాయించాలి. కానీ ఫీజు తక్కువ. దీంతో ఎక్కువ ఫీజు వసూలు చేయడం కోసం సిజేరియన్ సూచించే వైద్యులు ఉన్నారు. అలాగే నొప్పులు వచ్చినప్పుడు ప్రసవం ఎంతసేపట్లో అవుతుంది అనే విషయంలో స్పష్టతలేదు. దీంతో సమయం సేవ్ చేసుకోవడానికి సిజేరియన్ వైపు వెళ్లే డాక్టర్లు కూడా ఉన్నారు.

వీడియో క్యాప్షన్, సిజేరియన్ తరువాత సాధారణ ప్రసవం సాధ్యమేనా?

''రెగ్యులర్‌గా చూసే పేషెంటు ప్రసవించే తేదీల్లోనే డాక్టరు గారికి ఏదో ఒక పని ఉందనుకోండి. లేదా ఆవిడ అన్ని గంటలు ఆసుపత్రిలో ఉండే పరిస్థితి లేదనుకోండి. అప్పుడు కూడా సిజేరియన్ సూచించే డాక్టర్లు ఉన్నారు'' అని బీబీసీతో ఒక ప్రైవేటు ఆసుపత్రి నిర్వాహకులు చెప్పారు.

అయితే ఈ విషయంలో డాక్టర్లకు కేసుల భయం కూడా ఉందంటున్నారు డాక్టర్ ప్రమీల. ''పేషెంట్లు రిక్వెస్ట్ చేయడం ఒక ఎత్తు అయితే, కన్జూమర్ ఫోరం మరో సమస్య. చాలా సార్లు నార్మల్ డెలివరీకి ప్రయత్నం చేసినప్పుడు కొన్ని రిస్కులు ఉంటాయి. అప్పుడు ఏదైనా జరిగితే డాక్టరే కావాలని చేశారని కేసులు వేస్తున్న వారి సంఖ్య పెరిగింది. సిజేరియన్లో ఈ సమస్య ఉండదు కదా. అందుకే డాక్టర్లు అటు మొగ్గుతున్నారు. డాక్టరుకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చి మీరు నార్మల్ ప్రయత్నించండి కాకపోతే సిజేరియన్ చూద్దాం అనే పరిస్థితి లేదు. నిజంగా నార్మల్ కోసం ప్రయత్నించి తర్వాత సిజేరియన్‌కి వెళ్లాల్సి వస్తే మీరెందుకు అలా చేశారు, ముందే ఎందుకు చేయలేదంటూ గొడవలు అవుతున్నాయి. నార్మల్ చేసే సమయంలో కొన్ని సందర్భాల్లో బిడ్డకు ఆక్సిజన్ అందక పారలైజ్ అవ్వడం వంటి సమస్యలు వస్తాయి. ఆ భయం కారణం. ఉదాహరణకు బిడ్డ హార్ట్ బీట్‌లో హెచ్చుతగ్గులు వచ్చినా కూడా నార్మల్ కోసం ఎదరు చూడవచ్చు. కానీ డాక్టర్లు రిస్కు తీసుకోవడం మానేస్తున్నారు'' అని అన్నారామె.

''చిన్న ప్రైవేటు ఆసుపత్రుల్లో పీడియాట్రీషియన్ (పిల్లల డాక్టర్), అనస్తీషియన్ (మత్తు మందు ఇచ్చే డాక్టర్) నిత్యం అందుబాటులో ఉండరు. ఏదైనా కేసులో నార్మల్ డెలివరీ కోసం ఎదురు చూసి ఏ అర్ధరాత్రో అప్పటికప్పుడు సిజేరియన్‌గా మార్చాల్సి వస్తే అప్పటికప్పుడు ఈ డాక్టర్లు దొరకరు. దీంతో ముందే ప్లాన్ చేసి సిజేరియన్ చేసేస్తే సమస్య ఉండదు అనుకుంటున్నారు'' అని వివరించారు మరో డాక్టర్.

సిజేరియన్ ఆపరేషన్లు

తెలంగాణ ప్రభుత్వ ఫోకస్

ప్రస్తుతం తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. గత రెండు నెలలుగా ఆరోగ్యమంత్రి హరీశ్ రావు ఏ సభకు వెళ్లినా, అక్కడ అంశంతో సంబంధం లేకుండా రాజకీయ సభల్లో కూడా ఈ అంశం ప్రస్తావిస్తున్నారు.

ఆడవారు ఆపరేషన్‌కు బదులు సాధారణ ప్రసవాలకు వెళ్లాలనీ, లేకపోతే 40 ఏళ్లకే ఏ పనీ చేసుకోలేకుండా అయిపోతారనీ, దీనిపై ఆలోచించుకోవాలని సూచిస్తున్నారు. దీనిపై జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. ఆశా వర్కర్లతో ఆన్‌లైన్ సమావేశం కూడా నిర్వహించారు.

ఆపరేషన్లు ఎక్కువగా జరుగుతున్న ఖమ్మం, కరీంనగర్ కలెక్టర్లు కర్ణన్, గౌతమ్ కుమార్ ఇద్దరూ తమ ప్రాంతంలో ప్రైవేటు గైనకాలజిస్టులతో పాటూ, పురోహితులను కూడా సమావేశానికి పిలిచారు. కాన్పు ముహూర్తాలు పెట్టవద్దని కోరారు. దీంతో కరీంనగర్‌‌కు చెందిన కొందరు పురోహితులు, తాము కాన్పులకు ముహూర్తాలు పెట్టబోమంటూ ఫ్లెక్సీలు కూడా పెట్టారు.

సిజేరియన్ ఆపరేషన్లు

దేశంలోనే టాప్‌లో ఉన్న ఖమ్మం పరిస్థితిలో కాస్త మార్పు మొదలైంది. ఈ విషయంలో తెలంగాణ ఆరోగ్య మంత్రి హరీశ్ రావు ఇటీవలే ఖమ్మం కలెక్టరును ప్రత్యేకంగా అభినందించినట్టు ఆయన కార్యాలయం తెలిపింది. సిజేరియన్లకు కత్తెర వేద్దాం అంటూ రాజన్న జిల్లా యంత్రాంగం యాడ్ తయారు చేసింది.

''ప్రస్తుతం సిజేరియన్ జరిగితే ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బందికి కొంత అదనపు మొత్తం ఇస్తోంది ప్రభుత్వం. ఇకపై దాన్ని కూడా రద్దు చేయాలని చూస్తున్నాం. దాని బదులు నార్మల్ అయితే 3 వేల రూపాయలు ఇవ్వాలని ప్రతిపాదన ముఖ్యమంత్రిగారికి పంపించాం. ప్రైవేటు ఆసుపత్రుల్లో ప్రసవాలన్నీ రికార్డు చేసి ఆడిట్ నిర్వహించాలని ఆదేశించాం. అటు డాక్టర్లు, ఇటు ఆసుపత్రుల యాజమాన్యాలు అందరికీ నచ్చచెప్పి తెలంగాణలో సిజేరియన్లు తగ్గించే ప్రయత్నం చేస్తున్నాం'' అని ప్రకటించింది తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)