దక్షిణాఫ్రికా: ఒకే కాన్పులో 10 మంది శిశువుల జననం నిజం కాదు. కట్టుకథగా తేల్చిన విచారణ

ఒక నెల క్రితం గోసియేమ్ థమారా సిట్‌హోల్‌

ఫొటో సోర్స్, African News Agency (ANA)

ఫొటో క్యాప్షన్, గోసియేమ్ థమారా సిథోలే

దక్షిణాఫ్రికాలోని ప్రిటోరియాలో గోసియేమ్ థమారా సిథోలే అనే మహిళ ఒకే కాన్పులో 10 మంది శిశువులకు జన్మనిచ్చినట్లు ఈ నెల ప్రారంభంలో కథనాలు వచ్చాయి.

అయితే, ఇది నిజం కాదని ఆ తర్వాత చేపట్టిన అధికారిక విచారణలో తేలింది.

ఒకే కాన్పులో పది మంది శిశువులు పుట్టినట్టు గౌటెంగ్ రాష్ట్రంలోని ఏ ఆస్పత్రిలో కూడా రికార్డులు లేవని ప్రభుత్వం చెబుతోంది.

ఇటీవలికాలంలో గోసియేమ్ థమారా సిథోలే గర్భం దాల్చలేదని కూడా ఆమెకు చేసిన వైద్య పరీక్షల్లో తేలిందని పేర్కొంది.

మానసిక ఆరోగ్య చట్టం కింద 37 సంవత్సరాల గోసియేమ్‌ను ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు. ఆమెను అబ్జర్వేషన్‌లో ఉంచారు. ఆమెకు కావాల్సిన సహాయ సహకారాలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

అయితే, ఒకే కాన్పులో పది మంది శిశువులు పుట్టినట్టు ఎందుకు కట్టుకథ అల్లారన్న కారణాలను మాత్రం ప్రభుత్వం వెల్లడించలేదు.

ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

ఇండిపెండెంట్ ఆన్‌లైన్ - ఐఓఎల్ మీడియా గ్రూప్‌నకు చెందిన ప్రిటోరియా న్యూస్‌ ఈ కట్టు కథను ముందుగా ప్రచురించింది. తమ కథనానికి కట్టుబడి ఉన్నట్లు ఆ తర్వాత కూడా చెప్పింది.

రాజధానిలోని స్టీవ్ బికో అకాడమిక్ ఆస్పత్రి - SBAHలో జూన్ 7న గోసియేమ్ థమారా సిథోలే 10 మంది శిశువులకు జన్మనిచ్చారని.. ఆ ఆస్పత్రి, రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు ఈ విషయాన్ని కప్పిపుచ్చడానికి ప్రయత్నిస్తున్నారని ప్రిటోరియా న్యూస్‌ ఆరోపించింది.

"ఆ ఆరోపణలు అబద్ధం. నిరాధారం. స్టీవ్ బికో అకాడమిక్ ఆస్పత్రికి, గౌటెంగ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవడానికి మాత్రమే పనికొస్తాయి" అని ప్రభుత్వం తాజా ప్రకటనలో పేర్కొంది.

ప్రిటోరియా న్యూస్ ఎడిటర్ ఇన్ చీఫ్ పీట్ రాంపెడి, ఐఓఎల్‌ మీద చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం అంటోంది.

ఈ కథనం ఎలా బయటికొచ్చింది

గోసియేమ్ థమారా సిథోలేకు ఆరు సంవత్సరాల వయసు ఉన్న కవలలు ఉన్నారు. పిల్లలు, భర్త టెబోహో సోటెట్సితో కలిసి ఆమె థెంబిసాలోని ఒక టౌన్‌షిప్‌లో ఉంటున్నారు.

ఇండిపెండెంట్ ఆన్‌లైన్ - IOL చెబుతున్న దాని ప్రకారం.. డిసెంబర్‌లో ప్రిటోరియా న్యూస్ ఎడిటర్ ఇన్ చీఫ్ పీట్ రాంపెడి వెళ్లిన చర్చికే గోసియేమ్ దంపతులు వచ్చారు. అక్కడే వారితో రాంపెడికి పరిచయం అయింది.

ఆ తర్వాత మేలో ఆ దంపతులను ఇంటర్వ్యూ చేశామని చెప్తోంది. ఆ ఇంటర్వ్యూలో తమకు ఎనిమిది మంది శిశువులు పుట్టొచ్చని అనుకుంటున్నట్లు ఆ దంపతులు చెప్పారని వివరించింది. ఆ తర్వాత పెద్ద పొట్టతో ఉన్న ఆమె ఫొటోషూట్ కూడా చేసినట్లు చెబుతోంది.

ఇక జూన్ 8న గోసియేమ్‌కు ఒకే కాన్పులో 10 మంది శిశువులు జన్మించారంటూ ఆమె భర్త టెబోహో సోటెట్సితోను ఉటంకిస్తూ ప్రిటోరియా న్యూస్ వెల్లడించింది.

కరోనావైరస్ నిబంధనల కారణంగా తనను ఆస్పత్రి లోపలికి వెళ్లనివ్వలేదని, పది మంది పిల్లలు పుట్టినట్లు తన భార్య నుంచి తనకు టెక్స్ట్ మెసేజ్ వచ్చిందని ఆ తర్వాత టెబోహో చెప్పారు.

ప్రిటోరియా న్యూస్ ఎడిటర్ ఇన్ చీఫ్ పీట్ రాంపెడి కూడా ఈ వార్త వెనక నిజానిజాలు తెలుసుకోకుండా, ఆస్పత్రి వర్గాలను సంప్రదించకుండా, కేవలం వాట్సప్ మెసేజ్‌ల మీద మాత్రమే ఆధారపడ్డారు.

అనంతరం స్థానిక మేయర్‌ కూడా దీన్ని ధ్రువీకరించారు. ఆ తర్వాతే బీబీసీ సహా మిగతా మీడియా సంస్థలు ఈ కథనాన్ని ప్రచురించాయి.

అయితే, ఆ కుటుంబం చెప్పిన వివరాలను నమ్మి మేయర్ అలా చెప్పారని, ఆ పిల్లలను ఇప్పటి వరకు ఎవరూ చూడలేదని ప్రభుత్వ అధికార ప్రతినిధి ఒకరు ఆ తర్వాత వివరణ ఇచ్చారు.

వరదలా విరాళాలు

ఈ దంపతులకు ఒకే కాన్పులో పుట్టారని చెప్పిన 10 మంది శిశువులకు సాయంగా విరాళాలు వరదలా రావడం మొదలైంది. ఐఓఎల్ చైర్మన్ ఇక్బాల్ కూడా 70 వేల డాలర్లు ఇచ్చారు.

అయితే, ప్రిటోరియా న్యూస్‌ మొదట్లో ఆస్పత్రి పేరు వెల్లడించలేదు. దాంతో చాలా మందికి అనుమానం వచ్చింది. పైగా తమ ఆస్పత్రిలో ఇలా ఒకే కాన్పులో పది మంది పుట్టలేదని గౌటెంగ్‌లోని చాలా ఆస్పత్రులు ప్రకటనలు ఇచ్చాయి.

పది రోజుల తర్వాత ఇండిపెండెంట్ ఆన్‌లైన్ - ఐఓఎల్, స్టీవ్ బికో అకాడమిక్ ఆస్పత్రి -SBAH మీద ఆరోపణలు చేసింది.

ఆ తర్వాత కొన్ని రోజులకు గోసియేమ్‌ కనిపించడం లేదని, ఎవరూ విరాళాలు పంపించొద్దని ఆమె భర్త టెబోహో సోటెట్సితో ప్రజలకు విజ్ఞప్తి చేశారని, అయితే పిల్లల్ని అడ్డుపెట్టుకుని తన భర్త టెబోహో లబ్ధి పొందాలని అనుకుంటున్నారని గోసియేమ్‌ ఆరోపించించారని ప్రిటోరియా న్యూస్ పేర్కొంది.

అదే సమయంలో గోసియేమ్‌ ఎక్కడున్నారన్న విషయాన్ని సోషల్ మీడియా వర్కర్లు కనిపెట్టేశారని, గత శుక్రవారం వైద్య పరీక్షలు చేయించుకునేందుకు ఆమె గౌటెంగ్‌లోని ఒక ఆస్పత్రిలో చేరినట్లు వారు తెలుసుకున్నారని గౌటెంగ్‌ ప్రభుత్వ అధికారులు తెలిపారు.

ఇటీవల లీకైన ఒక మెమోను పరిశీలించిన న్యూస్24.. ఈ కథనం ద్వారా ఐఓఎల్‌ గ్రూప్‌నకు వచ్చిన చెడ్డపేరుకు రాంపెడి క్షమాపణలు చెప్పారంటూ కథనం ప్రచురించింది.

రాంపెడి.. దీన్ని ఒక మంచి ఫీల్ గుడ్ స్టోరీగా కాకుండా ఇన్వెస్టిగేటివ్ స్టోరీగా చూసి ఉండాల్సింది అని ఆ మెమోలో ఉందని న్యూస్24 వెల్లడించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)