ఎలాన్ మస్క్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. ఇంతకీ ఏం జరిగింది

ఎలాన్ మస్క్

ఫొటో సోర్స్, Getty Images

ప్రపంచంలోనే అత్యధిక ధనవంతుడు ఎలాన్ మస్క్ తనపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలను ఖండించారు.

స్పేస్‌ఎక్స్ రాకెట్ కంపెనీకి చెందిన ఒక మహిళను అసభ్యంగా తాకినట్లు, తన పురుషాంగాన్ని ఆమెకు చూపించినట్లు వచ్చిన ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు.

ఈ ఆరోపణలపై బిజినెస్ ఇన్‌సైడర్‌లో గురువారం ఒక కథనం ప్రచురించారు. ఈ వేధింపులపై ఆమె మాట్లాడకుండా ఉండేందుకు 2,50,000 డాలర్లు (సుమారు రూ.1.94 కోట్లు) ఇచ్చినట్లు ఆ కథనంలో పేర్కొన్నారు.

‘‘ఆ ఆరోపణలన్నీ పచ్చి అబద్ధాలు’’అని ఎలాన్ మస్క్ ఒక ట్వీట్ చేశారు. రాజకీయ దురుద్దేశాలతో ఆ వ్యాఖ్యలు చేశారని మస్క్ అన్నారు.

44 బిలియన్ డాలర్లు (రూ.3,42,402 కోట్లు)తో కొనుగోలు చేస్తున్న ట్విటర్ ఒప్పందంలో జోక్యం చేసుకునేందుకు, రాజకీయంగా తనను దెబ్బతీసేందుకు ఇలాంటి అబద్ధపు ప్రచారాలు చేపడుతున్నారని మస్క్ వివరించారు.

తను ఇకపై డెమొక్రటిక్ పార్టీకి మద్దతు తెలపబోనని, రాబోయే ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీకే ఓటు వేస్తానని ఇటీవల ఎలాన్ మస్క్ చెప్పారు.

తాజా ఆరోపణల నడుమ మస్క్ ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా షేర్లు పతనం అయ్యాయి.

వీడియో క్యాప్షన్, ఎలాన్ మస్క్: ట్విటర్‌ను రూ. 3.37 లక్షల కోట్లకు కొని ఆయన ఏం చేయబోతున్నారు?

ఆరోపణల్లో ఏముంది?

ఫ్లైట్ అటెండెంట్‌గా పనిచేసిన ఆ మహిళ మస్క్‌కు వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లకుండా స్పేస్‌ఎక్స్ సంస్థ భారీగా డబ్బు ఇచ్చిందని బిజినెస్ ఇన్‌సైడర్‌లో పేర్కొన్నారు. ఈ ఘటనపై ఆమె మాట్లాడటానికి వీలులేకుండా లేదా కోర్టు మెట్లు ఎక్కుకుండా ఆమెతో ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు.

సదరు మహిళ స్నేహితురాలితో మాట్లాడినట్లు బిజినెస్ ఇన్‌సైడర్ పేర్కొంది. సెటిల్‌మెంట్ ప్రక్రియలో భాగంగా ఒప్పందంలో సదరు మహిళతో సంతకం కూడా పెట్టించుకున్నట్లు పేర్కొన్నారు.

‘‘2016లో ఆ ఘటన జరిగింది. తన ప్రైవేటు జెట్‌లో ఆమెను తీసుకెళ్లారు. మసాజ్ చేయించుకున్న తర్వాత మస్క్ తన పురుషాంగాన్ని ఆమెకు చూపించారు. ఆమె అనుమతి లేకుండానే కాలిని తాకారు. ఇంకా ముందుకు వెళ్లేందుకు సహకరిస్తే మంచి బహుమతి కూడా ఇస్తానని అన్నారు’’అని ఆమె స్నేహితురాలు బిజినెస్ ఇన్‌సైడర్‌తో చెప్పారు.

వీడియో క్యాప్షన్, టెస్లా అంటే ఎందుకంత క్రేజ్? దీని విజయ రహస్యం ఏమిటి?

అయితే, ఈ ఆరోపణలను బీబీసీ ధ్రువీకరించలేదు.

ఈ ఆరోపణలపై గురువారం రాత్రి ఎలాన్ మస్క్ స్పందించారు. ఆ కథనంలో పేర్కొన్న బాధితురాలి మహిళను ఒక ఫార్ లెఫ్ట్ రాజకీయ పార్టీ నాయకురాలని చెప్పారు. తను అలా చేసినట్లు రుజువులు చూపించాలని అన్నారు.

మరోవైపు బిజినెస్ ఇన్‌సైడర్ ఎడిటర్ నికోలస్ కార్ల్‌సన్ ఆ కథనానికి మద్దతు తెలిపారు. ‘‘మేం మా కథనంలో చెప్పిన వివరాలకు కట్టుబడి ఉన్నాం. దీనికి సంబంధించిన డాక్యుమెంట్లు, ఇంటర్వ్యూ రికార్డింగ్‌లు మా దగ్గర ఉన్నాయి’’అని వివరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)