సెక్స్, అధికారం, భయం....మన పురాణాలకు ప్రేరణ ఇచ్చింది ఇవేనా?

ఫొటో సోర్స్, Gallery Oldham
- రచయిత, డెయిసీ డన్
- హోదా, బీబీసీ కల్చర్
అది ఒకటో శతాబ్దం. ఇంగ్లండ్‌లోని బాత్ నగరంలో ఉన్న కొలనుల్లో ఆనందంగా జలకాలాడుతున్న వారు ఆకస్మికంగా సిగ్గుతో ముడుచుకున్నారు. కారణం వారి వస్త్రాలను ఎవరో దొంగిలించారు. ఇలాంటి సందర్భాల్లో తప్పనిసరిగా ఎవరి సాయం కోరాలో వారికి తెలుసు.
వారంతా "సూలిస్" దేవతను ప్రార్థించారు. ఆమె రోమన్ కాంప్లెక్స్‌లోని వేడి నీటి కొలనులు, చన్నీటి తటాకాలు, మెరుపులతో కాంతులీనుతూ మునకలు వేయడానికి అనువుగా ఉండే లోతైన చెరువులకు అధిదేవత.
బాధలను తొలగించే దేవతగా ఆమెను ఆరాధిస్తారు. అంతేకాదు, ప్రతీకారం తీర్చుకోవడంలోనూ ఆమె శక్తి అపారమైనదని భావిస్తారు.
గిట్టని వారిని శపించాలని దేవీదేవతలను ప్రార్థించి 'శాపనార్థ ఫలకం' (కర్స్ ట్యాబ్‌లెట్) రాయించే సంప్రదాయం ప్రాచీన రోమ్ నాగరితకలో భాగంగా ఉండేది.
ఎక్కువ మంది 'సూలిస్ దేవత'ను ప్రార్థిస్తూ ఇలాంటి ఫలకాలు వేయించారు. ఆమె పేరున ఉన్న ఊట కొలనులో తవ్వకాలు జరిపినప్పడు ఇలాంటి ఫలకాలు వందకుపైగా దొరికాయి.
ఇతరుల ఆస్తులను దొంగిలించిన వారిని కఠినంగా శిక్షించాలంటూ తీవ్ర పదజాలతో రాసిన ఫలకాలే ఇందులో అధికంగా ఉన్నాయి. దొంగలూ జాగ్రత్త!

ఫొటో సోర్స్, Trustees of the British Museum
సూలిస్‌లాంటి శక్తిమంతమైన దేవతలు ఇంకెంతమందో ఉన్నారు. ఇలాంటి వారి వివరాలను పొందుపరుస్తూ లండన్‌లోని బ్రిటిష్ మ్యూజియంలో 'ఫెమినైన్ పవర్' పేరుతో సరికొత్త ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు.
వివిధ దేశాల్లో దేవతలకున్న ప్రాధాన్యాన్ని తెలియజెప్పేలా ఈ ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఆరు ఖండాలకు చెందిన దేవతల విగ్రహాలను సేకరించి పెట్టారు. వేల ఏళ్లుగా పూజలు అందుకొన్న ప్రతిమలు కూడా ఇక్కడ ఉన్నాయి.
ఆ పవిత్ర దేవతామూర్తుల మాదిరిగానే ఈ ప్రదర్శన కూడా చాలా విలువైనదిగా పరిగణిస్తున్నారు.
గ్యాలరీలో సూలిస్ దేవతతో పాటు, స్థానిక రూపురేఖలు ఉన్న రోమన్ దేవత మినర్వా విగ్రహం, ఈజిప్షియన్ల దేవత సెఖ్‌మెట్, హిందువుల దేవత కాళీమాత, జపనీయుల కన్‌నాన్, మెక్సికన్లకు చెందిన కోట్లిక్యూలు కొలువుదీరాయి.
పరస్సర విరుద్ధ లక్షణాలు ఉన్న దేవతలనూ ఆరాధించడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
సూలిస్‌కు పరస్పర విరుద్ధ లక్షణాలైన సాంత్వన చేకూర్చడం, ప్రతీకారం తీర్చుకోవడం అనే శక్తులు ఉన్నాయి.
అదే విధంగా ప్రాచీన మెసొపోటోమియాకు చెందిన ఇనన్నా దేవతకూ ఇలాంటి శక్తులే ఉన్నాయి. ఆమెను శృంగారం, యుద్ధం..రెండింటికీ దేవతగా కొలుస్తారు.
ప్రాచీన మంత్రం ఒకటి ఇనన్నాను భయంకర దేవతగా అభివర్ణించింది. యుద్ధ రంగంలోని పురుషులకు మరణాన్ని తెచ్చేది, వారి కుటుంబ సభ్యులకు విషాదం మిగిల్చేదని పేర్కొంది.
మరికొన్ని రచనల్లో శృంగార దేవతగానూ అభివర్ణించారు. ఆమె అనుగ్రహిస్తే లైంగిక సామర్థ్యం పెరుగుతుందంటూ పూజించేవారు.
సుమేరియన్ రాజులయితే యుద్ధాల్లో విజయం, శృంగారం.. ఈ రెండు లక్షణాలు తమలో ఉండాలని కోరుకునేవారు. ఇందుకోసం అన్నీ చేసేవారు. ఇనన్నాతో కలిసి పడుకున్నట్టు ఊహించుకునేవారు. యుద్ధంలో తమను రక్షిస్తుందన్న నమ్మకంతోనే ఇలాంటి కల్పనలతో కాలం గడిపేవారు. బహుశా, ఆమె అధికారం ముందు భయాందోళన పడకూడదన్న ఉద్దేశంతో కూడా ఇలా చేసేవారు.
స్త్రీ-పురుషులకు ఉండే సామాజిక పరిమితులను అధిగమించే శక్తి ఉండడం కారణంగానే వారిని సామాన్య మహిళల కన్నా ఉన్నతులుగా భావించి దేవతలుగా కీర్తించే వారు.
ఇనన్నాకు మగవారిని మహిళలుగా, స్త్రీలను పురుషులుగా మార్చే శక్తి ఉందని నమ్ముతారు. కొన్నిసార్లు ఆమెను కూడా పురుషునిగానే పరిగణిస్తారు.
ఈ ఎగ్జిబిషన్‌కు సంబంధించిన కేటలాగ్‌కు రాసిన ముందుమాటలో ప్రొఫెసర్ మేరీ బియర్డ్ ఇతర దేవతలకు సంబంధించిన మరికొన్ని వివరాలను ప్రస్తావించారు. ఈ ప్రదర్శన ఏర్పాటుకు సహకరించిన అయిదుగురు గెస్ట్ కంట్రిబ్యూటర్లలో ఆమె ఒకరు కావడం గమనార్హం.
"గ్రీకుల జ్ఞాన దేవత అథేనా కూడా విలక్షణమైనదే. ఆమెకు యుద్ధవిద్యలకు కూడా దేవతే. ఇతర గ్రీకు దేవతలకు ఇలాంటి లక్షణాలేవీ ఉండవు" అని అందులో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Trustees of the British Museum
వీనస్ వారసుడే జూలియస్ సీజర్
రోమన్ల దేవత వీనస్ అయితే ఈ లక్షణాలన్నింటికీ అతీతం. ఏదో ఒక గుణానికి పరిమితమైనది కాదు. ఇనన్నా మాదిరిగా ఆమెకు ఎల్లప్పడూ పురుషుల హృదయంలో స్థానం ఉంటుంది. అది పడక గది అయినా, యుద్ధ భూమైనా.
దీనిపై మేరీ బియర్డ్ వివరణ ఇస్తూ "వీనస్ దేవతతో పాటు అచంచల రాజ్యకాంక్షే రోమ్‌కు సైనిక విజయాలను తెచ్చి పెట్టింది"అని అభిప్రాయపడ్డారు.
ప్రముఖ రోమన్ వీరుడు జూలియస్ సీజర్.. వీనస్ దేవత వారసుడన్న నమ్మకం ఉంది. ట్రాజన్ యుద్ధంలో హీరోగా, చివరకు శరణార్థిగా మిగిలిన ఏయినియస్... వీనస్ కుమారుడు. ఏయినియస్ వారసత్వంలోని వాడే జూలియస్ సీజర్. అందుకే తాను విడుదల చేసిన కొన్ని నాణేలపై వీనస్ బొమ్మను ముద్రించాడు.
తరువాత వచ్చిన నాయకులు కూడా తమ అధికారానికి చిహ్నంగా వీనస్ దేవతనే పరిగణించారు.
మరో దేవత మినర్వా చిత్ర పటాలు వెల్లింగ్టన్ ప్యాలెస్, నెపోలియన్, క్వీన్ ఎలిజబెత్-1ల సమక్షంలో ప్రముఖంగా దర్శనమిచ్చాయి.
శక్తి స్వరూపిణుల అవసరం మహిళలకే తప్ప పురుషులకు లేదని ఎవరైనా భావిస్తే అది తప్పని తేలుతుంది. చరిత్రను పరిశీలిస్తే ఈ విషయం రుజువవుతుంది.
ఈజిప్టుకు చెందిన 18వ తరం ఫారో రాజు నైలు నది వద్ద నిర్మించిన తన స్మారక మందిరంలో పెద్ద సంఖ్యలో 'సెఖ్‌మెట్' దేవత విగ్రహాలను పెట్టించాడు. ప్లేగు, అంటురోగాలను తగ్గిస్తుందన్న నమ్మకంతోనే వీటిని ఏర్పాటు చేయించాడు.
దేవతల విగ్రహాలను పెట్టించిన వారిలో పురుషులే ప్రముఖంగా ఉన్నారు. ఇప్పటికీ ప్రాచుర్యంలో ఉన్న కొన్ని ప్రధాన దేవతల విగ్రహాలు, చిత్రాలను పురుషులే తయారు చేయించారు.
ఈ ఎగ్జిబిషన్ లీడ్ క్యూరేటర్ బలిండా క్రేరర్ 'బీబీసీ కల్చర్'తో మాట్లాడుతూ "ఈ బొమ్మలను ఎవరు తయారు చేయించారన్నది చాలా సందర్భాల్లో కచ్చితంగా మనకు తెలియదు. అయితే,.పురుషులే చేయించి ఉంటారని నమ్ముతుంటాం. కానీ చాలా సందర్భాల్లో ఇది నిజం కాదు. ఈ ఎగ్జిబిషన్‌లోని మొదటి సెక్షన్‌లో కంచు పాత్ర ఒకటి ఉంది. బహుశా దీన్ని బర్మింగ్‌హామ్‌లో చేసినట్టుంది. దీని అలంకారాలను మహిళలే చేశారు" అని చెప్పారు.

ఫొటో సోర్స్, Pace Gallery
భయం.. భక్తి
చాలా మంది దేవతలు గర్భదారణ, ప్రసవం వంటి విషయాల్లో మహిళలకు సాయపడేవారనే నమ్మకం ఉండేది. మరికొందరు దేవతలకు ఇందుకు పూర్తి వ్యతిరేకమైన శక్తి ఉండేది. ఈ కారణంగా దేవతల సహాయం అవసరమైన సమయంలోనే ఇతర శక్తుల వల్ల తమకు నష్టం కలుగుతుందేమోనన్న ఆందోళన మహిళల్లో ఉండేది. అందువల్ల కొన్ని శక్తుల పేర్లు చెబితేనే భయ పడేవారు.
సుమేరియన్ నాగరికతలోని 'లమత్సు' దేవత ఇలాంటిదే. సింహం తల, గాడిద దవడలు ఉండే ఈ దేవత ప్రసవం సమయంలో మహిళలను ఇబ్బంది పెట్టేది. పురిటిళ్లలోకి పాక్కుంటూ వెళ్లి బిడ్డలను దొంగిలిస్తుందన్న నమ్మకం ఉండేది.
మెక్సికోలోని 'సిచువాటెటెయో' (దైవిక మహిళ) దేవత కూడా ఇలాంటిదే. ప్రసవ సమయంలో మరణించిన 'కాబోయే అమ్మల' ఆత్మలే ఈ దేవత రూపం దాల్చుతాయని నమ్ముతారు. అజ్టెక్ సంవత్సరంలో అయిదు రోజుల పాటు తిరిగి వచ్చి ఊయలల్లోని ఆ ఆత్మలు శిశువులను ఎత్తుకుపోతాయని విశ్వసిస్తారు.
ఆడమ్ మొదటి భార్యగా భావించే లిలిత్ కూడా ఇలాంటి శక్తే. నవజాత శిశువుకు మరణం తెచ్చేది, సంతాన లేమికి కారణమయ్యేదానిగా భావిస్తారు.
సమకాలీన చిత్రకారుడు కికి స్మిత్ చెక్కిన లిలిత్ భయంకర శిల్పం ఈ ఎగ్జిబిషన్ హాలు గోడపై కనిపిస్తుంది.
ఉగ్రరూపంలో ఉండే ఆమె నీలి కళ్లు మీకు భయం కలిగిస్తాయి.
ఈ దేవతలన్నీ మానవుల్లోని వాస్తవ భయాలకు ఆకార రూపం దాల్చినవే. ఆందోళనలు చుట్టూ కథలు అల్లబడి చివరకు స్త్రీ రూప శక్తులుగా మనముందు నిలిచాయన్నది నిజం.
ఆది కాల సంస్కృతుల్లో భూమినే స్త్రీ మూర్తిగా భావించేవారు. భూ దేవత ప్రవర్తనకు అనుగుణంగానే సంస్కృతి కూడా ఉండేది.
ఉదాహరణకు, గ్రీకు పురాణాల్లోని డిమీటర్, పెర్సెఫోన్‌ల కథ ఇలాంటిదే. డిమీటర్ కుమార్తె పెర్సెఫోన్ రుతువుల రాక గురించి చెప్పేది.
ఆమెను ఒకసారి పాతాళ రాజైన హేడ్స్ అపహరించి పాతాళానికి తీసుకెళ్లి పోయాడు. ఆమె పంటలను కాపాడుతుండేది. ఆమె లేకపోవడంతో పంటలన్నీ పాడయ్యాయి. కుమార్తె కనబడక డిమీటర్ విషాదంలో మునిగిపోయాడు.
పెర్సెఫోన్ కొన్ని దానిమ్మ గింజలు తినడంతో సంవత్సరంలో కొంతకాలం పాటు ఆమె చీకట్లో ఉండేది.
భూమిపై ఆమె తిరిగి రావడంతో తల్లి సంబరాలు చేసుకుంది. ఆమె రాక వసంత రుతువు, ఫలాల ఆగమనానికి సూచికగా ఉండేది.
అదేవిధంగా హిందూ గ్రంథాల ప్రకారం శ్రీ లక్ష్మీ దేవతకు చిన్న బాధ కలగడంతో ఆమె భూమిని విడిచిపెట్టింది. దాంతో పొలాలన్నీ నాశనమయ్యాయి.
ఈ కథలన్నింటి వెనుక ఓ కారణం ఉంది. మన భూ గ్రహం గురించి పురుషులు చేసే ఊహల్లో అంతర్గతంగా స్త్రీ శక్తి ఉందని భావించడమే దీనికి ప్రాతిపదిక.
హిందూ పురాణాల ప్రకారం శివుని భార్య సతీదేవి మరణానంతరం భౌతిక విశ్వంలో భాగంగా మారింది. ఆమె భౌతిక కాయం ముక్కలు ముక్కలయి భూమి మీద పలు చోట్ల పడ్డాయి. యోని భాగం పడిన ప్రాంతం అస్సాంలోని కామాక్య మందిరంగా వెలసింది.
ఈ రోజుకు కూడా ఇక్కడ వర్షాకాలంలో సంబరాలు చేస్తారు. ఐరన్ ఆక్సైడ్ ఊటల కారణంగా ఎర్రగా మారే అక్కడి సహజ నీటి ప్రవాహాన్ని భక్తులు ఆశ్చర్యంతో చూస్తారు. భూదేవికి రుతు స్రావం జరిగినట్టు నమ్ముతారు.
మహిళల పాలనకు ఎందుకు భయపడ్డారంటే...
ఈ ఆరాధన విధానాల్లో ముఖ్యమైన విషయం ఏమిటంటే... మానవ మహిళలకన్నా దేవతలకు అపారమైన శక్తులు ఉండేవని పురుషులు విశ్వసించేవారు. అందుకే భూమిని మహిళలు పాలిస్తే అది విధ్వంసానికి దారి తీస్తుందని ఉదాహరణగా చెప్పేవారు. ఇలాంటి భావనలకు ఎవరేం చేస్తారు?
లక్ష్మి, డిమీటర్ మాదిరిగానే గ్రీకుల దేవత సెఖ్‌మెట్‌ను కూడా జీవితాన్ని ప్రసాదించే శక్తిగా ఆరాధించేవారు. అదే సమయంలో ఆమెను వినాశన దేవతగానూ చూశారు.
ఒకసారి ప్రజలంతా సూర్యదేవుడు 'రా'కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. దాంతో రా తన కుమార్తె అయిన సెఖ్‌మెట్‌ను పిలిచి భూమిని దోచుకోవాలని ఆజ్ఞాపించాడు. భూమి మీదకు వచ్చి ఆమె అదే పనిచేసింది. అయితే అత్యుత్సాహంతో అంతకన్నా ఎక్కవే చేసింది.
ఆమె రక్తదాహాన్ని చూసి సూర్యదేవుడే సిగ్గు పడ్డాడు. వెనక్కి రావాలని ఆదేశించాడు. తిరిగి వచ్చినా ఆమె పద్ధతి మార్చుకోలేదు. ఆమెను దారి మళ్లించడానికి ఓ ఎత్తువేశాడు. మద్యాన్ని రక్తంగా భ్రమింపజేసి తాగించాడు. మద్యం మత్తులో మునిగిన ఆమె ఎక్కడికీ కదలలేకపోయింది.
ఇప్పటికి కూడా అధికారంలో ఉన్న మహిళలు ఎంతగా గౌరవం పొందుతారో, అంతగా భయపడుతుంటారు కూడా. తమ విజయాలను ఎవరో అడ్డుకుంటున్నారని, అడ్డంకులను అధిగమిస్తామంటే బెదిరింపులు వస్తున్నాయన్న భావన కనీసం కొందరిలోనయినా కనిపిస్తోంది.
చరిత్రలోని ఉదాహరణలను పరిశీలిస్తే అధికారంలో ఉన్న మహిళలే పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరించారు. అంచనాలను తలకిందులు చేసి ఎదిగారు. వారిది ఏముందిలే అని ప్రజలు అనుకున్నా అన్నీ తామేనంటూ ప్రతిభ చూపారు.
ఇవి కూడా చదవండి:
- ఎప్పటిలాగే అడవికెళ్లి పుట్టగొడుగులు తెచ్చుకుని తిన్నారు, కానీ అర్ధరాత్రి దాటిన తర్వాత..
- ‘నా దగ్గర వేరే దారి లేదు, నేనెలాగూ చనిపోతా’ - సోనియాతో రాజీవ్ గాంధీ
- భూకంపాలు, సునామీలను ఇంటర్నెట్ కేబుళ్లు ఎలా గుర్తిస్తాయంటే....
- యుక్రెయిన్‌లో ‘యుద్ధ నేరాలకు’ రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను విచారించటం సాధ్యమేనా
- సినిమా రివ్యూ: ‘జోసెఫ్’ని కాపీ, పేస్ట్ చేసిన ‘శేఖర్’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













