ది హౌస్ ఆఫ్ విజ్డమ్: ఆధునిక గణితం ఆవిర్భావానికి కారణమైన ప్రాచీన ఇస్లాం గ్రంథాలయం

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అడ్రియెన్ బెర్నార్డ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
శతాబ్దాల క్రితం ఒక ప్రతిష్టాత్మక ఇస్లాం గ్రంథాలయం అరబిక్ అంకెలను ప్రపంచానికి పరిచయం చేసింది. ఆ గ్రంథాలయం ఎప్పుడో మాయమైనా, అది అందించిన గణిత విప్లవం ప్రపంచాన్నే మార్చేసింది.
'ది హౌస్ ఆఫ్ విజ్డమ్' అనే ఈ గ్రంథాలయం కాస్త కల్పిత కథగా అనిపిస్తుంది. ఈ ప్రాచీన గ్రంథాలయం జాడలేవీ ఇప్పుడు లేవు. దీనిని 13వ శతాబ్దంలో ధ్వంసం చేశారు. అందుకే, అది కచ్చితంగా ఎక్కడుండేది, ఎలా ఉండేది అనేది మనకేం తెలీదు.
కానీ, నిజానికి ఇస్లాం స్వర్ణ యుగంలో ఈ ప్రతిష్టాత్మక అకాడమీ బగ్దాద్‌లో ఒక ప్రధాన మేధో శక్తి కేంద్రంగా ఉండేది. భారతదేశం అందించిన సున్నా, ఆధునిక అరబిక్ అంకెలు గణితశాస్త్రాన్ని ఎంతగా మార్చేశాయో.. ఈ హౌస్ ఆఫ్ విజ్డమ్‌లో పుట్టిన గణితశాస్త్ర భావనలు కూడా గణితాన్ని అంతగా రూపాంతరం చేశాయి.
ఎనిమిదో శతాబ్దం ద్వితీయార్థంలో ఖలీఫా అల్ రషీద్ రచనలను భద్రపరిచేందుకు స్థాపించిన ఈ గ్రంథాలయాన్ని దాదాపు 30 ఏళ్ల తర్వాత ఒక పబ్లిక్ అకాడమీగా మార్చేశారు. ఈ 'హౌస్ ఆఫ్ విజ్డమ్' ప్రపంచమంతటా ఉన్న శాస్త్రవేత్తలను బగ్దాద్ వైపు ఆకర్షించేది. నగరంలో ఉత్సాహం కలిగించే మేధో జిజ్ఞాస, భావ ప్రకటనా స్వేచ్ఛ వారందరినీ ఇక్కడకు చేర్చింది. ముస్లింలు, యూదులు, క్రైస్తవులు తేడా లేకుండా అందరినీ ఇక్కడ చదువుకోడానికి అనుమతించేవారు.
ఈ ప్రాచీన గ్రంథాలయం ప్రస్తుతం లండన్‌లోని బ్రిటిష్ లైబ్రరీ లేదా ప్యారిస్‌లోని బిబిలోతెక్ నేషనలే ఆఫ్ పారిస్ అంత పెద్దదిగా ఉండేదని చెబుతారు. గణితశాస్త్రం, ఖగోళశాస్త్రం, వైద్యం, రసాయనశాస్త్రం, భూగోళశాస్త్రం, తత్వశాస్త్రం, సాహిత్యం, కళలతో చివరికి 'ది హౌస్ ఆఫ్ విజ్డమ్' మానవ విజ్ఞాన శాస్త్రం అధ్యయనానికి ఒక అద్భుతమైన కేంద్రంగా మారింది. ఇక్కడ సందేహాస్పదమైన రసవాదం, జ్యోతిషం లాంటి కొన్నిసబ్జెక్టులు కూడా ఉండేవి.
ఈ భారీ గ్రంథాలయం ఎలా ఉంటుందో ఊహించడం చాలా కష్టం. కానీ ఒకటి మాత్రం కచ్చితంగా చెప్పచ్చు. గణితశాస్త్రాన్ని సమూలంగా మార్చేసిన ఒక సాంస్కృతిక పునరుజ్జీవానికి ఈ అకాడమీ కారణమైంది.
1258లో బగ్దాద్‌పై మంగోలులు దాడి చేసినపుడు 'ది హౌస్ ఆఫ్ విజ్డమ్' ధ్వంసమైంది (చాలా పురాతన గ్రంథాలను టైగ్రిస్ నదిలో పడేశారని.. వాటిలోని ఇంకు తడిచిపోయి అవి నల్లగా మారిపోయాయని కథలుగా చెప్తుంటారు). కానీ అక్కడ కనుగొన్న గ్రంథాలు తర్వాత ఒక శక్తివంతమైన, అబ్‌స్ట్రాక్ట్ గణిత భాషను పరిచయం చేశాయి. తర్వాత ఇస్లామిక్ సామ్రాజ్యం, యూరప్, చివరికి మొత్తం ప్రపంచం వాటిని అనుసరించింది.

ఫొటో సోర్స్, Getty Images
‘‘ది హౌస్ ఆఫ్ విజ్డమ్'ను ఎక్కడ, ఎప్పుడు కట్టారో మనకు కచ్చితమైన వివరాలు తెలీవు. వారి శాస్త్రీయ ఆలోచనల చరిత్ర, వాటిని ఎలా అభివృద్ధి చేశారు అనేది ఇంకా ఆసక్తికరంగా ఉంది’’ అని యూనివర్సిటీ ఆఫ్ సర్రే ఫిజిక్స్ ప్రొఫెసర్ జిమ్ అల్-ఖలీలీ చెప్పారు.
'ది హౌస్ ఆఫ్ విజ్డమ్' గణిత వారసత్వాన్ని గుర్తించాలంటే, అది సమయంలోకి కాస్త వెనక్కు వెళ్లినట్లు ఉంటుంది. ఇటాలియన్ పునరుజ్జీవం మొదలయ్యేవరకూ యూరప్‌లో ఒక పేరు గణితశాస్త్రానికి పర్యాయపదంగా నిలిచింది. ఆయనే లియోనార్డో డా పిసా. చనిపోయాక ఆయన్ను ఫిబోనాచీ అన్నారు.
1170లో పీసాలో జన్మించిన ఈ ఇటలీ గణిత శాస్త్రవేత్త, ఆఫ్రికా తీరంలోని బుగియాలో ప్రాథమిక విద్య అభ్యసించారు. 20 ఏళ్ల వయసులో ఆయన మధ్యప్రాచ్యానికి వెళ్లారు. భారత్, పర్షియాల ఆలోచనలకు ఆకర్షితులయ్యారు. తిరిగి ఇటలీ వచ్చిన ఆయన హిందూ-అరబిక్ సంఖ్యా వ్యవస్థను వర్ణించే పాశ్చ్యాత్త రచనల్లో ఒకటైన 'లిబెర్ అబ్బాసీ'ని ప్రచురించారు.
'లిబర్ అబ్బాసీ' మొదట 1202లో వెలుగుచూసే సమయానికి, హిందూ-అరబిక్ అంకెల గురించి కొంత మంది మేధావులకు మాత్రమే తెలుసు. యూరోపియన్ వర్తకులు, పండితులు అప్పటికీ రోమన్ అంకెలే ఉపయోగిస్తున్నారు. వాటితో గుణించడం, భాగించడం చాలా గందరగోళంగా ఉండేది. (ఉదా: MXCIని LVIIతో గుణించడానికి ప్రయత్నించండి!) ఫిబొనాచీ పుస్తకంలోని అంకెలు అంకగణితంలో, లాభాల మార్జిన్, డబ్బు మారకం, బరువు మార్పిడి, వినిమయం, వడ్డీ లెక్కలు వేయడానికి ఉపయోగపడ్డాయి.
పిల్లలు ఇప్పుడు స్కూళ్లలో నేర్చుకుంటున్న అంకెల గురించి చెప్పిన ఫిబోనాచీ, లెక్కించే కళను, సూక్ష్మ బేధాలను, ఆ చాతుర్యాన్ని తెలుసుకోవాలనుకునేవారు చేతి వేళ్లతో లెక్కించడం గురించి కూడా తెలుసుకోవాలని తను రాసిన ఎన్‌సైక్లోపీడియా మొదటి అధ్యాయంలో చెప్పారు. సున్నాతో పాటూ ఉన్న ఈ తొమ్మిది అంకెలను జెఫర్ అంటారు. ఈ అంకెలతో గణితశాస్త్రం హఠాత్తుగా అందరికీ ఉపయోగపడేదిగా మారిపోయింది.
ఫిబొనాచీ గొప్పతనం, ఆయనను ఒక సృజనాత్మకత గణితశాస్త్రవేత్తకే పరిమితం చేయలేదు. కానీ, శతాబ్దాలపాటు ముస్లిం శాస్త్రవేత్తలకు తెలిసిన ప్రయోజనాల గురించి ఆయనకు లోతైన అవగాహన ఉంది. ఆయనకు వారి లెక్కించే సిద్ధాంతాలు, దశాంశ స్థాన వ్యవస్థ, అల్జీబ్రా అన్నీ తెలుసు. లిబెర్ అబ్బాసీ నిజానికి 9వ శతాబ్దానికి చెందిన అరబ్ గణితశాస్త్రవేత్త అల్-ఖ్వారిజ్మీ అల్గోరిథం ఆధారంగా రాశారు.
విప్లవాత్మకమైన ఆయన గ్రంథం చతురశ్రాకార సమీకరణాలును పరిష్కరించడానికి మొదటిసారి ఒక క్రమబద్ధమైన మార్గాన్ని అందించింది. ఈ ఆవిష్కరణల ఫలితంగా అల్-ఖ్వారిజ్మీని అల్జీబ్రా పితామహుడుగా వర్ణించేవారు. 821లో ఆయనను 'ది హౌస్ ఆఫ్ విజ్డమ్' గ్రంధాలయానికి హెడ్ లైబ్రేరియన్‌గా, ఖగోళశాస్త్రవేత్తగా నియమించారు.

ఫొటో సోర్స్, Getty Images
"అల్-ఖ్వారిజ్మీ గ్రంథాలు దశాంశ సంఖ్యా వ్యవస్థను ముస్లిం ప్రపంచానికి పరిచయం చేశాయి. లియోనార్డో డా పిసా లాంటివారు దానిని యూరప్ అంతటా వ్యాపించేలా చేశారు" అని అల్-ఖలీలీ చెప్పారు.
ఆధునిక గణితంలో ఫిబోనాచీ మార్పుల ప్రభావం అనేది చాలావరకూ అల్-ఖ్వారిజ్మీ అందించిన వారసత్వంగా నిలిచింది. ఇద్దరి మధ్యా దాదాపు నాలుగు శతాబ్దాల అంతరం ఉన్నప్పటికీ, ఒక ప్రాచీన గ్రంథాలయం వారిని కలిపింది. మధ్యయుగంలో అత్యంత ప్రముఖుడైన ఒక గణితశాస్త్రజ్ఞుడు, ఇస్లామిక్ స్వర్ణయుగంలో ఒక ప్రసిద్ధ సంస్థలో పురోగతి సాధించిన మరో మార్గదర్శకుడు, మేధావి ఆలోచనలను ఉపయోగించుకున్నారు.
బహుశా, 'ది హౌస్ ఆఫ్ విజ్డమ్' గురించి చాల తక్కువగా తెలిసుండడం వల్ల చరిత్రకారులు అప్పుడప్పుడూ దీని గొప్పతనాన్ని కాస్త అతిగా వర్ణిస్తుంటారు. మనకు లభించిన చారిత్రక ఆధారాలకు విరుద్ధంగా దీనికి ఒక పురాణం హోదాను ఇచ్చేస్తారు. కొంతమంది 'ది హౌస్ ఆఫ్ విజ్డమ్' అనేది చాలా మందికి అనిపించినంత గొప్పదేం కాదని అంటారని కూడా అల్ ఖలీలీ చెప్పారు.
"కానీ, ఈ గ్రంథాలయానికి గణిత, ఖగోళ, భూగోళశాస్త్రాలలో అల్-ఖ్వారిజ్మీ లాంటివారి కృషికి అనుబంధం ఉంది. 'ది హౌస్ ఆఫ్ విజ్డమ్' అనేది ఒక నిజమైన అకాడమీకి దగ్గరగా ఉందని, అది అనువాద పుస్తకాలు భద్రపరిచిన ప్రాంతం మాత్రమే కాదనడానికి నాకు అవి బలమైన ఆధారాలు అనిపిస్తున్నాయి" అన్నారు.
"ఈ గ్రంథాలయంలోని పండితులు, అనువాదకులు తమ రచనలను ప్రజలందరూ చదివేలా అందుబాటులో ఉంచడానికి నానా కష్టాలూ పడ్డారు. అక్కడ జరిగే అనువాదాలను బట్టి చూస్తే, 'ది హౌస్ ఆఫ్ విజ్డమ్' ప్రాథమికంగా చాలా ముఖ్యమైనది. అరబిక్ పండితులు స్థానిక భాషల్లోకి అనువదించిన గ్రీకు భావనలను, మేం మా గణితశాస్త్ర అవగాహనకు ఆధారంగా మార్చుకున్నాం" అని బ్రిటన్‌లోని ఓపెన్ యూనివర్సిటీలో గణిత చరిత్ర ప్రొఫెసర్ జూన్ బారో గ్రీన్ చెప్పారు.
మన ప్రస్తుత దశాంశ వ్యవస్థకు చాలా కాలం క్రితం, మన కంప్యూటర్లకు ప్రోగ్రాం రాసే బైనరీ సంఖ్యా వ్యవస్థ, రోమన్ అంకెల కంటే ముందు, పురాతన మెసపటోనియన్లు ఉపయోగించిన వ్యవస్థ కంటే ముందు... లెక్కలు చేయడానికి మనుషులు ప్రాథమిక గణన వ్యవస్థ ఉపయోగించేవారు. వీటిలో ఒక్కొక్కటీ మనకు ఊహకందని విధంగా, ప్రాచీనమైనవిగా అనిపించినప్పటికీ, వివిధ సంఖ్యలు అవి ఆవిర్భవించిన నిర్మాణం, సంబంధాలు, చరిత్ర, సంస్కృతిక సందర్భాల గురించి మనకు చెబుతాయి.
అవి స్థానం విలువ, సంగ్రహణ ఆలోచనను బలోపేతం చేస్తాయి. అంకెలు ఎలా పనిచేస్తాయో మనం మరింత మెరుగ్గా తెలుసుకోడానికి ఉపయోగపడతాయి. దీనికి పాశ్చ్యాత్త మార్గం ఒక్కటే లేదనేది అవి మనకు చూపిస్తాయి. వివిధ సంఖ్యా వ్యవస్థలను అర్థం చేసుకుంటే అసలైన విలువను తెలుసుకోగలం " అని బారో గ్రీన్ చెప్పారు.
ఉదాహరణకు పాతకాలంలో ఒక వ్యాపారి రెండు గొర్రెలు అని రాయడానికి, మట్టి పలకలపై రెండు గొర్రె బొమ్మలు చెక్కేవాడు. కానీ, అతడు దానిపైనే 20 గొర్రెలు అని రాయాలంటే, అది సాధ్యం కాదు. సంకేత- విలువ(సైన్-వాల్యూ) గుర్తులు అనేవి అంకెల చిహ్నాలను కలిపి ఒక విలువను సూచించే వ్యవస్థ. ఇక్కడ రెండు గొర్రెల బొమ్మ వేయడం అనేది వాటి వాస్తవ పరిమాణాన్ని చెబుతుంది.

పరిమాణాన్ని చెప్పడానికి అంకెల స్థాన విలువపై ఆధారపడే వ్యవస్థను అల్-ఖ్వారిజ్మీ పరిచయం చేసినప్పటికీ, సంకేత విలువ చిహ్నాలు, రోమన్ అంకెలు ఎలాగోలా కొనసాగాయి. అంటే చెక్కిన ఎత్తైన స్మారకాల్లా రోమన్ అంకెలు అవి పుట్టిన ప్రాంతాన్ని దాటి మిగతా ప్రాంతాలకు వ్యాపించాయి. అది అనుకోకుండా జరిగిందా లేదా ఉద్దేశపూర్వకంగా జరిగిందా అనేది కచ్చితంగా ఎవరూ చెప్పలేకపోయారు.
ఈ ఏడాది ఫిబొనాచీ 850వ జయంతిని జరుపుకుంటున్నారు. దీనిని రోమన్ అంకెల జోరుకు అడ్డుకట్టగా కూడా గుర్తుచేసుకుంటున్నారు. బ్రిటన్ పాఠశాలల్లోని తరగతి గదుల్లో ఇప్పుడు సంప్రదాయ గడియారాలకు బదులు పిల్లలు సులభంగా చదవగలిగేలా డిజిటల్ గడియారాలు పెట్టారు. ప్రపంచవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో రోడ్ సిగ్నళ్లు, అధికారిక పత్రాల్లో పాత అంకెలను తొలగించారు. హాలీవుడ్ తమ సీక్వెల్స్ టైటిళ్లకు రోమన్ అంకెలు ఉపయోగించడం మానేసింది. అభిమానులను గందరగోళానికి గురిచేయడంతో పాపులర్ గేమ్ సూపర్‌బౌల్ తమ 50వ గేమ్‌కు ఆ అంకెలు పక్కకు పెట్టింది.
మాజీ గణిత ఉపాధ్యాయుడు, కేంబ్రిడ్జ్ గణితశాస్త్రం ఎడిటర్ లూసీ రైక్రాఫ్ట్ స్మిత్ ఇప్పుడు గణితశాస్త్ర బోధనపై తన స్వరం వినిపిస్తున్నారు..
ఆయన ప్రపంచవ్యాప్తంగా గణితశాస్త్ర పాఠ్యాంశాల్లో ఉన్న తేడాలపై అధ్యయనం చేస్తున్నారు. వేల్స్, స్కాట్‌లాండ్, ఐర్లాండ్ పాఠాలలో రోమన్ అంకెలు ఉండవు. అమెరికాకు ప్రామాణిక అవసరాలు లేవు. ఇక ఇంగ్లండ్ తమ విద్యార్థులు 100 వరకూ రోమన్ అంకెలను చదవగలిగేలా ఉండాలని స్పష్టంగా చెప్పింది.
మనలో చాలా మందికి MMXX (2020)అనే పదం పెద్దగా ప్రత్యేకంగా అనిపించదు. ఫిబొనాచీగా ప్రసిద్ధి చెందిన ఆయన పద్ధతి మనకు అస్పష్టంగా గుర్తుండవచ్చు. ఆ పునరావృత వరుస 1 నుంచి మొదలై ముందున్న రెండు సంఖ్యలను కలిపే మొత్తంతో కొనసాగుతుంది.
ఫిబొనాచీ వరుసక్రమం కచ్చితంగా గొప్పది. అది సముద్రపు గవ్వల్లో, మొక్కల తీగల్లో, పొద్దు తిరుగుడు పూల మధ్య భాగంలో, పైన్ కాయల్లో, జంతువుల కొమ్ముల్లో, కాండంపై ఆకు చిగుళ్ల లాంటి వాటి ద్వారా సహజ ప్రపంచంలో కనిపిస్తుంది. డిజిటల్ ప్రపంచం (కంప్యూటర్ సైన్స్, సీక్వెన్సింగ్‌లో)లో కూడా మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. ఆయన నమూనాలు జనాదరణ పొందిన సంస్కృతిలోకి, అంటే సాహిత్యం, సినిమాలు, విజువల్ ఆర్ట్స్‌లో ప్రవేశించాయి. పాటల సాహిత్యంలో పల్లవిలా లేదా ఆర్కెస్ట్రా సంగీతంలో, ఆర్కిటెక్చర్‌లో కూడా ఉన్నాయి.
కానీ, అత్యంత శాశ్వతమైన లియోనార్డో డా పిసా గణిత సహకారాన్ని స్కూళ్లలో అరుదుగా చెబుతున్నారు. ఆ కథ దాదాపు వెయ్యేళ్ల క్రితం క్రైస్తవ మతంలో చాలా మంది మేధో అంధకారంలో మునిగిన సమయంలో ఒక భారీ గ్రంధాలయంలో మొదలైంది. ఇది గణితంపై మనకున్న యూరోసెంట్రిక్ దృక్పథాన్ని తొలగించి, ఇస్లామిక్ ప్రపంచ శాస్త్రీయ సాధనలు వెలుగులోకి వచ్చేలా, సుదీర్ఘ కాలం నుంచీ ఉన్న సంఖ్యా సంపద ప్రాధాన్యం కొనసాగించడానికి వాదించేలా చేస్తుంది.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: భారతదేశంలో కొంతమందికే కోవిడ్-19 వ్యాక్సీన్ ఇస్తారా?
- 'మిషన్ బిల్డ్ ఏపీ'లో భాగంగా రాజధాని భూములు అమ్మే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం
- సముద్రపు చేపలా.. చెరువుల్లో పెంచిన చేపలా.. ఏవి తింటే ఆరోగ్యానికి మంచిది?
- అమెరికాలో ఆకలి కేకలు.. ఆహారం దొరక్క సంపన్న ప్రాంతాల్లోనూ ప్రజల ఇబ్బందులు
- ATM - ఎనీ టైమ్ మీల్: అన్నార్తులను ఆదుకుంటున్న హైదరాబాదీ ఆలోచన...
- కరోనా వ్యాక్సీన్ భారతదేశంలో మొదట ఎవరికి ఇస్తారు... దీని కోసం ఎలా రిజిస్టర్ చేసుకోవాలి?
- కోవిడ్ వ్యాక్సీన్ తీసుకున్న తర్వాత కూడా మాస్క్ ధరించాల్సిందేనా? సామాజిక దూరమూ పాటించాలా?
- మీరు కోరుకునేవన్నీ మీకు ఇష్టమైనవేనా? సైన్స్ ఏం చెబుతోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








