నీలకంఠ భాను ప్రకాశ్: ఫాస్టెస్ట్ హ్యూమన్ కాలిక్యులేటర్ కావడానికి రోడ్డు ప్రమాదం ఎలా కారణమైంది?

నీలకంఠ భాను ప్రకాశ్

ఫొటో సోర్స్, Neelakantha Bhanu Prakash/Getty Images

    • రచయిత, దీప్తీ బత్తిని
    • హోదా, బీబీసీ ప్రతినిధి

హైదరాబాద్‌కు చెందిన 20 ఏళ్ల నీలకంఠ భాను ప్రకాశ్ ప్రపంచంలోనే వేగంతమైన మానవ కాలిక్యులేటర్‌గా నిలిచారు.

2020లో లండన్‌లో జరిగిన వరల్డ్ మైండ్ స్పోర్ట్స్ ఒలింపియాడ్‌లో పాల్గొని, మెంటల్ కాలిక్యులేషన్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ టైటిల్ గెలుచుకున్నారు.

భాను ప్రకాశ్‌తో బీబీసీ తెలుగు మాట్లాడింది.

గణితం అంటే ఒక మానసిక క్రీడ అని భాను ప్రకాశ్ అన్నారు.

‘పజిల్స్‌తో మొదలుపెట్టా’

ఫొటో సోర్స్, NEELAKANTHA BHANU PRAKASH

ఫొటో క్యాప్షన్, ‘పజిల్స్‌తో మొదలుపెట్టా’

రోడ్డు ప్రమాదం తర్వాత...

ఐదేళ్ల వయసులో గణితంతో తన ప్రయాణం మొదలైందని భాను ప్రకాశ్ అన్నారు.

“2005లో ఓ రోడ్డు ప్రమాదంలో నా మెదడుకు తీవ్ర గాయమైంది. ఐదు రోజులు నేను స్పృహలో లేనని అమ్మ, నాన్న చెప్పారు. చాలా శస్త్రచికిత్సల తర్వాత నన్ను వైద్యులు ఇంటికి పంపారు. నేను పూర్తిగా కోలుకోవడానికి సంవత్సరంపైనే పట్టింది” అని ఆయన అన్నారు.

ఆ ఘటన తర్వాత తాను ఇంటికి పరిమితం కావాల్సి వచ్చిందని భాను ప్రకాశ్ చెప్పారు.

“బయట ఆడుకోవాల్సిన వయసు అది. కానీ, ఇంట్లో నుంచి నన్ను బయటకు పోనిచ్చేవారు కాదు. అప్పుడు సమయం గడిచేందుకు, పజిల్స్ పరిష్కరించడం మొదలుపెట్టా’’ అని గణితంలో తన ప్రస్థానం గురించి భాను వివరించారు.

అలా గణితంపై ఆసక్తి పెంచుకున్న భాను... ఈ సబ్జెక్టుకు సంబంధించి స్థానిక ఛాంపియన్‌షిప్‌లు, జాతీయ ఛాంపియన్‌షిప్‌‌ల్లో పాల్గొని గెలవడం మొదలుపెట్టారు. నాలుగు ప్రపంచ రికార్డులు సాధించారు.

ప్రస్తుతం దిల్లీలోని స్టీఫేన్స్ కాలేజీలో భాను గణితం కోర్సు చదువుతున్నారు.

‘చాలా మందిలో గణితం అంటే కలిగే భయాన్ని తొలగించడం నా లక్ష్యం’

ఫొటో సోర్స్, NEELAKANTHA BHANU PRAKASH

ఫొటో క్యాప్షన్, ‘చాలా మందిలో గణితం అంటే కలిగే భయాన్ని తొలగించడం నా లక్ష్యం’

‘మనసులో ఎప్పుడూ అంకెలే’

నిత్యం తాను అంకెల గురించి ఆలోచిస్తూనే ఉంటానని భాను అంటున్నారు.

“ఇప్పుడు మీతో మాట్లాడుతూనే నేను 89వ ఎక్కం (గుణకార పట్టిక) మైండ్‌లో చదువుతున్నాను” అంటూ మాటల మధ్యలోనే 89వ ఎక్కం చెప్పేశారాయన.

కాలిక్యులేటర్ ఉండగా, దానితో పోటిపడటం ఎందుకు అని చాలా మంది తనను అడుగుతుంటారని, అందుకు తాను ఒలింపిక్స్‌లో ఎనిమిది బంగారు పతకాలు సాధించిన ఉసేన్ బోల్ట్‌ను ఉదాహరణగా తీసుకుని వారికి జవాబిస్తుంటానని భాను అన్నారు.

“ఉసేన్ బోల్ట్ ఎందుకు అంత వేగంగా పరిగెడతారు? ఆయన దగ్గర కారు లేదా? కాలిక్యులేటర్ ఉంది కాబట్టి, మెదడుకు పని చెప్పాల్సిన అవసరం లేదని అనుకోవడం తప్పు. సరైన శిక్షణతో మానవ శరీరం ఎలాంటి అద్భుతాలు చేయగలదన్నదానికి ఉసేన్ బోల్ట్ నిదర్శనం. శరీరానికి అవసరమైనట్లుగానే, మెదడుకు కూడా వ్యాయామం అవసరం” అని అన్నారు భాను.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

గణితం అంటే చాలా మందిలో ఉండే భయాన్ని తొలగించడం తన లక్ష్యమని ఆయన చెప్పారు.

“గణితంపై అనేక అపోహలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇదే సమస్య. గణితాన్ని సరదాగా బోధించరు. అందుకే, అంకెలు అంటేనే విద్యార్థులు భయపడిపోతారు. గణితం నేర్పే విధానంలో మార్పు రానంత వరకు విద్యార్థుల్లో గణితం అంటే భయం పోదు” అని భాను అన్నారు.

చిన్న వయసులోనే గణితం నేర్చుకోవడం ఎంత సులువో నేర్పితే పిల్లల్లో మేధో వికాసం ఎక్కువగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.

విద్యార్థుల్లో గణితం పట్ల ఆసక్తి పెంపొందించడం తన బాధ్యత అని భాను అన్నారు.

ఇప్పటికే ఆయన తెలంగాణ ప్రభుత్వ సాయంతో టీసాట్ ద్వారా సులభమైన చిట్కాలతో విద్యార్థులకు గణిత పాఠాలు చెబుతున్నారు. వివిధ మాధ్యమాలను కూడా ఆయన ఇందుకోసం ఉపయోగించుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)