వరల్డ్ థైరాయిడ్ డే: ప్రతి పది మంది భారతీయుల్లో ఒకరు ఈ సమస్యతో బాధపడుతున్నారు, కారణాలేంటి?

థైరాయిడ్ సోకినట్లు చాలామందికి తెలియదు కూడా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, థైరాయిడ్ సోకినట్లు చాలామందికి తెలియదు కూడా
    • రచయిత, రవి కుమార్ పాణంగిపల్లి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

2021 లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా సుమారు 4.2 కోట్ల మంది భారతీయులు థైరాయిడ్ వ్యాధిగ్రస్థులు.

సమస్య ఏంటంటే థైరాయిడ్ సోకినప్పటికీ మూడో వంతు మందికి ఆ విషయమే తెలియడం లేదు. ముఖ్యంగా మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. గర్భిణుల్లోనూ డెలివరీ తర్వాత మొదటి 3 నెలల్లో 44.3శాతం మందిలో థైరాయిడ్ సమస్య ఉత్పన్నమవుతోంది.

అసలేంటీ థైరాయిడ్?

శరీరంలోని మెడ భాగంలో సీతాకోక చిలుక ఆకారాన్ని పోలి ఉండే గ్రంధి థైరాయిడ్. శరీరం శక్తిని వినియోగించుకునేందుకు, వెచ్చగా ఉండేందుకు, మెదడు, గుండె, కండరాలు, ఇతర అవయవాలు సక్రమంగా పని చేసేందుకు అవసరమైన హార్మోన్లను ఈ గ్రంధి ఉత్పత్తి చేస్తుంది.

ఓ రకంగా చెప్పాలంటే ఈ గ్రంధి శరీరానికి బ్యాటరీలా పని చేస్తుంది. ఈ గ్రంధి హోర్మోన్లను తక్కువగా, లేదా ఎక్కువగా ఉత్పత్తి చేయడం మొదలుపెడితే, థైరాయిడ్ లక్షణాలు కనిపిస్తాయి" అని ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరుకు చెందిన ప్రముఖ ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ బెల్లం భరణి బీబీసీకి చెప్పారు.

థైరాయిడ్ గ్రంథి శరీరానికి అవసరమైనంత హోర్మోన్లను ఉత్పత్తి చేయలేకపోతే దాన్ని హైపో థైరాయిడిజం అంటారు.

బ్యాటరీ అయిపోయిన బొమ్మ తరహాలో శరీరం పని చేస్తుంది. చాలా త్వరగా అలిసిపోతూ ఉంటారు.

థైరాయిడ్ గ్రంథి అధికంగా పని చేయడం మొదలుపెడితే, హైపర్ థైరాయిడిజం వస్తుంది. వీరి పరిస్థితి కెఫీన్ అదనపు డోసు తీసుకున్నప్పటి మాదిరిగా ఉంటుంది.

ఇక మూడోది థైరాయిడ్ గ్రంధి వాచిపోవడం. దీన్ని గోయిటర్ అంటారు. ఈ సమస్య పరిష్కారానికి అవసరమైతే శస్త్రచికిత్స కూడా చేయాల్సి ఉంటుంది.

థైరాయిడ్ వల్ల పిల్లల్లో ఎదుగుదల ఆగిపోయే అవకాశం ఉంటుంది

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, థైరాయిడ్ వల్ల పిల్లల్లో ఎదుగుదల ఆగిపోయే అవకాశం ఉంటుంది

లక్షణాలేంటి?

బరువు పెరగడం, ముఖం, కాళ్లు వాచిపోవడం, నీరసం, బద్దకంగా అనిపించడం, ఆకలి తగ్గిపోవడం, అధిక నిద్ర, చలి ఎక్కువగా వేయడం, నెలసరిలో మార్పులు, జుట్టు రాలిపోవడం, గర్భధారణలో సమస్యలు.ఇవి హైపో థైరాయిడిజం ప్రధాన లక్షణాలు.

ఇక హైపర్ థైరాయిడిజంలో చూస్తే..ఇందులో థైరాయిడ్ హార్మోన్ శరీర అవసరానికి మించి ఉత్పత్తి అవుతుంది.

ఫలితంగా ఆకలి ఉన్నప్పటికీ సరిపడా ఆహారం తీసుకుంటున్నప్పటికీ బరువు తగ్గిపోవడం, విరోచనాలు, ఆందోళన, చేతులు-కాళ్లు వణకడం, వేడిని తట్టుకోలేకపోవడం, నీరసం, అకస్మాత్తుగా మూడ్ మారడం, నిద్రలేమి, హార్ట్ బీట్‌లో తేడాలు, కళ్లు మసగబారడం, నిద్ర పట్టకపోవడం, మెంటల్ ఫాగ్ లాంటి లక్షణాలు కనిపిస్తాయని డాక్టర్ భరణి అన్నారు.

థైరాయిడ్ సమస్య అని చెప్పడానికి దీనికంటూ ప్రత్యేకమైన లక్షణాలు ఏవి ఉండవు. ఓ రకంగా ఇదే అసలు సమస్య అని స్పానిష్ సొసైటీ ఆఫ్ ఎండోక్రైనాలజీ డాక్టర్ ఫ్రాన్సిస్కో జేవియర్ శాంటామేరియా బీబీసీకి గతంలో చెప్పారు.

ఉదాహరణకు హైపోథైరాయిడిజంను తీవ్రమైన మానసిక ఒత్తిడి అని పొరపాటు పడే ప్రమాదం ఉంది.

వీడియో క్యాప్షన్, థైరాయిడ్: ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ప్రాణాలకే ప్రమాదం

జనాభాలో చాలా మందికి హైపో థైరాయిడిజం ఉంటుంది. చాలా మంది దీనికి చికిత్స తీసుకోవడం కూడా ఆలస్యమవుతుంది.

‘‘జనాభాలో 10% మంది హైపో థైరాయిడిజంతో బాధపడుతుంటే, అందులో సగం మందికి వ్యాధి ఉన్నట్లే తెలియదు. స్త్రీ-పురుషుల్లో లక్షణాలు ఒకేలా ఉన్నప్పటికీ మహిళల్లో త్వరగా బయటపడుతుంది. 80% మంది మహిళలు థైరాయిడ్‌తో బాధపడుతూ ఉంటారు" అని డాక్టర్ శాంటామేరియా అన్నారు.

"సాధారణంగా 80% నుంచి 90% మంది థైరాయిడ్ వ్యాధిగ్రస్థులకు చికిత్స తర్వాత తగ్గిపోతుంది. కానీ, కొంత మందికి మాత్రం పూర్తిగా తగ్గదు. కొన్ని కేసులు చాలా సంక్లిష్టంగా ఉంటాయి. చాలా వరకు హైపో థైరాయిడిజంలో ఆటోఇమ్యూన్ తరహా ఉంటుంది. చికిత్స తీసుకుంటున్నా కూడా ఈ ఆటోఇమ్యూనిటీ ఇతర అవయవాల పై ప్రభావం చూపిస్తుంది" అని డాక్టర్ శాంటామేరియా చెప్పారు.

థైరాయిడ్ సమస్యల్లో అనేక స్థాయిలు ఉంటాయి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, థైరాయిడ్ సమస్యల్లో అనేక స్థాయిలు ఉంటాయి

T3-T4-TSH ఏం చెబుతాయి?

సాధారణంగా డయాబెటిస్ లెవెల్స్ గురించి చెప్పినట్టు థైరాయిడ్ లెవెల్స్ గురించి కచ్చితంగా ఇలా ఉండాలని చెప్పలేమని డాక్టర్ భరణి అన్నారు. హైపో థైరాయిడ్ అంటే లో థైరాయిడ్ విషయానికి వస్తే T3-T4 లెవెల్స్ తగ్గిపోతాయి. అదే సమయంలో థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ TSH లెవెల్స్ పెరుగుతాయి.

అలాగే హైపర్ థైరాయిడిజంలో T3-T4 లెవెల్స్ పెరుగుతాయి. TSH లెవెల్స్ సాధారణం కన్నా తగ్గుతాయి'' అని డాక్టర్ భరణి వివరించారు.

ఇక టీఎస్‌హెచ్ లెవెల్స్ విషయానికి వస్తే ఆరోగ్య బీమాను అందించే సంస్థ స్టార్ హెల్త్ తన వెబ్ సైట్లో పేర్కొన్న వివరాల ప్రకారం ఒక లీటరు రక్తంలో 0.5 నుంచి 5మిల్లీ ఇంటర్నేషనల్ యూనిట్లు ఉండాలి. థైరాయిడ్ గ్రంధి సరిగ్గా పని చేస్తున్నది లేనిది ఈ టీఎస్‌హెచ్ లెవెల్స్ సూచిస్తాయి.

అయితే ఈ నార్మల్ వాల్యూస్ అన్నవి పిల్లల్లో, పెద్దల్లో, గర్భిణిల్లో వేర్వేరుగా ఉంటాయి. అంటే వయసును బట్టీ వీటి వాల్యూస్‌ కూడా మారుతూ ఉంటాయి.

తెలుగు రాష్ట్రాల్లో ప్రజల్లో ఇటీవల ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోందని డాక్టర్ భరణి అన్నారు. ముఖ్యంగా కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా సమస్య ఉంటే వారి పిల్లల్లో కూడా వచ్చే అవకాశం ఉంటుందని ఆమె చెప్పారు.

అలాగే ఈ సమస్య రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకునే అవకాశాలు కూడా లేవని, సమస్య తలెత్తిన తర్వాత చికిత్స తీసుకోవడమే మార్గమని తెలిపారు.

సోకిన తర్వాత చికిత్స తప్ప నివారణ అవకాశాలు తక్కువ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సోకిన తర్వాత చికిత్స తప్ప నివారణ అవకాశాలు తక్కువ

ప్రాణాంతకమా?

హైపర్ థైరాయిడిజం అంటే అవసరానికి మధ్య హార్మోన్ ఉత్పత్తి అయినప్పుడు గుండె కొట్టుకునే వేగంలో మార్పులొస్తాయి. ఫలితంగా గుండెకు సంబంధించిన సమస్యలు రావచ్చు.

అలాగే హైపో థైరాయిడిజాన్ని సరైన సమయంలో గుర్తించకపోతే ఒక్కోసారి బ్రెయిన్‌లో సమస్య తలెత్తడం, ఆపై సోడియం స్థాయి తగ్గిపోయి కోమాలోకి వెళ్లే ప్రమాదం కూడా ఉంది.

వీడియో క్యాప్షన్, శరీరానికి తగినంత విటమిన్-డి అందాలంటే ఏ సమయంలో ఎంతసేపు ఎండలో ఉండాలి?

ముఖ్యంగా పిల్లలు పుట్టిన తర్వాత థైరాయిడ్ సమస్యను గుర్తించకపోతే వారిలో మానసిక అభివృద్ధి ఆగిపోయే ప్రమాదం ఉంది. ఐక్యూ లెవెల్స్ పడిపోతాయి.

చికిత్స ద్వారా సులభంగా తగ్గించదగ్గ ఈ వ్యాధిని నిర్లక్ష్యం చేయడం ద్వారా పిల్లల భవిష్యత్తు అయోమయంలో పడిపోతుంది. ముఖ్యంగా స్కూలుకి వెళ్లే పిల్లల్లో శారీరక ఎదుగుదల ఆగిపోతుంది.

రెండు రకాల సమస్యల్ని తగిన సమయానికి గుర్తించలేకపోయినప్పుడు ఒక్కోసారి ప్రాణాంతకమయ్యే ప్రమాదం కూడా ఉంటుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)