దోశల పెనంపై కోటింగ్ కారణంగా వీర్య కణాల ఉత్పత్తి తగ్గుతుందా

సెక్స్

ఫొటో సోర్స్, ISTOCK/BBC

పాశ్చాత్య దేశాల్లో 2011లో చేసిన పరిశోధనల ప్రకారం పురుషుల్లో వీర్య కణాల సంఖ్య ఒక మిల్లీలీటర్‌కు 4.7 కోట్లు. అదే 39 ఏళ్ల క్రితం 9.9 కోట్లు ఉండేది.

అంటే సగటున ఏడాది ఒక శాతం చొప్పున తగ్గుతూ వచ్చింది. అలా 2021 నాటికి 4 కోట్లకు చేరింది.

2016లో వెల్లడైన వివరాల ప్రకారం ఒక మిల్లీ లీటర్‌ వీర్యంలో ఉంటున్న సగటు వీర్య కణాల సంఖ్య 2 కోట్లు. 1979 నాటికి సుమారు 6 కోట్లు ఉండేది.

మన దేశంలో 2016 నాటికి ఇన్ఫెర్టిలిటీ రేటు సుమారు 3.9 నుంచి 16.8శాతం వరకు ఉండేదని WHO లెక్కల చెబుతున్నాయి. అదే రాష్ట్రాల విషయానికి వచ్చే సరికి ఆ లెక్కలు మారుతూ వచ్చాయి.

సెక్స్

ఫొటో సోర్స్, REBECCA HENDIN / BBC THREE

ఉత్తర ప్రదేశ్‌, హిమాచల్ ప్రదేశ్‌, మహారాష్ట్రలలో 3.7 శాతం ఉండగా.. ఆంధ్రప్రదేశ్‌లో 5 శాతం, కశ్మీర్లో 15 శాతంగా ఉంది. ఈ లెక్కలు ప్రాంతం, కులం, తెగలు బట్టి కూడా మారుతూ ఉంటాయి.

2020 సెప్టెంబర్ నాటికి ప్రపంచ వ్యాప్తంగా 4.8 కోట్ల జంటలు, 18.6 కోట్ల మంది వ్యక్తులు వంధ్యత్వంతో బాధపడుతున్నారన్నది WHO అంచనా.

పురుషుల్లో వాళ్ల తాతలతో పోల్చితే ప్రస్తుత తరం సంతానోత్పత్తి సామర్థ్యం సగానికి పడిపోయింది. స్త్రీలలో 35 ఏళ్లలో వాళ్ల అమ్మమ్మకున్న సంతానోత్పత్తి సామర్థ్యం ప్రస్తుతం 20 ఏళ్ల వయసున్న మనుమరాలికి కూడా లేకుండాపోతోంది. ఈ పరిశోధనలు, గణాంకాలు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి.

సెక్స్

ఫొటో సోర్స్, ISTOCK/BBC

అసలు ఈ పరిస్థితికి కారణమేంటి?

సిగరెట్, మద్యం తాగడం... వ్యాయామం చేయకపోవడం.. సరైన ఆహారం తీసుకోకపోవడం... ఒత్తిడి.

మొత్తంగా మీ లైఫ్ స్టైల్... మనం ఇంటికి తెచ్చుకుంటున్న వస్తువులే మనకు తెలీకుండా చేటు చేస్తున్నాయి.

పండ్లు, కూరగాయలు, ఆకు కూరల నుంచి.. ప్యాకేజీంగ్ ఫుడ్, పర్సనల్ కేర్ వస్తువుల వరకు.. ఆ లిస్టులో అన్నీ ఉన్నాయి.

సెక్స్

ఫొటో సోర్స్, Getty Images

మీ హార్మోన్లకు హాని చేసే రసాయనాలు మీరు ఇంట్లోకి తెచ్చే ప్రతి వస్తువులోనూ దాదాపు ఉంటున్నాయి.

మీరు దోశలు వేసుకునే ప్యాన్ నుంచి పిజ్జా బాక్స్ వరకు ప్రతిదానిపై కోటింగ్ కూడా ఈ పరిస్థితికి ఒక కారణం. అందులో పీఫాస్ అనే రసాయనాలుంటాయి.

ఇక రెండోది ప్లాస్టిక్‌ను నునుపుగా చేసే ఫాలెట్స్ అనే రసాయనం. ఇది కేవలం ప్లాస్టిక్ కంటైనర్లలో మాత్రమే కాదు.. కాస్మొటిక్స్ సహా అన్ని సెంటెడ్ ఉత్పత్తుల్లోనూ ఉంటుంది. ఫాథ్లెట్స్‌ను యాంటీ ఆండ్రోజన్స్ అంటారు. ఇవి టెస్టోస్టెరాన్‌ను కలిసినప్పుడు వాటిపై ప్రభావం చూపిస్తాయి.

సెక్స్

ఫొటో సోర్స్, Getty Images

అలాగే గర్భాశయం, గర్భధారణ తొలిదశలో కూడా ఫాలెట్స్ ప్రభావం ఉంటుంది. టెస్టోస్టెరాన్ లెవెల్స్ తక్కువైతే అది బిడ్డ శరీర నిర్మాణం, అభివృద్ధిపై ప్రభావం చూపిస్తుంది. ఫలితంగా పురుషుల్లో జననేంద్రియ వృద్ధి లోపిస్తుంది. దీన్నే ఫాలెట్ సిండ్రోమ్ అంటారు.

ఆపై బాలుడు పెరిగిన తర్వాత వీర్య కణాల సంఖ్య తక్కువగా ఉంటుంది. అలాగే వృషణాలు కిందకు జారకుండా ఉండిపోవచ్చు కూడా. మున్ముందు అది టెస్టికల్ క్యాన్సర్‌కు కూడా దారి తీయవచ్చు.

2000వ సంవత్సరంలో అమెరికాకు చెందిన ప్రముఖ ఎన్విరాన్మెంటల్ అండ్ రీ ప్రొడెక్టివ్ ఎపిడమాలజిస్ట్ డాక్టర్ షన్నా స్వన్.. అమెరికాలో 4 వేర్వేరు ప్రాంతాల్లో చేసిన పరిశోధన.. పురుగుల మందులు కూడా పురుషుల్లో వీర్య కణాల సంఖ్య తగ్గడానికి కారణం కావచ్చని తేలింది.

వీర్య కణాలశాతం తక్కువగా ఉండటం వల్ల డయాబెటీస్, గుండె జబ్బులు, రీప్రొడెక్టివ్ క్యాన్సర్లు ఇలా ఎన్నో రకాల వ్యాధులకు కూడా దారితీయవచ్చు.

ఇప్పటికే చాలా మంది తమ వీర్య కణాల్ని, అండాల్ని ల్యాబ్‌లలో ఫ్రీజ్ చేసి భవిష్యత్తు కోసం దాచుకుంటున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా అద్దె గర్భాలు అంటే సరోగసీ కూడా ఎక్కువైపోయింది. మొత్తంగా మనం చాలా చాలా ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నామంటున్నారు డాక్టర్ షన్నా.

వీడియో క్యాప్షన్, ‘లవర్ బాయ్స్’: యువతుల్ని ఉచ్చులోకి దింపుతున్నారు.. సెక్స్ కోసం అమ్మేస్తున్నారు

ఇదే పరిస్థితి కొనసాగితే మున్ముందు

ఇదే పరిస్థితి కొనసాగితే మున్ముందు చాలా జంటలు పిల్లల కనేందుకు వేరొకరి సాయం తీసుకోవాల్సి ఉంటుంది.

పరిస్థితులు ఇప్పటికీ మన చేతుల్లోనే ఉన్నాయా?

ఆరోగ్యకరమైన జీవన విధానం... ఇదొక్కటే వీర్య కణాల సంఖ్యను పెంచగలదు. అంటే షాపింగ్ అలవాట్లు మారాలి. అధిక బరువు ఉంటే వెంటనే తగ్గాలి. పొగతాగడం మానేయాలి. విందు వినోదాల్లో అతిగా గడపకూడదు. మద్యానికి దూరంగా ఉండాలి. మన శరీరంలోకి చేరే రసాయనాలను తిరిగి వెళ్లగొట్టాలి.

వీడియో క్యాప్షన్, మొదటి కలయిక తర్వాత కన్నెపొరకు ఏమవుతుంది, అసలు కన్యత్వంతో దానికి లింకేంటి?

అది చాలా కష్టమైన పనే.

గుడ్ న్యూస్ ఏంటంటే.. ఈ ఫాలెట్స్ మన శరీరంలో 4-5 గంటలు మాత్రమే యాక్టివ్‌గా ఉంటాయి. కనుక అవి ఎలా మన శరీరంలో చేరుతున్నాయో... గుర్తించి వాటిని ఆపగల్గితే సగం విజయం సాధించినట్టే.

అంటే రసాయనాలతో కూడిన పండ్లు, కూరగాయలు, ఇతర ఆహార పదార్థాలకు వీలైనంత దూరంగా ఉండాలి.

ఎవరో చెబితే వచ్చే శ్రద్ధ కాదు.. ఎవరికి వారు శ్రద్ధ పెట్టాలి. అంటే... పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని మనం జీవించగల్గితే... సమస్యకు పరిష్కరం కనుగొన్నట్టే.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)