ఆమెకు ఎయిడ్స్‌ ఉంది.. బావ కొడుకైన టీనేజ్ కుర్రాడితో ‘బలవంతంగా వివాహేతర సంబంధం పెట్టుకుంది’.. ఆ తర్వాత ఏమైందంటే..

లైంగిక నేరాలు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, వర్షా సింగ్
    • హోదా, బీబీసీ కోసం

ఆమె వయసు 23 ఏళ్లు. అప్పటికే ఆమెకు హెచ్ఐవీ ఉంది. అలాంటి మహిళ తన బావ కొడుకైన 15 ఏళ్ల బాలుడిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న బాలుడి తండ్రి ఆమెపై కేసు పెట్టారు.

ఉత్తరాఖండ్‌‌లోని ఉధమ్‌సింగ్ నగర్‌‌కు చెందిన నిందితురాలికి హెచ్‌ఐవీ సోకింది. గత ఏడాది డిసెంబర్‌లో ఆమె భర్త కూడా హెచ్‌ఐవీతో మరణించారు. ఆమె చేతిలో లైంగిక వేధింపులకు గురైన బాలుడికి టెస్టులు చేయించగా హెచ్‌ఐవీ నెగెటివ్‌ అని తేలింది.

పిల్లవాడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు రుద్రాపూర్‌లోని ట్రాన్సిట్ క్యాంపు పోలీస్ స్టేషన్‌లో ఆ మహిళపై కేసు నమోదైంది. నిందితురాలిపై పోక్సో చట్టం, ఐపీసీ సెక్షన్-270 కింద కేసు నమోదు చేసినట్లు ఈ కేసును విచారిస్తున్న సబ్‌-ఇన్‌స్పెక్టర్‌ రీటా చౌహాన్‌ చెప్పారు.

సెక్షన్-270 అంటే హానికరమైన మార్గాల ద్వారా ప్రాణాంతక వ్యాధిని వ్యాప్తి చేసే వారిపై మోపే నేరం.

లైంగిక నేరాలు

ఫొటో సోర్స్, Getty Images

అసలేం జరిగింది?

ఏప్రిల్ 2వ తేదీన బాధిత బాలుడి తండ్రి పోలీస్ స్టేషన్‌కు వచ్చారని సబ్-ఇన్‌స్పెక్టర్ రీటా చెప్పారు. తన కుమారుడితో అతనికి పిన్ని వరసయ్యే మహిళ బలవంతంగా శారీరక సంబంధం పెట్టుకుందని ఫిర్యాదు చేసినట్లు ఎస్సై రీటా వెల్లడించారు.

ఈ సంబంధం గురించి ఎవరికైనా చెబితే, నన్ను బలత్కారం చేశావని అందరికీ చెబుతానని ఆమె ఆ బాలుడిని బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

మార్చి 30న నిందితురాలు ఆ బాలుడిని బెదిరిస్తుండగా, అతని తల్లి గమనించారు. విషయం ఏంటని ఆరా తీయడంతో ఆ బాలుడు ఆమెకు అసలు విషయం వివరించాడు. నిందితురాలు ప్రస్తుతం జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉంది.

''నిందితురాలు ఫిలిభిత్‌‌లోని తన అత్తమామల ఇంట్లో ఉంటోంది. హోలీ సమయంలో బాధిత బాలుడు తన కుటుంబంతో సహా వారి ఇంటికి వెళ్లాడు. అక్కడే ఆమె ఆ బాలుడితో సంబంధం పెట్టుకున్నారు.

మొదటిసారి కూడా తనకు ఇష్టం లేకుండానే బలవంతంగా శారీరక సంబంధం పెట్టుకుందని ఆ బాలుడు చెప్పినట్లు అతని తల్లి వెల్లడించారు. ఒప్పుకోకపోతే తనపై బలాత్కారం చేశావని అందరితో చెబుతానని ఆమె కుర్రాడిని బెదిరించిందని బాలుడి తల్లి తెలిపారు.

మార్చి 30న నిందితురాలు రుద్రాపూర్‌కు వచ్చారని, అక్కడ కూడా బాలుడితో బలవంతంగా శారీరక సంబంధం పెట్టుకున్నారని బాలుడి తండ్రి వెల్లడించారు. బాలుడిని బెదిరిస్తుండగా తల్లి ఆ సంభాషణలు వినడంతో విషయం బయటకు వచ్చింది.

వీడియో క్యాప్షన్, నటి భావనపై లైంగిక దాడి కేసు: ఆ రోజు ఏం జరిగింది? నిందితులు ఎవరు?

నిందితురాలు తన తమ్ముడి భార్య అని, తన సోదరుడు డిసెంబర్ 2021లో మరణించాడని బాధితుడి తండ్రి చెప్పారు. ఐదు సంవత్సరాల కిందట అతనికి పెళ్లయిందని, పెళ్లయిన ఆర్నెల్లకే అతను హెచ్ఐవీ బారిన పడ్డాడని తెలిపారు.

తర్వాత అతని భార్యకు కూడా హెచ్ఐవీ సోకినట్లు తేలింది. ప్రస్తుతం ఆమె హెచ్ఐవీ చికిత్స పొందుతోంది. అయితే, నిందితురాలి నుంచి ఆమె భర్తకు వ్యాధి సోకిందా, భర్త నుంచి ఆమెకు వ్యాపించిందా అన్నది స్పష్టం కాలేదు.

''నీ కొడుకును దత్తత తీసుకుంటాను, తనతో ఊరికి పంపమని చెప్పేది. మేం కూడా దానికి రెడీ అవుతున్నాం. వాడు ఇటీవలే 8వ తరగతి పరీక్ష రాశాడు. అక్కడికి పంపక ముందే ఇదంతా జరిగింది. ఊరికి పంపి ఉంటే ఇంకా ఏమయ్యేదో'' అని బాలుడి తండ్రి అన్నారు.

అయితే, బాలుడికి హెచ్‌ఐవీ రిపోర్టు నెగిటివ్‌గా రావడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. ఒక నెల తర్వాత అతనికి మళ్లీ వైద్య పరీక్షలు చేస్తారు.

లైంగిక నేరాలు

ఫొటో సోర్స్, Getty Images

పురుషులపై లైంగిక నేరాలు నమోదు చేస్తారా?

''లైంగిక నేరాలు లింగ ఆధారితమైనవి కావు. మహిళలు కూడా అలాంటి ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. అబ్బాయిలపై చాలా లైంగిక నేరాలు నమోదు కావు. కాబట్టి అలాంటి నేరాలకు పాల్పడే వారిపై చర్యలు తీసుకున్నట్లు కనిపించదు'' అని డెహ్రాడూన్‌‌కు చెందిన లాయర్ అనుపమ గౌతమ్ అన్నారు.

ఇలాంటి కేసుల్లో మహిళలు పెద్ద వయసు వారై ఉంటారని అనుపమా గౌతమ్ అన్నారు. 21 ఏళ్ల కుర్రవాడు 45 ఏళ్ల మహిళను ఆమె ఒత్తిడి కారణంగా పెళ్లి చేసుకున్న కేసును ఆమె ఉదహరించారు.

''ఈ కేసులో ఆ మహిళ అబ్బాయి అంగీకారంతో లైంగిక సంబంధం పెట్టుకుంది. తర్వాత పెళ్లి చేసుకోమని బలవంతం చేసి బ్లాక్ మెయిల్ చేసింది. ఇప్పుడు అలాంటి కేసులు చాలా వస్తున్నాయి. సమాజంలో మార్పు కనిపిస్తోంది'' అన్నారామె.

ఈ చట్టం ప్రకారం మహిళలపై నేరుగా అత్యాచారం కేసులు నమోదు కావని అనుపమ చెప్పారు. పురుషుల మీద లైంగిక వేధింపులు అత్యాచారం నిర్వచనం కిందకు రావు. అలాంటి సందర్భాలలో లైంగిక వేధింపులు వంటి కేసులు నమోదు చేస్తారు.

రుద్రాపూర్‌లోని ఈ కేసులో బాధితుడు మైనర్‌ కాబట్టి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

లైంగిక నేరాలు

ఫొటో సోర్స్, Getty Images

పోక్సో చట్టానికి సంబంధించిన అంశం కావడంతో దీనిపై స్పందించేందుకు రుద్రాపూర్ ఎస్‌.ఎస్.పి. మంజునాథ్ నిరాకరించారు. అయితే మహిళలు లైంగిక వేధింపులకు పాల్పడే ఇలాంటి కేసులు పెరుగుతున్నాయా అని ప్రశ్నించగా.. అలాంటివి చాలా అరుదని మంజునాథ్ అన్నారు.

లింగ సంబంధిత అంశాలపై పని చేస్తున్న దీపా కౌశలం దీనిపై స్పందించారు.

''మహిళలపై వేధింపుల కేసులను నేను చాలా చూశాను. యుక్త వయస్సులో ఉన్నవారిపై లైంగిక వేధింపుల కేసుల్లో మహిళలు కూడా దోషులుగా తేలారు. కానీ, ఈ కేసులు ఎక్కువగా బైటికి రాలేదు. కాలక్రమేణా, మహిళలు తమ లైంగిక కోరికల గురించి కూడా తెలుసుకుంటున్నారు. అలాంటి కేసులు పెరుగుతున్నాయి'' అని ఆమె చెప్పారు.

''నేరం ఎవరు చేసినా నేరమే'' అన్నారు దీప.

లైంగిక నేరాలపై ప్రస్తుతం చట్ట నిర్వచనాన్ని లింగ తటస్థత ప్రాతిపదికన నిర్వచించాల్సిన అవసరం ఉందని దీప అంటున్నారు. ఇందులో స్త్రీలు, పురుషులతోపాటు థర్డ్ జెండర్ కూడా ఉండాలని ఆమె అన్నారు.

వీడియో క్యాప్షన్, ‘నిందితులు ఎవరో మేం చెప్పినా, పోలీసులు మాత్రం అరెస్ట్ చెయ్యడం లేదు ఎందుకు?’

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)