స్టాక్ మార్కెట్ కుప్పకూలినప్పుడు నష్టాల నుంచి బయట పడేందుకు ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఐవీబీ కార్తికేయ
- హోదా, బీబీసీ కోసం
'కుప్పకూలిన స్టాక్ మార్కెట్... ఒక్క రోజులో నాలుగు లక్షల కోట్లు ఆవిరి' అనే వార్తలు ఇటీవల పత్రికల్లో చూస్తున్నాం.
దీనికి కారణం మన మార్కెట్ సూచీలు క్రమంగా తగ్గుతూ జీవిత కాల గరిష్ఠ స్థాయి నుంచీ సాధారణం కంటే దాదాపు పదిహేను శాతం తక్కువగా ఉన్నాయి.
దీన్నే స్టాక్ మార్కెట్ పరిభాషలో బేర్ మార్కెట్ అంటారు. అసలు ఈ బేర్ మార్కెట్ సమయంలో ఏం చేయాలో ఆలోచించే ముందు బేర్ మార్కెట్ గురించిన అవగాహన చాలా ముఖ్యం.
ఏదైనా కారణంతో స్టాక్ మార్కెట్లో ఉండే అన్ని రంగాలు ఒకేసారి నష్టలు చవిచూస్తే అది బలమైన బేర్ మార్కెట్ పరిస్థితి. ఇలాంటి పరిస్థితులు తరచుగా రావు, ఎందుకంటే కంపెనీలు ఎప్పటికప్పుడు తమ పనితీరు ఆధారంగా మంచి భవిష్యత్తు రాబోతోంది అని మదుపరులకు భరోసా కల్పిస్తాయి.

ఫొటో సోర్స్, Getty Images
కానీ జాతీయ, అంతర్జాతీయ పరిస్థితులలో పెను మార్పులు సంభవించినప్పుడు బేర్ మార్కెట్ వాతావరణం అనివార్యం. రాజకీయ అనిశ్చితి లేదా ఇంకేదైనా ఉపద్రవం సంభవించినప్పుడు మార్కెట్ నష్టపోతుంది.
1998లో అప్పటి ఎన్డీఏ ప్రభుత్వం ఒక్క ఓటుతో పడిపొయినప్పుడు మార్కెట్లో నష్టాలు కనిపించాయి. అలాగే 2004 ఎన్నికలలో ఎన్‌డీఏ ఓడిపొయిన సమయంలో కూడా మార్కెట్ భారీగా నష్టపొయింది. నష్టాలను నివారించడానికి ట్రేడింగ్ ఆపేయాల్సిన పరిస్థితి వచ్చింది. మే 17, 2004న భారత స్టాక్ మార్కెట్ చరిత్రలో బ్లాక్ మండే అనే పేరుతో నిలిచిపొయింది.
ప్రస్తుతం యుక్రెయిన్ యుద్ధం వల్ల అంతర్జాతీయంగా ఉన్న అనిశ్చితి అన్ని దేశాల స్టాక్ మార్కెట్లను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ఈ సంక్షోభానికి ముందు స్టాక్ మార్కెట్ పెద్దగా నష్టపొయిన ఉదంతాలు, అలాగే వాటి నుంచీ నేర్చుకోవలసిన విషయాలు ఏమిటో చూద్దాం.
2008 సబ్ ప్రైం సంక్షోభం
లేమెన్ బ్రదర్స్ సంస్థ దివాళా తీసిందనే వార్త మార్కెట్లను బాగా దెబ్బతీసింది. ఈ తరానికి సంబంధించినంత వరకూ ఇది అత్యంత ఘోరమైన సంక్షోభం.

ఏడాది వ్యవధిలో సగానికి పైగా మార్కెట్ నష్టపోయింది. కింద ఇచ్చిన పట్టికలో ముఖ్యమైన రంగాలు ఈ సంక్షోభం నుంచీ కోలుకోవడానికి ఎంత సమయం తీసుకున్నాయో చూద్దాం. సంక్షోభానికి పూర్వపు స్థితిని చేరడానికి సెన్సెక్స్ దాదాపు మూడేళ్ల సమయం తీసుకుంది కానీ కొన్ని రంగాల సూచీలు సెన్సెక్స్ కంటే చాలా ముందుగానే పూర్వపు స్థాయిని చేరుకున్నాయి అంటే సెన్సెక్స్ కంటే ముందుగానే సంక్షోభాన్నుంచీ బయటపడ్డాయి.
ఎఫ్ఎంసీజీ రంగం, ఆరోగ్యం, బ్యాంకింగ్ రంగాలు సెన్సెక్స్ కంటే త్వరగా సంక్షోభం నుంచీ కోలుకున్నాయి. ఈ రంగాలలో మదుపు చేసిన వారు చాలా త్వరగా తమ నష్టాలను దాటుకున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
2020 కోవిడ్-19సంక్షోభం:
వివిధ దేశాలలో కోవిడ్ వ్యాప్తి గురించిన వార్తలు రాగానే అన్ని దేశాల మార్కెట్లు కుప్పకూలాయి. దేశంలో ఆరోగ్య సంక్షోభాన్ని సృష్టించిన కోవిడ్-19 వల్ల స్టాక్ మార్కెట్ కూడా అనూహ్యమైన నష్టాలను చూసింది.

కొన్ని రోజుల వ్యవధిలో సెన్సెక్స్ ముప్పై శాతానికి పైగా పడిపోయింది. ఈ సంక్షోభంలో కూడా ఆరోగ్యం, ఐటీ, ఎనర్జీ రంగాలు సెన్సెక్స్ కంటే చాలా ముందుగానే నష్టాల నుంచి బయటపడ్డాయి. అంటే ఈ రంగాలలో మదుపు చేసిన వారు నష్టల నుంచీ త్వరగా కోలుకున్నారు.
కోవిడ్ ఆరోగ్య సంక్షోభం కావడం వల్ల సహజంగా ఆ రంగానికి అటు ప్రభుత్వం నుంచీ ఇటు ప్రైవేట్ సంస్థల నుంచీ మద్దతు లభించింది. అందువల్ల ఆ రంగం త్వరగా కోలుకుంది.
ఇప్పుడు సగటు మదుపరికి ఈ రెండు సంక్షోభాలు నేర్పిన పాఠాలు ఏమిటో చూద్దాం:
- జీవిత బీమా, ఆరోగ్య బీమా ఎంత ముఖ్యమో ఈ సంక్షోభాలు మరోసారి గుర్తు చేశాయి. మదుపు గురించి ఆలోచించే ముందు తగిన టర్మ్ పాలసీ, ఆరోగ్య బీమా ఉండాలనే మౌలిక సూత్రం ఇక్కడ ప్రస్తావించక తప్పదు. సబ్ ప్రైం సంక్షోభం ఉద్యోగ భద్రతను, కోవిడ్ సంక్షోభం ఆరోగ్య భద్రతను ప్రశ్నించాయి. కానీ బీమా ద్వారా జాగ్రత్త పడ్డవారు తమ వైద్య ఖర్చులకు ఇతర నిధులను ఉపయోగించాల్సిన అవసరం రాలేదు.
- అత్యవసర నిధి: ప్రతీ కుటుంబానికి అత్యవసర నిధి ఉండాలి. అత్యవసర నిధి ఎంత ఉండాలి అనే అంశం మీద రకరకాల వాదనలు ఉన్నప్పటికీ కనీసం మూడు నెలల ఖర్చులు భరించే విధంగా అత్యవసర నిధి ఉండాలి.
- మన మార్కెట్ స్థూలంగా పురోగమిస్తూనే ఉంది కాబట్టి సంక్షోభంలో నష్టాలను చూసి మదుపు ఆపకూడదు. మరీ అవసరం అయితే తప్ప మదుపు చేసిన మొత్తాన్ని వెనక్కు తీసుకోకూడదు. మదుపు దీర్ఘకాలిక విషయం అని గుర్తుంచుకోవాలి. ఒడిదొడుకులు ఉన్నప్పటికీ మన మార్కెట్ స్థూలంగా ఏడాదికి తొమ్మిది శాతం వృద్ధిని సాధిస్తోంది.
- అన్ని రంగాలూ ఒకేసారి నష్టపొయినా, కొన్ని రంగాలు త్వరగా నష్టాల నుంచీ కోలుకున్నాయి. అందువల్ల వివిధ రంగాలలో మదుపు చేసినవారి నష్టం తక్కువగా ఉంటుంది. ఇది కూడా మదుపు చేసే సమయంలో పాటించాల్సిన మౌలిక సూత్రం.
- ఎఫ్ఎంసీజీ ఆరోగ్యం, బ్యాంకింగ్ రంగాలు మిగిలిన రంగాల కంటే త్వరగా సంక్షోభాల నుంచీ బయట పడ్డాయి. అంటే ఈ రంగాలలో నష్ట భయం తక్కువ అని అర్థం. ఈ రంగాలకు భారతదేశంలో అంతర్గతంగా ఉండే వ్యాపార విలువ వల్ల అంతర్జాతీయంగా జరిగే మార్పులు ఈ రంగాలను పెద్దగా ప్రభావితం చేయలేవు. కానీ లోహాధారిత పరిశ్రమలు, రియల్ ఎస్టేట్ లాంటి రంగాలు చాలా ఎత్తు పల్లాలు చూస్తున్నాయి. అలాంటి రంగాల విషయంలో మదుపరులు ఆచితూచి వ్యవహరించాలి. సంస్థలలో కాక వ్యాపారాలలో మదుపు చేయాలనే బఫెట్ గారి సూత్రం మరోసారి రుజువయింది.
- వివిధ కంపెనీల పనితీరు అధ్యయనం చేసే అవకాశం లేని వారు మ్యూచువల్ ఫండ్స్ ద్వారా మదుపు చేయడం కూడా ఈ సంక్షోభ సమయాల్లో నష్టాన్ని తగ్గిస్తుంది. ఎక్కువ కాలపరిమితి పెట్టుకుని ఇండెక్స్ ఫండ్ ద్వారా చేసిన మదుపుకు నష్ట భయం చాలా తక్కువ.
ఇవి కూడా చదవండి:
- టెక్సస్ కాల్పులు: ప్రైమరీ స్కూల్‌పై జరిగిన దాడిలో 19 మంది పిల్లలు, ఒక టీచరు మృతి
- జ్ఞాన్వాపి మసీదును శివాలయంగా మార్చవచ్చా... చట్టం ఏం చెబుతోంది?
- మంకీపాక్స్ ఎలా సోకుతుంది, లక్షణాలేమిటి? స్వలింగ సంపర్కులకు ఎక్కువగా సోకుతుందా
- పెళ్లి గిఫ్ట్‌గా టెడ్డీబేర్ పంపిన పెళ్లికూతురి అక్క మాజీ ప్రియుడు.. అందులోని బాంబ్ పేలి కళ్లు, చేతులు కోల్పోయిన పెళ్లి కొడుకు
- సెక్స్, అధికారం, భయం... ఇవే మన పురాణాలకు మూలాధారమా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













