పోస్టాఫీసులో ప్రజలు డిపాజిట్ చేసిన కోటి రూపాయలతో ఐపీఎల్ బెట్టింగ్ ఆడిన సబ్ పోస్ట్ మాస్టర్

ఫొటో సోర్స్, BBC/SHUREH_NIAZI
- రచయిత, షురైహ్ నియాజీ
- హోదా, బీబీసీ కోసం
ఇద్దరు చిన్న పిల్లల తల్లి అయిన వర్షా సోలంకి వయసు 32 ఏళ్లు. మధ్యప్రదేశ్‌లోని బీనాలో రోజూ అధికారుల చుట్టూ తిరుగుతున్నారామె.
భర్త చనిపోయిన తర్వాత గత ఏడాది పోస్టాఫీసులో ఆమె తన పేరున ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసిన రూ. 6.5 లక్షలను సబ్ పోస్ట్ మాస్టర్ సొంతానికి వాడుకోవడే దీనికి కారణం.
తన డబ్బు తనకు వచ్చేలా చేయాలంటూ ఆమె అధికారుల చుట్టూ తిరుగుతున్నారు.
సబ్ పోస్ట్‌మాస్టర్ బాధితుల్లో వర్ష ఒక్కరే కాదు.. ఇంకా చాలా మంది ఉన్నారు. ఆయన దారి మళ్లించిన మొత్తం రూ. కోటి కంటే ఎక్కువేనని పోలీసులు చెప్పారు.
పోస్టాఫీసులో ప్రజలు జమ చేసిన నగదును ఐపీఎల్ బెట్టింగ్ కోసం వాడిన సబ్ పోస్ట్ మాస్టర్ విశాల్ అహిర్వార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
“నా భర్త గత ఏడాది కరోనాతో చనిపోయారు. ఆ తర్వాత రూ. 6.5 లక్షలను మా బంధువులు నాతో పోస్టాఫీసులో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయించారు. ఇప్పుడు ఈ విషయం తెలీగానే, నేను పోస్టాఫీసుకు వెళ్లాను. ఆ పోస్టు మాస్టర్ మాకు ఇచ్చిన పత్రాలు కూడా నకిలీవని మాకు అప్పుడే తెలిసింది” అని వర్ష చెప్పారు.

ఫొటో సోర్స్, BBC/SHUREH_NIAZI
వర్ష ఇద్దరు పిల్లల్లో ఒకరికి ఐదేళ్లు, మరొకరికి పదేళ్లు.
“ఇంటి నుంచి వచ్చే అద్దె డబ్బులతోనే మా ఇల్లు గడుస్తుంది. డిపాజిట్ చేసిన డబ్బును నేను నా పిల్లల భవిష్యత్తు కోసం పోస్టాఫీసులో వేశాను. కానీ, ఆయన ఆ మొత్తం డబ్బును తప్పుడు పద్ధతుల్లో డ్రా చేసి వాడేసి, మమ్మల్ని కష్టాల్లో ముంచేశారు” అన్నారు వర్ష.
తాను వెళ్లి కలిసిన అధికారులు అందరూ తన పట్ల సానుభూతి చూపిస్తున్నప్పటికీ, డిపాజిట్ చేసిన డబ్బు తిరిగి వస్తుందా, లేదా అనేది వారు చెప్పకపోవడంతో వర్ష ఆందోళనకు గురవుతున్నారు.
భర్త చనిపోయిన తర్వాత ఆ డబ్బును ఆమె తనకు, తన పిల్లలకు ఆధారంగా భావించారు. కానీ, ఇప్పుడు ఏం చేయాలో ఆమెకు పాలుపోవడం లేదు.
కిశోరీ బాయిది కూడా దాదాపు ఇలాంటి పరిస్థితే. ఆమెకు నలుగురు కూతుళ్లు. తన కూతుళ్ల పెళ్లి కోసం ఆమె ఐదు లక్షల రూపాయలు అదే పోస్టాఫీసులో జమ చేశారు. కానీ, ఇప్పుడు ఆ డబ్బు తనకు ఎప్పుడు తిరిగొస్తుందో తెలీక ఆమె కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.
“మాకు ఫోన్ వచ్చింది, ఆయన ఇచ్చిన కాగితాలన్నీ నకిలీవని చెప్పారు. మా డబ్బంతా తినేశారని, మాకు పోస్టాఫీసుకు వెళ్లాకే తెలిసింది. ఆ డబ్బులు మాకు ఎలా తిరిగొస్తుందో తెలీడం లేదు” అన్నారు కిశోరీ బాయి.

ఫొటో సోర్స్, BBC/SHUREH_NIAZI
తమ భవిష్యత్తు కోసం దాచుకున్న డబ్బును వీళ్లందరూ పోస్టాఫీసులో జమ చేశారు. ప్రభుత్వ నిర్వహణలో పోస్టాఫీసుల్లో తమ డబ్బు సురక్షితంగా ఉంటుందనుకున్నారు. కానీ, ఇప్పుడు ఆ డబ్బును పోస్టాఫీసులో జమ చేయడమే వారిని కష్టాల్లో పడేసింది.
ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే, బాధితులకు పోస్టాఫీసు వారు ఇచ్చిన ఖాతా పుస్తకం కూడా నకిలీదేనని ఇప్పుడు చెబుతున్నారు. తాము జమ చేస్తూ వచ్చిన డబ్బులు అసలు పోస్టాఫీసులో జమ కాలేదని, బదులుగా తమకు నకిలీ రసీదులు ఇచ్చారని బాధితులు చెబుతున్నారు.
మరోవైపు, ఇప్పటివరకూ ఈ కేసులో దాదాపు 15 మంది బాధితులు ఉన్నట్లు తేలిందని, వారందరి ద్వారా దాదాపు కోటి రూపాయలకుపైగా మొత్తం పోస్టాఫీసులో జమ అయినట్లు తెలిసిందని భోపాల్ రైల్వే పోలీస్ సూపరింటెండెంట్ హితేష్ చౌధరి చెప్పారు.
“కేసు దర్యాప్తు చేస్తున్నాం. ఆ డబ్బును ఐపీఎల్ బెట్టింగులో పెట్టినట్లు నిందితుడు చెబుతున్నాడు. కానీ, వాస్తవాలు పూర్తిగా తెలియాలంటే, టెక్నాలజీ సాయం కూడా అవసరం. అప్పుడే మాకు అతడు నిజంగా ఆ డబ్బును బెట్టింగులో పెట్టాడా, లేక వేరే ఏమైనా చేశాడా అనేది తెలుస్తుంది” అన్నారు.
ఈ కేసులో మొదట ఫిర్యాదు చేసిన వ్యక్తి, హితేష్ చౌధరి దగ్గరికే వచ్చారు. తాము జమ చేసిన డబ్బు అకౌంట్‌లో కనిపించకపోవడంతో కేసు నమోదు చేశారు.
పోలీసులు ఇది విశాల్ అహిర్వార్ ఒక్కరే చేశారా, లేక ఇందులో వేరే వారి ప్రమేయం కూడా ఉందా అనేది కూడా తెలుసుకునే పనిలో ఉన్నారు.

ఫొటో సోర్స్, BBC/SHUREH_NIAZI
పోస్టాఫీసుల్లో డబ్బులు జమ చేస్తున్న వారు, తమ డబ్బు అక్కడ సురక్షితంగా ఉందా, లేదా అనే జాగ్రత్తలు తీసుకునేలా, ఈ వార్త గురించి అందరికీ తెలిసేలా పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.
బీనా సమీపంలోని ఖిమ్లాసా పోస్టాఫీసులో కూడా దాదాపు 50 లక్షల రూపాయలను స్వాహా చేశారని పోలీసులు చెబుతున్నారు.
విశాల్ అహిర్వార్ ఖిమ్లాసా పోస్టాఫీసులోనే పనిచేస్తారు. కానీ, పోలీసులు ఇప్పటివరకూ ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. బీనా నుంచి ఖిమ్లాసా దాదాపు 19 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
తమ డబ్బు సురక్షితంగా ఉంటుందనే ఆశతో జనం పోస్టాఫీసులో డబ్బులు దాచుకుంటారని, కానీ ఇప్పుడు జరిగింది చూస్తుంటే.. ప్రజాధనానికి అక్కడ కూడా భద్రత లేదనే విషయం బయటపడిందని ఖిమ్లాసాకు చెందిన రాజేష్ బాథ్రీ అన్నారు.
తమ డబ్బు సురక్షితంగా దాచుకోడానికి జనం ఇప్పుడు ఎక్కడికెళ్లాలంటూ ఆయన ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి:
- టెక్సస్ కాల్పులు: ప్రైమరీ స్కూల్‌పై జరిగిన దాడిలో 19 మంది పిల్లలు, ఒక టీచరు మృతి
- జ్ఞాన్వాపి మసీదును శివాలయంగా మార్చవచ్చా... చట్టం ఏం చెబుతోంది?
- మంకీపాక్స్ ఎలా సోకుతుంది, లక్షణాలేమిటి? స్వలింగ సంపర్కులకు ఎక్కువగా సోకుతుందా
- పెళ్లి గిఫ్ట్‌గా టెడ్డీబేర్ పంపిన పెళ్లికూతురి అక్క మాజీ ప్రియుడు.. అందులోని బాంబ్ పేలి కళ్లు, చేతులు కోల్పోయిన పెళ్లి కొడుకు
- సెక్స్, అధికారం, భయం... ఇవే మన పురాణాలకు మూలాధారమా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












