జానీ డెప్–అంబర్ హెర్డ్: పైరేట్స్ ఆఫ్ ది కరీబియన్ నటుడికి, ఆయన మాజీ భార్యకు మధ్య కేసులో 5 విస్తుపోయే వాదనలు

ఫొటో సోర్స్, Reuters
హాలీవుడ్ నటుడు జానీ డెప్ పరువు నష్టం కేసులో తన మాజీ భార్య అంబర్ హెర్డ్ మీద గెలిచారు. జానీ డెప్ ప్రతిష్టకు అంబర్ హెర్డ్ భంగం కలిగించినట్లు అమెరికా కోర్టు నిర్ధరించింది.
జానీ డెప్‌కు నష్టపరిహారం కింద 15 మిలియన్ డాలర్లు అంటే సుమారు రూ.116 కోట్లు చెల్లించాలంటూ అంబర్ హెర్డ్‌ను కోర్టు ఆదేశించింది. జానీ డెప్ తనను వేధింపులకు గురి చేశాడంటూ అంబర్ హెర్డ్ చేసిన ఆరోపణలను కోర్టు నమ్మలేదు.
అయితే అంబర్ హెర్డ్ చేసిన ఆరోపణల్లో మూడు నిజమని తేల్చిన కోర్టు ఆమెకు 2 మిలియన్ డాలర్లు పరిహారం చెల్లించాలంటూ జానీ డెప్‌ను ఆదేశించింది.
కేసు గెలిచిన సందర్భంగా జానీ డెప్ ఆనందం వ్యక్తం చేశారు. ఎప్పటికైనా సత్యమే గెలుస్తుందని అన్నారు. మరొకవైపు కేసు ఓడిపోవడం మీద అంబర్ హెర్డ్ దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఇలాంటి తీర్పులు మహిళలకు నష్టం చేస్తాయని, తన అనుకూలంగా ఉన్న సాక్ష్యాలను కోర్టు పట్టించుకోలేదని ఆమె అన్నారు.
దీని మీద పై కోర్టులో అంబర్ హెర్డ్ అప్పీలు చేయనున్నట్లు ఆమె ప్రతినిధి తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
జానీ డెప్, అంబర్ హెర్డ్ 2011లో తొలిసారి కలుసుకున్నారు. ఆ తరువాత 2015లో వారు పెళ్లి చేసుకున్నారు. రెండు సంవత్సరాల తరువాత అంటే 2017లో వారు విడిపోయారు.
ఆ తరువాత తన పరువుకు నష్టం కలిగించింది అంటూ 36 ఏళ్ల అంబర్ హెర్డ్‌పై 58 ఏళ్ల జానీ డెప్ 50 మిలియన్ డాలర్ల (రూ.388 కోట్లు)కు పైగా దావా వేశారు.
2018లో 'ది వాషింగ్టన్ పోస్ట్' కోసం రాసిన ఒక ఒపినీయన్ పీస్‌లో అంబర్ హెర్డ్, తానొక గృహి హింసకు గురైన పబ్లిక్ ఫిగర్‌ను అని చెప్పుకొచ్చారు. అయితే ఆమె జానీడెప్ పేరును ప్రస్తావించలేదు.
ఈ ఆరోపణలను జానీ డెప్ ఖండించారు.
ఆమె చేసిన ఆరోపణలు బూటకమని జానీ డెప్ న్యాయవాది ఆడమ్ వాల్డ్‌మన్ అన్నారు. దీని తర్వాత హెర్డ్ కూడా డెప్‌పై 100 మిలియన్ డాలర్ల (రూ. 776 కోట్లు) ఎదురుదావా వేశారు.
హెర్డ్ రాసిన కథనం, డెప్ జీవితాన్ని నాశనం చేసిందని డెప్ తరఫు న్యాయవాది వాదించారు. ఆమెపై గృహహింస జరిగిందనడానికి ఆధారంగా ఎలాంటి వైద్య నివేదికలు లేవని అన్నారు. హెర్డ్‌తో రిలేషన్‌షిప్‌లో ఉన్న సమయంలో జానీ డెప్ హింసను అనుభవించారని తెలిపారు.
''హెర్డ్ కారణంగా జానీ డెప్ నిరంతరం శారీరక, మానసిక, భావోద్వేగ హింసను అనుభవించారు'' అని డెప్ అటార్నీ కామిలీ వాస్క్వెజ్ అన్నారు.
మరోవైపు జానీ డెప్ తన మాజీ భార్య హెర్డ్ మరణాన్ని కోరుకున్నట్లు స్పష్టంగా సూచించే కొన్ని మెసేజ్‌లు ఉన్నట్లు హెర్డ్ తరఫు లాయర్ బెంజమిన్ రాటెన్‌బర్న్, జ్యూరీకి గుర్తు చేశారు.
ఈ కేసుకు సంబంధించి మొదటి నుంచి మీడియా దృష్టిని ఆకర్షించిన కొన్ని వివరాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

ఫొటో సోర్స్, Getty Images
1. లైంగిక వేధింపుల ఆరోపణలు
మే ప్రారంభంలో విచారణ సందర్భంగా అంబర్ హెర్డ్ కన్నీరు పెడుతూ గద్గద స్వరంతో తనపై జరిగిన లైంగిక వేధింపుల గురించి వివరించారు.
డెప్ తన యోనిలోకి లిక్కర్ బాటిల్‌ను చొప్పించాడని ఆమె జ్యూరీకి తెలిపారు.
ఆస్ట్రేలియాలో పైరేట్స్ ఆఫ్ కరేబియన్ సాగా సినిమా ఐదో భాగాన్ని డెప్ చిత్రీకరిస్తున్నప్పుడు, 2015 మార్చిలో ఈ ఘటన జరిగినట్లు ఆమె ఆరోపించారు.
''నేను భయపడ్డాను. అప్పటికి మా పెళ్లి జరిగి కొంతకాలమే అయింది'' అని ఆమె చెప్పారు.
అయితే, జానీ డెప్ దీనికి భిన్నంగా స్పందించారు. ఆరోజు రాత్రి హెర్డ్ తనపై దాడికి పాల్పడిందని జానీ డెప్ చెప్పారు. హెర్డ్, వోడ్కా బాటిల్ విసరడంతో తన కుడిచేతి మధ్యవేలుకు తీవ్ర గాయమైందని ఆయన తెలిపారు.
దీంతో షాక్‌కు గురయ్యానని అన్నారు. ఆ గాయం నుంచి వచ్చిన రక్తాన్ని హెర్డ్ కోసం గోడపై సందేశాలు రాయడానికి ఉపయోగించినట్లు జానీ డెప్ తెలిపారు.
మరోసారి విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో జానీ డెప్ తనను వీపుపై తన్నాడని హెర్డ్ ఆరోపించారు. నటుడు జేమ్స్ ఫ్రాంకోతో కలిసి తాను 'ద అడెరల్ డైరీస్' సినిమాలో నటిస్తున్నందుకు అసూయతో డెప్ ఇలా చేశారని ఆమె తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
2. బెడ్‌పై మలం
విచారణ సందర్భంగా జానీ డెప్, 2016లో తన మంచంపై మలాన్ని గుర్తించానని చెప్పారు.
''ఇది ఒక భయంకరమైన తప్పుడు ప్రాంక్'' అని హెర్డ్ తనతో అన్నట్లు డెప్ సెక్యూరిటీ గార్డుల్లో ఒకరు తెలిపారు.
హెర్డ్ దీన్ని ఖండించారు. తమ పెంపుడు కుక్క ఆ పని చేసి ఉండవచ్చని ఆమె సూచించారు. కొచెలా ఫెస్టివల్‌లో పాల్గొనడానికి తన ఫ్రెండ్‌తో కలిసి తాను బయటకు వెళ్లినప్పుడు ఇంట్లో ఉన్న పెంపుడు కుక్క ఆ పని చేసి ఉండొచ్చని ఆమె అన్నారు.
అయితే, ఒక చిన్న కుక్కపిల్ల మల వ్యర్థాల్లా అవి లేవని డెప్ వాదించారు. అవి మనిషి వ్యర్థాలే అనేది ఆయన అభిప్రాయం.
''అది చాలా వికారమైన, వికృతమైన క్షణం'' అని ఆయన వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, Getty Images
3. నకిలీ ఫొటోలు
డెప్ కొట్టడం వల్ల తన శరీరంపై గాయాలు, కొన్నిసార్లు వాపు రావడం, ముక్కుకు దెబ్బలు తగిలాయని హెర్డ్ సాక్ష్యమిచ్చారు.
మే నెల మధ్యలో జరిగిన తొలి క్రాస్ ఎగ్జామినేషన్‌లో డెప్ లాయర్ కామిలీ వాస్క్వెజ్ కొన్ని ఫొటోలను కోర్టులో ప్రవేశపెట్టారు. అవి డెప్ తన మాజీ భార్యను కొట్టిన 24 గంటల తర్వాత తీసిన ఫొటోలని చెప్పారు.
ట్రయల్ సందర్భంగా ప్రవేశపెట్టిన ఆ ఫొటోల్లో గాయపడినట్లు, గాయాల గుర్తులు ఉన్నట్లు హెర్డ్ కనిపించలేదు. అయితే, గాయాలపై తాను ఐస్ ప్యాక్‌తో మర్ధన చేశానని, మేకప్‌తో ముఖాన్ని కవర్ చేసుకున్నానని హెర్డ్ వివరించారు.
అదే వారంలో హెర్డ్ కూడా జ్యూరీకి కొన్ని ఫొటోలను అందజేశారు. వాటిలో ఆమె ముఖం ఎర్రగా కందిపోయిట్లుగా ఉంది. ఈ ఫొటోలు 2016లో విడాకుల కోసం దరఖాస్తు చేసుకోవడానికి ముందు జరిగిన గొడవకు సంబంధించినవిగా ఆమె ప్రవేశపెట్టారు.
అయితే, ఒకే ఫొటోకు సంబంధించి రెండు వేర్వేరుగా ఉన్న కాపీలను చూపిస్తూ వీటిలో ఒకదాన్ని హెర్డ్ మార్చినట్లు కామిలీ చెప్పారు.
''మీరు ఈ ఫొటోలను ఎడిట్ చేశారు'' అని కామిలీ నొక్కి చెప్పారు.
కానీ హెర్డ్ దీన్ని ఖండించారు. ''అది తప్పు. నేను వాటిని ఎడిట్ చేయలేదు'' అని హెర్డ్ తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
4. మనం కాల్చే ముందు ఆమెనే మునిగిపోనిద్దాం
బ్రిటిష్ నటుడు పాల్ బెటానీతో సందేశాల మార్పిడి గురించిన ప్రశ్నలకు డెప్ ఏప్రిల్ చివర్లో సమాధానం ఇచ్చారు.
2013లో వీరిద్దరి మధ్య సందేశాల మార్పిడి జరిగింది. అప్పటికి డెప్, హెర్డ్‌లకు పెళ్లి కాలేదు.
''మనం ఆమెను కాల్చే ముందు ఆమెనే మునిగిపోనిద్దాం'' అని డెప్ మెసేజీలో రాశారు.
''ఆమె చనిపోయిందని నిర్ధారించడానికి'' అని అర్థం వచ్చేలా మరో సందేశం కూడా పంచుకున్నారు.
ఈ సందేశాల గురించి అడిగినప్పుడు... మాంటీ పైథాన్ సినిమాలో మాంత్రికులు తగలబడటం, మునిగిపోవడం అనే ఒక హాస్యపూరిత సన్నివేశానికి సంబంధించినవని ఆయన చెప్పారు.
10 ఏళ్ల వయస్సులో మనమంతా ఈ సినిమాను చూశాం అని ఆయన తెలిపారు.
ఏదో హాస్యం పండించే ప్రయత్నంలో భాగంగా అలా చేశానని, ఈ మెసేజీల వల్ల తాను ఇబ్బందిపడినట్లు డెప్ వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
5. డెప్ నాపై దాడి చేయలేదు
డెప్, మోస్ ఇద్దరూ 1994 నుంచి 1998 వరకు రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. ఈ కేసులో వీడియో కాల్ ద్వారా సాక్ష్యమిచ్చిన మోస్.... ''డెప్, నన్నెప్పుడూ తోసేయలేదు. ఒకసారి నేను మెట్లపై నుంచి పడినప్పుడు నాకు సహాయం చేయడానికి వచ్చారు'' అని తెలిపారు.
మోస్ ఇచ్చిన సాక్ష్యం, హెర్డ్ చెప్పిన దానికి పూర్తి భిన్నంగా ఉంది. ''ఒకసారి మోస్‌ను డెప్ మెట్ల పైనుంచి తోసేశాడనే వార్తలను నేను విన్నాను'' అని హెర్డ్ కోర్టులో చెప్పారు.
''గదిలో నుంచి బయటకు వచ్చి నేను మెట్లపై జారి పడ్డాను. నా వీపుకు దెబ్బ తగిలింది. అప్పుడు నేను గట్టిగా అరిచాను. నాకేం జరిగిందో అర్థం కాలేదు. కానీ నొప్పి మాత్రం కలిగింది. నాకు సహాయం చేయడానికి ఆయన పరిగెత్తుకు వచ్చారు. నన్ను నా గదిలోకి తీసుకెళ్లారు. వైద్య సహాయం అందించారు'' అని మోస్ తెలిపారు.
''మేం కలిసి ఉన్న సమయంలో డెప్ నన్నెప్పుడూ నెట్టలేదు, తన్నలేదు'' అని మోస్ చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- ఆసియా దేశాలు ఆహార ఎగుమతులను ఎందుకు నిలిపేస్తున్నాయి? దీనిని ఫుడ్ నేషనలిజం అంటారా?
- ‘ముస్లింలను ముస్లింలే చంపుతున్నారు, ఇది ఎలాంటి జిహాద్’- అమ్రీనా భట్ తండ్రి
- Monsoon: తుపానులు, వరదలు లాంటి విపరీత వాతావరణ పరిస్థితులు ఇకపై సాధారణం అయిపోతాయా?
- నార్మల్ డెలివరీయా, సిజేరియనా? బిడ్డను ఎలా కనాలో నిర్ణయించుకునే హక్కు మహిళలకు లేదా
- తమిళ కుటుంబానికి ఆస్ట్రేలియన్ల మద్దతు, దిగొచ్చిన ప్రభుత్వం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














