Monsoon: తుపానులు, వరదలు లాంటి విపరీత వాతావరణ పరిస్థితులు ఇకపై సాధారణం అయిపోతాయా?

రుతుపవనాలు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, కమల త్యాగరాజన్
    • హోదా, బీబీసీ ఫ్యూచర్

ప్రపంచంలో మూడింట రెండొంతుల జనాభా జీవించే ప్రాంతాలను రుతుపవనాలు ప్రభావితం చేస్తున్నాయి. అయితే, గత కొన్ని దశాబ్దాలుగా వీటి ప్రభావం తగ్గుతూ వస్తోంది.

2020లోని మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఆసియాలోని భిన్న దేశాల్లో కోవిడ్-19 వ్యాప్తి నడుమ లాక్‌డౌన్‌లు విధించారు. ఆ సమయంలోనే వాతావరణంలో కొన్ని మార్పులను పరిశోధకులు గుర్తించారు. ఈ మార్పుల ప్రభావం ఆసియాలోని రుతుపవనాలపైనా కనిపించింది.

వైరస్ వ్యాప్తి కట్టడికి విధించిన లాక్‌డౌన్‌లతో వాతావరణంలోనూ మార్పులు వస్తాయని ఎవరూ ఊహించలేదు. ఆనాడు వీధుల్లో వాహనాల రాకపోకలు ఆగిపోయాయి. పరిశ్రమల్లోనూ ఉద్గారాలు స్తంభించిపోయాయి. ఫలితంగా వాతావరణంలోని ధూళికణాలు అంటే ఏరోసోల్ స్థాయిలు తగ్గాయి.

ఇవి మన చుట్టూ వాతావరణంలో ఉండే చిన్నచిన్న కణాలు. వీటిలో పీఎం 2.5 నుంచి పీఎం 10 వరకు ఉంటాయి. ఇవి మనుషుల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. సల్ఫర్ డయాక్సైడ్‌తో మొదలుపెట్టి బొగ్గును మండించేటప్పుడు వెలువడే ధూళి, బ్లాక్ కార్బన్, సూట్ ఇవన్నీ.. ఏరోసోల్‌ కిందకు వస్తాయి. సూట్, బ్లాక్ కార్బన్ లాంటివి పంట వ్యర్థాలకు నిప్పుపెట్టడం వల్ల భారీగా వాతావరణంలోకి వచ్చే చేరుతుంటాయి.

ఏరోసోల్ దుష్ప్రభావాల గురించి ఇప్పటికే చాలా అధ్యయనాలు వెల్లడించాయి. వాక్యూమ్ క్లీనర్‌లో డస్ట్ ఇరుక్కున్నట్లే మన శ్వాస నాళాల్లో ఇవి ఇరుక్కుంటాయని, ఊపిరితిత్తుల్లోకి ఇవి చేరుకోగలవని, రక్తంలోనూ కలిసిపోతాయని పరిశోధకులు హెచ్చరించారు.

రుతుపవనాలు

ఫొటో సోర్స్, Getty Images

అయితే, 2020లో వాతావరణంలో ఈ ఏరోసోల్ గణనీయంగా తగ్గినట్లు పరిశోధకులు గుర్తించారు. ఫలితంగా తూర్పు ఆసియా వేసవి రుతుపవనాలపై ఇది ప్రభావం చూపినట్లు అంచనా వేశారు.

‘‘లాక్‌డౌన్ సమయంలో మనుషుల కదలికలు దాదాపుగా లేవు. దీంతో భారత వాతావరణంలో ఏరోసోల్ 30 శాతం వరకు తగ్గినట్లు మేం గుర్తించాం’’అని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీరియోలజీలో గత 25ఏళ్లుగా రుతుపవనాలపై అధ్యయనం చేపడుతున్న సువర్ణ ఫడణవీస్ చెప్పారు.

ఈ మార్పులపై మీడియాలో చాలా వార్తలు కనిపించాయి. ఉత్తర ప్రదేశ్‌లోని సహరన్‌పుర్‌లో 30ఏళ్ల తర్వాత తొలిసారి హిమాలయ పవనాలను ప్రజలు ఎలా ఆస్వాదిస్తున్నారో వివరించారు.

అయితే, ఈ ఏరోసోల్ వల్ల రుతుపవనాలకు సంబంధించి వాతావరణంలో ఒక పొర ఏర్పడుతుంది. ఇది సూర్యరశ్మిని వెనక్కి తిప్పికొడుతుంది. ‘‘అయితే, లాక్‌డౌన్‌తో ఈ ఏరోసోల్ పొర పలుచబడింది. దీంతో భూమి చాలా వేగంగా వేడెక్కుతోంది’’అని సువర్ణ చెప్పారు.

సాధారణంలో ఉష్ణోగ్రతల్లో తేడాలను ఆసరాగా చేసుకొని రుతుపవనాలు కదులుతుంటాయి. అంటే చల్లగా అధిక పీడనంతో ఉండే ప్రాంతాల నుంచి వేడీగా అల్ప పీడనం ఉండే ప్రాంతాలకు గాలి పయనిస్తుంటుంది. ఈ గాలితోపాటు సముద్రంపై ఉండే నీటి రేణువులతో కలిసివుండే రుతుపవనాలు కూడా ముందుకు వెళ్తాయి. ఏరోసోల్ లేకుండా నేల చాలా వేగంగా వేడెక్కినప్పుడు రుతుపవన వర్షాలు మరింత ఎక్కువగా ఉంటున్నాయని తాజాగా పరిశోధకులు గుర్తించారు.

రుతుపవనాలు

ఫొటో సోర్స్, Getty Images

‘‘ఈ ప్రభావంతో రుతుపవన వర్షాలు 5 నుంచి 15 శాతం వరకు పెరిగినట్లు మేం గమనించాం. అంటే రోజుకు 3 మీ.మీ. కంటే అధిక వర్షపాతం నమోదవుతుందన్నమాట’’అని సువర్ణ చెప్పారు.

‘‘అంటే రోజూ ఒక గంట ఎక్కువగా ఒక మోస్తరు వర్షం కురుస్తున్నట్లు మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కరవులు ఎక్కువగా పీడించే ప్రాంతాల్లో ఆహార భద్రత, ప్రజల ఆరోగ్యంపై ఇది గణనీయమైన ప్రభావం చూపుతుంది’’అని ఆమె వివరించారు.

అయితే, ఈ ప్రభావం భారత్‌లో అంత ఎక్కువ కనిపించలేదు. ఆసియాలోని మొత్తం వాతావరణంపై రుతుపవనాలు ప్రభావం చూపిస్తాయి. కానీ, ప్రస్తుతం తూర్పు ఆసియాలోని చాలా ప్రాంతాల్లో ఏరోసోల్ తగ్గినట్లు పరిశోధకులు గమనించారు. చైనా, కొరియా, జపాన్‌లలో ఈ ప్రభావం ఎక్కువగా కనిపించింది.

‘‘ఒక్కసారిగా వాతావరణంలో ఏరోసోల్ స్థాయిలు తగ్గడంతో తూర్పు ఆసియాలో రుతుపవనాలపై మంచి ప్రభావం పడినట్లు మేం గుర్తించాం’’అని చైనాలోని గువాంగ్‌ఝౌలో జియాన్ యూనివర్సిటీలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎన్విరాన్‌మెంట్ అండ్ క్లైమేట్ రీసెర్చ్ అసిసోయేట్ ప్రొఫెసర్ చావో హే బీబీసీ ఫ్యూచర్‌తో చెప్పారు.

ఈ విషయాన్ని 2020, 2021 వేసవిల్లో ప్రత్యేక వాతావరణ మోడళ్ల సాయంతో పరిశోధకులు ధ్రవీకరించారు.

‘‘అయితే, వాతావరణ మార్పులను కట్టడి చేసేందుకు సరిపడా స్థాయిలో కోవిడ్-19 వ్యాప్తి సమయంలో ఉద్గారాలు తగ్గలేదని ఇదివరకటి పరిశోధనలు ధ్రువీకరించాయి. నిజమే కోవిడ్-19 వ్యాప్తి నడుమ తగ్గిన ఉద్గారాలు ప్రపంచ వ్యాప్తంగా వాతావరణ మార్పులపై గణనీయమైన మార్పులులేని మాట వాస్తవమే. అయితే, ప్రాంతీయ స్థాయిలో మాత్రం వీటితో మంచి మార్పులే వచ్చాయి. ముఖ్యంగా తూర్పు ఆసియా హాట్ స్పాట్‌పై ఈ మార్పుల ప్రభావాన్ని మేం గుర్తించాం’’అని ఆయన చెప్పారు.

రుతుపవనాలు

ఫొటో సోర్స్, Getty Images

‘‘గత కొన్ని దశాబ్దాల్లో భారత్, చైనాల్లో అభివృద్ధి వేగం పుంజుకుంది. ఇక్కడ వాతావరణంలో ఏరోసోల్ స్థాయిలు విపరీతంగా పెరిగాయి’’అని బ్రిటన్‌ రుతుపవనాలపై పరిశోధన చేపడుతున్న, ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ ఛేంజ్ ఆరో రిపోర్టును తయారుచేసిన ప్రధాన అధ్యయనకర్త ఆండ్రూ టర్నర్ వివరించారు.

‘‘వాతావరణంలో ఏరోసోల్ స్థాయిలు పెరగడంతో ఇక్కడ వర్షపాతం తగ్గిపోతూ వస్తోంది’’అని ఆయన చెప్పారు.

దీని కోసం 1901 నుంచి 2011 మధ్య భారత పరిశోధకులు సేకరించిన ఆగ్నేయ రుతుపవనాలపై సమాచారాన్ని తాజాగా పరిశోధకులు విశ్లేషించారు. వర్షపాతం తగ్గిపోవడానికి మరికొన్ని ఇతర కారణాలు కూడా ఉన్నాయని కొందరు పరిశోధకులు భావిస్తున్నారు. సముద్రాలు వేడెక్కడం ఈ కారణాల్లో ఒకటిగా వారు చూపిస్తున్నారు.

‘‘ప్రపంచంలో వేగంగా వేడెక్కుతున్న సముద్రాల్లో హిందూ మహాసముద్రం మొదటిది’’అని పుణెలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీరియోలజీ క్లైమేట్ సైంటిస్ట్ రాక్సీ మాథ్యూ కోల్ చెప్పారు. సముద్రపు హీట్‌వేవ్‌లపై ఆయన పరిశోధన చేపడుతున్నారు.

‘‘1950ల నుంచి నేటి వరకు సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు 1.4 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు వేడెక్కినట్లు మా పరిశోధనల్లో రుజువైంది. ముఖ్యంగా అరేబియన్ సముద్రం సహా పశ్చిమ ప్రాంతంలో ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా సముద్రాల్లో ఉష్ణోగ్రతలు కేవలం 0.7 డిగ్రీలు మాత్రమే పెరిగేయనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి’’అని ఆయన వివరంచారు.

వీడియో క్యాప్షన్, ఇంతలా ఉష్ణోగ్రతలు పడిపోడానికి కారణమేంటి?

‘‘సముద్ర ఉష్ణోగ్రతలు పెరగడంతో రుతుపవనాలు బలహీనపడతాయి. అదే సమయంలో ఉష్ణోగ్రతల్లో తేడా కూడా తగ్గిపోతుంది. నేల, సముద్రంపై ఉష్ణోగ్రతలు సమానం అవుతాయి’’అని కోల్ చెప్పారు.

‘‘ఈ పరిణామాలు రుతుపవనాలపై ఒత్తిడి మరింత పెంచుతాయి. అయితే, రుతుపవనాల్లో మార్పులకు ప్రధాన కారణం మాత్రం ఏరోసోలే’’అని టర్నర్ వివరించారు. భూతాపం వల్ల కూడా దీర్ఘకాలంలో రుతుపవనాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని టర్నర్ అన్నారు.

వాతవరణంలో సీవో2 స్థాయిలు ఎక్కువగా ఉన్నప్పుడు రుతుపవనాల ప్రభావం కూడా ఎక్కువగా ఉన్నట్లు ఇదివరకటి అధ్యయనాల్లో రుజువైంది. సీవో2 ఎక్కువగా ఉంటే, నేల వేగంగా వేడెక్కుతుంది. ఫలితంగా నేల, సముద్రాల మధ్య ఉష్ణోగ్రతల్లో తేడా కూడా పెరుగుతుంది. అదే సమయంలో వాతావరణం వేడెక్కితే ఎక్కువ నీటిని కూడా మేఘాలు ఒడిసిపట్టగలవు. ఫలితంగా భారీ వర్షాలు పడుతుంటాయి.

1950ల తర్వాత వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ స్థాయిలు విపరీతంగా పెరిగాయి. 2005 తర్వాత అత్యధిక ఉష్ణోగ్రతలు మళ్లీ నమోదవుతున్నాయి. ‘‘రుతువపనాలు కూడా త్వరలో ఒక టిప్పింగ్ పాయింట్‌కు చేరుకోబోతున్నాయి. ఇదివరకటిలా భారీ వర్షాలు మళ్లీ పడొచ్చు. ఒక్కోసారి ఇదివరకటి కంటే ఎక్కువ వర్షాలు పడొచ్చు’’అని టర్నర్ వివరించారు.

దీర్ఘ కాలంలో సీవో2తో రుతుపవనాలు బలపడతాయి. ‘‘కార్బన్ డైఆక్సైడ్‌కు ఏరోసోల్‌కు మధ్య తేడా ఏమిటంటే.. వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ సులువుగా కలిసిపోగలదు. దీన్ని వెల్‌మిక్సిడ్ గ్రీన్‌హౌస్ గ్యాస్‌గా చెప్పుకోవచ్చు. కానీ ఏరోసోల్ మాత్రం ఉద్గారాల మూలాలకు సమీపంలోనే ఉంటాయి’’అని టర్నర్ చెప్పారు.

మరోవైపు కార్బన్ డైఆక్సైడ్‌తో పోల్చినప్పుడు ఏరోసోల్ జీవిత కాలం కూడా తక్కువని షాంఘైలోని ఫ్యూడాన్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ వెన్ ఝౌ వివరించారు. ఆమె నేతృత్వంలో తూర్పు ఆసియా వేసవి రుతుపవనాలపై కోవిడ్-19 లాక్‌డౌన్‌ల ప్రభావాన్ని అంచనా వేసేందుకు ఒక అధ్యయనం నిర్వహించారు.

‘‘వాతావరణ మార్పులపై ఏరోసోల్ ప్రభావం చాలా వేగంగా మొదలైంది. లాక్‌డౌన్‌లు మొదలైన వెంటనే ఈ మార్పులను మేం గుర్తించాం’’అని ఆమె వివరించారు.

వీడియో క్యాప్షన్, దేశమంతా మండుతున్న ఎండలు.. అస్సాంలో వరదల విధ్వంసం

రెండూ పెరిగితే..

ఒకవేళ కార్బన్ డైఆక్సైడ్, ఏరోసోల్ రెండూ పెరిగితే వాతావరణంపై ఎలాంటి ప్రభావం పడుతుంది? ఈ ప్రశ్నకు స్పందిస్తూ ‘‘మనం టిప్పింగ్ పాయింట్‌కు చేరుకుంటాం’’అని టర్నర్ సమాధానం ఇచ్చారు.

‘‘ఏదో ఒక సమయంలో రుతు పవనాలపై కార్బన్ డైఆక్సైడ్ ప్రభావం పతాకస్థాయికి చేరుతుంది’’అని టర్నర్ చెప్పారు. ‘‘1950ల తర్వాత రుతుపవనాలు బలహీన పడటంలో ఏరోసోల్ ఉద్గారాలు ప్రధాన పాత్ర పోషించినట్లు మా ఐపీసీసీ నివేదిక చెబుతోంది. భవిష్యత్‌లో కార్బన్ డైఆక్సైడ్ వల్ల రుతుపవనాలు బలపడే అవకాశముంది’’అని ఆయన అన్నారు.

ఇంతకీ ఆ రోజు ఎప్పుడొస్తుంది? అనే ప్రశ్నకు.. ఇప్పుడే సమాధానం చెప్పలేమని టర్నర్ అన్నారు.

ఆ రోజు వచ్చినప్పుడు తుపానులు, వరదలు లాంటి విపరీత వాతావరణ పరిస్థితులు మనకు సాధారణం అయిపోతాయని పరిశోధకులు అంచనా వేస్తున్నారు.

‘‘ఆరో ఐపీసీసీ నివేదికలో వెల్లడైన చాలా అంశాల్లో ఇదీ ఒకటి. భూమి వేడెక్కడం పెరిగేకొద్దీ, ప్రతికూల ప్రభావాలు మరింత ఎక్కువవుతాయి’’అని టర్నర్ చెప్పారు. ‘‘ఒక డిగ్రీ ఉష్ణోగ్రత పెరిగినప్పుడు.. వర్షాలు కూడా విపరీంగా పడతాయి. అంటే పర్వత ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడటం పెరుగుతుంది. పంటలు నష్టపోతాం. లోతట్టు ప్రాంతాలు మునిగిపోతాయి’’అని టర్నర్ వివరించారు.

భవిష్యత్‌లో విపరీత వాతావరణ పరిస్థితుల ప్రభావం ఆసియాపై మరింత ఎక్కువగా పడొచ్చు. వాతావరణంపై ఏరోసోల్ ప్రభావం నుంచి మనం తేలిగ్గానే వెనక్కి వెళ్లొచ్చు. కానీ, సీవో2తో వచ్చే మార్పుల నుంచి వెనక్కి వెళ్లడం కాస్త కష్టమే. ఈ మార్పులను తట్టుకునేలా ప్రజలను సిద్ధం చేయడం ఇప్పుడు చాలా ముఖ్యంగా ప్రొఫెసర్ ఝౌ చెప్పారు.

వీడియో క్యాప్షన్, రెంట చింతల: ‘ఈ గ్రామంలో మీరైతే గంటసేపు కూడా ఉండలేరు’

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)