ఆసియా దేశాలు ఆహార ఎగుమతులను ఎందుకు నిలిపేస్తున్నాయి? దీనిని ఫుడ్ నేషనలిజం అంటారా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అన్నాబెల్ లియాంగ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
దేశంలో కోళ్ల కొరత కారణంగా జూన్ ప్రారంభం నుంచి కోళ్ల ఎగుమతిని తగ్గించనున్నట్టు మలేషియా ప్రకటించింది. ఇటీవల భారతదేశం గోదుమ ఎగుమతులను నిషేధించగా, ఇండోనేషియా పామాయిల్ విదేశీ అమ్మకాలకు కొన్నాళ్లు విరామం ప్రకటించింది.
యుక్రెయిన్‌పై రష్యా దండయాత్ర తర్వాత ప్రపంచం దశాబ్దాలలో తొలిసారి అత్యంత ఘోరమైన ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సమయంలోనే ఇలాంటి ప్రకటనలు వినిపిస్తున్నాయి.
ఆసియా ప్రాంతంలోని ప్రభుత్వాలు ఆహార జాతీయవాదం (ఫుడ్ నేషనలిజం) వైపు మొగ్గుతున్నట్లు ఆందోళనలు పెరుగుతున్నాయని ఒక వ్యవసాయ నిపుణుడు అన్నారు.
మలేషియా దుకాణదారులు ఇటీవలి నెలల్లో చికెన్ ధరలు పెంచారు. అయితే, కొంతమంది రిటైలర్లు కస్టమర్లు కొనే మాంసం పరిమాణంపై పరిమితులు విధించారు.
''ప్రస్తుతం దేశం ప్రతి నెలా జరిగే 3.6 మిలియన్ కోళ్ల ఎగుమతిని నిలిపివేసింది. దేశీయంగా ధరలు, ఉత్పత్తిని స్థిరీకరించే వరకు ఈ నిషేధం కొనసాగుతుంది" అని సోమవారం నాడు మలేషియా ప్రధాన మంత్రి ఇస్మాయిల్ సబ్రి యాకోబ్ అన్నారు.
తమ దేశ ప్రజలే తమ ప్రభుత్వ ప్రాధాన్యత అని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
పొరుగున ఉన్న సింగపూర్ తన దిగుమతులలో మూడవవంతు మలేషియా నుంచి దిగుమతి చేసుకుంటుంది. మలేషియా నిర్ణయం వల్ల సింగపూర్ తీవ్రంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంది.
మలేషియా నుంచి లైవ్ కోళ్లను దిగుమతి చేసుకున్న తర్వాత వాటిని కోసి ఫ్రోజెన్ చికెన్ గా మారుస్తారు. సోమవారం నాటి మలేషియా దేశపు ప్రకటన తర్వాత సింగపూర్ ఫుడ్ ఏజెన్సీ తమ దేశంలోని షాపులు ఫ్రోజెన్ చికెన్ ను దిగుమతి చేసుకోవాల్సిందిగా సూచించింది.
దీంతో పాటు పానిక్ బైయింగ్ (దొరకవేమోనన్న భయంతో షాపులకు పరుగెత్తి, విపరీతంగా కొనేయడం)ను తగ్గించే చర్యలు చేపట్టింది.
"ఫ్రోజెన్ చికెన్ సరఫరాకు తాత్కాలిక అంతరాయాలు ఉండవచ్చు. కొరతను తగ్గించడానికి ఈ చికెన్ మంచి ఆప్షన్'' అని ఏజెన్సీ ఒక ప్రకటనలో తెలిపింది.
"వినియోగదారులు అవసరమైన మేరకు మాత్రమే చికెన్ కొనుగోలు చేయాలని మేము సూచిస్తున్నాం" అని పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images
యుద్ధం ప్రభావం
ప్రపంచ ఆహార సంక్షోభంలో మలేషియా చికెన్ ఎగుమతి నిషేధం తాజా పరిణామం.
ఆహార ధరలు రికార్డు స్థాయిలో పెరగడం వల్ల వందల మిలియన్ల మంది ప్రజలు పేదరికం, పోషకాహార లోపం బారిన పడతారని ప్రపంచ బ్యాంకు గత నెలలో హెచ్చరించింది.
గోదుమల ప్రధాన ఎగుమతిదారు యుక్రెయిన్ పై రష్యా దాడి చేసినప్పటి ఆ దేశం నుంచి ఉత్పత్తి పడిపోయింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా గోదుమల ధరలు పెరిగాయి.
ఇది దాని ఎగుమతులపై ఆధారపడిన దేశాలలో కొరత అవకాశాలను కూడా పెంచింది.
సోమవారం, యుక్రెయిన్‌లో చిక్కుకున్న మిలియన్ల టన్నుల ధాన్యాన్ని దేశం దాటించేందుకు అంతర్జాతీయ సమాజం సురక్షిత మార్గం (సేఫ్ పాసేజ్)ని రూపొందించాలని యుక్రెయిన్ ఉప ప్రధాన మంత్రి యులియా స్వైరిడెంకో బీబీసీతో అన్నారు.
మరోవైపు యుక్రెయిన్ ఆహార ఎగుమతులను రష్యా అడ్డుకోవడం "ప్రపంచ ఆహార భద్రతపై యుద్ధ ప్రకటన" అని ఐక్యరాజ్య సమితి ప్రపంచ ఆహార కార్యక్రమం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డేవిడ్ బీస్లీ దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సందర్భంగా బీబీసీ ఎకనామిక్స్ ఎడిటర్ ఫైసల్ ఇస్లాంతో అన్నారు.
రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత మనం ఇప్పటికే అత్యంత తీవ్రమైన ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నామని ఆయన అన్నారు.
"మీరు(రష్యా) యుక్రెయిన్ నుండి వచ్చే ఆహారంతో జీవించే దాదాపు 4 కోట్ల మందికి భూమి మీదనే నరకం చూపిస్తున్నారు'' అని బీస్లీ విమర్శించారు.

'ఫుడ్ నేషనలిజం మొదలైందా?
ప్రధానమైన తృణధాన్యాల ఎగుమతులను భారతదేశం నిషేధించిన తర్వాత ఈ నెల ప్రారంభంలో గోదుమ ధరలు మళ్లీ పెరిగాయి.
దేశంలో వేడిగాలుల కారణంగా దేశీయంగా దిగుబడి తగ్గి, ధరలు రికార్డు స్థాయికి చేరుకున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
కరువులు, వరదలు కారణంగా ప్రధాన ఉత్పత్తిదారుల నుంచి పంట దిగుబడి తగ్గడంతో యుక్రెయిన్ నుండి వచ్చే కొరతను భారత దేశం భర్తీ చేస్తుందని చాలామంది ఆశించారు.
ప్రాసెస్డ్ ఫుడ్ నుంచి సబ్బుల వరకు ప్రతిదానిలో ఉపయోగించే నూనెను ప్రధానంగా ఉత్పత్తి చేసే దేశం ఇండోనేషియా.
అయితే, స్థానికంగా ధరలను తగ్గించడానికి మూడువారాల పాటు ఆ దేశం ఎగుమతులను నిలిపి వేయడంతో పామాయిల్ ధరలు కూడా ఇటీవలి వారాల్లో పెరిగాయి. సోమవారం నిషేధాన్ని ఎత్తివేశారు.

ఫొటో సోర్స్, Getty Images
సింగపూర్‌లోని లీ కువాన్ యూ స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ సోనియా అక్టర్ ప్రకారం ఈ చర్యలన్నీ ఆహార జాతీయవాదం(ఫుడ్ నేషనలిజం)కి ఉదాహరణలుగా అభివర్ణించారు.
"ప్రభుత్వాలు ఇలాంటి ఆంక్షలు విధిస్తాయి. వారు తమ పౌరుల అవసరాలకు అన్నింటికంటే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తాయి" అని సోనియా అక్టర్ అన్నారు.
''2007-2008 ఆహార సంక్షోభం అనుభవంతో చాలా దేశాలు ఈ విధానాన్ని అనుసరిస్తాయని అంచనా వేస్తున్నాం. ఇది సంక్షోభాన్ని, ఆహార ధరల ద్రవ్యోల్బణాన్ని మరింత తీవ్రతరం చేస్తుంది" అని ఆమె అన్నారు.
అయితే, ఎగుమతులపై పరిమితులు తాత్కాలికమని, వీటిని పూర్తి స్థాయి ఫుడ్ నేషనలిజంగా భావించలేమని సింగపూర్‌లోని నాన్యాంగ్ టెక్నలాజికల్ యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్ విలియం చెన్ అభిప్రాయపడ్డారు.
"పలు దేశాలు ఆహార వస్తువులపై నిషేధాన్ని విధించాయి. కానీ, కొన్నాళ్లకు ఆ నిషేధాన్ని ఎత్తివేసాయి" అని యూనివర్సిటీ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రోగ్రామ్ డైరెక్టర్ కూడా అయిన చెన్ అన్నారు.
"ఇది ఫుడ్ చైన్ ఇంటర్ కనెక్టివిటీకి మంచి ఉదాహరణ. ఏ దేశం కూడా తన ప్రజల అన్ని ఆహార అవసరాలను తీర్చలేదు'' అని చెన్ అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి:
- పెళ్లి గిఫ్ట్‌గా టెడ్డీబేర్ పంపిన పెళ్లికూతురి అక్క మాజీ ప్రియుడు.. అందులోని బాంబ్ పేలి కళ్లు, చేతులు కోల్పోయిన పెళ్లి కొడుకు
- సెక్స్, అధికారం, భయం... ఇవే మన పురాణాలకు మూలాధారమా?
- పామాయిల్ కంపెనీలు లక్షలాది నిరుపేద గిరిజనులను ఎలా దోచుకుంటున్నాయో తెలుసా? - బీబీసీ పరిశోధన
- మోదీ జపాన్ పర్యటన: బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ ఎంతవరకు వచ్చింది... ఎప్పటికి పూర్తవుతుంది?
- ప్రేమించిన యువకుడితో వెళ్లిపోయిందని బాలికకు విషమిచ్చి చంపేసిన మేనమామ, బావ
- దిశ అత్యాచార నిందితుల ఎన్కౌంటర్ కేసులోని పోలీసులను వెంటనే అరెస్ట్ చేయాలి: మహిళల, ట్రాన్స్ జెండర్ల జేఏసీ డిమాండ్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















