అమ్రీనా భట్ తండ్రి : ‘ముస్లింలను ముస్లింలే చంపుతున్నారు, ఇది ఎలాంటి జిహాద్’

ఫొటో సోర్స్, BBC/IMRAN_ALI
- రచయిత, మాజిద్ జహంగీర్
- హోదా, బీబీసీ కోసం
''నా కూతుర్ని చంపి నా ఇంటి వెలుగును ఆర్పేశారు. నా అందమైన ప్రపంచాన్ని నాశనం చేశారు. నా కూతురే నాకు ఆధారం. నన్ను మట్టిలో కలిపేశారు. నా కూతురు ఉన్నప్పుడు నేను మహారాజును. ఆమెను చంపి ఇప్పుడు నన్ను పకీరును చేశారు.''
ఇవన్నీ అమ్రీనా భట్ తండ్రి ఖిజర్ మొహమ్మద్ భట్ మాటలు. కూతురు మరణంతో ఆయన షాక్‌లో ఉన్నారు.
కశ్మీర్‌లోని బడ్‌గామ్ జిల్లా హుష్రూ గ్రామంలోని తన ఇంటి రెండో అంతస్థులోని ఒక గదిలో కూర్చున్న ఖిజర్ పదే పదే తన కూతురు మరణాన్ని తల్చుకుంటూ నిట్టూరుస్తున్నారు.
''నేను ఏ చెట్టు నీడలో అయితే బతుకుతున్నానో, ఆ చెట్టునే వారు నరికేశారు. నాకు ఆరోగ్యం బాగుండదు. నా కూతురు చలికాలంలో ఖర్చులన్నీ భరించి నన్ను జమ్మూకు తీసుకెళ్లేది. ఇప్పుడు నన్ను ఎవరు తీసుకెళ్తారు? నాకు వైద్యం ఎవరు చేయిస్తారు'' అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
మాటల మధ్యలో ఉండగా ఆయన ''ముస్లింలు, ముస్లింలనే చంపుతున్నారు. ఇదేం జిహాద్'' అని అడిగారు.
30 ఏళ్ల అమ్రీనా భట్ కళాకారిణి. కశ్మీర్‌లోని సామాజిక మాధ్యమాల్లో తక్కువ సమయంలోనే తనదైన ముద్రను వేసిన అమ్రీనా బుధవారం రాత్రి హత్యకు గురయ్యారు.

ఫొటో సోర్స్, BBC/IMRAN_ALI
ఇద్దరు అనుమానిత తీవ్రవాదులు ఆమె ఇంటికి వచ్చి ఆమెను బయటకు పిలిచారు. తర్వాత అతి సమీపం నుంచి ఆమెను కాల్చి చంపారు.
ఈ ఘటనలో ఆమె అక్క 10 ఏళ్ల కుమారునికి కూడా గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
అతి తక్కువ సమయంలోనే అమ్రీనా చాలా ఫేమస్ అయ్యారు. సోషల్ మీడియాలో ఆమెకు వేలాదిమంది ఫాలోవర్లు ఉన్నారు. ఆమె పోస్ట్ చేసే వీడియోలకు లక్షల్లో వ్యూస్ ఉన్నాయి.
కశ్మీర్‌లో వరుస హత్యలు జరుగుతున్న సమయంలోనే అమ్రీనా కూడా హత్యకు గురయ్యారు. కొన్ని రోజుల క్రితమే కశ్మీరీ పండిట్ రాహుల్ భట్ హత్య జరిగింది. రెండు రోజుల కిందట శ్రీనగర్‌లోని సౌరాలోఒక పోలీసు, ఆయన కూతురిపై అనుమానిత ఉగ్రవాదులు దాడి చేశారు.
ఇలాంటి హత్యల తర్వాత కశ్మీర్‌లో భయానక వాతావరణం నెలకొంది. అమ్రీనా ఇంటికి వచ్చిన చాలామంది కెమెరా ముందుకు రావడానికి కూడా భయపడటం మేం గమనించాం.
జమ్ము కశ్మీర్‌లో గత రాత్రి రెండు ఎన్‌కౌంటర్లు జరిగాయి. శ్రీనగర్‌లో జరిగిన మొదటి ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు లష్కరే తోయిబా మిలిటెంట్లు మరణించారని పోలీసులు తెలిపారు. అవంతిపురాలో రెండో ఎన్‌కౌంటర్ జరిగింది. ఇందులో టీవీ ఆర్టిస్ట్ అమ్రీనా భట్ హత్యతో సంబంధం ఉన్న ఇద్దరు తీవ్రవాదులు చనిపోయినట్లు పోలీసులు వెల్లడించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ శుక్రవారం బడ్‌గామ్‌లో అమ్రీనా కుటుంబాన్ని పరామర్శించారు. అమ్రీనా కుటుంబానికి అండగా నిలవాలని జమ్ము కశ్మీర్ పాలకవర్గానికి విజ్ఞప్తి చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
అమ్రీనా ఇంట్లో విషాదం నిండి ఉంది. బీబీసీ బృందం అమ్రీనా ఇంటికి చేరుకున్నప్పడు, ఇంటి బయట వేసిన టెంట్ కింద చాలా మంది మహిళలు కూర్చున్నారు. అమ్రీనా చనిపోవడంతో ఆమె అక్క రజియా బేలగా మారిపోయారు.

ఫొటో సోర్స్, BBC/IMRAN_ALI
అమ్రీనా హత్య ఎలా జరిగిందో వివరిస్తూ పెద్దగా ఏడ్చారు. ''మేమంతా లోపల కూర్చున్నాం. ఇద్దరు వ్యక్తులు వచ్చి అమ్రీనా భట్ ఎక్కడుంది? ఆమెను పిలవండి అంటూ నా కుమారుడికి చెప్పారు. లోపలికి వెళ్లి ఆమెను తీసుకొచ్చాడు. అప్పుడు వాళ్లు... 'మేం ఈ ప్రాంతానికి చెందినవాళ్లమే. మీరు పెళ్లిలో పాట పాడాలి' అన్నారు. నేను పాటలు పాడను అని అమ్రీనా చెప్పింది. అలా చెప్పిన తర్వాత వారు అమ్రీనాపై కాల్పులు జరిపారు. ఆమె పరుగెడుతూ లోపలి గదిలోకి వెళ్లింది. అక్కడే పడిపోయింది. ఆ తర్వాత నాకు కళ్లకు చీకట్లు వచ్చాయి. తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు'' అని రజియా వివరించారు.
అమ్రీనాను ఎందుకు చంపారో తనకు అర్థం కావట్లేదని రజియా అన్నారు. ఆమె చెప్పిన వివరాల ప్రకారం, అమ్రీనా గతంలో దూరదర్శన్‌లో పనిచేసేవారు. మూడు నెలల క్రితమే ఆమె సోషల్ మీడియాలో 'భట్ అమ్రీనా' పేరుతో చానెల్‌ను ప్రారంభించారు. ఏడాది కాలంగా పాటలు కూడా పాడుతున్నారు.
అమ్రీనా రోజంతా పనిచేసి సాయంత్రానికి ఇంటికి చేరుకునేదని ఆమె చెప్పారు. ఇంట్లో అమ్రీనా మాత్రమే సంపాదించేదని, ఇప్పుడు ఇంటికోసం ఎవరు సంపాదిస్తారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ఫొటో సోర్స్, BBC/IMRAN_ALI
ఇలా జరగడం పట్ల అమ్రీనా సహోద్యోగులు కోపంగా ఉన్నారు. ఇలాంటి హత్యలను ఉపేక్షించకూడదని అన్నారు.
హసన్ జావీద్ ఆమెతో కలిసి పనిచేసేవారిలో ఒకరు. ''నేను ఒక్కటి అడగాలనుకుంటున్నా... ఏం తప్పు చేసిందని అమ్రీనాను హత్య చేశారు? ఇంటికి వచ్చి కాల్చి చంపడం ఏంటి? ఈ ఘటనతో నేను చాలా నిరాశ చెందాను. దీన్ని నేను ఖండిస్తున్నా'' అని ఆయన అన్నారు.
''ఏ తప్పు చేయని వ్యక్తిని, ఆర్టిస్టుని ఇలా చంపడం చాలా దారుణం. మీరు ఆమె సోషల్ మీడియా చానెల్‌ను చూస్తే, ఆమె ఎప్పుడూ ఎవరికీ వ్యతిరేకంగా మాట్లాడిన కంటెంట్ ఉండదు. నాలాగే అమ్రీనా కూడా ప్రజలను నవ్వించే ఒక ఆర్టిస్టు'' అని ఆయన చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- పోస్టాఫీసులో ప్రజలు డిపాజిట్ చేసిన కోటి రూపాయలతో ఐపీఎల్ బెట్టింగ్ ఆడిన సబ్ పోస్ట్ మాస్టర్
- ఫేస్‌బుక్: మెటావర్స్‌లో మహిళ అవతార్‌పై లైంగిక దాడి
- యాసిన్ మలిక్‌కు జీవితఖైదు విధించడంపై పాకిస్తాన్ ఎలా స్పందించింది
- భారతీయులు లావెక్కిపోతున్నారు... ఇది మామూలు సమస్య కాదు
- స్టాక్ మార్కెట్ కుప్పకూలినప్పుడు నష్టాల నుంచి బయట పడేందుకు ఇన్వెస్టర్లు ఏం చేయాలి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















