నార్మల్ డెలివరీయా, సిజేరియనా? బిడ్డను ఎలా కనాలో నిర్ణయించుకునే హక్కు మహిళలకు లేదా

ఫొటో సోర్స్, ADRIANA MEDEIROS
సెనెగల్‌కు చెందిన అస్టౌ సోఖ్నా, ప్రసవ సమయంలో మరణించారు. ఆమె మరణం ఆ దేశవ్యాప్తంగా ఆగ్రహానికి కారణమైంది.
30 ఏళ్ల అస్టౌ 20 గంటల పాటు ప్రసవ వేదనను అనుభవించి బిడ్డ సహా కన్నుమూశారు.
స్థానిక మీడియా నివేదికల ప్రకారం, సిజేరియన్ చేయమని ఆమె వైద్యులను కోరారు. కానీ, ముందుగా సిజేరియన్‌ను షెడ్యూల్ చేయలేదు కాబట్టి ఆమె విజ్ఞప్తిని వైద్యులు నిర్లక్ష్యం చేశారు.
ప్రమాదంలో ఉన్న వ్యక్తికి సహాయం చేయడంలో విఫలమైనందుకు ముగ్గురు సిబ్బందిని దోషులుగా తేల్చారు. వారిపై ఆరు నెలల సస్పెన్షన్ విధించారు.
అస్టౌ కేసు, ప్రసవం విషయంలో మహిళల హక్కుల విషయంలో తీవ్ర చర్చకు దారి తీసింది.

ఫొటో సోర్స్, GIULIANA CASTILLO
'నో చెప్పే శక్తి కూడా నాకు లేదు'
గిలియానా కాస్టిలో సిజేరియన్ ద్వారా గత ఆగస్టులో ఆడబిడ్డకు జన్మనిచ్చారు. అయితే, ఆ అనుభవం తనకు చాలా బాధ కలిగించిందని ఆమె చెప్పారు.
ఆమె లండన్‌లోని చెల్సియా అండ్ వెస్ట్‌మినిస్టర్ ఆసుపత్రిలో ప్రసవం కోసం చేరారు. ఇదే ఆమెకు తొలి కాన్పు.
ఆమె తొలుత సహజ ప్రసవాన్నే కోరుకున్నారు. అవసరమైతేనే సిజేరియన్‌కు వెళ్లాలనుకున్నారు.
''నేనెప్పుడు శస్త్రచికిత్స ద్వారా బిడ్డకు జన్మనివ్వాలని అనుకోలేదు. సహజ ప్రసవంలో నొప్పి ఉంటుందని నాకు తెలుసు. అయినా నేను దానికి సిద్ధంగానే ఉన్నా'' అని 26 ఏళ్ల గిలియానా చెప్పారు. ఆమె ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు.
ఆసుపత్రిలో చేరాక ఆమెకు కాసేపు పురిటి నొప్పులు రావడం, తర్వాత ఆగిపోవడం జరిగింది. ఇలా 12 గంటలు గడిచిన తర్వాత ఆమె ఇక సిజేరియన్ చేయమని కోరారు.
''నాకు చాలా బలహీనంగా అనిపించింది. అప్పుడు నేను సిజేరియన్ చేయండి అని అడిగాను. కానీ, రెండో షిఫ్టులో ఉన్న నర్స్ మాత్రం పూర్తిగా పురిటి నొప్పులు రాకుండానే నేను ఆసుపత్రిలో అడ్మిట్ అయినట్లు భావించారు. అసలు అవి పురిటి నొప్పులు కావన్నట్లే ఆమె ప్రవర్తించారు. ఆమెకు నా పరిస్థితి అర్థం కాలేదు. నిజానికి నేను చాలా భయపడ్డాను. నేను ఇంటికి వెళ్లాలని అనుకోలేదు'' అని ఆమె చెప్పారు.
"నా బిడ్డ బాగానే ఉందని వారు నాకు చెప్పినప్పటికీ చాలా భయపడ్డాను. ఎందుకంటే అప్పటికే నా శక్తి మొత్తం నశించింది. నొప్పిని భరించడానికి ప్రయత్నించా. కానీ సహించలేకపోయాను. ఇక ఎన్‌హెచ్‌ఎస్‌కు ఫోన్ చేసి నా పరిస్థితి అంతా వివరించా. నేను ఆసుపత్రిలోనే ఉన్నందుకు తాము చేయగలిగింది ఏమీ లేదని వారన్నారు'' అని గిలియానా అప్పటి పరిస్థితులు గుర్తు చేసుకున్నారు.
షిఫ్ట్ మారడంతో వచ్చిన కొత్త వైద్య బృందం తనను మెరుగ్గా చూసుకుందని గిలియానా చెప్పారు.
"నేను చాలా అలసిపోయా. నా చూపు కూడా మసకగా మారింది. నేను ఏడుస్తూనే ఉన్నా. వారు నన్ను జాగ్రత్తగా చూసుకున్నారు'' అని గిలియానా వివరించారు.
పురిటి నొప్పులు రావడానికి గిలియానాకు ఎపిడ్యూరల్ ఇచ్చారు.

ఫొటో సోర్స్, GIULIANA CASTILLO
బిడ్డను ప్రసవించడానికి గంటకు పైగా ప్రయత్నించిన తర్వాత శిశువు గుండె కొట్టుకునే రేటు తగ్గిపోవడం ప్రారంభమైంది. దీంతో ఆమెను సిజేరియన్ కోసం థియేటర్‌కి తీసుకెళ్లారు.
"ఆపరేషన్ థియేటర్‌కి వెళ్లాక వాక్యూమ్, ఫోర్సెప్స్‌ని ఉపయోగించబోతున్నామని వారు చెప్పారు. కానీ, నో చెప్పే శక్తి కూడా లేకపోయింది. చివరకు వారు ఆ పని చేశారు'' అని గిలియానా వివరించారు.
ఒక మహిళ ప్రసవ అనుభవం నిపుణుల బృందంపై ఎక్కువగా ఆధారపడి ఉంటుందని గిలియానా చెప్పారు.
"నా భర్త అక్కడ ఉన్నప్పటికీ, నిజంగా నేను ఒంటరిగా భావించాను. ఏమీ చేయాలో తెలియక చాలా ఆవేదన చెందాను.’’
మళ్లీ గర్భం దాల్చినప్పుడు అవసరమైన మద్దతు, మార్గదర్శకత్వం అందించేలా ఒక సహాయకురాలిని(డౌలా) ఏర్పాటు చేసుకుంటానని గిలియానా చెప్పారు.
'' అది చాలా ప్రత్యేకమైన క్షణం. మీరు భయపడుతున్న సమయంలో భరోసాగా నిలిచేవారు మీతో ఉండాలి. అలాంటి వారిని కలిగి ఉండటానికి మీరు అర్హులు కూడా. బిడ్డ తల సరైన దిశలో లేకపోవడం వల్ల నేను పుష్ చేయలేకపోయానని తర్వాత వైద్యులు చెప్పారు. దీన్ని వారు ముందే ఎందుకు గుర్తించలేదు? గుర్తిస్తే ఇంత బాధను నేను అనుభవించాల్సిన అవసరం ఉండకపోయేది కదా''
"యూకేలో సిజేరియన్ చేయకూడదనే ధోరణి ఉందని నేను అనుకుంటున్నా. నేను పుట్టిన అర్జంటీనాలో విపరీతంగా సిజేరియన్లు చేస్తారు. ఈ రెండు దేశాలు విపరీత ధోరణిని అనుసరిస్తున్నాయి. ఇలా ఉండకూడదు'' అని ఆమె అన్నారు.
కాగా దీనిపై చెల్సియా అండ్ వెస్ట్‌మినిస్టర్ ఆసుపత్రి స్పందిస్తూ ''ఎప్పుడూ ముందు నుంచి అనుసరించిన బర్త్ ప్లాన్‌నే గౌరవిస్తామని'' తెలిపింది.

ఫొటో సోర్స్, Family of Astou Sokhna
ప్రపంచవ్యాప్తంగా పరిణామాలు ఏంటి?
కొన్ని దేశాలలో అధిక సిజేరియన్ రేటు నమోదు అవుతుండగా, మరికొన్ని దేశాల్లో అసలు ప్రాణాలను రక్షించే వైద్య ప్రక్రియ కూడా అందుబాటులో ఉండటం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. వీటి మధ్య అసమానత పెరిగిపోతుందని వ్యాఖ్యనించింది.
అస్టౌ సిజేరియన్‌ను కోరగా అలాంటి ఆపరేషన్ చేయబోమని పేర్కొన్నారు. అయితే, గత ఏడాది డబ్ల్యూహెచ్‌వో ప్రకటించిన నివేదిక... ప్రపంచంలో సిజేరియన్ రేటు పెరుగుతున్నట్లు సూచిస్తుంది.
సిజేరియన్ అవసరం లేని వారికి కూడా వీటిని చేస్తున్నారని, తద్వారా మహిళలు ప్రమాదంలో పడుతున్నారని పేర్కొంది.

ఫొటో సోర్స్, ANDRIANA MEDEIROS
"ఒక స్త్రీ తాను ఏ విధంగా జన్మనివ్వాలనుకుంటున్నారో నిర్ణయించుకునేందుకు అనుమతించాలి'' అని బ్రెజిల్‌కు చెందిన ఏబీఈఎన్‌ఎఫ్ఓ వ్యవస్థాపకురాలు మరిలాండా లాప్స్ డి లిమా అన్నారు.
డబ్ల్యూహెచ్‌వో ప్రకారం, బ్రెజిల్ ప్రపంచంలో రెండవ అత్యధిక సిజేరియన్ రేటును కలిగి ఉంది.
"మన శరీరం పవిత్రమైనది. కాబట్టి నిపుణులు ఏ రకమైన ప్రసవం చేయాలనుకుంటున్నారో మహిళతో చర్చించాలి. నేను సిజేరియన్లకు వ్యతిరేకం కాదు. కానీ, అనవసరమైన శస్త్రచికిత్సలకు వ్యతిరేకం. ప్రత్యేకించి బ్రెజిల్‌లో జరుగుతున్న సిజేరియన్ల పరంగా వాటిని వ్యతిరేకిస్తున్నా'' అని ఆమె అన్నారు.

ఫొటో సోర్స్, DANIELLA DE OLIVEIRA
'నేను పూర్తిగా మోసపోయాను'
బ్రెజిల్‌లో సిజేరియన్ ద్వారా బిడ్డను ప్రసవించిన చాలామంది మహిళల్లో డానియెల్లా డి ఒలివెరా ఒకరు. బ్రెజిల్‌లోని మొత్తం ప్రసవాల్లో సగానికి పైగా సిజేరియన్లే.
ఒక దేశంలోని మొత్తం ప్రసవాలలో కేవలం 10-15 శాతం మాత్రమే సిజేరియన్లు ఉండాలని డబ్ల్యూహెచ్‌వో సూచించింది.
2013లో డానియెల్లా సాధారణ చెకప్ కోసం ఆసుపత్రికి వెళ్లారు. కానీ, 37 వారాల్లో ప్రసవించడానికి సిద్ధంగా ఉండాలని ఆమె డాక్టర్ చెప్పారు.
"నాకు సి-సెక్షన్ జరిగింది. తొలి కాన్పుగా కుమారుడు పుట్టినప్పుడు నేను పూర్తిగా మోసపోయా'' అని 29 ఏళ్ల డానియెల్లా చెప్పారు.
తనను గర్భవతిగా నిర్ధారించినప్పటి నుంచి వైద్యులు సిజేరియన్ గురించే చెప్పారని ఆమె తెలిపారు. సహజ ప్రసవం గురించి అడిగిన ప్రతీసారి వైద్యులు తనను వైద్యులు పట్టించుకోలేదని అన్నారు.
"నాతో ఏమీ చర్చించకుండానే వైద్యులు, సిజేరియన్ కోసం అంతా సిద్ధం చేశారు. సి-సెక్షన్ చేయించుకునేలా వారు ఒత్తిడి తెచ్చారు. నాకు సహజ ప్రసవం అవుతుందా అని అడిగాను. కానీ, అప్పటికే వారంతా సిజేరియన్ కోసం సిద్ధమయ్యారు. నేను సర్జరీ గదిలోకి వెళ్ళాను. ఆపై నాకు కుమారుడు జన్మించాడు'' అని ఆమె చెప్పారు.
"నేను మత్తులో ఉన్నాను. బిడ్డ జన్మించిన మొదటి క్షణాలు నాకు అసంపూర్ణంగా గుర్తున్నాయి. మత్తులో ఉన్న మూడు గంటలు నాకు ఏమీ అర్థం కాలేదు. ఇప్పటికి కూడా నాకెందుకు సిజేరియన్ చేశారో అర్థం కాలేదు'' అని ఆమె చెప్పారు.
ఇప్పుడు డానియెల్లా డౌలాగా పనిచేస్తున్నారు. ఇతర మహిళలకు ప్రసవంలో సహాయం చేస్తున్నారు.

ఫొటో సోర్స్, DANIELA LEITE
చరిత్ర పునరావృతం అవుతుందనే భయం
ప్రసవ సమయంలో తన తల్లి అనుభవించిన వేదనను విన్న తర్వాత డానియెల్లాకు ప్రసవం అంటే భయం ఏర్పడింది.
"నా తల్లి నల్లజాతి మహిళ. ఆమె అనుభవించిన వేదనకు ఇది కూడా కారణమైంది. నేను పుట్టినప్పుడు జాత్యాహంకార హింసను ఆమె ఎదుర్కొంది. మత్తు మందు పని చేసే వరకు వైద్యులు ఆగలేదు. దీంతో ఆమెకు మెళకువలోనే నొప్పినంతా భరించాల్సి వచ్చింది. నొప్పిగా ఉన్నట్లు వైద్యులకు చెప్పింది. కానీ, నువ్వు ఆ నొప్పిని తట్టుకోగలవని వైద్యుల నుంచి సమాధానం వచ్చింది'' అని డానియెల్లా చెప్పారు.
బ్రెజిల్ ఆరోగ్య వ్యవస్థలో జాత్యహంకారం ఉన్నట్లు ఆమె చెప్పారు.

బ్రెజిల్ తరహానే సైప్రస్‌లో కూడా సహజ ప్రసవాల కంటే సిజేరియన్లు ఎక్కువ.
సైప్రస్‌కు చెందిన జార్జియా డెమోఫానోస్ కూడా కాన్పు సమయంలో తన అనుభవాన్ని వివరించారు.
ఇవి కూడా చదవండి:
- పోస్టాఫీసులో ప్రజలు డిపాజిట్ చేసిన కోటి రూపాయలతో ఐపీఎల్ బెట్టింగ్ ఆడిన సబ్ పోస్ట్ మాస్టర్
- ఫేస్‌బుక్: మెటావర్స్‌లో మహిళ అవతార్‌పై లైంగిక దాడి
- యాసిన్ మలిక్‌కు జీవితఖైదు విధించడంపై పాకిస్తాన్ ఎలా స్పందించింది
- భారతీయులు లావెక్కిపోతున్నారు... ఇది మామూలు సమస్య కాదు
- స్టాక్ మార్కెట్ కుప్పకూలినప్పుడు నష్టాల నుంచి బయట పడేందుకు ఇన్వెస్టర్లు ఏం చేయాలి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











