తమిళ కుటుంబానికి ఆస్ట్రేలియన్ల మద్దతు, దిగొచ్చిన ప్రభుత్వం

ఫొటో సోర్స్, HOMETOBILO
- రచయిత, టిఫనీ టర్న్‌బుల్
- హోదా, బీబీసీ ప్రతినిధి, సిడ్నీ నుంచి
ఇమిగ్రేషన్ డిటెన్షన్ సెంటర్ నుంచి ఆస్ట్రేలియా క్వీన్స్‌లాండ్ నగరానికి చేరుకోడానికి శ్రీలంకకు చెందిన ఒక తమిళ కుటుంబానికి నాలుగేళ్లకు పైగా వేచిచూడాల్సి వచ్చింది.
ఆస్ట్రేలియా కొత్త ప్రభుత్వం మురుగప్పన్ కుటుంబానికి ఇప్పుడు వీసా మంజూరు చేసింది. బిలోవిలా నగరంలో ఉండడానికి, పని చేసుకోడానికి వారికి తాత్కాలిక అనుమతులు కూడా ఇచ్చింది.
ఆశ్రయం కల్పించాలంటూ ఈ తమిళ కుటుంబం చేసుకున్న అభ్యర్థనను అంతకు ముందున్న ప్రభుత్వం తోసిపుచ్చింది. ఆ తర్వాత అంటే 2018 నుంచి ఈ కుటుంబం ఇమిగ్రేషన్ డిటెన్షన్ సెంటర్లోనే ఉంటూ వచ్చింది.
ఆస్ట్రేలియాలో ఈ అంశంపై కలకలం రేగింది. బిలోవిలాలోని స్థానికులు ఈ తమిళ కుటుంబాన్ని తిరిగి తమ నగరానికి పంపించాలంటూ పెద్ద ఎత్తున ఉద్యమించారు.
ఆస్ట్రేలియా వివాదాస్పద విధానాల ప్రకారం దేశంలో ఆశ్రయం కోసం వచ్చే మురుగప్పన్ లాంటి వారిని నివరధికంగా నిర్బంధంలో ఉంచవచ్చు.
ఆ సమయంలో ఆ కుటుంబాల వాదనలపై ఒక అంచనాకు వస్తామని, తర్వాత వారిని వారి స్థలాలకు పంపించే చర్యలు చేపడతామని ఆ ప్రభుత్వం చెబుతోంది.
కానీ, ఆస్ట్రేలియా కొత్త ప్రధాని ఆంథోనీ అల్బనీస్ మాత్రం మురుగప్పన్ కుటుంబం కేసులో తమ ప్రభుత్వం మినహాయింపు ఇస్తుందని, అంటే ఆ కుటుంబానికి దేశ నిబంధనల నుంచి మినహాయింపు ఉంటుందని చెప్పారు. ఆంథోనీ గత శనివారమే ఎన్నికల్లో విజయం సాధించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
"మనం ప్రజలతో చెడుగా ప్రవర్తించకూడదని, మా సమాజం ఇతరులకు సందేశం ఇవ్వగలిగేంత బలంగా ఉంది. ఈ కేసు ఇంత సుదీర్ఘంగా ఎందుకు నడిచిందో నాకు అర్థం కావడం లేదు" అన్నారు.
మురుగప్పన్ కుటుంబానికి మద్దతిస్తున్నవారు ఆ కుటుంబానికి తాత్కాలిక వీసా బదులు పర్మినెంట్ వీసా ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఆ కుటుంబం స్నేహితుడు ఏంజెలీ ఫ్రెడరిక్స్ శుక్రవారం ఒక ట్వీట్ కూడా చేశారు.
"బిలోవిలా వరకూ వారి ఈ ప్రయాణం ఒక సుదీర్ఘమైన, బాధాకరమైన అధ్యాయానికి అంతం లాంటిది. జీవితంలో బాధల నుంచి మెల్లమెల్లగా విముక్తి కావడానికి ఆరంభం" అని పోస్ట్ చేశారు.
ఆస్ట్రేలియాలో పర్మినెంట్ వీసాతో పొందేవరకూ ఆ కుటుంబం సురక్షితంగా ఉండలేదని ఆయన భావిస్తున్నారు.

ఫొటో సోర్స్, HOMETOBILO
అసలు తమిళ కుటుంబం కేసేంటి
ప్రియా నటరాజ్, నాదేశ్‌లింగమ్ మురుగప్పన్ శ్రీలంక నుంచి దాదాపు దశాబ్దం క్రితం వేరు వేరు పడవల్లో ఆస్ట్రేలియాకు వచ్చారు. అక్కడి ప్రభుత్వాన్ని ఆశ్రయం కోరారు. తమిళులైన తమకు శ్రీలంకలో హింస గురించి భయంగా ఉందని చెప్పారు.
బిలోవిలాలో కలిసిన ఇద్దరూ అక్కడే స్థిరపడ్డారు. తర్వాత వారి పరిచయం ప్రేమగా మారింది. వారికి ఇధ్దరు అమ్మాయిలు పుట్టారు. పెద్ద పాప కోపిలకు ఏడేళ్లు. చిన్న పాప థర్ణికకు నాలుగేళ్లు.
1500 రోజులకు పైగా నిర్బధంలో
ఈ కుటుంబానికి ఆస్ట్రేలియాలో ఉండడానికి చట్టపరమైన హక్కు లేదని భావించిన ప్రభుత్వం 2018లో వారిని నిర్బంధ కేంద్రంలో ఉంచింది.

ఫొటో సోర్స్, HOMETOBILO
బిలోవిలా ప్రజలు ఈ కుటుంబానికి మద్దతుగా పోరాటం చేశారు. వాళ్లకోసం నగరంలో ఒక పెద్ద ప్రచారమే ప్రారంభించారు. దానికి దేశవ్యాప్తంగా కూడా మద్దతు లభించింది. ఆ ప్రచారానికి మిగతా రాజకీయ పార్టీల ఎంపీలు కూడా తమ మద్దతు తెలిపారు.
ఆశ్రయం కోరామనే తమ వాదనలను నిరూపించడానికి ఆ కుటుంబం ఒక సుదీర్ఘ న్యాయ పోరాటం చేసింది.
ఈ కుటుంబాన్ని బహిష్కరించడానికి రెండు సార్లు ప్రయత్నాలు జరిగాయి. కానీ, వారి సమస్య పరిష్కరించనిదే, వాళ్లను దేశం నుంచి బయటకు పంపించకూడదని 2019లో ఒక కోర్టు ఆదేశించింది.
దీంతో ఆ కుటుంబం 1500 రోజులకు పైగా ఇమిగ్రేషన్ డిటెన్షన్ సెంటర్లలోనే గడిపింది. అందులో ఎక్కువ రోజులు వీళ్లు హిందూ మహాసముద్రంలోని క్రిస్మస్ ద్వీపంలోనే నివసించారు.

ఫొటో సోర్స్, HOMETOBILO
గత ఏడాది మురుగప్పన్ కూతురు థర్ణికకు అత్యవసర వైద్యం అవసరమవడంతో ఆ కుటుంబాన్ని క్రిస్మస్ ద్వీపం నుంచి పెర్త్‌లోని డిటెన్షన్ సెంటర్‌కు తరలించారు.
గత ఏడాది బీబీసీతో మాట్లాడిన ఈ కుటుంబం తాము సుదీర్ఘ కాలంగా డిటెన్షన్ సెంటర్‌లోనే ఉంటున్నామని, తమ వారికి దూరంగా ఉండడం వల్ల చాలా నష్టపోయామని చెప్పారు. ఏళ్లపాటు నిర్బంధ కేంద్రంలో ఉండడం వల్ల తాను డిప్రెషన్‌లోకి వెళ్లిపోయానని ప్రియ చెప్పారు.
ఈ కుటుంబాన్ని నిర్బంధంలోకి తీసుకున్నప్పుడు థర్నికకు 9 నెలలు. 2019లో పాడైన ఆహారం తినడం వల్ల పాప దంతాలు పుచ్చిపోయాయి. తన దంతాలు తొలగించడానికి థర్నికకు సర్జరీ చేయాల్సి వచ్చింది. గత ఏడాది మరోసారి జబ్బు చేయడంతో థర్నిక రెండు వారాలు ఆస్పత్రిలో ఉండాల్సి వచ్చింది.
ఆస్ట్రేలియా మాత్రం మానవ అక్రమ రవాణాను అడ్డుకోడానికి, సముద్రంలో మరణాలను నివారించడానికే తాము ఈ కఠిన నిబంధనలను రూపొందించామని చెబుతోంది. కానీ, ఐక్యరాజ్యసమితి మాత్రం అవి అమానుషంగా ఉన్నాయని విమర్శిస్తోంది.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్: కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ పేరు వద్దంటూ ఎందుకీ నిరసనలు... అసలేం జరుగుతోంది?
- టెక్సస్ కాల్పులు: ప్రైమరీ స్కూల్‌పై జరిగిన దాడిలో 19 మంది పిల్లలతో పాటు 21 మంది మృతి
- వరల్డ్ థైరాయిడ్ డే: ప్రతి పది మంది భారతీయుల్లో ఒకరు ఈ సమస్యతో బాధపడుతున్నారు, కారణాలేంటి?
- జ్ఞాన్వాపి మసీదును శివాలయంగా మార్చవచ్చా... చట్టం ఏం చెబుతోంది?
- పెళ్లి గిఫ్ట్‌గా టెడ్డీబేర్ పంపిన పెళ్లికూతురి అక్క మాజీ ప్రియుడు.. అందులోని బాంబ్ పేలి కళ్లు, చేతులు కోల్పోయిన పెళ్లి కొడుకు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












