గుజరాత్: ఈ విద్యార్థి పెయింటింగ్ పాఠ్య పుస్తకం కవర్ పేజీ అయ్యింది.. అతను కూలీ అయ్యాడు.. ఆ పెయింటింగ్ వల్లే మళ్లీ స్కూలుకెళ్తున్నాడు

ఫొటో సోర్స్, VINOD RATHVA
- రచయిత, పార్థ్ పండ్యా
- హోదా, బీబీసీ ప్రతినిధి
"పొలాల్లో పని చేస్తున్నప్పుడు, నేను వేసిన పెయింటింగ్ ఒక పుస్తకం కవర్ పేజీగా ముద్రించారనే విషయం తెలిసింది".
12 ఏళ్ల కాంతి రాఠ్వా ఈ మాట అన్నాడు. ఇతడిది గుజరాత్‌లోని ఛోటా ఉదయపూర్ దగ్గర కచేల్ గ్రామం. అది అహ్మదాబాద్‌కు సుమారు 200 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
మూడేళ్ల క్రితం స్వచ్ఛ భారత్ ప్రచారానికి సంబంధించిన ఒక పోటీలో అతడు ప్రథమ స్థానంలో నిలిచాడు. అప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న ఆనందీబేన్ పటేల్ నుంచి బహుమతి అందుకున్నాడు.
కానీ ముఖ్యమంత్రి నుంచి సన్మానం అందుకున్న తర్వాత కూడా కాంతి పరిస్థితిలో మార్పు రాలేదు, మరింత దారుణంగా తయారైంది. దాంతో కుంచె పట్టిన అతడి చెయ్యి గొడ్డలి పట్టుకోవాల్సి వచ్చింది.
కాంతి వేసిన పెయింటింగ్ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్సీఈఆర్టీ (విద్య పరిశోధన, శిక్షణ జాతీయ మండలి) ముద్రించిన ఒక పుస్తకానికి కవర్ పేజీ అయ్యింది. కానీ చదువుకు దూరమైన అతడు మాత్రం కూలీగా మారాడు.

ఫొటో సోర్స్, VINOD RATHVA
ముఖ్యమంత్రి సన్మానం
2015లో తను వేసిన పెయింటింగ్‌కు గాను ముఖ్యమంత్రి నుంచి బహుమతి అందుకున్నప్పుడు కాంతి మూడో తరగతి చదువుతున్నాడు.
చిత్రలేఖనం పోటీలో అతడు చీపురుతో నేలను శుభ్రం చేస్తున్న గాంధీ బొమ్మ వేశాడు. మొదటి బహుమతిగా అతడికి 2 వేల రూపాయలు కూడా ఇచ్చారు.
కేంద్ర ప్రభుత్వం 2014 అక్టోబర్ 2వ తేదీన స్వచ్ఛ భారత్ కార్యక్రమం ప్రారంభించింది. దేశవ్యాప్తంగా పరిశుభ్రతను పెంచాలని భావిస్తోంది.

ఫొటో సోర్స్, VINOD RATHVA
స్కూల్ వదిలి పొలం పనుల వైపు
కాంతి కుటుంబం కూలిపనులు చేసుకుని జీవిస్తుంది. అతడి అమ్మనాన్నలు ప్రస్తుతం అహ్మదాబాద్ నుంచి 130 కిలోమీర్ల దూరంలో ఉన్న సురేంద్రనగర్‌లో పనులు చేసుకుంటున్నారు.
పెయింటింగ్ బహుమతి గెలుచుకున్న తర్వాత రెండేళ్ల వరకూ కాంతి స్కూలుకు వెళ్లేవాడు.
"నాకు ఇద్దరు తమ్ముళ్లు, ఇద్దరు చెల్లెళ్లు. వాళ్లు కూడా మా అమ్మనాన్నలతో పనికెళ్తున్నారు. నాకంటే చిన్నవాళ్లు అక్కడ పనులు చేస్తుంటే, నేనిక్కడ ఎలా చదవగలను. ఇంట్లో పరిస్థితి సరిగా లేదు, అందుకే నేను స్కూలు వదిలి, కుటుంబంతో పనికి వెళ్లాల్సివచ్చింది" అంటాడు కాంతి.

ఫొటో సోర్స్, VINOD RATHVA
'పెయింటింగ్ విషయం తెలీదు'
ఇటీవల ఎన్సీఈఆర్టీ రెండు కొత్త పుస్తకాలను ప్రచురించింది. కాంతి పెయింటింగ్‌ను మూడో తరగతికి చెందిన ఒక పుస్తకం కవర్ పేజీపై ముద్రించింది.
కానీ ఈ పుస్తకం ముద్రించిన సమయంలో కాంతి స్కూల్ వదిలి సురేంద్రనగర్‌లో తన అమ్మనాన్నలతో కలిసి కూలి పనులకు వెళ్తున్నాడు.
"నేను వేసిన పెయింటింగ్ ఒక పుస్తకంపై వేశారని నాకు తెలీదు. మా నానమ్మ చనిపోయినపుడు నేను ఛోటా ఉదయ్‌పూర్ వస్తే, మా టీచర్ నాకా విషయం చెప్పారు" అని కాంతి బీబీసీకి చెప్పాడు.
ఛోటా ఉదయ్‌పూర్‌లో ఉన్న ఆ స్కూలు ఉపాధ్యాయుడు వినోద్ రాఠ్వా బీబీసీతో మాట్లాడుతూ.. "కాంతి చదువు ఎందుకు ఆపేశాడో వాళ్ల చిన్నాన్న నాకు చెప్పారు. తన పెయింటింగ్ పుస్తకంపై ముద్రించినా, అతడికి ఆ విషయం తెలీదు, కాంతికి బహుమతి ఇచ్చిన వాళ్లు, అతడి కుటుంబం స్థితి ఎలా ఉందో తెలుసుకోలేదు" అన్నారు.

ఫొటో సోర్స్, VINOD RATHVA
కాంతికి సాయం అందించారు
గ్రామస్తులకు కాంతి పరిస్థితి తెలియగానే.. అందరూ అతడికి సాయం చేయాలని ఆలోచించారు.
"కాంతి మళ్లీ చదువుకోడానికి ప్రభుత్వం నుంచి మాత్రం ఎలాంటి సాయం అందలేదు" అని వినోద్ రాఠ్వా చెప్పారు.
అయితే, గుజరాత్ మాజీ డీజీపీ పీసీ ఠాకూర్‌కు అతడికి సాయం చేసేందుకు ముందుకొచ్చారు.
"నేను కాంతి కుటుంబ సభ్యులను కలవడానికి వెళ్లాను. మరికొంతమందిని కూడా కలిసి, అతడికి మరింత సాయం అందించడానికి ప్రయత్నించాను" అని పీసీ ఠాకూర్ బీబీసీకి చెప్పారు.

ఫొటో సోర్స్, VINOD RATHVA
గొప్ప చిత్రకారుడు కావాలనే కల
ప్రస్తుతం కాంతి తన చదువు తిరిగి కొనసాగించేలా వినోద్ రాఠ్వా అతడిని దత్తత తీసుకున్నారు.
వినోద్ రాఠ్వా, పీసీ ఠాకూర్ సాయంతో కాంతి మళ్లీ స్కూలుకు వెళ్తున్నాడు. ఇప్పుడు అతడు ఛోటా ఉదయ్‌పూర్ దగ్గరే 'ఏకలవ్య స్కూల్'లో చదువుతున్నాడు. భవిష్యత్తులో చిత్రలేఖనంలో గొప్పపేరు సంపాదించాలని అనుకుంటున్నాడు.
" కాంతి స్కూలుకు వెళ్తున్నందుకు సంతోషంగా ఉంది. కానీ మేం మా మిగతా పిల్లలను చదివించలేకపోతున్నామని బాధగా కూడా ఉంది" అని అతడి తండ్రి జెందూ రాఠ్వా బీబీసీతో అన్నారు.
కాంతి వేసిన పెయింటింగ్ అతడు తిరిగి స్కూలుకు వెళ్లేలా చేసింది. గుజరాత్ విద్యా శాఖ గణాంకాల ప్రకారం 2013-14లో రాష్ట్రంలో చదువు మధ్యలోనే వదిలేసిన పిల్లలు 6.91 శాతం మంది ఉన్నారు.
"కాంతి భవిష్యత్తులో గొప్ప పెయింటర్, లేదా కళాకారుడు కావచ్చు, కానీ మనం పిల్లలు చదువు మధ్యలోనే నిలిపేస్తే ఎంతోమంది భవిష్యత్ మేధావులను, కళాకారులను కోల్పోతాం" అంటారు వినోద్ రాఠ్వా.
ఇవికూడా చదవండి:
- ప్రొఫెసర్ డీఎన్ ఝా: హిందూమతం అంటే ఏమిటి? భారత్ ఎప్పుడు 'మాత'గా మారింది? చరిత్ర ఏం చెప్తోంది?
- ఎడిటర్స్ కామెంట్: కరుణానిధి - తమిళుల్లో ఎందుకింత ఉద్వేగం? ఎక్కడిదీ అభిమానం?
- వోగ్ మ్యాగజీన్ కవర్ పేజీపై షారూఖ్ ఖాన్ కుమార్తె.. సినీ జనుల ఆగ్రహం ఎందుకు?
- అభిప్రాయం: ప్రతి పరిమళానికీ ఓ జ్ఞాపకం
- తమిళ విద్యార్థులను ఆకట్టుకున్న ఈ టీచర్ తెలుగాయనే
- పగటిపూట బాలకార్మికులు.. రాత్రిపూట విద్యార్థులు!
- అసలు ప్రపంచంలో పేదోళ్లు ఎందరు?
- ‘భారత్‌లో వేగంగా తగ్గుతున్న పేదరికం.. నిమిషానికి 43 మందికి విముక్తి’
- బంగారం, వజ్రాల గనులున్నా.. ఈ దేశంలో పేదరికం పోవట్లేదు
- దివ్య సూర్యదేవర: ఒకప్పుడు డబ్బుల్లేక ఇబ్బందులు పడ్డారు.. నేడు రూ.లక్షల కోట్ల కంపెనీని చక్కబెడుతున్నారు
- తెలంగాణ ‘చిన్నారి పెళ్లి కూతురు’: బాల్య వివాహాన్ని ఎదిరించింది.. చదువుకు పేదరికం అడ్డు పడుతోంది
- ఇద్దరమ్మాయిలు.. ఒక చిన్న విమానం.. లక్ష్యం 23దేశాలు.. గడువు 100 రోజులు
- వీళ్లకు కావల్సింది భార్యలా? లేక బ్యూటీ క్వీన్లు, వంట మనుషులా?
- 'నువ్వు ఆడపిల్లవి, ఈ పని ఎలా చేస్తావు?' అన్నారు... కానీ 4వేల దహన సంస్కారాలు నిర్వహించాను
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








