భారత్-నేపాల్‌ మధ్య ఒక నది ఎలా చిచ్చు పెడుతోంది

నేపాల్-భారత్
    • రచయిత, రాఘవేంద్ర రావ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

200ఏళ్ల క్రితం ఒక నదిని రెండు దేశాల మధ్య సరిహద్దుగా నిర్ధరించారు. నదికి తూర్పు వైపు ప్రాంతం ఒక దేశానికి చెందినదిగా, పశ్చిమవైపు ప్రాంతం మరో దేశానికి చెందినదిగా ఒప్పందం కుదర్చుకున్నారు.

అయితే, ఏళ్లు గడిచినకొద్దీ ఆ నది తన దిశను మార్చుకుంటూ వచ్చింది. కొన్ని ఏళ్లకు తూర్పు వైపు నది కాస్త పక్కకు జరిగి ప్రవహించడం మొదలుపెట్టింది.

ఫలితంగా తూర్పువైపు కొన్ని ప్రాంతాలు నది పశ్చిమ ప్రాంతాల్లో కలిశాయి. దీంతో రెండు దేశాల మధ్య సరిహద్దు వివాదం మొదలైంది. నేటికీ ఆ వివాదం అలానే ఉంది.

ఆ రెండు దేశాలు భారత్, నేపాల్. మనం చెప్పుకొన్న ఆ నదిని నేపాల్‌లో ‘‘నారాయణి’’గా, భారత్‌లో గండక్‌గా పిలుస్తారు.

రెండు దేశాల సరిహద్దులో వివాదాస్పదమైన ఆ ప్రాంతం పేరు ‘‘సుస్తా’’. ఈ ప్రాంతం తమదంటే తమదని ఇటు భారత్, అటు నేపాల్.. రెండూ చెబుతున్నాయి.

నేపాల్‌ నవల్‌పరాసీ జిల్లాలోని నారాయణి నది తీరానికి బీబీసీ వెళ్లింది. మేం అక్కడి నుంచి ఒక పడవలో ప్రయాణించి సుస్తా చేరుకున్నాం.

నేపాల్-భారత్

సుస్తా చేరుకున్న తర్వాత, మాకు అక్కడ నేపాల్ పోలీస్ అధికారి ఒకరు కనిపించారు. సుస్తా నేపాల్‌లో భాగమని ఆయన మాతో చెప్పారు. అయితే, ఈ చుట్టుపక్కల చాలా ప్రాంతాలు రెండు దేశాల మధ్య వివాదాస్పంగా మారాయని ఆయన అన్నారు.

అలా వివాదాస్పదంగా మారిన కొన్ని ప్రాంతాల్లో మేం పర్యటించాం. సుస్తాలో ప్రజలు ఒకప్పుడు పంటలు పండించేవారని, అయితే, వివాదం నడుమ ఇప్పుడు అక్కడ వ్యవసాయం జరగట్లేదని నేపాల్ పోలీస్ అధికారులు బీబీసీతో చెప్పారు.

కొంతదూరం నడిచిన తర్వాత మాకు ఒక ప్రదేశం కనిపించింది. ఈ ప్రాంతం విషయంలోనూ రెండు దేశాల మధ్య వివాదముందని నేపాల్ పోలీసులు మాతో చెప్పారు. ఇక్కడ తమ దేశ భద్రతా సిబ్బందిని మోహరించేందుకు నేపాల్ ప్రయత్నించిందని, దీనిపై భారత్ అభ్యంతరాలు వ్యక్తంచేసిందని ఆయన వివరించారు.

నేపాల్-భారత్

అస్పష్టమైన సరిహద్దులు

ఆ ప్రాంతం నుంచి కొంచెం దూరం వచ్చిన తర్వాత, భారత్‌లోని బిహార్‌కు చెందిన కొంతమందిని మేం కలిశాం. తాము నివసిస్తున్న ప్రాంతం భారత్‌లోని బిహార్‌ పరిధిలోకి వస్తుందని, ఆ ప్రాంతం పేరు ‘‘ఛక్‌దావా’’అని వారు చెప్పారు.

ఈ ప్రాంతంలో ఒక సన్నని రోడ్డు కనిపించింది. ఆ రోడ్డుకు అవతలివైపు ‘‘ఛుక్‌దావా’’ గ్రామం ఉంటుందని, రెండోవైపు భూభాగం నేపాల్ పరిధిలోకి వస్తుందని నేపాల్ పోలీసులు వివరించారు.

అయితే, రోడ్డుకు అవతలి వైపు కూడా కొంతమంది భారతీయులు జీవిస్తున్నారని స్థానికులు చెప్పారు. చిన్నచిన్న ఇళ్ల సమూహాలు ఇక్కడ చాలా కనిపించాయి. అసలు ఇక్కడ సరిహద్దు ఎక్కడ మొదలవుతుందో చెప్పడం చాలా కష్టం.

సుస్తా ప్రాంతం భారత్‌లోని బిహార్‌కు పక్కనే ఉంటుంది. దీంతో ఇక్కడ నివసించే ప్రజలు సరిహద్దులు దాటి భారత్‌లోని మార్కెట్‌కు వెళ్తుంటారు. ఒకవేళ వారు నేపాల్ మార్కెట్‌లో ఏదైనా కొనుగోలు చేయాలని భావిస్తే, నారాయణి నదిని వారు దాటాల్సి ఉంటుంది.

సుస్తాలో జీవించే కొందరు ఉద్యోగాలు, వ్యాపారం కోసం నారాయణి నదిని దాటి నేపాల్‌కు రోజూ వెళ్తామని చెప్పారు.

నేపాల్-భారత్

సుగౌలి ఒప్పందం

1816లో బ్రిటిష్-నేపాల్ యుద్ధం ముగిసింది. అనంతరం నేపాల్ పాలకులు, ఈస్ట్ ఇండియా కంపెనీ మధ్య సుగౌలి ఒప్పందం కుదిరింది. దీనిలోనే రెండు దేశాల మధ్య సరిహద్దును ‘‘నారాయణి నది’’గా పేర్కొన్నారు.

ఈ ఒప్పందం ప్రకారం, నది తూర్పు భూభాగం భారత్ పరిధిలోకి వస్తుంది. పశ్చిమ భాగం నేపాల్ కిందకు వస్తుంది.

ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు నది పశ్చిమ భాగంలో సుస్తా ఉండేది. అయితే, ఏళ్లు గడిచిన తర్వాత, ఇది నదికి తూర్పు వైపు మారింది. దీంతో ఈ ప్రాంతం రెండు దేశాల మధ్య వివాదానికి కేంద్ర బిందువైంది.

సుస్తాలో తమ ప్రాంతాలను భారత్ ఆక్రమించుకుందని నేపాల్ అంటోంది. అయితే, నేపాల్ వాదనలో తప్పుందని భారత్ అంటోంది.

రెండు దేశాల మధ్య 1800 కిలోమీటర్ల పొడవున సరిహద్దు ఉంది. దీనిలో భారత్‌లోని బిహార్ పరిధిలో 601 కి.మీ. ఉంటుంది. మరోవైపు ఉత్తర్ ప్రదేశ్‌లో మరో 651 కి.మీ. పొడవైన సరిహద్దు ఉంది. భారత రాష్ట్రాలైన ఉత్తరాఖండ్, సిక్కిం, పశ్చిమ బెంగాల్‌లతోనూ నేపాల్‌కు సరిహద్దు ఉంది.

నేపాల్‌ జనాభాలో డెమొగ్రఫిక్ మార్పులకు ఉత్తర్ ప్రదేశ్, బిహార్‌లలోని సరిహద్దు ప్రాంతాలే కారణమని భారత్‌తో చర్చల్లో నేపాల్ అధికారులు ఆరోపిస్తున్నారు.

నేపాల్-భారత్

గోపాల్ గురూంగ్.. సుస్తాలో జీవిస్తున్నారు. ‘‘సేవ్ సుస్తా అభియాన్’’ పేరుతో ఆయన ఒక సంస్థను నడిపిస్తున్నారు.

‘’40,950 హెక్టార్ల భూమిలో 7,500 హెక్టార్లు సుస్తాలో ఉండే ప్రజల పేరిట ఉంది. 19,600 హెక్టార్ల భూమిపై రెండు దేశాల మధ్య వివాదం నడుస్తోంది. మిగతా భూమిని బిహార్ ప్రజలు ఆక్రమించారు. ఈ భూమిని మళ్లీ నేపాల్ ప్రజలకు ఇచ్చేయాలని మేం డిమాండ్ చేస్తున్నాం’’అని ఆయన అన్నారు.

రెండు దేశాలు కలిసి ఈ విషయంపై ఒక కమిటీని నియమించి, సరిహద్దు పిల్లర్లను ఏర్పాటుచేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.

ఈ విషయంపై నేపాల్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధితో మాట్లాడేందుకు మేం ప్రయత్నించాం. కానీ, ఆయన మాట్లాడేందుకు సంసిద్ధత వ్యక్తం చేయలేదు.

గోపాల్ గురూంగ్
ఫొటో క్యాప్షన్, గోపాల్ గురూంగ్

మరోవైపు నేపాల్ సరిహద్దు వివాదం విషయంలో ఇటీవల భారత్ తమ వైఖరిని స్పష్టం చేసింది.

‘‘రెండు దేశాల మధ్య సరిహద్దు వివాదాల విషయానికి వస్తే, దీనికి సంబంధించి ఇప్పటికే ద్వైపాక్షిక ఒప్పందాలు కుదిరాయి. చర్చల్లో వీటికి ప్రాధాన్యం ఇవ్వాలని మేం మొదట్నుంచీ చెబుతున్నాం. ఈ విషయంలో రాజకీయాలు చేయకూడదు’’అని మే 13న భారత విదేశాంగ కార్యదర్శి వినయో మోహన్ చెప్పారు.

భారత్-నేపాల్ మధ్య స్నేహపూర్వక సంబంధాలు 2020లో గాడితప్పాయి. ఆ ఏడాదిలో కాలాపానీ, లింపియాథురా, లిపూలేఖ్‌లను తమ భూభాగంలో చూపిస్తూ నేపాల్ ఒక కొత్త మ్యాప్‌ను ప్రచురించింది. అయితే, ఈ ప్రాంతాలు ఉత్తరాఖండ్‌లో భాగమని భారత్ భావిస్తోంది.

మరోవైపు 2020 మే 8న ఉత్తరాఖండ్‌లోని లిపూలేఖ్‌ను ధార్‌చూలాతో అనుసంధానిస్తూ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఒక కొత్త రోడ్డు మార్గాన్ని ప్రారంభించారు. అయితే, లిపూలేఖ్ తమ భూభాగంలో భాగమని నేపాల్ దీన్ని ఖండించింది. ఆ తర్వాత కొన్ని రోజులపాటు ఈ వార్తలు పతాక శీర్షికల్లో నిలిచాయి.

నేపాల్-భారత్

పరిష్కారం ఎలా?

రెండు దేశాల మధ్య సరిహద్దు వివాదాన్ని పరిష్కరించేందుకు 2014లో బౌండరీ వర్కింగ్ గ్రూపును ఏర్పాటుచేశారు. అయితే, సమస్య మాత్రం పరిష్కారం కాలేదు.

నేపాల్‌లోని సర్వే విభాగం డైరెక్టర్ జనరల్‌గా బుద్ధి నారాయణ్ శ్రేష్ఠ పనిచేస్తున్నారు. నేపాల్ సరిహద్దులపై ఆయనకు మంచి అవగాహన ఉంది.

‘‘సుస్తా సమస్య వల్ల నేపాల్-భారత్‌ల మధ్య సాంకేతిక, దౌత్య చర్చలు ముందుకు వెళ్లకపోవడం శోచనీయం. గత రెండేళ్లుగా సరిహద్దులపై రెండు దేశాల మధ్య చర్చలే జరగడం లేదు. చాలా రంగాల్లో రెండు దేశాలు కలిసి పనిచేస్తున్నాయి. కానీ, సరిహద్దు వివాదాల విషయంలో మాత్రం ముందుకు వెళ్లడం లేదు’’అని ఆయన అన్నారు.

నేపాల్-భారత్

సమీప భవిష్యత్‌లో ఈ సరిహద్దు వివాదానికి ఏమైనా పరిష్కారం దొరికే అవకాశముందా?

‘‘ఈ రెండు దేశాల ప్రజలు కలిసి పనిచేయాలి. ముఖ్యంగా సరిహద్దులను స్పష్టంగా గుర్తించాలి. రెండు దేశాల ప్రజల మధ్య మంచి సంబంధాలున్నాయి. సుస్తాలోనూ ఆ సంబంధాలు దెబ్బతినకుండా చూడాలి’’అని ఆయన అన్నారు.

‘‘దీని కోసం రెండు దేశాల సాంకేతిక నిపుణులు జోక్యం చేసుకుని సామరస్యంగా సమస్యకు పరిష్కారం చూపాలి. ప్రధాన మంత్రి లేదా ప్రభుత్వ అధిపతి లాంటి ప్రధాన నాయకులు కలుగజేసుకుని సరిహద్దులను సుస్పష్టంగా గుర్తించాలి. అప్పుడు మాత్రమే ఈ సమస్య పరిష్కారమవుతుంది’’అని ఆయన చెప్పారు.

వీడియో క్యాప్షన్, నేపాల్ సరిహద్దుల్లో చైనా ఆక్రమణలు

మరోవైపు రెండు దేశాల మధ్య మంచి సంబంధాలున్నాయని, ఈ సమస్య కూడా సులువుగానే పరిష్కారం అవుతుందని గోపాల్ కూడా అన్నారు.

‘‘రెండు దేశాల మధ్య సరిహద్దులను శాంతియుతంగా గుర్తించాలని మేం కోరుకుంటున్నాం’’అని ఆయన చెప్పారు.

‘‘దీనికి పరిష్కారం ఏమిటో రెండు ప్రభుత్వాలకూ తెలుసు. వారు చేయాల్సిన పనిని వారు చేయాలి. ఇక్కడ రైతులు, కూలీలు జీవిస్తారు. వారేం చేయగలరు?’’అని సుస్తాలో జీవించే సుకయీ హరజన్ అన్నారు.

వీడియో క్యాప్షన్, నేపాల్: భూకంపాన్ని ఎదుర్కొన్న ప్రాంతం ఇప్పుడు కోవిడ్‌తో విలవిల్లాడుతోంది

భారత్, నేపాల్‌ల మధ్య సంబంధాలు ఏళ్లనాటివి. సాంస్కృతికంగా, చారిత్రకంగా ఇవి వేళ్లూనుకున్నాయి. ఈ రెండు దేశాల మధ్య ప్రజలు వీసాల్లేకుండానే పర్యటించొచ్చు.

భారత్‌లో దాదాపు 80 లక్షల మంది నేపాల్ వాసులు జీవిస్తున్నారు. మరోవైపు నేపాల్‌లోనూ ఆరు లక్షల మంది భారతీయులు జీవిస్తున్నారు.

రెండు దేశాల మధ్య ఇంతలా పెనవేసుకున్న సంబంధాలే ఏదో ఒకరోజు ఈ సుస్తా వివాదం కూడా పరిష్కారం అవుతుందనే ఆశాభావాన్ని ప్రజల్లో నింపుతున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)