జయనగర్-కుర్థా: భారత్-నేపాల్‌ దేశాలను కలిపే ఈ రైల్వే లైన్ ప్రత్యేకత ఏంటి?

నేపాల్ రైల్వే
    • రచయిత, విష్ణు పోఖరే
    • హోదా, బీబీసీ ప్రతినిధి

భారత్-నేపాల్‌లను అనుసంధానించే రైల్వే లైన్‌ను రెండు దేశాల ప్రధానులు శనివారం ప్రారంభించారు.

నేపాల్ భూభాగంలో భారత్ సాయంతో నిర్మించిన ఈ రైల్వే మార్గంపై మీడియాలో చర్చ జరుగుతోంది.

జయనగర్-కుర్థాలను అనుసంధానించే ఈ రైల్వే లైన్‌ను నేపాల్ ప్రధాన మంత్రి షేర్ బహదూర్ దేఒబా, భారత్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం సంయుక్తంగా వర్చువల్ సమావేశంలో ప్రారంభించారు.

ఈ ప్రాజెక్టులో భాగంగా రైల్వే మార్గాన్ని భారత్ నిర్మించగా, నేపాల్ రెండు రైళ్లను కొనుగోలు చేసింది. నిర్మాణం మొదలుపెట్టిన ఏడాదిన్నద తర్వాత ఈ సేవలను మొదలుపెట్టారు.

ఆదివారం నుంచి జయనగర్-కుర్థా రైల్వే సేవలు ప్రజలకు అందుబాటులో ఉంటాయి. నేపాల్‌లోని ధునుషా జిల్లాను భారత్‌లోని బిహార్‌తో ఇది అనుసంధానిస్తుంది.

భారత్ సాయంతో నిర్మిస్తున్న 69 కి.మీ. పొడవైన జయనగర్-జనక్‌పూర్-బరిదీవాస్ రైల్వే మార్గంలో తాజా మార్గం కూడా భాగం.

నేపాల్ రైల్వే

భారత్ సాయంతో నిర్మాణం

రైల్వే విభాగం సమాచారం ప్రకారం.. భారత్ ఆర్థిక, సాంకేతిక సాయంతో నేపాల్‌లోని భిన్న ప్రాంతాల్లో రైల్వే మార్గాలను నిర్మిస్తున్నారు.

కొన్ని రైల్వే మార్గాలు నిర్మాణ దశలో ఉంటే, చాలావరకు ఇంకా అధ్యయన దశలో ఉన్నాయని రైల్వే విభాగం అధికార ప్రతినిధి, సీనియర్ డివిజనల్ ఇంజినీర్ అమన్ చిత్రకార్ చెప్పారు.

2010లో కుదిరిన ఒప్పందం ప్రకారం, నేపాల్‌లోని దక్షిణ నగరాలను సరిహద్దుల్లో భారత మార్కెట్లతో అనుసంధానించాలని రెండు దేశాలు నిర్ణయించాయి.

జల్పాయ్‌గుడి-కాకడ్‌విట్టా (46 కి.మీ.), బహనా-కటాహారీ (జోగ్‌బనీ -విరాట్‌నగర్ 18 కి.మీ.), జయనగర్-జనక్‌పూర్-బరిదీవాస్ (69 కి.మీ.), నౌతనవా-బైరహవా (12 కి.మీ.), రూపెడియా- నేపాల్‌గంజ్ (15 కి.మీ.)లను నిర్మించాలని ఆనాడు ఒప్పందంలో కుదర్చుకున్నారు. అయితే, వీటిలో చాలా మార్గాల నిర్మాణం ఇంకా మొదలుకాలేదు.

మరోవైపు రక్సౌల్-కాఠ్‌మాండూ రైల్వే మార్గం కూడా నేపాల్‌లో భారత్ సాయంతోనే నిర్మిస్తున్నట్లు చిత్రకార్ వెల్లడించారు.

రక్సౌల్-కాఠ్‌మాండూ రైల్వే లైన్ పొడవు 136 కి.మీ.గా మొదట అంచనా వేశారు. అయితే, సమగ్ర అధ్యయనం తర్వాతే ఈ మార్గం పొడవుపై స్పష్టత వస్తుంది.

నేపాల్ రైల్వే

ఫొటో సోర్స్, KONKAN RAILWAY/TWITTER

ఎంతవరకు పనులు పూర్తయ్యాయి?

నేపాల్‌లో మౌలిక సదుపాయాల నిర్మాణం కోసం భారత్ అందిస్తున్న ఆర్థిక, సాంకేతిక సాయం చాలా తక్కువని కొందరు నిపుణులు చెబుతున్నారు.

రైల్వే మార్గాల నిర్మాణంలోనూ ఆలస్యం జరుగుతోందని మరికొందరు భావిస్తున్నారు. నేపాల్‌లో అంతర్గత ప్రాంతాలను అనుసంధానించే మార్గాల నిర్మాణం కొనసాగుతోందని, మరికొన్ని మార్గాల సాధ్యాసాధ్యాలపై సాంకేతికపరమైన అధ్యయనాలు పూర్తయ్యాయని రైల్వే విభాగం అధికార ప్రతినిధి అమన్ చిత్రకార్ అన్నారు.

‘‘ఐదు ప్రాంతాల్లో రైల్వే మార్గాల విస్తరణ పనులు కొనసాగుతున్నాయి. జోగ్‌బనీ-విరాట్‌నగర్, జయనగర్-జనక్‌పూర్-బరిదీవాస్‌ల నిర్మాణం పనులు కూడా కొనసాగుతున్నాయి’’అని ఆయన చెప్పారు. మిగతా ప్రాంతాల్లోని సాంకేతికపరమైన అధ్యయనాలు పూర్తయిన తర్వాత నిర్మాణపు పనులు మొదలవుతాయని ఆయన వివరించారు.

రక్సౌల్-కాఠ్‌మాండూ రైల్వే మార్గం తొలి దశకు సంబంధించి ప్రాథమిక అధ్యయనం కూడా పూర్తయిందని చిత్రకార్ వివరించారు.

‘‘భారత్-నేపాల్‌ల మధ్య రైల్వే నిర్మాణానికి సంబంధించి ఒప్పందం కుదిరిన తర్వాత, క్షేత్రస్థాయిలో అధ్యయనాలు మొదలయ్యాయి’’అని ఆయన చెప్పారు.

వీడియో క్యాప్షన్, నేపాల్: భూకంపాన్ని ఎదుర్కొన్న ప్రాంతం ఇప్పుడు కోవిడ్‌తో విలవిల్లాడుతోంది

ఆలస్యం కావడంతో..

2010లో కుదిరిన ఒప్పందం ప్రకారం, నేపాల్-భారత్‌లను అనుసంధానించే రైల్వే మార్గాలు ఐదేళ్లలో పూర్తవ్వాలని లక్ష్యం నిర్దేశించారు. అయితే, ఇప్పటివరకు చాలాచోట్ల నిర్మాణాలు పూర్తికాలేదని కొందరు నిపుణులు చెబుతున్నారు.

నేపాల్ వైపు నుంచి ఎదురవుతున్న సమస్యల వల్లే ప్రాజెక్టులు ఆలస్యం అవుతున్నాయని రైల్వే నిపుణులు వివరిస్తున్నారు.

‘‘ప్రస్తుతం పూర్తైన రైల్వే ప్రాజెక్టులను కూడా నేపాల్‌ సరిగా నిర్వహించడం లేదు. మరోవైపు కొత్త ప్రాజెక్టుల విషయంలోనూ ఆలస్యం అవుతోంది’’అని రైల్వే నిపుణుడు ప్రకాశ్ ఉపాధ్యాయ్ చెప్పారు.

నేపాల్ భూభాగంలో క్షేత్ర స్థాయిలో అధ్యయనాలు చేపట్టడంలో ఆలస్యం వల్లే రైల్వే మార్గాల విస్తరణ ఆలస్యం అవుతోందని ఆయన వివరించారు.

కరోనావైరస్ వ్యాప్తి కూడా రైల్వే మార్గాల నిర్మాణం ఆలస్యం కావడానికి ఒక కారణమని ఉపాధ్యాయ్ చెప్పారు.

‘‘కొన్ని చోట్ల భూసేకరణ కూడా ఆలస్యం అవుతోంది. ఇలాంటి అవరోధాలపై భారత్ పెద్దగా దృష్టిపెట్టడం లేదు’’అని ఆయన వివరించారు.

వీడియో క్యాప్షన్, నేపాల్ సరిహద్దుల్లో చైనా ఆక్రమణలు

సొంత ఖర్చుతో తూర్పు-పశ్చిమ రైల్వే

రైల్వే నిర్మాణం కోసం భారత్ నుంచి ఆర్థిక, సాంకేతిక సాయం తీసుకుంటున్న నేపాల్.. పశ్చిమ సరిహద్దుల్లో సొంతంగా రైల్వే మార్గాన్ని నిర్మిస్తోంది. మెచీ-మహాకాళీగా ఈ రైల్వే లైనును పిలుస్తున్నారు.

మరోవైపు తూర్పు సరిహద్దుల్లోని కంకడవిట్ట ప్రాంతాన్ని పశ్చిమ సరిహద్దుల్లోని గడ్డ ప్రాంతాన్ని అనుసంధానిస్తూ రైల్వే లైను నిర్మించాలని కూడా నేపాల్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్) ఇప్పటికే సిద్ధమైందని అమన్ చిత్రకార్ చెప్పారు.

‘’11 ప్రాజెక్టులకు సంబంధించి ఇప్పటికే డిపీఆర్‌లు పూర్తయ్యాయి. తూర్పు-పశ్చిమ రైల్వే లైన్‌లోని బరిదీవాస్-నిజ్‌గఢ్‌ల మధ్య నిర్మాణం పనులు జరుగుతున్నాయి’’అని ఆయన అన్నారు.

‘‘రైల్వే మార్గం విస్తరణతోపాటు వంతెన నిర్మాణం కోసం పనులు జరుగుతున్నాయి’’అని ఆయన చెప్పారు.

అయితే, దెబ్బతిన్న రైల్వే మార్గాల్లో మరమ్మతులు ఏమీ జరగడంలేదని వివరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)